సుజనరంజని / కబుర్లు / పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు

"పత్రం -పుష్పం-ఫలం -తోయం".

                   రచన : ఓలేటి వెంకట సుబ్బారావు 

                        

 

వీటిని సభక్తికంగా ఆ పరమాత్మునికి సమర్పించి సేవిస్తే ఆయన మనలను  ఆశీర్వదించి  అనుగ్రహించేది  ఆయన అపారమయిన కరుణామృతాన్ని, వాత్సల్యాన్ని మానవుడు మాధవుడు వీరువురి అనుసంధానంలో మనకు గోచరాలు సమర్పణ ప్రసాదం అనేవి  రెండూను. ఇవి ఎంతో ప్రాముఖ్యతని సంతరించుకున్నవి.

అలా జీవితాన్ని భగవంతుని పాదాల వద్ద పూజాద్రవ్యంగా సమర్పించి, ఆయన కరుణామృతాన్ని ప్రసాదంగా స్వీకరించిన ఒక వ్యక్తిని గురించినది  ఈ  కథనం.
శ్రీ పి.వి .ఆర్.కె.ప్రసాద్  IAS .,-- అవును, ఆయనే !

ఈ పేరు వినగానే  పలువురు  వేసే మొదటి ప్రశ్న ...
" ఓ --తిరుపతి దేవస్థానంలో చేసారు- ఆయనేనా ?"--అని  

ప్రసాద్ గారు ఎన్నో వున్నత పదవులను సమర్ధవంతంగా  నిర్వహించారు. అలాగే,ఆయన తన ఉద్యోగ పర్వంలో తిరుపతిలో  తిరుమల తిరుపతి దేవస్థానముల  కార్యనిర్వాహణాధికారిగా  ప్రజాహృదయాలలో  ఒక  విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు..ఆయన మాటలలోనే చెప్పాలంటే 


                                                       "అనేక అనుభవాలు..
                                                        అసంఖ్యాక భావాలు...
                                                        అపరిమితమయిన ఆలోచనలు ...


ఇవన్నీ రాయాలని వున్నా రాసే  ప్రయత్నం   చేసే లోపల కుటుంబ సంబంధమయిన , ఉద్యోగ  సంబంధమయిన   అనేక అవరోధాలు !"---
అయినా సరే ఈ అవరోధాలను అధిగమించి  ఆయన తన ఆశలకు ఆశయాలకు అనుభూతులకు ఒక అక్షర రూపాన్ని ఇచ్చి  వైవిధ్యమయిన రెండు బృహత్తర రచనలను చేసి  వాటిని పుస్తకాలుగా  వెలువరించారు.
శ్రీ వేమూరి బలరాం  సంపాదకత్వంలో  వెలువడే ప్రముఖ వార పత్రిక  స్వాతి లో ధారావాహికంగా  నాహం కర్తా-హరి: కర్తా అన్న శీర్షిక తో  ప్రచురింపబడిన  ఆయన వ్యాసాలను  అటు తరువాత అదే పేరుతో  ఎమెస్కో  సంస్థ  ఆయన తొలి పుస్తకం గా వెలువరించింది. .తిరుపతి లో శ్రీ పద్మావతి-శ్రీనివాసుల  కొలువు లో (TTD ) లో కార్య నిర్వహణాధికారి ( Executive  Officer ) గా 1978 -82  మధ్య కాలంలో  పని చేసినప్పటి ఆయన ముఖ్య అనుభవాలన్నీ ఇందులో చోటు చేసుకుని  ఈ పుస్తకం - ఎందరి     అభిమానాన్నో  చూరగొన్నది  శ్రీ ప్రసాద్ రచనకు-ప్రసిద్ధ చిత్రకారుడు శ్రీ బాపు  బొమ్మలు మరింత వన్నె తెచ్చి -పుష్టి నీ తుష్టి  నీ సమకూర్చాయి

0


ఐఏఎస్  ఆఫీసర్  గా ఆయన ఇతర బాధ్యతాయుతమయిన  ఎన్నో పదవులను  కడు సమర్ధవంతంగా   నిర్వహించారు. వీటిలో కొన్ని  ఖమ్మం జిల్లా కలెక్టర్  గా ఎక్సైజ్  కమీషనర్  గా, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్  గా, విశాఖ పోర్ట్ ట్రస్ట్  చైర్మన్  గా, మానవ వనరుల అభివృద్ధి సంస్థ  డైరెక్టర్  జనరల్  గా, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గా...
ఇవన్నీ ఒక ఎత్తయితే  మరో ఎత్తు రాష్ట్ర ముఖ్య మంత్రి కి  సలహాదారుగా, కార్యదర్శిగా, ప్రధాన మంత్రి  కార్యాలయంలో  సంయుక్త కార్యదర్శిగా ఉంటూ  ప్రధాన మంత్రి కి సమాచార సలహాదారుగా అతి కీలకమయిన  ఉద్యోగాలు..

సాధారణంగా ఒక ముఖ్యమంత్రి  దగ్గర పని చేయడమే  అనేక వత్తిడులతో కూడుకున్న పని. అలాంటిది వివిధ/పలు ముఖ్యమంత్రుల వద్ద  వారి పరిపాలనా శైలికి అనుగుణంగా  పని చేయగలగడం నిజంగా కత్తి మీద సాము లాంటిది. ఒక ప్రక్కన ఊపిరి సలుపని ఉద్యోగ విధుల నిర్వహణలో శారీరక, మానసిక వత్తిడులు అటు కుటుంబ వ్యవహారాలకు తగినంత సమయాన్ని వెచ్చించలేని నిస్సహాయ స్థితి దీనిని ఊహించడమే కష్టం.
ఇక అనుభవంలో  అవే పరిస్థితులు ఎదురయినప్పుడు  ఏమి చేయాలి ?నిజానికి ఇది పరిష్కారం అంతుబట్టని చాలా చిక్కు ప్రశ్న.ఇలాంటి చిక్కు ప్రశ్నలెన్నిటికో  తమ సమాధానాలను జోడించి ఆయన వ్రాసిన అద్భుత రచన ..‘అసలేం జరిగిందంటే’.

ఇక మరి ఇంతవరకూ  ప్రసాద్ గారి ఉద్యోగ విధుల గురించి వివరించడం జరిగింది. వారి బాల్యం, తత్సంబంధమయిన  అంశాలను ఇక్కడ నేను ప్రస్తావన చేయడం లేదు. శ్రీ ప్రసాద్ తో  నా పరిచయం ఆ పరిచయంలో చోటు చేసుకున్న రెండు మూడు ప్రధాన అంశాలను మీకు ఇక్కడ తెలియజేస్తాను.. 

నేను 1957 - 58  విద్యా సంవత్సరంలో హిందూ కళాశాల, గుంటూరులో ప్రీ  యూనివర్సిటి కోర్స్  (PUC ) చదువుకున్నాను. శ్రీ ప్రసాద్ అదే ప్రాంతం లో అదే కళాశాల లో చదువుకున్నారు.శ్రీ వల్లభజోస్యుల సుబ్బారావు  గారు మా  కళాశాల ప్రిన్సిపాల్ .ఉపాధ్యాయ వర్గం లో  శ్రీ చతుర్వేదుల నరసింహశాస్త్రి గారు
( అమరేంద్ర ), శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు, శ్రీ పిల్లలమఱ్ఱి  వెంకట హనుమంత రావు గారు, శ్రీ ప్రతివాది భయంకర అప్పలాచార్యుల వారు, శ్రీ పళ్ళెపూర్ణ ప్రజ్ఞాచార్యుల వారు వంటి  ఉద్దండ  పండిత  ప్రకాండులు వుండేవారు. మేము వారి శిక్షణలో, వారి కనుసన్ననలలో  పెరిగిన వాళ్ళం.

మాలో  సాహితీపిపాసకు  బీజాన్ని వేసినదీ, ఒరవడిని దిద్దినదీ  ఆ మహానుభావులే! క్రమశిక్షణ, వాత్సల్యాలను ప్రదర్శించి  మాలో భయభక్తులను ఉద్దీపింప జేశారు. మా విద్యార్ధి  దశలో అవి నిజంగా సువర్ణ దినాలు. అలనాటి స్మృతులు  మలయ సమీరాలు సంస్తవనీయాలు!

ప్రసాద్ గారికీ నాకూ  కూడా శ్రీ అమరేంద్ర గారంటే  అమితమయిన అభిమానం. నేను ఉద్యోగ రీత్యా  1985  ప్రాంతాలలో  హిందూ కాలేజ్ లో చదువు ముగించిన పాతికేళ్ళకు మించిన విరామం అనంతరం గుంటూరు లో నాగార్జునసాగర్  రైట్ కెనాల్స్ మెకానికల్  సర్కిల్  ఆఫీస్  లో  డిప్యుటీ  ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్  గా పని చేసే రోజులలో శ్రీ అమరేంద్ర గారిని బ్రాడీపేటలోని వారి స్వగృహంలో తరచూ కలుస్తూ ఉండేవాడిని. ఈ మధ్యకాలంలో  వారికీ నాకూ మధ్యన  ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవి.. ముత్యాలకోవలాంటి వారి చేతి వ్రాతలో  మూర్తీభవించిన   వాత్సల్యానికి అద్దం  పట్టేవారి ఉత్తరాలంటే  నాకు పరమ  ప్రీతి.

శ్రీ అమరేంద్ర తాడిపత్రి లోనూ పుట్టపర్తి లోనూ భగవాన్ శ్రీ సత్యసాయీ  విద్యా సంస్థలలో  పని చేసి పదవీ విరమణ చేసాకా, అనంతరం తన  పెన్షన్  మంజూరు గురించి హైదరాబాద్ వెళ్లి అక్కడ పెన్షన్  కార్యాలయంలో విచారణ  చేస్తూ  వుండగా  కాకతాళీయంగా అక్కడకే వేరే పని మీద వచ్చిన  శ్రీ ప్రసాద్  వారిని దూరం లో చూసి ఏమిటీ-మన అమరేంద్ర మాష్టారిలా వున్నారు అనుకుంటూ మళ్ళా వెనక్కు వచ్చి, వారిని కలిసి "నమస్కారం మాస్టారూ నా పేరు ప్రసాద్. నేను గతం లో గుంటూరులో హిందూ కాలేజ్  లో  మీ వద్దనే   చదువుకున్నాను. మీ  పూర్వ విద్యార్ధిని. అవునూ ఏమిటీ మీరిలా వచ్చారు?  అంటూ వాకబు చేయడం, అందుకు వారు  ఆనందం, ఆశ్చర్యం, తొట్రుపాటు  చెందిన కంఠం తో "అలాగా బాబూ-ఏమనుకోకు.వెంటనే నిన్ను గుర్తుపట్టలేక పోయాను..ఇక్కడ న పెన్షన్ మంజూరు గురించిన కాగితాల కోసం  ఇలా వచ్చాను . అన్నారట.. వెంటనే ప్రసాద్ అందుకొని అదేమిటి మాస్టారూ ఈ వయసులో మీరిలా శ్రమ  తీసుకోవడం..మేమంతా వుండగా ! మీ  దగ్గర కాగితాలనిలా ఇవ్వండి. నేను అన్నీ కనుక్కుని మీకా విషయం తెలియబరుస్తాను అని. తన కారు డ్రయివర్  ని పిలిచి అమ్మగారికి నేను ఫోన్ చేసి చెబుతాను. నువ్వు సార్ ని జాగ్రత్త గా తీసుకువెళ్ళి మన ఇంట్లో దిగబెట్టి రా. అని చెప్పారట. అమరేంద్ర మాస్టారు వారింట ఆతిధ్యం స్వీకరించి  తరువాత గుంటూరు చేరుకున్నారట. ఈ సంఘటన  జరిగిన సరిగ్గా వారం తిరక్కుండా  ఆయన పెన్షన్ మంజూరయి కాగితాలు అమరేంద్ర గారికి చేరాయట.
ఈ విషయాలన్నిటినీ. అమరేంద్ర గారిని నేను కలిసినప్పుడు  వారే నాతో స్వయంగా చెబుతూ "ఇదుగో మన ప్రసాద్  పాపం, ఈ విషయాలన్నిటినీ దగ్గరుండి చూసి, ఈ కాగితాలు వచ్చేలా చేసాడు. అతను స్వయంగా కలుగ జేసుకోబట్టే ఈ పని  ఇంత   సులువుగా  ఇంత  తొందరగా జరిగింది. అంటూ ఆనందపడ్డారు. ఈ విషయాన్ని  తరువాత ప్రసాద్  గారికి నేను వుత్తరం ద్వారా తెలియజేశాను.అప్పట్లో  ఆయన పౌర సంబంధాల శాఖ కమీషనర్ గా వుండేవారు. ప్రసాద్ గురుభక్తికి  ఇది ఒక ఉదాహరణ.

ప్రసాద్ TTD  ఎగ్జిక్యుటివ్  ఆఫీసర్ గా ఉన్న రోజులలో నేను వారికి  ఒకసారి  సూచన చేస్తూ  లేఖ వ్రాసాను. దేవస్థానం వారికి రోజూ తిరుమల తిరుపతి మధ్యన రవాణా సదుపాయం ఉంది కనుక -దీనిని వినియోగించుకొని  తిరుమల శ్రీవారి మహాప్రసాదం (లడ్లు వగయిరా) విక్రయానికి (దిగువ) తిరుపతి లో శ్రీ  గోవిందరాజస్వామి  వారి ఆలయ ప్రాంగణం లో ఒక కౌంటర్ ను ఏర్పాటు చేస్తే   భక్తులకు ఇక్కడ తిరుపతి లో కూడా  స్వామి వారి ప్రసాదాన్ని కొనుక్కునే సదుపాయాన్ని  కలుగజేసినట్లు అవుతుంది. ప్రత్యేకంగా   దీని కోసమని  వారు మళ్ళా తిరుమల వెళ్ళవలసిన  పని  వుండదు అంటూ. ఈ సూచనకు  శ్రీ ప్రసాద్ సానుకూలంగా స్పందిస్తూ  నాకు వుత్తరం రాసారు. భక్తులకు ఈ సదుపాయాన్ని కల్పిస్తూ అందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నామని.. వుత్తరం  వ్రాయడమే కాదు. ఆ సూచనను అమలు జరిపి  భక్తులకు ఆ సదుపాయాన్ని కల్పించారు.

మరో ముఖ్యమయిన విషయం.
1958 -65   ఆ ప్రాంతాలలో  ప్రస్తుతం సప్తగిరి  దేవస్థానం మాస పత్రిక  TTD  Bulletin  అన్న పేరుతో వెలువడేది . దానికి వార్షిక చందా కేవలం ఒకే ఒక్క  రూపాయి. ఇంగ్లీషు, తెలుగు, తమిళం, కన్నడం, హిందీ  విభాగాలు ఇందులో ఉండేవి. నేను ఆ పత్రిక కు చందాదారుడిని. అప్పటి ఆ పత్రికలో  శ్రీ రామాయణ రహస్య రత్నావళి అన్న  పేరుతో  శ్రీమద్వాల్మీకి రామాయణం ని  ఆధారంగా చేసుకుని సంస్కృత శ్లోకాలు -వీటికి తెలుగు లో వ్యాఖ్య తో  తిరుచానూరు  లో దేవస్థాన   విద్యాలయం లో  తెలుగు ఉపాధ్యాయునిగా పని చేసిన  శ్రీ వంగీపురం రంగస్వామి అయ్యంగార్  గారు  చక్కని వ్యాసాలను  ధారావాహికంగా వ్రాసేవారు. ఈ వ్యాసాలూ నన్ను అమితంగా ఆకర్షించాయి. వీటిని ఇంట్లో భద్రంగాను, మనసులో  పదిలంగాను దాచుకున్నాను.

1980 :
నా దగ్గర దాచుకున్న  TTD  Bulletins పాతవి  ఒకసారి  తిరగవేస్తూంటే   శ్రీ రామాయణ రహస్య రత్నావళి వ్యాసాలు ఎదుట దర్శన మిచ్చాయి. వెంటనే మనసులోంచి స్పార్క్ లా  ఒక ఆలోచన బయటకు వచ్చింది. అది ఆధారంగా  ప్రసాద్ గారికి వెంటనే ఒక ఉత్తరం రాసాను.

దేవస్థానం  వారు పూనుకుని ఈ వ్యాసాలను సంకలనం చేసి  ఒక పుస్తకం గా ప్రచురిస్తే, ఎందరో  సాహిత్య అభిమానులకు మేలు చేసిన వారవుతారు. దయచేసి ఈ సూచనను పరిశీలించి ఆమోదయోగ్యమయితే తగు చర్య తీసుకోవలసినది.. అని.

ఈ  వుత్తరం వ్రాసిన కొంత కాలానికి శ్రీ ప్రసాద్ నుంచి నాకు సమాధానం వచ్చింది. 
దేవస్థానం  శ్రీ అయ్యంగార్ గారిని  ని ఈ విషయంలో  సంప్రదించినట్లు  వారు  ఆనందించి  వ్రాత ప్రతులను  వారికి లభ్యపరచి ఆర్ధిక సహాయాన్ని చేసిన పక్షంలో  వారికి వారుగా ఈ పుస్తకాన్ని వెలువరించే సంకల్పంతో తామున్నట్లు  కోరికను  వ్యక్తం చేసారని ఈ కారణంగా  భద్రపరచబడిన  ఆ నాటి వ్రాత ప్రతులను తగు  ఆర్ధిక సహాయాన్ని వారి పేరున మంజూరు చేసి వారికీ అందజేయడానికి దేవస్థానం  తీర్మానించినట్లు.

శ్రీ ప్రసాద్ వుత్తరంలోని ఈ అంశాలను చదివిన పిమ్మట నా ఆనందానికి  అవధులు లేవు!!!  

ఇది ఇలా వుండగా దైవ లీల కాబోలు ! ప్రసాద్ గారికి అప్పటి ప్రధాన మంత్రి శ్రీ  పి.వి . నరసింహా రావు  గారికి సలహాదారుగా  నియామకపుటుత్తరవులు అందడం వారు బదిలీ పయిన డిల్లీ  వెళ్ళడం తటస్థించింది. నాకు అనిపించింది ఇంకేమిటిలే  ఈ వ్యవహారం ఇంతటితో  చతికిల బడ్డట్టే. ఆయన డిల్లీ వెళ్ళిపోతే ఇక ఈ విషయాన్ని ఇక్కడ ఎవరు పట్టించుకుంటారు ? వ్యవహారం ఇక అటక ఎక్కినట్లే ' అని .
కాలగమనం లో  మరో రెండు ,మూడు ఏళ్ళు గడిచిపోయాయి .......


ఒక నాడు  "సప్తగిరి' సంపాదకులు శ్రీ కే. సుబ్బారావు  గారు తిరుపతి  నుండి  నాకొక  వుత్తరం రాసారు. దానిలో  సారాంశము :

గతంలో  ఎక్జిక్యూటివ్  ఆఫీసర్  శ్రీ  PVRK   ప్రసాద్  గారి ఉత్తర్వుల మేరకు   దేవస్థానం నుండి  వ్రాత ప్రతులను-ఆర్ధిక సహాయాన్ని   అందుకున్న శ్రీ రంగస్వామి అయ్యంగార్  ఆ పుస్తకాన్ని ప్రచురించారు  అని .  ఈ పరిణామం  పూర్తిగా, నేను ఊహించనిది. సాక్షాత్తూ, ఆ  పద్మావతీ శ్రినివాసులే  శ్రీ ప్రసాద్ సత్సంకల్పానికి  ఊపిరి పోసి ఈ కధనంతా  స్వయంగా నడిపారా అనిపించింది. ఈ సంఘటన  జరిగిన కొన్నాళ్ళకు నేను  నా తిరుపతి యాత్రలో భాగంగా  తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి దర్శనం చేసుకుని ఆ పిమ్మట  ఆలయానికి ఎదురుగా సన్నధి వీధిలోనే శ్రీ అయ్యంగార్ గారు నివసిస్తున్నారని తెలుసుకుని వారి ఇంటి గురించి  వాకబు చేసి  వారిని దర్శించు కుందామని  వారింటికి వెళ్ళాను. పెద్ద లోగిలి వారిది. వెళ్లి చూస్తే వీధి తలుపులు వేసి వున్నాయి..తలుపు తట్టాను మెల్లగా..తలుపు తీసి బయటకు వచ్చినాయన  తన పేరు నటరాజన్  తను  రంగ స్వామి గారి అబ్బాయి నని, స్టేట్ బ్యాంక్  లో పని  చేస్తున్నానని  తనను పరిచయం చేసుకున్నారు. లోపలి రండి అంటూ మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు. ఫరవా లేదు లెండి అంటూ  నేను నాగురించి , నేను వచ్చిన పని గురించి  ఆయనకు వివరంగా చెప్పాను..వెంటనే  ఆయన కేదో  స్ఫురించింది కాబోలును ఓ( హ్! మీరా సుబ్బారావు గారంటే!. నాన్న గారు మీ గురించీ, ప్రసాద్ గారి గురించీ, వారి సహాయం  గురించీ మాతో పదే పదే చెబుతుండేవారు. దురదృష్ట వశాత్తూ  రెండు మాసాల క్రితం  నాన్న గారు  'కాలం 'చేసారు."అంటూ.  నేను ఆశ్చర్యం నుండి తేరుకునే లోగా  ఆయన "ఒక్క నిముషం " అంటూ లోపలి వెళ్లి వచ్చారు.

ఆయన  చేతులలో  " శ్రీ రామాయణ రహస్య రత్నావళి "!
తీసుకోండి. మీ కోసమే ఈ పుస్తకం  అంటూ ఆ ప్రతి ని నా చేతులలో  ఉంచారు .
నా కళ్ళు చెమర్చాయి.!! ....నోట  మాట రాలేదు !!!!........

తిరుమల తిరుపతి  దేవస్థానం  శ్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో  ఎందరో పండితులకూ రచయిత లకూ కళా కారులకూ  ఉపాధిని కల్పించడమే కాకుండా,వారిని సముచిత రీతిలో  సమ్మానించి, వారిలో  కళాభారతి కి నీరాజనాలను అర్పించింది. ఈ రకం గా లభ్ధిని పొందిన వారెందరో నాతో స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించి శ్రీ ప్రసాద్ సౌజన్యాన్ని మనసారా కొనియాడారు.


చాలా కాలంగా అంటే కొన్ని దశాబ్దాలుగా  ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా మా మధ్యన ఏర్పడిన పరిచయాన్ని  పురస్కరించుకుని గత ఏడాది అంటే  2010  అక్టోబర్  లో శ్రీ ప్రసాద్, నేను తొలిసారి  గా చికాగో లో  నివాసమున్న  వారి కుమార్తె ఇంట్లో కలుసుకుని  ఇష్టాగోష్టి గా కాసేపు  అనేక  విషయాలను  ముచ్చటించుకున్నాము.
పరిచయం స్నేహంగా రూపొంది  బలపడిన శుభ సందర్భం ఇది. తిరుమల దేవాలయ చరిత్ర గురించిన  రచన  పని లో వున్నానని చెప్పారాయన. వారి అమ్మాయి ఆతిధ్యానికి  కృతజ్ఞతలు చెప్పి ఆయనకు అభినందనలు తెలుపుతూ  నేనూ మా అబ్బాయి సుధాకర్  వారి నుండి సెలవు తీసుకున్నాము .

ఒక ఇంటర్వ్యూ  సందర్భంగా  ప్రసాద్  గారు ఇలా చెప్పారు. . "Devotion is the breath of every action " అని . అవును.....ఆ మాటలు  వాస్తవానికి ప్రతిబింబాలు ..జీవనసత్యాలు ......!!!
 

====_/|\_===

 న     మ    స్తే

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech