Sujanaranjani
           
  శీర్షికలు  
  దేవుడున్నాడా? ఓ చర్చా వేదిక - 9
 

 - రచన: ముత్తేవి రవీంద్రనాథ్

 
 

పాశ్చాత్య తత్త్వవేత్తలు దేవుడున్నాడనడానికి మన ముందుంచిన నాలుగు  సంప్రదాయ రుజువులలో మొదటి మూడూ ఎంతమాత్రం శాస్త్రీయం కాదని మనం గ్రహించాం. ఇక నాల్గవదైన నైతిక రుజువు ఏమేరకు శాస్త్ర పరీక్షకు నిలబడగలదో  కూడా మనమిప్పుడు చూద్దాం. నైతిక రుజువు సిద్ధాంతాన్ని కాంట్ ప్రతిపాదించాడు. మొదటి మూడు సంప్రదాయ రుజువులనూ తార్కికంగానూ, శాస్త్రీయంగానూ నిలబడగలిగేవి కాదని  A  Critique of Pure  Reason అనే తన గ్రంథంలో ఖండించిన కాంట్ నైతిక రుజువు సిద్ధాంతాన్ని తన మరో గ్రంథం 'A Critique of Practical Reason' లో ప్రతిపాదించాడు.అదేమిటో ఇప్పుడు వివరంగా చూద్దాం.

మనం మన రోజువారీ కార్యకలాపాలలో అనేక పనులు చేస్తూ ఉంటాం.మంచి పనులు-చెడ్డ పనులు;

విధులు, నిషిద్ధాలు అంటే చేసి తీరాల్సిన పనులు, చెయ్యకూడని పనులు వగైరాలు. మానవుడి నైతిక వర్తన(రుజు వర్తనసమాజం మనుగడకు అత్యంత ఆవశ్యకం. నైతిక వర్తన అంటే మానవులు చేసి తీరాల్సిన విధులు చెయ్యడం; చెయ్యకూడని పనులు చెయ్యకుండా ఉండడం. అలాగే మంచి  పనులు చెయ్యడం; చెడ్డ పనులు చెయ్యకుండా ఉండడం. ఉదాహరణకు మనం ఎప్పుడన్నా అబద్ధం చెప్పేటప్పుడు తడబడతాం.మన నాలుక తడబడుతుంది.అబద్ధం చెప్పడం చెయ్యకూడని పని. అయితే మనందరం  ఎప్పుడో ఒకప్పుడు చిన్న అబద్ధమైనా చెప్పకుండా ఉండలేం. తమ జీవితాల్లో ఎప్పుడూ అబద్ధం చెప్పని వాళ్ళూ కొందరుంటే ఉండొచ్చు. ఐతే అబద్ధం చెప్పేటప్పుడు  ఏమాత్రం తడబడకుండా చెప్పేవాళ్ళు మాత్రం ఉండరు. ఒకవేళ ఉన్నా చాలా అరుదు. ఇక వాళ్ళు అబద్ధం చెప్పడం అలవాటుగా చేసుకున్న వాళ్ళు అయివుంటారని గ్రహించాలి. వారిలాగే  ప్రపంచంలో నిజం అనేది మాట్లాడకుండా అందరూ అబద్ధం చెప్పడమే పనిగా పెట్టుకున్నారనుకోండి. అప్పుడీ సమాజం తీరుతెన్నులు ఎలా ఉంటాయో ఊహించుకోండి. ఎవ్వరూ ఎవ్వరినీ నమ్మరు. ప్రతివారూ మరొకరి మాటను సీరియస్ గా తీసుకోరు. బాగా సాన్నిహిత్యం ఉన్నవారి మాటలను సైతం అనుమానిస్తారు.ఇక అప్పుడు సమాజం మనుగడే ప్రశ్నార్థకం అయిపోతుంది.అంచేత సమాజం సమాజంలా  సజావుగా మనగలగాలంటే వ్యక్తులకు నైతిక వర్తన చాలా  అవసరం. అలాగే మనం వాగ్దానాలు చేస్తూ ఉంటాం. చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడం మన నైతిక బాధ్యతగా భావిస్తాం.నైతిక పరిభాషలో దీనినే Ceteris Paribus(An obligation to deliver what is promised) అంటారు.ఇలా వాగ్దానాన్ని నెరవేర్చడం నైతిక వర్తనలో భాగం.సమాజంలో ఇలాంటి నైతిక వర్తనే లేకపోతే ,అందరూ వాగ్దానాలు నిలబెట్టుకోకపోతే సమాజంలో ఒకరిని మరొకరు నమ్మని తీవ్ర విశ్వాసరాహిత్య వాతావరణం ఏర్పడుతుంది. కారణంగా సమాజం మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది.

కాబట్టి మానవ సమాజాల మనుగడకు యా సమాజాలలోని వ్యక్తుల 'నైతిక వర్తన' అత్యంత ఆవశ్యకం.

 వ్యక్తులు  నైతిక వర్తన కలిగివుండాలంటే వారు భగవంతుడిని నమ్మాలి.భగవంతుడి మీద విశ్వాసం ఉంచినప్పుడే మనకు నైతికవర్తన సాధ్యం.అలా కాంట్ దృష్టిలో నైతికతకు భగవంతుడు అనే భావనను మనం విశ్వసించడం  మూలం. విశ్వానికంతటికీ భగవంతుడే నైతిక పాలకుడు (Moral Governor).భగవంతుడు కర్మఫలదాత.ఆయన మంచి పనులకు (పుణ్య కార్యాలకు) వరాలు,బహుమతులూ ఇస్తే, చెడ్డ పనులకు(పాపాలకు) శిక్షలు విధిస్తాడు.అలా  నిర్ధారణకు రావడానికి కాంట్  సంప్రదాయ 'సగుణ బ్రహ్మ' భావనను (God, with the attributes traditionally ascribed to him) ఆశ్రయించాడు.అంటే దేవుడు మనం చేసే పాప పుణ్యాలను అన్నింటినీ గమనిస్తూ ఎప్పుడూ మన వెన్నంటే ఉంటూ,అంతిమంగా మన జీవితంలో మనం చేసే మంచి లేక చెడ్డ పనులను సమీక్షించి, న్యాయ విచారణ చేసి, వాటికి తగు ఫలాలను(కర్మ ఫలాలను)  మనకు ఇస్తాడన్నమాట.

కాంట్ తన A Critique  of  Practical  Reason అనే గ్రంథంలో దైవం మీద విశ్వాసం అనేది' తప్పనిసరిగా అంగీకరించి తీరాల్సిన ఒక వాస్తవిక ఆవశ్యకత' అన్నాడు.దేవుడున్నాడని మనం  ఊహించుకొనడానికైతే కాస్తంత భూమిక కూడా లేనిమాట వాస్తవమే అయినా 'బహుజన హితం,బహుజన సుఖం'(Ideal of the Supreme Good) సాధించాలంటే  ప్రపంచంలో నైతిక వర్తన అత్యంత ఆవశ్యకం.నైతిక వర్తనకూ, దైవభావనకూ ఉన్నట్టి విడదీయరాని బంధం కారణంగా వాస్తవిక కోణం నుంచి చూస్తే,దైవభావనను మనం అంగీకరించి తీరాల్సిందే.దేవుడున్నాడని ఊహించుకుంటేనే మనం కొన్ని విషయాలకు చక్కటి అర్థాన్నీ, వివరణనూ ఇవ్వగలుగుతాం.అలాంటి విషయాలలో 'నైతికత'లేక 'రుజువర్తన' ఒకటి--అని పేర్కొన్నాడు కాంట్.

వోల్టేర్(1694-1778) అనే ఫ్రెంచి మేధావి, తాత్త్వికుడు కూడా తన Jasche Logic(1800) అనే గ్రంథంలో ఇలా పేర్కొన్నాడు--దేవుడు ఇంతకుముందు లేనట్లయితే - దేవుడిని కనిపెట్టడం అవసరం(If God did not exist,it would be necessary to invent him).ఆయనింకా  ఇలా రాశాడు.--'ఇదో కేవల సైద్ధాంతిక భావన.దీన్ని రుజువుపరచడం సాధ్యపడని పని.అయినప్పటికీ దేవుడున్నాడని భావిస్తేనే మనం నైతిక వర్తనకు కట్టుబడి ఉంటామనేది నిజం.నైతిక ధర్మం ఎలాంటి రుజువులూ అవసరం లేనట్టిదే (Axiomatic) కదా! దైవం ఉనికి ' నైతిక ధర్మం' అనే భావన ఆధారంగానే రుజువు పడుతుంది.దేవుడున్నాడని నమ్ముతూ,మనం నైతిక ధర్మానికి కట్టుబడి ప్రవర్తించినప్పుడే  మనం ప్రపంచంలో నైతికతనూ,బహుజన హితాన్నీ,బహుజన సుఖాన్నీ సాధించగలం. ఆవశ్యకత రీత్యానే మనం దేవుడిని విశ్వసించాలి.'

భగవంతుడిని రుజువుపరచడానికి కాంట్,వోల్టేర్ మొదలగువారిచే ప్రతిపాదించబడిన 'నైతిక రుజువు' సిద్ధాంతం కూడా పలు విమర్శలకు లోనయింది.వాటిని కూడా మనం తులనాత్మకంగా, క్లుప్తంగా పరిశీలిద్దాం.   

 మనం చేసే పనుల్లో ఏది ధర్మం,ఏది అధర్మం అనే ధర్మ మీమాంస చేసే నీతిశాస్త్ర సంబంధిత విషయాలను  'నైతిక ధార్మికత' లేక 'నైతికత'(Moral Normativity) అంటారు. నైతిక ధార్మికత అనేదానికి ప్రత్యక్షంగా భగవంతుడి ఉనికితో సంబంధం ఉందనీ,భగవంతుడే విశ్వానికి నైతిక పాలకుడనీ కాంట్ తదితరులు చేసే వాదనలలో తీవ్రమైన తార్కిక లోపాలున్నాయి.అసలీ నైతిక ధార్మికత అనేది మన మనస్సులలో ఏర్పరచుకున్న భావనేకానీ అదో భౌతిక వాస్తవికత కాదు. అలాంటి వాస్తవికం కానిదాన్ని వాస్తవమని భావించి, దానితో దైవభావం ముడిపడి ఉన్నదని చెపుతూ, నైతికత అమలుజరిపే ఒక వ్యక్తిగా భగవంతుడనేవాడి అవసరం ఉందని వాదిస్తూ అతడి ఉనికిని నిర్ధారించబూనుకొనడం దృష్టికోణం నుంచి చూసినా శాస్త్రీయం కానేరదు.

Moral Normativity is a projection on human mind.Moral Binding is not Real.It is 

no more out there in the world- minus- us.

నైతిక ధార్మికత అనేది వాస్తవికమైనదే అయితే మనం లేని ప్రపంచంలోనూ అది ఉండాలి. అంతెందుకు? మనం ఉంటున్న ప్రపంచం లోనూ మానవులకే తప్ప జంతువులు, పక్షులు,క్రిమి కీటకాలూ, వృక్షాలకూ అది వర్తించడం లేదే? మానవులలో కూడా అర్థం చేసుకోగలిగే, కట్టుబడే తత్త్వం ఉన్నవాళ్ళనే ' నైతిక ధార్మికత'  కట్టిపడేస్తున్నదని మనం గమనించవచ్చు. మానవ సమాజాల్లోనూ ఒక్కో సమాజానిది ఒక్కో ధర్మం.అక్కడక్కడా  ఒకరికి నీతి అయింది మరొకరికి అవినీతి అవడమూ ఉంది.దీన్నిబట్టే నైతిక ధార్మికత అనేది మన ఉనికితో సంబంధం లేని  ఒక భౌతిక వాస్తవికత కాదనీ, యా సమాజాలు వాటి ఆవశ్యకత మేరకు నైతిక ధార్మికతను కేవలం మానసిక నియమావళిగా  రూపొందించుకున్నాయని మనం గ్రహించగలం.వాస్తవం కాని దార్మికతకు ఒక పాలకుడిగా దేవుడిని ఊహించుకొనడం అలా  దేవుడి ఉనికిని నిర్దారించబూనడం ఏమేరకు శాస్త్రీయం? ఒకడు' విస్కీ తియ్యగా ఉంది' అంటాడు.నిజానికి విస్కీలో కలగలసిన పలు రసాయనిక పదార్థాలు మత్తునిస్తాయేకానీ, అది రుచికి  తియ్యగా మాత్రం  ఉండదు.దానిపై మక్కువ పెంచుకున్నవాడికి అది తియ్యగానే అనిపిస్తుంది.వాస్తవికతకూ, మానసిక భావనకూ గల మౌలిక భేదం అది.జ్ఞానేంద్రియం(రసనేంద్రియం) ద్వారా మనం తెలుసుకోగలిగే విస్కీ అసలు  రుచి కూడా మానసికమైనదే అయినా - అది వాస్తవం ;' అందులో లేని తియ్యదనం'లాగా అది కేవల మానసిక భావన కాదు.తినగా తినగా-- వేము తియ్యగానూ,గారెలు చేదుగానూ ఉంటాయనే భావనలూ    యా వ్యక్తుల కేవల మానసిక భావనలే కానీ ,కేవల  సత్యాలు కావు.నైతిక ధార్మికత అలా కేవల  సత్యమైనప్పుడు,అంతే కాదు ;అది  విశ్వజనీనమైన సత్యం (Universal Truth) కూడా అయినప్పుడు, భగవంతుడితో అట్టి నైతిక ధార్మికతకు విడదీయరాని లంకె ఉన్నదనీ భావిస్తూ  విశ్వానికి నైతిక పాలకుడిగా భగవంతుడి ఉనికిని మనం నమ్మవచ్చు.కనుక నైతిక  వాదన కూడా భగవంతుడి ఉనికిని రుజువుపరచజాలినది కాదు.

కొందరు నైతికత సిద్ధాంతాన్నే మరింత ముందుకు తీసుకెళ్ళారు.ఆత్మలను నమ్మేవాళ్ళు ప్రత్యగాత్మలు (ప్రత్యక్+ఆత్మ-Individual Self) విశ్వాత్మ లేక పరమాత్మ యొక్క అంశలేనని  నమ్ముతారు.

                       కాశ్మీర శివాద్వైతి అయినట్టి వేమన ఏమంటున్నాడో చూడండి-- 

                               .వె.   దేవుడనగ వేరె దేశమందున్నాడె?

                                         దేహమందెనెపుడు దేహి తోడ 

                                         వాహనములనెక్కి వడిదోలుచున్నాడు

                                         విశ్వదాభిరామ వినురవేమ

 దేవుడనేవాడు వేరే ప్రదేశంలో ఎక్కడాలేడు.దేహంలోనే దేహి(ఆత్మ)తో పాటే ఎప్పుడూ ఉంటాడు.

దేహాలు అనే వాహనాలు ఎక్కి వేగంగా స్వారీ చేస్తున్నాడు-- అంటూ మనలోని ఆత్మలే పరమాత్మ అన్నాడు.

 కొందరందుకేనేమో తమకు ఆకలై ఆహారం తీసుకునేటప్పుడు కూడా 'ఆత్మారాముడికి ఏదోవొకటి

వెయ్యాలిగదా! ' -- అంటూ ఉంటారు.'తన','తాను' అనే శబ్దాలకు 'ఆత్మ'అనే పదం  సామాన్యార్థకం అయిపోయింది.ఆత్మ హత్య,ఆత్మార్పణ,ఆత్మ విమర్శ, ఆత్మ పరిశీలన,ఆత్మ కథ  అనేపదాలలోని ఆత్మ అంటే 'తన','తన యొక్క'(స్వీయ) అని స్థిరపడింది.ఆత్మలను నమ్మనివారూ ఇవేపదాలను వాడుతుండడం పరిపాటి అయిపోయింది.

అలా మనందరిలో పరమాత్మ  (Universal Self) అంశ ఉన్నదని వారి విశ్వాసం.మనం తప్పు చేసేటప్పుడు పరమాత్మే మన లోపలినుంచి మనల్ని తప్పు చెయ్యొద్దని హెచ్చరిస్తుంటాడట.అయినా మనం హెచ్చరికను పెడచెవినపెట్టి తప్పులు చేస్తూ ఉంటామట. మనం అబద్ధం చెప్పేటప్పుడు కూడా  ప్రత్యగాత్మే మనలో నుంచి అబద్ధం చెప్పొద్దని హెచ్చరిస్తాడట.అయినా మనం బేఖాతరు చేసి అబద్ధం చెప్పేస్తాం.అప్పుడే మన మాటలు తడబడతాయి-అంటారు వారు.

 అబద్ధం  చెప్పేటప్పుడే కాదు. తప్పుపని చేసేటప్పుడైనా మనం తడబడతాం.మన చిన్నతనం నుంచీ ' పని చెయ్యకూడనిది.ఇది తప్పుపని.'అనే గట్టి నమ్మకంతో పెరిగాం కాబట్టి అది సహజమే.ఏపనైనా అంతకు ముందు ఎప్పుడూ' చెయ్యని పని' మొదటిసారి చేసేటప్పుడు ఎవరికైనా తడబాటు(Funk) సహజం.మనం ఎంతకాలం నుంచో 'చెయ్యకూడనిది అనుకుంటున్న పని' చేసేటప్పుడు మరింత తడబాటు సహజం.బాల్యం నుంచీ తగినంత నైతిక శిక్షణ ఉన్నవారిలోనే ఇలాంటి తడబాటు(దీన్నే సాధారణంగా పాప భీతి అంటుంటాం.) మనం చూడగలం.ఎటువంటి నైతిక శిక్షణ పొందనివారిలోనూ,అడవి మనుషులలోనూ, మృగాలలోనూ యుక్తాయుక్త విచక్షణగానీ,చెడు చేయడానికి తడబడడంగానీ  కానరావేం? మరి వారిలోనూ ఉన్న భగవంతుడు(విశ్వాత్మ) వారిని'తప్పు చెయ్యొద్దు; అబద్ధం చెప్పొద్దు' అని వారించాలిగా? కనుక అందరిలోనూ పరమాత్మ ఉండడం, ఆయనే 'తప్పు చెయ్యొద్దు','అబద్ధం చెప్పొద్దు' అని లోపలి నుంచి' వార్నింగ్ 'లు ఇవ్వడం వాస్తవాలు కావు.కేవలం మన నమ్మకాలు మాత్రమే.

కాంట్ వంటి మహా పురుషులు తమ కాలంనాటి క్రైస్తవ మతంలోని మూఢ నమ్మకాలను,విగ్రహారాధన తదితర కర్మకాండ (Ritualistic Practices),మతాధికారుల స్వార్థం,అవినీతి, పెత్తందారీ పోకడలను తీవ్రంగా నిరసిస్తూ గొప్ప మత సంస్కరణోద్యమం తెచ్చారు.దానిలో భాగంగానే మతం లో  మతాధికారుల పాత్రను గణనీయంగా తగ్గించి, వారిబారినుంచి సామాన్య ప్రజలను విముక్తి చెయ్యాలని భావించారు.తదనుగుణంగానే వారి తాత్త్విక సిద్ధాంతంలో  కూడా ముందుగా దైవం యొక్క ఉనికిని రుజువు చెయ్యడానికీ ,ఆయన్నే సమస్త  విశ్వానికి  నైతిక పాలకునిగా ప్రతిష్టించడానికి ప్రయత్నం జరిగింది.నీతి, స్వేచ్చ,మానవీయ విలువలు,మతంలో ప్రజాస్వామ్యం వగైరాలకు వారి సిద్ధాంతాలు పట్టం కట్టాయి.

అయితే కొన్ని తార్కిక తప్పిదాల కారణంగా వీరి 'నైతిక రుజువుల' సిద్ధాంతం  తాత్త్వికంగా దేవుడున్నాడని రుజువుపరచడంలో విఫలం చెందినప్పటికీ వీరి కృషి సామాజిక రంగంలో పెద్ద ముందడుగేనని చెప్పుకోవాలి.

నైతిక సిద్ధాంతం ఆధారంగా దేవుడున్నాడని రుజువుపరచే ప్రయత్నాలు ప్రపంచ వ్యాప్తంగా,అన్ని మతాలలోనూ  చాలానే  జరిగాయి.అంతర్యామిగా అందరి లోపల ఉండి,' మంచి- చెడు లలో మంచినే ఎంచుకో' మని మనల్ని లోపలినుంచి  దేవుడే శాసిస్తున్నాడనే వాదన అశాస్త్రీయమని మనం గమనించాం.

వాదన అంతగా ప్రాచుర్యం పొందనప్పటికీ దేవుడే విశ్వానికి నైతిక పాలకుడనీ,  మన మంచి- చెడు వర్తనలకు ఆయనే అంతిమంగా తగు బహుమతులో, శిక్షలో ఇస్తాడనే భావనను మాత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు స్వీకరించారు.  నమ్మకం కారణంగా సమాజానికి కొంత మేరకు  మేలే జరిగింది.సామాన్య ప్రజలలో ఉన్న దైవ భీతి కారణంగా సమాజంలో  నేర విస్ఫోటనం (Explosion of Crime) వచ్చే ప్రమాదం నివారించబడింది.ఎందుకంటే ఇంకా సమాజంలో ఎక్కువమంది ప్రజలు తప్పు చెయ్యడానికి తడబడుతూనే ఉన్నారు కాబట్టి.ఇది సామాన్య ప్రజల స్థితి కాగా,పెత్తందారులు,దోపిడీ వర్గాలు  వారి ప్రతినిధులు మాత్రం నిస్సంకోచంగా నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు.అవసరమైనప్పుడల్లా ఎలాంటి జంకూ గొంకూ లేకుండా అబద్ధాలు చెప్పడానికి వారు ఎప్పుడూ సిద్ధమే.కనుక దోచుకునేవాడికి దైవభీతీలేదు ; పాపభీతీ లేదు. దోచబడే వాడికే అన్నిరకాల దైవభీతులు,పాపభీతులూ.

భీతీ లేకుండా తాము తమ దోపిడీని యథేచ్చగా కొనసాగిస్తున్న పెత్తందారీ వర్గాలు సామాన్య జనంలో పాప భీతి,దైవ భీతి తగ్గిపోతే వారు తమపైకి ఎక్కడ తిరగబడతారోనని, తమ అన్యాయాలనూ, అక్రమాలనూ ఎక్కడ ప్రశ్నిస్తారోనని ,  మతప్రచారం ముసుగులో వారిలో దైవభీతి తగ్గకుండా తగు  జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే మత ప్రచారానికి ముమ్మరంగా నిధులు కుమ్మరిస్తున్నారు.అదీ సంగతి!!

ఇక భారతీయ తత్త్వశాస్త్రంలో దేవుడున్నాడని రుజువు పరచేందుకు ఎవరెవరు ఏయే సిద్ధాంతాలను మనముందు ఉంచారో అవి ఏమేరకు శాస్త్రీయాలో ఒక్కటొక్కటిగా తరువాత భాగం నుంచీ చూద్దాం.

_______________________________________________________________________

శీర్షికలో గతమాసపు వ్యాసము పైన వచ్చిన స్పందనలను, జతపరచి సమర్పిస్తున్నాము. మీ స్పందనలను, విమర్శలను తప్పకుండా పంపండి. మళ్ళీ వచ్చే నేల జతపరుస్తాము. గత మాసపు వ్యాసం ఈ క్రింది లంకెను నొక్కితే లభ్యమవుతుంది.

http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/Aug12/devudunnaada.html

_______________________________________________________________________

Name: Rachakonda Daskhinamurthy, MN

Message: Devudunnaada? This article writer needs to realize - Reader Unnaada?

The article goes on and on and on for ages without good readability and conclusions. Why do we write to show our knowledge? One needs to write to drive a point. Why bring so many points so much information that have no conclusion. Its getting like a salad, without seasoning. Its becoming a flower-wase without flowers. This article needs serious consideration or review from readers perspective.

____________________________________________________________________________

ముత్తేవి రవీంద్రనాథ్ ఇలా వ్రాసారు:

ప్రియమైన రాచకొండ దక్షిణామూర్తి గారూ!

                                                నమస్కారం.

                   'దేవుడున్నాడా ?' పేరిట 'సుజనరంజని'లో నడుస్తున్న చర్చావేదిక పై మీ అభిప్రాయం చక్కగా , నిర్మొగమాటంగా తెలిపినందుకు ధన్యవాదాలు.అయితే అది కేవలం మీ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. వ్యాసావళికి   'చదువరులెవరైనా ఉన్నారా ?'అని రచయిత  గ్రహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వ్యాసాలను మొదటినుంచీ ఆసక్తిగా చదువుతున్న పలువురిలో కొందరు చర్చలో పాల్గొంటూ,  మరింత ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు కూడా. కొందరు మరింత ముందడుగేసి, నాతో ఫోన్ సంభాషణలు కూడా చేస్తూ, విషయం పై తమ లోతైన  ఆసక్తిని కనబరుస్తున్నారు.చదువుతున్నవారందరూ  వ్రాతపూర్వకంగా స్పందించక పోవచ్చు.   అయితే వచ్చిన చిక్కల్లా'దేవుడున్నాడా ?' అనేది తత్త్వ శాస్త్రపు మౌలిక ప్రశ్న.తత్త్వ శాస్త్రమేమో అత్యంత గడ్డుదైన   ముడి పదార్ధం.కథలూ,గాథలూ, నవలలు వగైరాలలా తత్త్వ శాస్త్రం చదువరులందరినీ  ఆకట్టుకోదనేది వాస్తవం . కనుక తత్సంబంధిత  అంశాలపై ఆసక్తి చూపేవారి సంఖ్య సైతం  చాలా తక్కువగానే ఉంటుందనేది కూడా నిర్వివాదాంశం. వీలైనంత సులభ శైలిలో రాస్తూ, వివిధ చారిత్రక దశలలో మౌలిక ప్రశ్నపై పలువురు ప్రాక్పశ్చిమ తాత్త్వికులు  ఏం చెప్పారో వివరిస్తూ, వారి సిద్ధాంతాలలో ఉన్న తార్కిక లోపాల కారణంగా అవి శాస్త్రీయంగా నిలువజాలనివయ్యాయో క్లుప్తంగా తెలపడమే వ్యాస పరంపర లక్ష్యం. .'సుజనరంజని'లో సంగీతం, సాహిత్యం, భక్తి, చరిత్ర - ఇలా పలు అంశాలపై వ్యాసాలు  వస్తున్నట్లే చదువరులలో హేతు దృష్టినీ, శాస్త్రీయ      చింతననూ పెంపొందింపజేసి , 'దేవుడున్నాడా?' అనే దిశగా వారిని ఆలోచింపజేసే  తత్త్వ శాస్త్ర సంబంధిత చర్చ కూడా జరగడం అభిలషణీయమూ, ఆరోగ్యప్రదమూ కాదంటారా? భారత రాజ్యాంగంలోని పది ప్రాథమిక పౌర విదులలోనిదైన ' తాను  హేతు దృష్టిని కలిగి ఉండి, ఇతరులలో శాస్త్రీయ చింతనను పెంపొందింపజేయడం ' అనే విధికి నా వ్యాసాలు  ఏరకంగానూ విరుద్ధం కాదుకదా ! ఇక  ఎటువంటి నిర్దారణలూ  లేకుండా చర్చను  అనంతంగా యుగాల పర్యంతం(ఉత్ప్రేక్ష) సాగదీస్తున్నానని  మీరు   నిరాధార ఆరోపణ చేయడం సమంజసమేనంటారా ?.వాస్తవానికి  యుగాల తరబడి సాగిన భావ సంఘర్షణను క్లుప్తంగా, ఒక ప్రణాళిక ప్రకారం కేవలం   పద్దెనిమిది వ్యాసాలలో తెలియజేసేవరకు కూడా మీరు ఓపిక పట్టేట్లు లేరే  ?.నేను వ్యక్తపరుస్తున్న భావాలు రుచించకే  మీరు-- నేను' ఎట్టి  నిర్ధారణలు చేయకుండా సాగదీస్తున్నాననడం'  మాత్రం భావ్యం కాదు. మనసుపెట్టి చదివితే ప్రతి వ్యాసంలోనూ నా నిర్ధారణలు స్పష్టంగా  కనుపిస్తాయి. ఒకవేళ   వ్యాసాలు  నిస్సారంగా ఉన్నాయనేది మీ అభిప్రాయమైతే చర్చలో మీవంటి పెద్దలూ  పాల్గొని దాన్ని అర్థవంతమూ,సారవంతమూ చేయవచ్చు కదా ?అందుకు ఇప్పుడున్న  ఆటంకమేమిటి ? ఇది అసలు ఒక చర్చా వేదికేకదా? కనుక  నిరాధారమైన ఆరోపణలు మాని ఇకమీదట  అందుకు ప్రయత్నించ మనవి. వ్యాసాలు మీరు పేర్కొన్నట్లు  నేను నా పాండితీ ప్రకర్ష  కోసం రాస్తున్నవి కావని గమనించ ప్రార్థన.'సుజనరంజని' సంపాదకులు కోరిన మీదటనే నేను అంతకుమునుపు రాసిన వ్యాసాలను కొంత మార్చి ఒక క్రమ పద్ధతిలో అమర్చి ప్రచురణకు పంపడం జరిగింది మీకు రుచించని ఆహారాన్ని వర్జించే స్వేచ్చ మీకు  ఉన్నట్లే రుచించని  భావాల జోలికి వెళ్ళకుండా ఉండే స్వేచ్చ కూడా మీకుంది. ఒకవేళ మీకు తప్పుగా అనిపించిన,    అశాస్త్రీయ మనిపించిన  భావాలు ఏవయినా నేను  వ్యక్తపరిస్తే వాటిని  చర్చలో పాల్గొని ఎదుర్కొనండి.తప్పని, అశాస్త్రీయమని  రుజువుచేయండి. అంతేకాని,   రెండూ చేయకుండా మొత్తం చదువరులందరి తరఫునా మీరే వకాల్తా పుచ్చుకుని  ఇలాంటి నిరాధార  ఆరోపణలు చేయడం  సరికాదు.మీరు కోరుతున్నట్లు చదువరులకు చర్చాంశం స్పష్టంగా అర్థమయ్యేలా వివరించడమే నా ఉద్దేశం కనుకనే తేట తెలుగులోనే సులభ శైలిలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను.నా బహుముఖ ప్రజ్ఞనో, బహుభాషా పాటవాన్నో చాటుకునే ప్రయత్నం అసలు చేయడం లేదు. అవసరమైన ఉటంకింపులు తప్పితే చర్చలో పాల్గొంటున్న కొందరు  నా ప్రతివాదులలాగా నేను ఆంగ్ల భాష జోలికే వెళ్లడం లేదు.తెలుగులో సాగితేనే చర్చ అందరికీ సుబోధకంగా ఉండగలదని వారికి ఇప్పటికే  పలుమార్లు విన్నవించాను.చదువరులకు సౌలభ్యమని మాత్రమే కాక-- పరాయి భాషలో పాటవం లేని కారణంగా 'Flower vase' వంటి అతి చిన్న పదాన్నికూడా 'Flower wase' అని తప్పుగా రాస్తానేమోననే భయం చేత కూడా నేను మాతృభాషకే కట్టుబడ్డాను. పాండితీ ప్రకర్ష నా ఉద్దేశమైతే నేనలా చేయనుకదా !!!

                               ఆలోచించవలసిందిగా  నా వినయపూర్వక విజ్ఞప్తి.

                                                                                           విద్వజ్జన విధేయుడు,

___________________________________________________________________________

కృష్ణ మహంకాళి ఇలా వ్రాసారు:

మనం తెలిసో తెలియకో అంటాం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయిన కుట్టదు అని. భగవద్గీత లో కూడా ఘంటశాల గారు పఠించిన శ్లోకాలలో కృష్ణుడు " కార్యాన్నీ నేనే, కార్యం చేయించే వాణ్ణీ నేనే వీటి అన్నిటికీ అతీతుణ్ణీ నేనే అని అంటాడు. ఇవన్ని థియరీసే. తర్కించుకోవచ్చు. మన పరిజ్ఞానం కర్థ-కర్మ-క్రియ వరకే పరిమితమయ్యింది. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి వలయం లో నుండీ బయట పడాలి. పారడాక్స్ ఎమిటంటే బయట పడ్డ వాడు అయన్స్టీను కాని, రమణ మహర్షి కాని, భగవంతుడు ఉన్నాడు లేడు అనే తర్కం లొ నుండీ విముక్తి పొందారు. కాబట్టి ఇంక పజిలు మన ముందు అలానే మిగిలి పోయింది. భగవంతుడు ఉన్నాడు అన్న వాడు ఉన్నాడని ప్రూవు చేయ్యలి. లేడు అన్న వాడు లేడని ప్రూవు చెయ్యాలి. ఇవి రెండూ నా దృష్ఠిలో సమాంతర రేఖలు రైలు పట్టాల్లాగా.

___________________________________________________________________________

 

ఏల్చూరి మురళీధరరావు   ఇలా వ్రాసారు:

ఆత్మీయులు శ్రీ రవీంద్రనాథ్ గారికి

నమస్కారములతో,

సుజనరంజనిలో మీరు వ్రాస్తున్న వ్యాసపరంపరను, అన్యస్థలంలో మీరు ప్రకటించిన శేషాచలపతిని గురించిన శేషప్రశ్నలనుఇతరవ్యాసాలను చదివి, ఏతన్మూలకంగా మీ ఆలోచనాలోచనాలు వెల్లడిస్తున్న కాంతిపుంజాన్ని ఎప్పటికప్పుడు దర్శిస్తూనే ఉన్నాను. మీ రచనాసంవిధానం, వాదపటిమ, సంస్కారం, సంయమనం, స్పష్టత నాకెప్పుడూ నచ్చుతాయి.   

తర్కశాస్త్రంలో వాద బలము వాది బలము అని రెండు విషయాలున్నాయి. వాది బలం వల్ల నెగ్గే ప్రతిపాదనలు (ఆధునిక తర్కంలో వాటిని సాధ్యవిషయాలని అంటారు) కాలప్రవాహంలో నిలుస్తాయో, నిలువలేవో ఎవరూ చెప్పలేరు. భర్తృహరి చెప్పినట్లు సదసి వాక్పటుతా” – (భూపసభాంతరాళముల పుష్కలవాక్చతురత్వము అని ఏనుగు లక్ష్మణకవి) ఉన్నవారు ఏమి చెప్పినా తత్కాలోచిత తత్తత్సభాస్థానపరిమితమైన విజయం వారికి దక్కి తీరుతుంది. అయితే, అఖండమైన కాలశక్తి ఆ వాదిపైన, ఆ వాదం పైన, ఆ విజయం పైన దృగ్దర్శనాలకు అందని యవనికను పరిచి అన్నింటినీ మింగివేస్తుంది. వాద బలం ఉన్నవి తత్తత్కాలాలలో ప్రాచుర్యాన్ని గడింపలేకపోయినా, కాలాంతరంలో నైనా వాటి విలువ జనానికి అనుభవంలోకి వచ్చి, ఆ వాదం నిగమనం గానూ, నిష్కర్ష గానూ, సిద్ధాంతం గానూ, శిరోధార్యం గానూ మారుతుంది.

ఆస్తికత నాస్తికత అన్న దార్శనికసంహితను గురించి నేనేమీ లోతుగా ఎప్పుడూ ఆలోచించలేదు. మా నాన్నగారు నాస్తికతను నమ్మినందువల్ల మాకు జాతకర్మ, చౌల, ఉపనయనాదికాలు చేయించలేదు. మా అక్కయ్య మామగారు శ్రీ ధనికొండ హనుమంతరావు గారు పూర్తిగా నాస్తికులు. జీవితంలో క్లిష్టసమయాలు ఎదురైనప్పుడు కూడా ఆయన ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారే కాని, ఏదో అతీతశక్తి, దేవుడు, దయ్యం అన్న ఆలోచననే దరికి రానీయలేదు. మా నాన్నగారికి అప్రతర్కితంగా, అనభ్యూహితంగా ఒకనాడు మద్రాసులోని హిందూ పత్రిక కార్యాలయంలోని ఒక చిన్ని ఉద్యోగి - భగవత్తుల్యస్వరూపులైన ఉపద్రష్ట సంగమేశం గారని ఒక ఉత్తమపురుషులు పరిచయమైనప్పుడు ఆ మహావ్యక్తి ఉదాత్తజీవితాన్ని చూసి ఆయన విశ్వాసధర్మాన్ని చూసి ఆయన నిఃస్వార్థభక్తిని చూసి ఆయన నిర్మమతను, లోకోపకారదీక్షను చూసి మా నాన్నగారు కూడా ఆయన విశ్వసనీయత వల్ల తామూ విశ్వసించి, కొన్ని అనుభవాలను పొందారు. మేము వ్యక్తులమయ్యే నాటికే ఇవన్నీ జరిగినందువల్ల మా నాన్నగారి గురువు గారైన ఆ మహాపురుషుని జీవితం ఇంటిలో మమ్మల్ని అందర్నీ ప్రభావితం చేసింది. అప్పటి నుంచి ఇంటిలో అన్నీ సంప్రదాయోక్తంగా సంభవించాయి. ఆస్తికత నాస్తికతలలో ఏది కార్యకారణసంగతమో, ఏది పూర్వోత్తరాన్వయసంగతమో నాకు తెలియదు.

మీ వ్యాసాలలో ఇంతకు మునుపు చర్చకు వచ్చిన అనేకవిషయాల ఆత్మీయాభివ్యక్తి ఉన్నది. నాకు మీ తర్కసంగతి నచ్చుతుంది. గతితార్కికభౌతికవాదపు పునాదులు నచ్చుతాయి. అయితే తర్కము, పూర్వమీమాంస అన్నవి ప్రమాణషట్కముపై ఆధారపడినవి. ప్రమాణానికి మూలమైన ప్రమ భ్రమను తొలగిస్తుందే కాని, తదతీతమైన ఆనుభవికతను గురించి చర్చ చేయదు. చీకటిలో రజ్జువును తాకినప్పుడు సర్పమని భ్రమిస్తే సర్పజ్ఞానమే కదా, ఆ భ్రాంతికి కారణం! అప్పుడు భ్రమకు మూలమైన ఆ జ్ఞానం మాత్రం ప్రమాణమా? ప్రమాత్మకమా? అని మీమాంసక -నైయాయికులలో ఒక వర్గం వారు (భాట్ట మతస్థులు) వాదించినప్పుడు, పూర్వమీమాంసకులు రజ్జువు సర్పమన్నప్పటి భ్రాంతిజ్ఞానం జ్ఞానము కాదు; అది విపరీతజ్ఞానం; అజ్ఞానమంటే విపరీతజ్ఞానమే కాని జ్ఞానరాహిత్యం కాదు అని సమాధానింప వలసి వచ్చింది. ఆ పాఠపరిష్కారం వల్లనే అజ్ఞానము నుంచి విజ్ఞానము లోనికి, తమస్సులో నుంచి జ్యోతిస్సులోకి ప్రయాణించినప్పుడు విపరీతజ్ఞానం తొలగి, శుద్ధము, బుద్ధము, ముక్తము, కేవలము, అఖండము, సత్ చిత్ ఆనందస్వరూపము అయిన స్థితియొక్క అనుభవము కలుగుతుంది అని మీమాంసకులు వేదాంతధర్మానికి పునాదులు తవ్వారు. షడ్దర్శనాలు నిర్మించిన ఆ పునాదిపై భారతీయసంస్కృతి మహాసౌధాన్ని అనుష్ఠానవేదాంతులు నిర్మించారు.

నే ననుకొంటాను: ఎవరి అనుభవం వారిది. ఎవరి జీవితానుభవం, వారు చవిచూసిన కష్టనష్టాలు, వారి వారి జీవితాలలో తారసిల్లిన వ్యక్తులు, కుటుంబం లోని పరిస్థితులు ఇవన్నీ వారి ఆలోచనలపై ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల ఆస్తికతను ఆస్తికులను వేరుగా చూడాలనుకొంటాను. నాస్తికతను నాస్తికులను వేరుగా చూడాలనుకొంటాను. ఆస్తికులలోని మూఢతను, శుష్కతర్కాన్ని అంగీకరించలేను. నాస్తికధర్మం కూడా ఈ దేశంలో ఒక ధర్మమే కదా. నాస్తికులు చూపే పెక్కు ఉపపత్తులను నేను కాదనలేను. బ్రహ్మసూత్రవిచారంలో నాస్తికదర్శనాలను ఖండింపవలసి వచ్చినప్పుడు వ్యాఖ్యాతలు ఆచితూచి అడుగువేసిన ఘట్టాలు నాకెంతో నచ్చుతాయి. ఎందుకంటే, ఆ వ్యాఖ్యాతలకు సైతం ఆ విషయంపైని నిశ్చితాభిప్రాయమేమీ ఏర్పడలేదు కనుక. ఆస్తికత నాస్తికత అన్న జీవితంలోని అతిసూక్ష్మవిభాజకరేఖపై మనవలెనే వారూ నిలిచి ఉన్నారు కాబట్టి.

ఉభయవాదాలలోని సత్యాసత్యాలను పరిష్కరించగల స్థాయి నాకు లేదు.

అందువల్ల మీరు వ్రాసిన, వ్రాస్తున్న వ్యాసాలను అభిమానంతో చదువుకొంటాను. మీ వాదనలోని తార్కికతను ఆసక్తితో నేర్చుకొంటాను. నా జీవితంలోని వివిధవయోవస్థలలో నేను ఆ విధంగా ఆలోచించి వివేకపూర్ణనిర్ణయాలను తీసికొనగలిగానా? నిర్వికార నిరంజనమైన శక్తిపై ఆధారపడి బలహీనపడ్డానా? అని నెమరువేసుకొంటాను

శాస్త్రమెప్పుడూ భాసించే విషయాలను శాసించే ప్రయత్నం చేస్తుంది. భాసమానతకు అతీతమైన విషయాలు చర్చకు, మీమాంసకు, ఆన్వీక్షికకు, తర్కానికి సంబంధించినవి కావు. హేతువుకు అందని నిర్దేశాలు కూడా జీవితంలో ఉంటాయి. మనము చూడలేనంత మాత్రాన గమ్యము అగమ్యగోచరమని, గమనీయం కాదని అనలేము కదా. నాస్తికదర్శనంలో ఆ వైయక్తికాన్వేషణకు, ఆత్మానుభూతికి, అనిర్వచనీయతకు స్థానం లేకపోవటం నాకు విచారాన్ని కలిగిస్తుంది. ఆస్తికదర్శనాల విషయమూ అంతే. అవి తమకు తామై కల్పించుకొన్న విద్యారణ్యంలో ఉండి ప్రజానీకానికి దూరవర్తులైనాయి. ఆ లోపం శోచనీయం కదా. ఆస్తికధర్మాన్ని గురించి వాదించే వారి వాదమూ ఆనుభవికమైతే అభిమానంతో తెలుసుకొని అధ్యయనిస్తాను. పుస్తకాలలోని పడికట్టురాళ్ళ చిలుక పలుకులనిపిస్తే మర్చిపోతాను.

దేవుడున్నాడా? లేడా? అన్నది నా స్థాయికి అందని సాధ్యనిర్దేశం. నేను ఏకీభావానికి, మూకీభవానికి మధ్యావస్థలో ఉన్నాను. ఆత్మవిచారం, జీవవిచారం, బ్రహ్మవిచారం అన్నవాటి తత్త్వవిచారంతో ప్రస్థానం మొదలుపెట్టిన విద్యార్థి గమ్యాన్ని చేరుకొంటాడో చేరుకొనలేడో; ఆ విద్యార్థిత్వం తోడి విద్యార్థిని నేనే అయితే అనంతమైన జీవితక్షితిజరేఖకు ఆవలి తీరాన ఉన్న ఆ ఆస్తికత నాస్తికతల చరమగమ్యాన్ని చేరుకొనగలనో చేరుకొనలేనో నాకు తెలియదు. అయితే, నా శిక్షణ, మా తండ్రిగారి ప్రభావం, కలిసికొన్న గురువులు, చదివిన పుస్తకాలు పరిచిన వెలుగుబాటలలో ప్రయాణించి చేరుకొనగల నిష్కైవల్యావస్థ భగవన్మయమైతే బాగుండు నని మాత్రం నాకు అనిపిస్తుంటుంది.

మీ వ్యాసాలు మనస్సులో ఎన్నో తీయని తలుపులను తీశాయి. తీయని తలపులను తెచ్చాయి. అవి మేధకు, హృదయానికి కలిగిస్తున్న నైశిత్యానికి మీకు ధన్యవాదాలని చెప్పటం కోసం ఈ మాటలు వ్రాశాను.

భవదీయుడు,

 

ముత్తేవి రవీంద్రనాథ్ గారి 'తెనాలి రామకృష్ణ కవి-శాస్త్రీయ పరిశీలన' అనే తొలి రచనకే  కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ పొందడం విశేషం. వీరికి "కావ్యనుశీలన కళా సమ్రాట్టు" అనే బిరుదుతోబాటు,విజయవాడ,ఒంగోలు,గుంటూరు,తెనాలి,చీరాల, అద్దంకి మొదలగు చోట్ల ఘన సత్కారాలు జరిగాయి. కమ్యూనిస్టు ఉద్యమంలో కాకలు తీరిన కుటుంబ నేపథ్యం గలిగి, సైన్స్ విద్యార్థిగా శాస్త్రీయ దృష్టినీ,సహేతుక దృక్పథాన్నీ అలవరచుకుని,స్వయం సంపాదిత సాహితీ నేపథ్యంతో రచనలు చేస్తున్న రవీంద్రనాథ్ గారు సంఘ సేవా తత్పరులు కూడా కావడం అదనపు గౌరవానికి ఆలంబనమైన విషయం. వీరు  'శ్రమ వీరులు' పేరిట కొన్ని శ్రామిక సామాజిక వర్గాల చరిత్ర, స్థితిగతులపై పరిశోధనాత్మక గ్రంథం రాశారు. జనరంజకమైన  హరికథా రూపంలో దైవ ప్రస్తావన లేకుండా ' మహాకవి శ్రీ శ్రీ - సిరి కథ' అనే రచన చేశారు. 'పాండురంగ మాహాత్మ్యము-పరిచయం','మన ప్రాచీనుల ఆహారం,ఆరోగ్యం, వైద్యం' వీరి ఇటీవలి రచనలు. 2009 లో వాణిజ్య పన్నుల అధికారిగా పదవీ విరమణ చేసిన వీరు తత్త్వశాస్త్రం, చరిత్ర, వర్తమాన రాజకీయాలు, సైన్సు,పర్యావరణం వగైరా భిన్న, విభిన్నమైన  అంశాలపై  పలు దిన, వార, మాస పత్రికలలో రాస్తున్న వ్యాసాలు చదువరులలో ఆసక్తినీ,ఆలోచననూ రేకెత్తిస్తాయి. హేతుబద్ధమైన   ఆలోచన, శాస్త్రీయ దృష్టితోబాటు, వివిధ శాస్త్రాలు, భాషలలో చక్కటి ప్రవేశమున్న రవీంద్రనాథ్ గారి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే చర్చా వేదిక.

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech