Sujanaranjani
           
  శీర్షికలు  
 

భగవంతుని పై అరవిందునితో - ప్రశ్నోత్తరములు                                

        

 

 - రచన : ఉమా దేవి అద్దేపల్లి (అరోధృతి)  

 

పాండుచెర్రీలోని శ్రీ అరవిందో ఆశ్రమము

( శ్రీ మాతని గురించి వ్రాసిన ‘దివ్య జనని’  అనే నా పుస్తకంలోని  ఒక చిన్న భాగం యీ  ప్రశ్నోత్తరములు.  భగవంతుడు వున్నాడా!లేడా! అనే మీమాంసలో  కొట్టుమిట్టాడేవారికీ, దైవాన్ని గురించి తెలుసుకోవాలనే ఆకాంక్ష, ఆసక్తి గలవారికి సాక్షాత్తు దివ్య గురువులు  శ్రీ అరవిందుల సమాధానాలు ఉపయుక్తం కాగలవని ఆశిస్తున్నాను.)
 
 1926 నవంబర్ 24. పరిపూర్ణ శ్రీ కృష్ణ చైతన్యం మరొక సారి ఈ భూవాతావరణం లోనికి దిగివచ్చి, శ్రీ అరవిందుల భౌతిక శరీరంలోనికి ప్రవేశించిన అపూర్వ దినం. ఈ పవిత్రదినాన్ని సిద్ది దినం  గా ప్రకటించారు శ్రీ మాత.అంతకు ముందు శ్రీ అరవిందులు తరుచు తమ దర్శనార్ధమై వచ్చే కొందరు  భక్త్తులకి , సంవత్సరంలొ  నాలుగుసార్లు దర్శనమిచ్చేవారు. ఆ తరువాత పూర్తిగా వారు బయట ప్రపంచంలోని వ్యక్తులకు కనిపించడంమానివేశారు, ఆఖరికి ఆశ్రమ సాధకులకి కూడా వారి దర్శనభాగ్యం లభించేది కాదు.
 
సిద్ది అనంతరం శ్రీ అరవిందులను ఎవరు దర్శించలేకపోయినా, వారు స్వయంగా ఎవరితో మాటాడలేకపోయినా, బయట వారితో యధారీతి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతుండేవారు. దూరంగా వున్నవారైనా, దగ్గరగా వున్నవారైనా, ఎవరైనాసరే  భేదభావం లేకుండా వారు జవాబులు వ్రాసేవారు. చివరకి ఆశ్రమంలో ఉన్న సాధకులు సైతం తాము ఏదైనా శ్రీ అరవిందులకు తెలుపుకోవాలనుకున్నపుడు లేఖల ద్వారానే తెలియజేసుకోనేవారు. వెంటనే వారికీ శ్రీ అరవిందులు లిఖిత పూర్వకంగానే జవాబులిచ్చేవారు. దానివలన వారికీ ఎంతో సమయం నష్టం అవుతుండేది. మొదట్లో నాలుగైదు గంటలు, తరువాత ఎనిమిది పది గంటలు కూడా ఈఉత్తరాలు వ్రాయడం కొరకు వెచ్చించేవారు. పగటివేళ వారు ఏదైనా పనినో నిమగ్నమైవుంటే ,రాత్రి సమయాలలో ఉత్తరాలు వ్రాసేవారు. ఒక్కొక్కసారి అర్దరాత్రి వరకు వ్రాస్తూ ఉండిపోయేవారు. అనేకసార్లు వారు ఉత్తరాలు వ్రాస్తుండగానే ఉషోదయమయ్యేది. అయితే ఉత్తరాలు అనగానే ఏవో నాలుగు పంక్తులుగానో, లేక రెండు, మూడు పేజీలుగానో వ్రాయడంకాదు. వారి ఒక్కొక్క లేఖ ఒక్కొక్క అమూల్యమైన శక్తిపాతం అంటే అతిశయోక్తికాదు. లేఖలు వ్రాసినపుడు వారు తమ సర్వోన్నత చేతనతో, సర్వోన్నత స్థాయినుండి వ్రాసేవారు. అంతటి మహోన్నత స్థాయి నుండి  వారు వ్రాస్తున్నప్పటికి, వారి భాష జటిలంగా, గంభీరంగా, అర్ధంకాని స్థాయిలో కాక, ఎంతో సరళంగా, మృదుమధురంగా, ఎంతో కుతూహలాన్ని కలిగించేదిగా వుండేది. కొన్ని కొన్ని ఉత్తరాలు వారికీ చాలా హాస్యాస్పదంగా, తమాషాగా అనిపించేవి. అటువంటి వాటికి అదేవిధంగా హాస్యాన్నిచిందిస్తూ జవాబులిచ్చేవారు.
ఒకసారి వారి భక్తులొకరు వారిని ప్రశ్నించేరు .. ఏ విలువాలేని సామాన్యమైన  ఉత్తరాల కోసం మీ అమూల్యమైన సమయాన్ని ఎందుకు వృధాచేస్తున్నారు..?’ అని .దానికి వారిచ్చిన జవాబు ఏది కూడా సామాన్యమైనది కాదు. ఇసుక రేణువు కూడా విధాత సృష్టించినదే. అనంత విశ్వంలో ఇసుకరేణువుకి  కూడా దానివిలువ దానికుంది...  వారి దృష్టిలో ఈ లేఖలు వ్రాయడం అనే దానికి ఎంతో విలువ వుండేది. భగవదోపకరణంగా వారు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపడం వలన వారికీ ఈ పని ఆటంకం కలిగేది కాదు. అందుకే అతి సామాన్యమైనదిగా ఇతరులు భావించే పనిలో కూడా వారు అపార ఆనందాన్ని పొందగలిగేవారు.

అరవిందుని మహా సమాధి

ఉత్తరాల ద్వారా వారి భక్తులు వారిని వేసిన ప్రశ్నలు, వాటికి వారిచ్చిన  జవాబులు  మచ్చుకి కొన్ని చూద్దాం.    ప్రశ్న:  భగవంతుడు ఉన్నాడన్న మాట సత్యమా?.    జవాబు : రెండు రెండు కలిపితే నాలుగు అన్నది ఎంత సత్యమో, భగవంతుడు ఉన్నాడనేది దానికన్నా పది రెట్లు సత్యం. ప్రశ్న-:  భగవంతుడిని కళ్ళతో  ప్రత్యక్షంగా చూడగలమా ? జవాబు-:  తప్పకుండా.  టేబిల్, కుర్చీ ఎంత స్పష్టంగా చూడగలుగుతున్నామో, భగవంతుడిని అంతకన్నా కూడా స్పష్టంగా  చూడగలం. ఈ  బాహ్యవస్తువులను చూడడంలో ఒక్కోసారి పొరపాట్లు కూడా జరుగుతుంటాయి. కాని భగవంతుడిని  చూడగలిగితే  మనలో ఏ విధమైన పొరపాటు కూడా వుండదు. (అంటే అంత స్పష్టంగా, పరిపూర్ణంగా దర్శించగలం.) బాహ్య వస్తువులను మనం చూసేది, వినేది, కేవలం ఇంద్రియాల సహాయం ద్వారా. ఇంద్రియాల సహాయం, సహకారం లేకుండా మన చేతన అసలు పనిచెయ్యలేదు. కారణం, అజ్ఞానం అనే తెరతో అది కప్పబడి వుంటుంది కనుక. బాహ్యేంద్రియాలు  ఎంతవరకు విషయాలను సేకరించి తెలుపగలవో అంతవరకు మాత్రమే మన చేతన తెలుసుకోగలదు. భగవంతుని కృప కలిగితే తెర తొలగిపోతుంది. అప్పుడు అంతఃచేతన యొక్క అంతర్నేత్రం విడివడి  భగవంతుని ముఖాముఖి స్పష్టంగా చూడగలుగుతుంది. అంతేకాదు ,అంతర్నేత్రం యొక్క దివ్యదృష్టి బాహ్యేంద్రియాలను  కూడా సచేతనంగా మార్చగలదు. ప్రశ్న :-  భగవంతుని దర్శించడానికి సులువైన మార్గమేది ? జవాబు :-  భగవంతుని  దర్శించాలంటే ప్రభలమైన అభీప్స, ఇచ్చ కావాలి. ప్రాణాలను కూడా ఇవ్వగలంత  ప్రేమ, పరిపూర్ణంగా  అతని వద్ద తనని తాను నివేదించుకోగల సమర్పణ భావం కావాలి. ఈ విధమైన భావాలు నీలో వుంటే  ఏదో ఒకనాడు తప్పక అతన్ని దర్శించగలుగుతావు. ప్రశ్న :- భగవంతుడు లభించాలంటే  ఏదైనా మంత్రం లాటిది జపించాలా ? జవాబు :-  కేవలం ఒకే మంత్రం ఏకాగ్రతతో నేనాతనిని ఎప్పుడైతే హృదయపూర్వకంగా  కోరుకుంటానో, అప్పుడే నాకాతను  లభిస్తాడు. ఇది నాపూర్తి  నమ్మకం. ఇంతకు మించి వేరే భావన నాలోలేదు. అతనేమి చెయ్యాలనుకుంటున్నాడో, చేస్తాడో  చెయ్యనీగాక! స్వతః స్పూర్తిగా, సమయోచితంగా, తన స్వహస్తాలతో  నన్ను తన అక్కున చేర్చుకోవాలి.. ఇదే అన్నిటికన్నా విలువైన మంత్రం. భగవంతుడు నాకు లభిస్తాడు గాక లభిస్తాడు, అన్న పరిపూర్ణమైన  విశ్వాసం, నమ్మకమే  అన్నిటికన్నా గొప్ప మంత్రం. ప్రశ్న :-  ఈ విధమైన భావాలు మనలో వున్నప్పటికీ , భగవంతుని సంధానం మనకు లభించకపోతే .? జవాబు :- నీ కోరిక  యధార్ధమైనదైతే, ఒక రోజు కాకపోతే వేరొక రోజు తప్పక అతన్ని పొందగలుగుతావు. ఒక విషయం మాత్రం భ్రాంతి లేనిదీ, సందేహం లేనిదీను, అదేమిటంటే, మొదటినుంచి చివరివరకు  ప్రతి ఒక్కరు ప్రభంజనంలాగా నిన్ను  ఊపివేస్తారు, ఒక్క భగవంతుడు తప్ప. ఒకసారి నీ ముఖాన్ని అతనివైపుకి తిప్పగలిగావంటే  అతని సన్నిధికి చేరే మార్గం నీకు సుగమం  అయిందన్నమాటే. దాని కొరకై తరువాత ఎంత కాలవిలంబన జరిగినా జరగవచ్చు. ఒకవేళ  మధ్యే మార్గంలో నీ పయనం ఆగిపోతే అది వేరే సంగతి, లేదంటే అతను మాత్రం విడిచి పెట్టడు. చివరవరకు నిన్ను చేయి పట్టుకొని నడిపిస్తాడు. నిజమైన అభిప్సగల  ఆశావాదులనెప్పుడు  ఆయన నిరాశ పరచడు. ప్రశ్న :-  కఠోరమైన తపస్సులనాచరించకుండా  భగవంతుడిని పొందడమనేది సంభవమా  ? జవాబు:- కేవలం ఆ ఒకే ఒక ఆధారం, ఆశయంతో నీ సర్వస్వాన్ని అతని చేతులలో వదిలి వేయగలిగిననాడు అసంభవం అనేదిలేదు. నీ మనసులోనున్న సందేహాన్ని దూరం చేసుకోగలిగితే, వినమ్రుడవై  నిన్ను నీవు సమర్పించుకోవాలనే  ఇచ్చను నీలో నీవు పెంపొందించుకుంటూ  సాగిపో. ఆప్పుడు తప్పక భగవంతుడు నీ పిలుపునాలకిస్తాడు. అప్పుడు నీకు కఠోర తపస్సు యొక్క ఆవశ్యకత వుండదు. పరిపూర్ణంగా భగవంతునికి నీవు లభించినపుడే  భగవంతుడు నీకు లభిస్తాడు. అటువంటివారే భగవంతుని శాంతి,ప్రేమ, జ్యోతి,ఆనందం, శక్తి,జ్ఞానం పొందుతారు. అన్ని వైపుల నుండి  పరిపూర్ణత లభిస్తుంది .   ప్రశ్న :- మీరింతగా చెప్తున్నప్పటికీ  మనసులో సందేహం అనేది పోవడంలేదు.- ! జవాబు:- నీ కళ్ళతో నీవు చూసేవరకు సందేహం అనేది తొలగిపోదు. అయినా ఎంత వరకు నీకు నమ్మకం, విశ్వాసం వున్నాయో అంతటితోనే  ముందుకు సాగిపో. తరువాత బాహ్యచక్షువులతో  కాకుండా, స్వానుభవంతో , అనుభూతితో  అతన్ని చూడగలుగుతావు.  అతని శాంతి,ఆనందం అనేవి వరద వెల్లువలా వచ్చి నీలో ప్రవేశించినపుడు, అతని ఉనికిని అహరహం నీలో నిలుపుకోగలిగినప్పుడు, అతని జ్ఞానదీప్తి తరంగమనేది ఎగసి వచ్చి ఒకముహూర్త కాలంలో  నీలోనున్న సమస్త  అంధకార తామసికతను కాంతి ప్రవాహంగా మార్చి వేస్తుంది.ఇవన్ని ప్రత్యక్షంగా  చూడగలిగినపుడు, సందేహం అనేదానికి నీలో తావేక్కడిది .? ప్రశ్న :- ఇది కేవలం మీ మనోగత భావనయేనేమో. యదార్ధమైన జ్ఞానానికిచెందిన విషయం కాదు . జవాబు :- ఇది కూడా ఒకరకమైన జ్ఞానమే. వైజ్ఞానికంగా కూడా మనసులో ఒక సూచన ప్రాయంగా మొదట ఒక అనుభూతి  జనిస్తుంది. తరువాత పరీక్షలద్వారా  దానిలోనున్న  సత్యాన్ని  వాస్తవరుపంలో  ఆవిష్కరించడం జరుగుతుంది. ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా అంతే. అనేక దేశాలవారు,  అనేక సమయాల్లో భగవంతుని గురించి ఇదేవిధంగా చెప్తూ వచ్చారు. నీవు స్వయంగా పరిక్షించి, ప్రయోగాత్మకంగా విషయాన్ని తెలుసుకొని చూడు. తద్వారా నీకు లభించిన యధార్ధ సత్యాన్ని కార్యరూపంలో పెట్టు. ముందుగా కేవలం తర్కవితర్కాలతో  సందేహాన్ని నీలో నింపుకోవడం వలన ప్రయోజనం ఏమిటి ? విజ్ఞానంలో  ఈ విధమైన మీమాంస  పనికి వస్తుందా ! అవిశ్వాసంతో  ఏ వస్తువునైనా  పరిక్షించగలుగుతామా ? ప్రశ్న :- భగవంతుని కృప సర్వులకు  లభించగలదా ? జవాబు :- తప్పకుండా. భగవత్కృప  అందరికి లభిస్తుంది. అయితే ఆ కృపను అందుకోగలిగే  యోగ్యతను నీవు  సంపాదించాలి. ఆ  గ్రహణశీలత, సంసిద్ధత ముందు నీలో  కలగాలి. అతని వైపునుండి కృప నీపై వర్షించినపుడు నీవైపు  నుండి సంసిద్ధత అనేది  ఏర్పడినపుడే  ఆ కృప ఫలప్రదం కాగలుగుతుంది. ప్రశ్న :- తమరు భగవత్సాక్షాత్కారాన్ని పొందారు. అయినా ఇంకా ఎందుకు యోగసాధన కొనసాగిస్తున్నారు .? జవాబు :- నా యీ యోగసాధన నాకోసం కాదు. నా సొంతం కోసం నాకేమి అవసరం లేదు. ఆఖరికి ముక్తి, మోక్షం కూడా అక్కరలేదు.  ప్రపంచం యొక్క పరిస్థితిని ,రూపురేఖలను మార్చడం కొరకే నాయోగం. ఇప్పటిలా కాకుండా వేరే విధంగా యీ జగత్తు ఉండాలని నేను వాంచిస్తున్నాను. ప్రశ్న :- ప్రపంచ పరిస్థితి ఇంకా ఇంకా జటిలమవుతు వుంది. ఈ  సమయంలో మీ ఉద్దేశ్యం సఫలమయ్యేది ఎలా ? జవాబు :- ఇటువంటి  జటిల పరిస్థితి ఒకనాడు రానే వస్తుందన్న సంగతి నాకు ముందుగానే తెలుసు. ఉషోదయానికి  ముందు చీకటి ఇంకా ఇంకా గాఢమవుతుంది.  ఈ విధమైన  గ్లాని ప్రపంచ ప్రకృతిలోనే  నిండివుంది. అదంతా బయటకు రానిదే  ప్రపంచంలో మంచి జరిగేదేలా ? బహిరంగంగా  కొంత అటు,ఇటు మార్పులు జరుగుతున్నాయి,జరిగాయి. ఇప్పుడు లోపల వైపు మార్పు రావాలి. భారత దేశానికి  స్వాతంత్ర్యం  లభించింది. అయినా అస్తవ్యస్త పరిస్థితులు చక్కబడలేదు. ఇది కూడా కొంత కాలానికి మారకపోదు. అయితే ప్రజానీకానికి  ప్రస్తుతం కొంత దుఖం ,కష్టం అనేవి  అనుభవించక తప్పదు. కాని అది తాత్కాలికమే. తరువాత  దివ్య శక్తి యొక్క క్రియ ఆరంభం అవుతుంది. ప్రపంచాన్ని ఆధ్యాత్మిక ప్రకాశంలో ప్రకాశింప చేయాలన్న సంకల్పం అప్పుడు ఫలప్రదమవుతుంది. అందుచేత ప్రస్తుత క్లిష్ట పరిస్థితులను చూసి నేను క్రుంగిపోవడం లేదు. జగత్కళ్యాణం జరిగేతీరుతుందనేది  నిస్సందేహం .......’’             తరువాత, తరువాత ఇతర కార్యక్రమాల ఒత్తిడి , సాధనలో వారు  అధిరోహిస్తున్న ఉత్తుంగ శిఖరాల ఆరోహణ, తద్వారా  శ్రీ  అరవిందులు ఉత్తరప్రత్యుత్తరాలే  కాదు ,అన్ని నిలుపు చేసి ,గభీర సాధనలో ,తపస్సులో మునిగిపోయారు. 1926  సకల బరువు భాద్యతలను శ్రీ మాత పై మోపి,వారు తపోనిష్ట లొ గడిపారు. ఆమె పర్యవేక్షణలోనే  ఆశ్రమం క్రమక్రమంగా ఈ నాటి రూపం దాల్చింది. ‘’శ్రీమాత లేనిదే ఆశ్రమం లేదు.’’ అనేవారు శ్రీ అరవిందులు.                                                                             నమోభగవతే  శ్రీ అరవిందాయనమః   

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech