తెల్లవారి గడ్డపై తెలుగు బిడ్డలు

-- శాంతి కూచిభొట్ల


తెల్లవారినంతనే ముంగిట కళ్ళాపి చల్లి

ముచ్చటైన ముగ్గులు తీర్చిదిద్ది మురిసిపోయే వేళ

తెల్లవారి ఇంతి, అద్దె ఇంటి యజమాని

ఇంతింత కళ్ళతో ...

ఇదేమి "నేల చిత్ర రచన?" అని అచ్చెరువొందగా

ముగ్గు ప్రాశస్త్యము మహోత్సాహముగా వివరించె

శ్రద్ధగా విని అంతయూ ...

ఇంటిముంగిట నేల నీదికాదనుచు

నేలరాతలు అన్నీ నేరమని చెప్పి

బుద్ధిగా నేల కడిగి ఇంటి అందము

నిలుపమనె ... చల్లగా

తెల్లవారి గడ్డపై తెలుగుబిడ్డ అగచాట్లు ఇంతింత కాదు

అని కినుకుతో .. పతికి విన్నవింప

ఇంగితము లేని ఇంతి ఇల్లాలు అయినచో

ఇంట శాంతి లేదని వగచె

ఆ.. నాగరీకపు భర్త

ఇంటి చూరు నుండి పెరటి పై దాక

బట్టలన్నీ ఉతికి ఆరవేయ

ఇంటి బయట అందమంతా అంట్ల కలిపితివనుచు

ఉరుకు పరుగుల వచ్చి "బెదిరింపు లేఖ" నిచ్చె

అంత అందమిచ్చు కట్టుబట్టలు

పెరటి అందము ఏల హరించు? ననుచు

ఇంత వింత జాతి ఏల ఈ మూక

అని వాపోయె ...

తెల్లవారిగడ్డపై తెలుగు బిడ్డ

విఘ్నరాజుని పూజింప ... ఇంటి గుమ్మానికి

మామిడికాయల బదులు "మ్యాగ్నోలియా" ల తోరణములు కట్టి

చెట్టుపుట్టలు పట్టి "పత్రి"కై తిరుగాడి

అడ్డదిడ్డముగా పేరు తెలియని కొమ్మరెమ్మలతో

రంగు వాసన యెరుగని పూలతో

నింపిన సంచిని చూసి ...

నక్షత్రకుడిలాగ అడ్డుపడె .. అద్దె ఇంటి యజమాని

అవి అన్ని తినినచో "హరీ" అందువనుచూ

పసుపురాచిన పాదాలను పెను అనుమానమున పరికించె

పూజ కొరకేగాని

పొట్టపూజకు కొరగానిదీ "పత్రి" అని వివరించి

తోక చేరిన ప్రాణముతో తల్లడిల్లె

తెల్లవారిగడ్డపై తెలుగుబిడ్డ

ఇన్ని ఇక్కట్లకు ఇసుమంత జంకక

సంక్రాంతికి రంగవల్లులు

ఉగాదికి కోయిలలు

వినాయక "నిమజ్జన" ఊరేగింపులు

నవరాత్రి పందిళ్ల ఉత్సవాలు

దీపావళి మందు సామాను .. అన్నీ లేకున్నను

అన్ని పండుగల సందడి ...అందినంత మేర అమలు చేయుచు

తెల్లవారి గడ్దపై తెలుగు బిడ్డ.