స్వరసంగమం

-- ప్రఖ్య వంశీకృష్ణ, వక్కలంక సూర్య

సుజనరంజని మూలస్థంభాలైన సాహిత్య, సంగీత, నృత్య నటనలలో ప్రతి నెలా వివిధ అంశాలను ప్రస్తుతపఱచడమే మా ధ్యేయం. అందులో భాగంగా ఈ నెల స్వరసంగమం శీర్షికలో ప్రఖ్య వంశీకృష్ణ చే రచింపబడి, శ్రీ వక్కలంక సూర్య గారిచే స్వరపరచబడిన, ఓ మధురమైన గానం మీకోసం...

వానర వైభవం

పల్లవి:

వాలము ఉన్న నరులం మేము
అలసట ఎరగని కోతులము ||2||

కొమ్మల దూకే ఆటలకూ
కమ్మని పళ్ళూ తుంచుటకూ
గబగబ గెంతుతు చకచక పాకుతు
ఉత్సాహంగా ఉరకలు వేస్తాం

సంతోషమునే పంచుతు పెంచుతు
జగతికి నవ్వును నేర్పాము

చరణం: 1

అందరి దేవుడు ఆ రఘు రాముడె
ఆలిని కానక అడవులపట్టీ
మన్నూ మిన్నూ వెతుకుతు ఉంటే
దండుగ మేమూ కదిలాము

సీతను వెతకీ కొండను తెచ్చీ
బండలనెన్నో బద్దలుకొట్టాం
స్వార్ధం లెక సహనం కూడీ
మెడుగ మంచిని చేశాము

లంకను చేరగ వారధి కట్టీ
రక్కసి నేతల కొట్టీ
సీతను తెచ్చీ రామునికిచ్చీ
అండగ అంతట నిలిచాము

మనుషుల లేనీ మానవతేదో
కోతులకుందని చూపాము || పల్లవి ||

చరణం:2

హద్దులు ఎరుగని చిలిపి చేష్టలతో
బాల్యమె కరగని బతుకే మాదీ
మలినం లేనీ మనసులకెన్నడు
యువతే తరగక ఉంటుంది

మూతి ముడుస్తూ, పెదవి విరుస్తూ
విసుగుతో బతుకూ బండలు చేయం
లేదని ఏడ్చీ, ఇమ్మని సణిగీ
నసుగుతు దేవుని పూజించం

ఉల్లాసముగ బతకాలంటే
మాలో ఒకరుగ కలవాలి
కోతులలాగా పుట్టాలంటే
నవ్వుల యాగం చేయాలి

కోపం గీపం ఎరగని వారం
భయమూ గియమూ రానివ్వం || పల్లవి ||

పిల్లలు పూజిత దశిక, పవన్ పొట్టి,
ప్రహర్షిత పసుమర్తి, అనూష కొండిపర్తి,
బృందంగా ఆలపించిన
ఈ పాటను వినడానికి
ఈ క్రింద మీట నొక్కండి

వక్కలంక సూర్య సిలికానాంధ్ర చేసే వివిధ కార్యక్రమాలకు సంగీత అందిస్తూ ఉంటారు. చిన్నతనం నుండీ కీబోర్డుపై ప్రయోగాలు చేస్తూ సంగీతం అలవోకగా నేర్చుకుని, రాగాలతో ఆటలడుకునే ఇంజనీరు. సిలికానాంధ్ర విడుదల చేసిన కృష్ణ శాస్త్రి గారి లలితగీతాలు నిండిన "ఆంధ్రకాహళి"కి సంగీత దర్శకులు సూర్య గారే.