వీరతాళ్ళు వేస్తాం, వస్తారా?! - 7

--వేమూరి వేంకటేశ్వరరావు

ముందుమాట: తెలుగులో రాయటమన్నా, మాట్లాడటమన్నా చాల కష్టం అనే భావం మనలో చాలమందిలో ఉంది. అందుకనే ఎందుకొచ్చిన గొడవనీ, తేలిగ్గా ఉంటుందనీ శుభ్రంగా ఇంగ్లీషులో మాట్లేడేసుకుంటాం. ఏ భాషైనా సరే వాడుతూన్నకొద్దీ వాడిగా తయారవుతుంది; వాడకపోతే వాడిపోతుంది. కనుక మన భాష కుంటుతూనో, మెక్కుతూనో మాట్లాడుతూ ఉంటే వాడితేరి వాడుకలోకి వస్తుంది. ఇంగ్లీషులో ఉన్నంత పదజాలం తెలుగులో లేదు. ఇంగ్లీషులో వాడుకలో ఉన్న మాటలు దరిదాపు 50,000 ఉంటాయని అంచనా. ఇదే రకం అంచనా వేస్తే తెలుగులో వాడుకలో ఉన్న మాటలు ఓ 15,000 ఉంటాయేమో. మన భాష పెరగటం మానేసింది. మన భాష విస్తృతిని పెంచాలంటే వాడుకని పెంచాలి. వాడుక పెరగాలంటే క్లిష్టమైన భావాలని, సరికొత్త విషయాలని తెలుగులో వ్యక్తపరచటానికి సదుపాయంగా మన పదజాలం పెరగాలి. మన సంప్రదాయాలకి, మన వ్యాకరణానికి అనుకూలపడేలా ఈ పదజాలాన్ని సమకూర్చుకోవాలి. ఈ పని మనమే ప్రయోగాత్మకంగా చేసి చూడాలి. మాయాబజారు సినిమాలో చెప్పినట్లు మాటలు మనం పుట్టించకపోతే మరెక్కడనుండి పుట్టుకొస్తాయి?

ఒక భావానికి సరిపడే మాట సృష్టించే బధ్యత మనదే. తెలుగులో ఆధునిక అవసరాలకి పనికివచ్చే కొత్త మాటలు సృష్టించి వాటిని వాక్యాలలో ప్రయోగించి చూస్తే ఎలాగుంటుందో చూడాలని ఒక కోరిక పుట్టింది. ఈ ప్రయోగంలో పాఠకులని కూడా పాల్గొనమని ఇదే మా ఆహ్వానం. ప్రతినెలా మేము ఐదో-పదో మాటలు తయారు చేసి వాటి ప్రవర, పుట్టుపూర్వోత్తరాలు కొంతవరకు చెప్పి, అవసరం వెంబడి వాటి వాడకం ఎలాగో మీకు సోదాహరణంగా చూపిస్తూ ఉంటాము. ఆ తరువాత కొన్ని ఇంగ్లీషు మాటలు ఇచ్చి వాటితో సరితూగగల తెలుగు మాటలని ప్రతిపాదించమని పాఠకులని ఆహ్వానిస్తూ ఉంటాం. మేమడిగిన మాటలని తెలుగులో ఏమంటే బాగుంటుందో మీరు సూచించాలి. మీ సూచనని బలపరచటానికి ఆ తెలుగు మాటని ఒక వాక్యంలో ప్రయోగించి చూపండి. మా స్వకపోల కల్పితాలైన మాటలతో పాటు పాఠకులు సూచించిన వాటిలో కొన్ని ఎంపిక చేసి ప్రచురిస్తూ ఉంటాము. ఈ దిగువ చూపిన విధం మీకు నచ్చితే దాన్ని ఒక మూసగా తీసుకుని మీరూ ప్రయత్నించి చూడండి. లేదా కొత్త పంధాని సూచించండి. పాఠకులు పంపిన అంశాలని ప్రచురణ సౌకర్యానికి సవరించే హక్కు మాకు ఉంది. ఇదొక ‘విక్కీ’ నిఘంటువుని తయారుచేసే ప్రయత్నంలా ఊహించుకొండి. విక్కీ విజ్ఞానసర్వస్వంలో అందరూ పాల్గొన్నట్లే ఇదీను.

వీరతాళ్ళు-6 ప్రచురణ కొంచెం ఆలశ్యమయినందుకు ఇవే మా క్షమార్పణలు. ఆలశ్యానికి కారణం లేకపోలేదు. గాయకుడు వేదిక ఎక్కి పాట పాడితే శ్రోతలు చప్పట్లు కొట్టాలి; అలా కొట్టకపోతే ఆ గాయకుడు నిరుత్సాహపడిపోతాడు. పాట బాగులేకపోతే ఏమిటి చెయ్యాలంటారా? కనీసం పిల్లి కూతలైనా కూయాలి. అంతే కాని, ఏ స్పందనా లేకపోతే ఆ గాయకుడి చేత మరొక పాట పాడించాలా వద్దా అన్న సందిగ్ధంలో పడిపోతారు, నిర్వాహకులు. ఇప్పుడు నా పరిస్థితి అలాగే ఉంది. వీరతాళ్ళు శీర్షికకి ఎక్కువ స్పందన రాకపోతే ఆపేద్దామనే కోరికతో గత సంచికకి రాసినదే సంపాదకులకి పంపలేదు. మీరంతా అలా మొహమాటపడిపోయి స్పందించకపోతే ఈ శీర్షికని నిర్వహించే ఉత్సాహం నాకు ఉండదు, మరి. తరువాత మీ ఇష్టం!

Sine, Cosine ట్రిగొనామెట్రి లో వచ్చే sine, cosine అన్న మాటలు సంస్కృతం నుండి వచ్చేయని చెబితే ఎంతమంది నమ్ముతారు? భాస్కరాచార్య ఖగోళ పరిశోధనలు చేసేటప్పుడు త్రిభుజాల అవసరం తరచు వచ్చేది. అందులోనూ లంబకోణ త్రిభుజాలు మరీ ఎక్కువగా వచ్చేవి. లంబకోణ త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీలు. (డిగ్రీని తెలుగులో ఏమంటారో తెలుసా?) మిగిలిన రెండు కోణాలు 90 డిగ్రీల కంటె తక్కువ కనుక వాటిని లఘు కోణాలు అంటారు. ఈ లఘు కోణాలని కలుపుతూ ఉండే రేఖని కర్ణం (hypotenuse) అంటారు. భాస్కరాచార్యుల వారు చేసే లెక్కలలో ఒక కోణానికి ఎదురుగా ఉండే భుజం పొడుగుకి కర్ణం పొడుగుకి మధ్య ఉండే నిష్పత్తి పదే పదే వస్తూ ఉంటే అదేదో ముఖ్యమైన నిష్పత్తి అని భావించి దానికి ‘జీవ’ అని పేరు పెట్టేరాయన. జీవ అంటే ప్రాణం కనుక, ముఖ్యమైన వాటిని ప్రాణంతో పోల్చటం సబబే కదా! ప్రాణవాయువు (oxygen), ప్రాణ్యము (protein) అన్న పేర్ల లాంటిదే ఇదీను. వ్యాకరణంలో వచ్చే అచ్చులని ‘ప్రాణ్యములు’ అన్నట్లే అనుకొండి. కనుక భాస్కరాచార్యుల పుస్తకంలో ‘జీవ’ అంటే ఒక లంబకోణ త్రిభుజంలో ఒక కోణానికి ఎదురుగా ఉన్న భుజం పొడుగుని కర్ణం పొడుగు చేత భాగించగా వచ్చే లబ్దం. దీన్నే మనం ఈ నాడు sine అంటున్నాం. జీవ శబ్దం నుండి sine ఎలా వచ్చిందో ఇప్పుడు చెబుతాను.

భాస్కరాచార్యుల రోజులలో అన్ని దేశాల నుండి ప్రజలు భారతదేశం వచ్చి లెక్కలు నేర్చుకునేవారు. ఈ మాట మీద నమ్మకం లేకపోతే అరబ్బీ, పారశీక భాషలలో గణితాన్ని ‘హిన్‌సా’ అని ఎందుకు పిలుస్తారో అని ఆలోచించి చూడండి. అరబ్బీలో ‘హిన్‌సా’ అంటే హిందూ శాస్త్రం! లెక్కలలో భారత దేశం అంత గొప్పగా వెలిగిపోయిందా రోజులలో. ఈ అరబ్బీ దేశస్తులు మన దేశం వచ్చి, సంస్కృతంలో ఉన్న గణిత గ్రంధాలని పెద్ద ఎత్తున అరబ్బీ భాషలోకి తర్జుమా చేసి పట్టుకుపోయేవారు. ఇలా తర్జుమా చేసేటప్పుడు అరబ్బీ సంప్రదాయం ప్రకారం హల్లులని మాత్రమే రాసుకొని అచ్చులని రాసేవారు కాదు. చదివేటప్పుడు అచ్చులని సరఫరా చేసుకునేవారు. మొన్నమొన్నటి వరకు ఈ పద్ధతి టెలిగ్రాములు ఇచ్చేటప్పుడు వాడేవారు: strt immly అంటే వెంటనే బయలుదేరమని చెప్పటం కదా! ఈ రకం ఆచారంలో వచ్చే ఇబ్బందులని ఎత్తి చూపటానికి మరొక ఉదాహరణ చెబుతాను. చూడండి! తమిళంలో గాంధి అన్న మాటని, కాంతి అన్న మాటని ఒకే అక్షరాలతో రాస్తారు, కాని సందర్భాన్ని బట్టి దాన్ని గాంధీ అనో కాంతి అనో పలుకుతారు. దరిదాపుగా అటువంటి పరిస్థితి ఇక్కడా ఎదురవుతుంది. అరబ్బులు jiva అని రాయటానికి బదులు jb అని రాసుకున్నారు (వ కార బకారాల మధ్య వీళ్ళకీ బెంగాలీ వాళ్ళలాగ ఏదో ఇబ్బంది ఉంది.) కనుక jiva కాస్తా అరబ్బీలో jb అయి కూర్చుంది. రాసినవాడికి దీని అర్ధం తెలుసు, కాని మరొక సందర్భంలో, మరొక కాలంలో చదివేవాడికి jb అన్న మాట అర్ధం అయి చావలేదు. రాసిన వాడిని అడుగుదామా అంటే వాడు చచ్చి ఊరుకున్నాడాయె! ఏం చేస్తాం? ఆ jb ముందు, మధ్య, చివర రకరకాల అచ్చులని పెట్టి చూసేరు. ప్రయత్నించగా, ప్రయత్నించగా అరబ్బీ భాషలో ఒకే ఒక అచ్చుల జంట నప్పింది. అలా నప్పిన అచ్చులని jb తో కలగాపులగంగా కలపగా వచ్చిన మాట అర్ధం ‘చనుగవ’ లేదా ‘చనుకట్టు’! ప్రబంధాలలో ఏ వరూధినిని వర్ణించినప్పుడో అయితే ఏమో కాని గణిత శాస్త్రంలో చన్నులు ఎందుకు వచ్చేయో ఆ వ్యక్తికి అర్ధం కాలేదు. గత్యంతరం లేక jb ని ‘చనుగవ’ అనే అర్ధం వచ్చేలా అరబ్బీలోకి అనువదించేడు. అప్పటి నుండి అరబ్బీ కుర్రాళ్ళు గణిత శాస్త్రాన్ని ద్విగుణీకృతమైన ఉత్సాహంతో అధ్యయనం చేసి ఉండాలి మరి. (ఇంగ్లీషు కవులు కూడా ఆడదానిని నఖశిఖపర్యంతం మన వాళ్ళల్లా వర్ణించి ఉండుంటే నాకు ఇంగ్లీషు బాగా వచ్చి ఉండేదేమో!)

యూరప్‌లో ఉన్న వారికి ఎక్కడో దూరంలో ఉన్న ఇండియాలో మాట్లాడే సంస్కృతం రాదు కాని, పొరుగునే ఉన్న దేశాలలో మాట్లాడే అరబ్బీ వచ్చు. వాళ్ళు మన లెక్కలని అరబ్బుల దగ్గర నేర్చుకున్నారు. వాళ్ళ భాషలో చనుగవని వర్ణించటానికి వాడే మాట ఇప్పుడు మనం ఇంగ్లీషులో వాడే sinuous (ఒంపులు తిరిగినది) కి దగ్గరగా ఉంటుంది. కనుక వాళ్ళు చనుగవ ని sinuous అని తర్జుమా చేసేరు. అందులోంచే sine అన్న మాట వచ్చింది. మన ముక్కునీ, చెవులనీ కలుపుతూ మెలికలు (ఒంపులు) తిరిగిన సొరంగాలని sinuses అనటానికి కారణం కూడ ఇదే.

మరి cosine సంగతి ఏమిటని అడగకండి. మీరు ఊహించుకొండి. నా ఊహ ప్రకారం భాస్కరాచార్యులవారు ‘జీవ’ తో పాటు ‘సహజీవ’ ని కూడా వాడి ఉంటారు. అది అరబ్బీలో shjb అయి ఉంటుంది. అందులోంచే cosine వచ్చి ఉంటుంది (కోసెస్తున్నాను, మరోలా అనుకోకండి!). ఇలాగే tangent కి కూడ ఇటువంటి సిద్ధాంతం ఒకటి నా దగ్గర ఉంది కానీ, ఎందుకైనా మంచిది, ఇప్పుడు చెప్పను; మరోసారి చెబుతాను.

Trigonometry ఎలా వచ్చిందో చూద్దాం. నేను చెప్పేది నిజమో కాదో తెలియదు కాని, ఒక సారి ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో చదివినది జ్ఞాపకం మీద చెబుతున్నాను. త్రి అంటే మూడు. గుణ అంటే లక్షణం. మాత్ర అంటే కొలత (dimension, measure, metric, pill, capsule, …). కనుక, ఒక విధంగా ఆలోచిస్తే trigonometry అన్నది పక్కా సంస్కృతం మాట. కనుక గతంలో చెప్పిన డజనుతో పాటు ఈ ట్రిగొనామెట్రీ ని తెలుగు మాటలా నిక్షేపం వాడేసుకోవచ్చు!

Degree కి తెలుగు మాట కావాలని పైన అడిగేను కదా. జాతకాలు రాసేవాళ్ళని ఎవ్వరిని అడిగినా చెబుతారు. జాతక పరిభాషలో డిగ్రీని భాగ అంటారు.

Infection, Contagion ఇంగ్లీషులో infectious, contagious అని రెండు మాటలు ఉన్నాయి. వీటి అర్ధంలో పోలిక ఉంది కానీ ఈ రెండూ రెండు భిన్నమైన భావాలని చెబుతాయి. ఒక ప్రియాను (prion) వల్ల కాని, వైరస్ (virus) వల్ల కాని, బేక్టీరియం (bactirium) వల్ల కాని, ఫంగస్ (fungus) వల్ల కాని, పేరసైట్ (parasite) వల్ల కాని వచ్చే రోగాలని infectious diseases అంటారు. ఒక మనిషి నుండి మరొక మనిషికి అంటుకునే రోగాలని contageous diseases అంటారు. CJD అనే జబ్బు ఉంది. ఇది ప్రియానులు మన శరీరంలో జొరబడ్డం వల్ల వస్తుంది. కాని ఇది ఒకరి నుండి మరొకరికి అంటుకోదు. కనుక ఇది infectious disease మాత్రమే. దోమకాటు వల్ల మనకి సంక్రమించే మలేరియా వంటి రోగం కూడ infectious disease కోవకే చెందుతుంది. కాని ఇన్‌ఫ్లుయెంజా (influenza or flu) infectious disease మాత్రమే కాకుండా contageous disease కూడా! ఎందుకంటే ఇంట్లో ఒకరికి వస్తే మరొకరికి అంటుకునే సావకాశం ఉంది కనుక. Infection లు ఎన్నో విధాలుగా రావచ్చు, కాని అన్ని infection లూ అంటుకోవు. మరొక విధంగా చెప్పాలంటే సూక్ష్మజీవులు మన శరీరంలో ప్రవేశించి అక్కడ తిష్ట వేస్తే అది ‘తిష్ట’ (లేదా, infection), దాని వల్ల వచ్చే రోగం తిష్ట రోగం (infectious disease). ఈ రోగం ఒకరి నుండి మరొకరికి అంటుకుంటే అది ‘అంటు’ (లేదా, contageon), దాని వల్ల వచ్చే రోగం అంటురోగం (contageous disease). ఇప్పుడు తిష్టతత్వం అంటే infectious, అంటుతత్వం అంటే contageous.

Invention, Discovery సైన్సు ఏమాత్రం వచ్చిన వారికైనా ఈ రెండు మాటల మధ్య ఉన్న తేడా తెలుసు. Discovery అంటే ఉన్న దాని ఉనికిని కనుక్కోవటం. దీనిని ఆవిష్కరణ అనొచ్చు. Invention అంటే అప్పటివరకు లేనిదానిని సృష్టించటం. కనుక దీన్ని ‘సృజనం’ అనో ‘పరికల్పనం’ అనో అనొచ్చు. ఈ రెండు మాటలకి దగ్గర పోలిక ఉన్న మరి రెండు మాటలు మన సంప్రదాయంలో ఉన్నాయి. మన వైదిక సంస్కృతిలో స్మృతి, శృతి అని రెండు ఉన్నాయి. స్మృతి అంటే ‘జ్ఞాపకం వచ్చినది’, మనకి ఇప్పుడు దీని ఉనికి తెలిసొచ్చింది కనుక ఇది discovery లాంటిది. శృతి అంటే ఇది మనకి ‘వినిపించింది,’ లేదా మన మెదడులో మెదిలింది. ఇది మన స్వకపోలకల్పితం. కనుక ఇది invention లాంటిది. Columbus discovered America అంటారు, కాని Marconi invented radio అంటారు.

Public, Private నామవాచకంగా వాడినప్పుడు, public అంటే జనసామాన్యం. నామవాచకంగా వాడినప్పుడు private కి అమెరికాలో అయితే సిపాయి, జవాను అనే అర్ధాలు ఉన్నాయి కాని, ఈ అర్ధాలు భారత దేశంలో చెల్లవు. పోతే, ఈ రెండు మాటలూ విశేషణం (adjective) గా వాడినప్పుడు చాలా అర్ధాలు స్పురిస్తాయి. ఉదాహరణకి private అంటే స్వంత, సొంత, వ్యక్తిగత, స్వకీయ, వ్యష్థి అనే అర్ధాలే కాకుండా ఖాసా, ఖానిగీ అనే అర్ధాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ‘నా ఖాసా తమ్ముడు’ అంటే నా సొంత (own) తమ్ముడు అనే అర్ధం ఉంది. ‘ఖానిగీ భూమి’ అంటే private land.

Public అంటే బాహాటపు, బాహాటమైన, బాహిర, బహిరంగ, బహిరంగమైన, రట్టయిన, రచ్చ (ఉ. రచ్చబండ) అనే అర్ధాలు ఉన్నాయి. ఇవే కాకుండా ప్రజా, జనహితైక, సర్వజనిత, అనే మరొక రకమైన అర్ధాలు కూడ ఉన్నాయి. ప్రభుత్వ, రాజస, దివాణపు, సర్కారు అని మూడో అర్ధం కూడ ఉంది. ఈ దిగువ ప్రయోగాలు చూడండి. public health = ప్రజారోగ్యం, public interest = ప్రజాహితం, public officer = ప్రభుత్వోద్యోగి, public opinion = ప్రజాభిప్రాయం, public performance = బహిరంగ ప్రదర్శనం, public relations = పౌరసంబంధాలు, public road= రహదారి, రచ్చదారి, public sector = ప్రభుత్వ రంగం, మొదలైనవి.

Matrix ఈ మాట లెక్కలలోను, జీవశాస్త్రంలోనూ కూడ వస్తుంది. గణితంలో ఒక వరస మీద మరొక వరస చొప్పున అమర్చిన సంఖ్యలని matrix అంటారు. జీవశాస్త్రంలో కూడా జీవకణాలు, గోడలో ఇటికల మాదిరి, వరసలలో అమర్చబడ్డప్పుడు ఆ అమరిక ని matrix అంటారు. దీన్ని మనవాళ్ళు ‘మాతృక’ అని తెలిగించేరు. మనం కూడ మన ఊహలని విహరించనిస్తే మరికొన్ని కొత్త మాటలని కనిపెట్టవచ్చు. ఉదాహరణకి ‘అమరిక’ ఎలా ఉంది? matrix కి ఇంగ్లీషులో rows, columns ఉన్నట్లే మన అమరికని పడుగు, పేక లా ఊహించుకుంటే ‘అల్లుడు, అల్లిక’ అన్న మాటలు ఇక్కడ సరిపోతాయి. ‘అచ్చు, మూస, వరుధారణి’ అనే మాటలు కూడ ఉన్నాయి. ఇంగ్లీషులో matty cloth లోని matty అన్న మాట ఈ matrix నుండే వ్యుత్పన్నం అయి ఉంటుందని ఊహిస్తున్నాను..

వచ్చే నెల మీరు ప్రయత్నించవలసిన మాటలు:

  • oven
  • clown
  • filter
  • formaldehyde
  • methane, ethane, propane, butane, pentane, hexane, heptane, octane, nonane, decane (names of the first ten hydrocarbons)
  • vocabulary
  • glossary
  • valency
  • discovery
  • solo performance
మీ ఊహలు veerataallu@siliconandhra.org కి పంపండి.

డా. వేమూరి: నవీన తెలుగు సాహితీ జగత్తులో పరిశోధకులుగా, విజ్ఞానిగా వేమూరి వెంకటేశ్వర రావు గారు సుపరిచితులు. తెలుగులో నవీన విజ్ఞాన శాస్త్ర సంబంధ వ్యాసాలు విరివిగా వ్రాయటంలో ప్రసిధ్ధులు. విద్యార్ధులకు, అనువాదకులకు, విలేకరులకు పనికొచ్చే విధంగా శాస్రీయ ఆంగ్ల పదాలకు తెలుగు నిఘంటువును తయారు చేయడం వీరి పరిశ్రమ ఫలితమే. సరికొత్త పదాలను ఆవిష్కరించడంలో వీరు అందెవేసిన చేయి. కలనయంత్ర శాస్రజ్ఞుడిగా వృత్తిలోను, తెలుగు సాహిత్యంపైన లెక్కించలేనన్ని వ్యాసాలు వ్రాస్తూ, ఉపన్యాసాలు ఇస్తున్నారు.