Sujanaranjani
           
  శీర్షికలు  
       ఎందరో మహానుభావులు

         మహేంద్రవాడ బాపన్నశాస్త్రి (1904)

 

 - రచన : తనికెళ్ళ భరణి    

 

సరిగ్గా తొంభయ్యేళ్ళ క్రితం! తూర్పు గోదావరి జిల్లాలోని యింజరం గ్రామం. అప్పుడే తెలతెల వారుతోంది!
కొబ్బరి మట్టలతో వెలిగించిన పొయ్యిలనుంచి పొగ...మంచులా ఊరంతా.. వ్యాపించింది.

సన్నటి సూర్యకిరణాలు చెట్ల సందుల్లోంచి పెంకుటిళ్ళ మీద పడుతున్నయ్..
ఆవుల అంబారవాలూ..కాకుల కావ్ కావ్ లూ..
నూతి గిలకలచప్పుడూ..
వీటన్నిటినీ చీల్చుకుంటూ కమ్మగా ఆధ్యాత్మరామాయణ కీర్తన..
మూడేళ్ళ పిల్లాడికి తలంటుతోంది తల్లి!!
వాడు గోలపెట్టేస్తున్నాడు..
మొత్తానికి ‘యజ్ఞం’ అయినంత పనైంది..!
వెంటనే పాలుపట్టించేసింది..!
ఏడుపు ఆపేశాడు.
ఆరోజు కృష్ణాష్టమి.

తన పిల్లాణ్ణి కృష్ణుడల్లే అలంకరిస్తోంది సూర్యాంబ..
గిరిజాల జుట్టు దువ్వింది..
కస్తూరి బొట్టుపెట్టింది..
పాత పట్టు పంచె చించీ.. కట్టీ దానిమీద మొలతాడు ఎక్కించింది..
తన కాసులపేరు తీసి మెళ్ళోవేసి చేతికో పిల్లన గ్రోవిచ్చింది.
అచ్చం బాల కృష్ణుడల్లే ఉన్నాడు.
తన దిష్టే తగిలేలా ఉంది.
గబగబ దిష్టి చుక్క పెట్టింది.
పిల్లాడు గలగలా నవ్వాడు. కృష్ణం కలయ సఖి సుందరం.. తరంగం అందుకుంది సూర్యాంబ.
అ బాల కృష్ణావతారం పేరు బాపన్నశాస్త్రి.
పిల్లాణ్ణి చంకనేసుకుని గుళ్ళోకెళ్ళింది. ఊళ్ళో అందరి కళ్ళూ పిల్లాడి మీద..
ముద్దెట్టుకునే వారు కొందరు.. ఎత్తుకునేవారు కొందరు.. ఏవో పళ్ళు-పూలు పెట్టేవాళ్ళు కొందరు..
ఆ ఊళ్ళో శివాలయం - విష్ణ్వాలయం రెండూ ఉన్నాయ్..
పిల్లాణ్ణి ఓ చోట దింపి..ప్రదక్షిణలు చెస్తోంది తల్లి...బాలకృష్ణుడు తప్పటడుగులు వేసుకుంటూ ఎటో వెళ్ళిపోయాడు..
తీరా తల్లి వచ్చేసరికి పిల్లాడులేదు!
కాళ్ళకింద భూమి చీలిపోయినట్ట్లై పోయింది తల్లికి..
నాన్నా..బాపన్నా..తండ్రీ..బాపన్నా..వెర్రిదానిలాగా వెతికేస్తోంది!! ఊళ్ళో జనం కూడా కలయతిరిగేసారు.
తల్లి సూర్యాంబ.. తండ్రి కామయార్యులు.. వెతకని చోటులేదు.
ఎలాగో..ఎందుకో..అదే ప్రాంగణంలో ఉన్న శివాలయానికెళ్ళింది తల్లి..లింగం వెనకల నుంచి చిన్న నవ్వు వినిపిస్తోంది. వెనక్కెవెళ్ళి చూస్తే!
బాలకృష్ణుడి వేషంలోనున్న శాస్త్రి ఉంగా భాషలో లింగంతో మాట్లాడుతున్నాడు.
ఎంత మనోహర దృశ్యం..తన నెత్తిమీద నెమలి పింఛం లింగం మీద పడి ఉంది. కృష్ణుడి ఒంటినిండా విబూధి.
హరిహరాద్వైతం - అక్కడ సాక్షాత్కరించింది.
తల్లి గబ గబ పిల్లాడినెత్తుకుని ముద్దుల్తో ముంచెత్తింది.
కాపాడు పరమేశ్వరా అని కన్నీ ళ్ళతో ఈశ్వరుడికి దణ్ణాలెట్టుకుంది.
బాపన్నశాస్త్రి బాల్యంలోనే ..భక్తీ, సంగీతం రెండూ వంటబట్టాయి.
తల్లి ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలు నేర్పితే..
తండ్రి తరంగాలు నేర్పితే... బ్రహ్మశ్రీ రేగిళ్ళ జగన్నాధశాస్త్రి గారూ, దుడ్డు సీతారామయ్య గారూ గురువులయ్యారు.
ఆ తర్వాత శృంగారం అలహ సింగరాచార్యులు వద్ద పదేళ్ళ పాటు కఠోర పరిశ్రమ చేసి, సంగీతాన్ని ఆపోశన పట్టేశాడు మహేంద్రవాడ బాపన్నశాస్త్రి.

ఆంధ్రదేశంలో జరిగిన ఏ సంగీత సభకెళ్ళినా..బహుమతి..తీసుకోకుండా వేదిక దిగలేదు బాపన్నశాస్త్రి.
1934 లో కొలంబియా రికార్డింగ్ కంపెనీవారు బాపన్న గారి పాటలు రికార్డులుగా విడుదల చేశారు.
1943 నుంచీ ‘యింజరం’ గ్రామం లో ప్రతీయేడు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా చేయడం ప్రారంభించారు.
బాపన్నశాస్త్రి ప్రత్యేకతలు ఏమిటంటే హరిహరాద్వైతం!
శివుడిని - కేశవుడిని కూడా సమదృష్టితో అభేదంగా చూసి ‘హరి హర కృతి మంజరి’ అన్న అద్భుతమైన పుస్తకం రాశారు.
ఈ పుస్తకానికీ యానం గ్రామ అడ్మినిస్టేటర్ అండ్ జడ్జి...అయిన గానకళారసిక శేఖరులు శ్రీరామలింగం (బార్.ఎట్.లా) గారు ఆర్ధిక సహాయం చేశారు.
హరిహర కృతి మంజరిలో మొదటి కృతి, ఉదయరవిచంద్రిక రాగం ఆదితాళంలో వినాయక స్తుతి.

గణపతి నిన్ను సేవించ దలచితి
సద్గుణములిచ్చు సద్గురుడ నీవెకదా?
ఫణిహరధర, హరిసతౌతనయా
గణనాయక నా వందన్ మందుకో..

అలాగే బాలా త్రిపుర సుందరి మీద రాసిన మరో కృతి - కళ్యాణరాగంలో..

అమ్మ పరదేవమ్మ నిన్ను నమ్మితి నమ్మ
ఇమ్మహిలో నీవమ్మ, నను బ్రోవమమ్మ..అమ్మ..

ఈశ్వరుడి మీద మూడు కృతులు రాశాడు. శుభ పంతువరాళి, ఉదయ రవి చంద్రిక, సింధురామ క్రియ రాగాల్లో..
ఎంతో మంది సంగీత విద్వాంసుల్లాగే మహేంద్రవాడ బాపన్నశాస్త్రి గారు కూడా సంగీతాన్ని కేవలం భుక్తికే కాకుండా కూడా ఉపయోగించి నాదోపాసన చేసి తరించిన ధన్యజీవి.

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech