తోడు

-- గంగరాజు సంధ్యాదేవి


"ఇప్పుడేం చేద్దాం అన్నపూర్ణా?" భోంచేసి వసారాలో కూర్చున్న రాఘవరావుకు వక్కపొడి అందిస్తూ "ఏవిషయమండీ" అని అడిగింది అన్నపూర్ణ.

"అదే మనకోడల విషయం. అబ్బాయి పోయి అపుడే సంవత్సరం దాటిపోయింది. ఇంత చిన్న వయస్సులోనే భర్తని పోగుట్టుకుని సుమతి, కొడుకును పోగొట్టుకొని మనం రోజుల్ని భారంగా నెట్టుకొస్తున్నాం."

పెళ్ళయిన తర్వాత కొడుకు, కోడలు వేరువేరు ఊర్లల్లో ఉద్యోగం చేస్తూ ఒకరికొకరు దూరంగా కాలంగడిపారు, ఆరేళ్ళు, ఎలాగోలా తంటాలు పడి ఒక చోటకి ట్రాన్స్‌ఫర్ చేయించుకొని హాయిగా ఉన్నారులే అనుకొనేలోపు అబ్బాయి గిరిధర్ కి జబ్బు చేసి అర్ధాంతరంగా పోవటం అంతా క్షణాల్లో జరిగినట్టు అయిపోయింది.

"కోడలు ఉద్యోగం చేస్తోంది. తనకేం ఫరవాలేదులే అనుకోవటానికి లేదు. ఏ ముద్దు ముచ్చట లేకుండా మ్రోడువారిన చెట్టులా మన కళ్ళ ముందు తిరుతుంటే చాలా బాధగా ఉంది."

"నిజమేనండీ. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. మనమే ఏదన్నా మంచి నిర్ణయం తీసుకొని సుమతి జీవితాన్ని సరిదిద్దాలి" అన్నారు రాఘవరవు.

"సుమతికి మళ్ళీ పెళ్ళి చేస్తే" అన్నపూర్ణ తన మనసులో మాట చెప్పింది.

"చాలా బాగుంది నీ ఆలోచన ఈ విషయం గురించి కోడలుతో మాట్లాడదాం. సర్లే చాలా పొద్దుపోయింది. నేనిక్కడ పడుకుంటాను. నువ్వు లోపలికెళ్ళు. సుమతి ఒక్కతే ఉంది కదా" అన్నారు రాఘవరావు.

తెల్లవారుతూనే భార్య అందించిన కాఫీ గ్లాసు అందుకుంటూ, "పూర్ణా, రాత్రంతా ఆలోచించి నేనొక నిర్ణయం తీసుకొన్నా. మనం ఇక్కడే వుంటే సుమతి భవిష్యత్ కు ప్రతిబంధం అవుతామేమో. మనం వోల్డేజ్ హోంలో చేరితే ఏ చీకూ చింతా వుండదు" తన మనసులో మాట వెల్లడించారు రాఘవరావు.

"సుమతీ ఇటురామ్మా కాసేపు నీతో మాట్లాడాలి ఇటు కూర్చో" తనకు ఆఫీసుకు టైం అవుతుందేమో అన్న అత్తగారితో, "ఫరవాలేదు మీరు చెప్పండి మామయ్యా ఏ విషయం" అడిగింది సుమతి.

"ఏం లేదమ్మా ఇంత చిన్న వయస్సులోనే నీకు రాకూడని కష్టమే వచ్చింది. నువ్వు జీవం లేని బ్రతుకు బ్రతుకుతున్నట్లుగా అనిపిస్తోంది.

వాడు పోయిన దగ్గరనుంచి నీ గురించి నీవు పట్టించుకోవటం మానేశావు.

కళతప్పి చిన్నపోయిన నీ ముఖం అలా చూడలేకుండా వున్నాం. అందుకని" ఆగిపోయారు రాఘవరావు.

"అందుకని" సందేహంగా అడిగింది సుమతి.

"అందుకని నువ్వు మళ్ళి చేసుకొని నీ జీవితాన్ని చిగురింపచేయాలి.

ఈ ముసలివాళ్ళు నీ పంచన వున్నారని తెలిస్తే నిన్ను పెళ్ళి చేసుకోవడానికి ముందుకు రారు. అందుకే మేం నీకు దూరంగా వెళ్ళి వోల్డేజ్ హోంలో చేరాలనుకుటున్నాం. ఈరోజే అక్కడికి వెళ్ళి అన్ని వివరాలు కనుక్కొని వస్తాను. ఈ నిర్ణయం నువ్వు అంగీకరిస్తావు కదా?" చెప్పారు రాఘవరావు.

"ఒక్క క్షణం మామయ్యా, మీకు నేను భారం అనుకొంటే నేనే నాదారి చూసుకుంటూ కాని నా కోసం మాత్రం మీరు మరెక్కడికో వెళ్ళి వుండ నక్కరలేదు.

ఏ తోడు లేని నన్ను మీ ఇంటి కోడలుగా చేసుకొని కన్న కూతురికంటే ఎక్కువగా చూసుకొనారు. మీ అబ్బాయి పోయినపుడే నా సుఖసంతోషాలన్ని అతనితోనే తీరిపోయాయి.

నేను మళ్ళీ పెళ్ళి చేసుకొని నా స్వార్ధం నేను చూసుకోలేను. అసలు ఆ ఆలోచన కూడా లేదు. నేనే మీ కొడుకుని, కోడలిని అనుకోండి. మీరున్నంతకాలం మీతోడే నేను, నాతోడే మీరు. మీరైనా చెప్పండి అత్తయ్యా, మామయ్యగారి ఆలోచన సబబైనది కాదని" అత్తగారితో అంది సుమతి.

"కాదమ్మా నువ్వేదో నాలుగు రాళ్ళు సంపాదిస్తున్నావు నీ సంపాదన కోసం ఆశపడి నీ పంచన వున్నామని లోకం మనల్ని ఆడిపోసుకుంటుంది. నా మాట విని ఆయన చెప్పినట్లు విను తల్లి" అన్నది అన్నపూర్ణ.

"లేదు అత్తయ్యా, మీకు తెల్సు కదా! నేనేదైనా నిర్ణయం తీసుకొంటే దానికే కట్టుబడి వుంటానని" నిశ్చయంగా చెప్పింది సుమతి.

కోడలి మాటలకు, రాఘవరావు, అన్నపూర్ణ ఇద్దరూ నిర్వేదంగా ఉండిపోయారు.

కోడలి అండలో కాలం గడపటానికి సంతోషపడాలో, ఆ అమ్మాయి జీవితం మూణ్ణాళ్ళ ముచ్చట అయినందుకు బాధపడాలో తెలియక మిన్నకుండిపోయారు.

"అత్తయ్యా, మామయ్యా, జీవితం ఎపుడూ ఒకలాగ వుండదు. కష్టాలు వచ్చినపూడే తట్టుకొనే ధైర్యం వుండాలి మనిషికి. భౌతికంగానే గదా వారు దూరమైంది. ఆయన జ్ఞాపకాలతో మనం ఆనందంగా జీవిద్దాం. ఇంక నా గురించి మీరేం ఆలోచించవద్దు" అంటూ ఇద్దరి భుజాల మీద చేతులు వేసి లోపలికి తీసుకెళ్ళింది సుమతి. మీకండగా నేనుండగా మీ కెందుకీ చింత అన్నట్లున్న కోడల్ని అక్కున చేర్చుకున్నారు అన్నపూర్ణ, రాఘవరావులు.