సుజననీయం: నిశ్శబ్ద విప్లవం

-- ప్రఖ్య వంశీ కృష్ణ


ప్రపంచ చరిత్ర ఏమాత్రమన్నా తెలిసినవారికి అక్టోబరు మాసం యొక్క విశిష్టత తెలుసు. ఈ మాసంలోనే ప్రపంచ ప్రఖ్యాత రష్యను విప్లవం జరిగి ప్రభుత్వాన్ని కూల్చి బొల్షివిక్కులు రాజ్యాధికారం స్వంతం చేసుకున్నారు. సోవియట్ యూనియన్ ఏర్పాటు జరిగింది. అప్పటి నుండి అక్టోబరు విప్లవంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. గత తొంభై యేళ్ళలో ప్రపంచం ఎంతగా మారిపోయినదీ అందరికీ తెలిసినదే. చరిత్ర మనకు నేర్పే నీతి, గట్టిగా తలపెడితే తప్ప ప్రపంచంలో సమూలమైన మార్పు రాదని. మార్పు ఏదైనా.. ఎంతటిదైనా. పిండి కొద్దీ రొట్టె అన్నట్టు శ్రమ కొద్దీ మార్పు! పరిశ్రమ కొద్దీ ఫలితం!!

******************

చరిత్రలో నుంచి వర్తమానంలోకి వచ్చి చూస్తే గత కొద్దికాలంగా సిలికాన్ వేలిలో తెలుగు వారి జీవనంలో ఒక మౌలికమైన మార్పు కానవస్తోంది. ఏదో ఒక్కసారి మెరిసి మురిపించేలా కాక ప్రతినిత్యమూ కానవస్తున్న ఆ మార్పు ప్రవాస తెలుగు జీవితాలలో కొత్త ఉత్సాహం నింపుతోంది. మరో కొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. ఈ మార్పు రాజకీయ పరమైనది గాక, సాంస్కృతికమైనది.


తెలుగు నాటకమే పరిచయం లేని ఒక వ్యక్తి అలవోకగా పద్యం పాడుతూ పౌరాణిక పాత్రల్లో వెలుగొందడం -

సరదాగా డప్పులపై ఆడుకునే వ్యక్తి లయవిన్యాసంతో జనులు పులకరింపచేయడం -

సంగీతంలో కేవలం ప్రవేశం ఉన్నవారు విద్వాంసుడి స్థాయికి చేరుకోవడం -

ఎప్పుడో కాలక్షేపానికి వ్రాసుకుంటూ ఉండేవారు లక్ష్యశుధ్ధి గల రచనలు రచించడం -

సరదాగా పదం కలిపే వారు పదిమందికి లయబధ్ధంగా ఆడటం నేర్పించేంత ఎదిగడం -

ఇవన్నీ అతి సాధారణమైన మనుషుల్లో ఒక ఆరేడేళ్ళల్లో ప్రస్ఫుటంగా కానవచ్చిన మార్పులు. ఇంత తక్కువ వ్యవధిలో అన్ని మార్పులు అంత మందిలో ఒకేసారి కలగటం చిన్న విషయం కాదు. ఒక బృహత్తరమైన మార్పుకు ఇవి శ్రీకారం అని చెప్పవచ్చు. ఐతే, ఈ మార్పులకు మూలకారణం మాత్రం నిస్సందేహంగా సిలికానాంధ్ర తలపెడుతున్న కార్యక్రమాలే!

సిలికాన్ వేలీలో అక్టోబరు నెల వస్తున్నదంటే ఒక రెండు నెలల ముందు నుంచి వందలాది తెలుగు పిన్నా పెద్దా కలిసి ఒక బృహత్ కార్యక్రమానికి 'నేను సైతం..' అంటూ చేయి చేయి కలుపుతూ ముందుకు సాగడం నిజంగా కన్నుల పండుగ. నృత్య, అభినయ, సంగీతా, సాహిత్య కళలలో ఎవరికి అభిరుచి ఉన్న రంగంలో వారు అహోరాత్రులూ శ్రమ పడటం చూస్తుంటే ముచ్చటేస్తుంది.

పగలంతా, ఆఫీసుల్లో పెద్దవారు - స్కూళ్ళల్లో పిల్లలు శ్రమ పడుతూ, విశ్రాంతి తీసుకోవడానికి సాయంత్రాలు, వారాంతాలు వెచ్చిస్తారు అందరూ సాధారణంగా. కానీ ఆ సమయంలో తమ సంస్కృతి కోసమని కేరింతలేస్తూ కష్టపడుతూ ఆహ్లాదంగ గడుపుతున్న మన సిలికాన్ వేలీలోని ఆంధ్రులను చూస్తే ఏదో అద్భుతమైన శక్తి వీరిని నడిపిస్తోంది అనిపిస్తుంది. అలా నిస్వార్ధమైన శ్రమ పడేవారిని చూస్తే ఎవరికి ఉత్సాహం పెల్లుబికదు? అలా ఉవ్వెత్తున ఎగసిన ఉత్సాహం మరింత మందిని దగ్గర జేస్తూండటం వల్ల ప్రతి యేడూ సిలికానాంధ్ర కుటుంబం పెరుగుతూనే ఉంది. ఉరకలెత్తే ఉత్సాహానికి ఒక రూపమిచ్చి అందరూ కలిసి ఒకచోట తమ శక్తి యుక్తులని కూడదీసుకుని చేసుకునేదే 'ఆంధ్ర సాంస్కృతికోత్సవం'.

మన సంస్కృతిలోని భిన్న అంశాలకు కొత్త రూపమిచ్చి, కొత్త ఆలోచనలతో సంస్కృతికి నూతన సొబగులద్ది మనవంతు చేర్పులు చేస్తూ పదిలంగా భావి తరాలకు అందించే ప్రక్రియకు ఉత్కృష్ట రూపం ప్రతి యేడాది చేసే సాంస్కృతికోత్సవం. యేడాది పాటూ సాగే ప్రయత్నంలో పతాక సన్నివేశం, "ఆంధ్ర సాంస్కృతికోత్సవం". సుమారు 8 గంటల పాటు సరికొత్త, వైవిధ్యమైన కళల మేళవింపుతో ఇంపుగా సాగుతూ రెండువేలమందిని ఒక 300 మంది కళాకారులు కట్టిపడేసే మధుర ఘట్టం అది.

ఐతే ఇద్ద పెద్ద ప్రయత్నం అవసరమా అని సందేహం రావచ్చు. సంస్కృతి కోసం ఇంతగా కష్టపడాలా? భాష భవిత కోసం ఇంత శ్రమించాలా? పూర్వకాలంలో ఎవరు ఇంతగా కష్టపడ్డారని ఇంతకాలం నిలిచింది మన సంస్కృతి? అనుకోవడమూ ఒక్కోసారి జరగవచ్చు. ఐతే, పరిస్థితులు మారి అత్యంత వేగంగా మన జీవనపరిస్థితులు మారిపోతున్న తరుణం ఇది. గత 10 యేళ్ళలో వచ్చిన మార్పు, సమాచార విప్లవం వల్ల నేడు మన జీవన విధానాలు, అనగా స్థూలంగా మన సంస్కృతులు, వేగంగా మారిపోతున్నాయి. ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి, ఒక దిశ - గమ్యం లేకుండా. అటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో రెపరెపలాడుతున్న సంస్కృతీ దీపానికి అరచేయి అడ్డు సరిపోదు. బలమైన కట్టడం కావాలి. అప్పుడే సంస్కృతీ జ్యోతులు అప్రతిహతంగా తేజస్సు వెదజల్లుతూంటాయి

అంటే, ఏవో చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే సరిపోదు. ప్రయత్నాలు పెద్ద ఎత్తులో జరగాలి. క్రమ పధ్ధతిలో జరగాలి. మనవైన సంస్కృతులను పరిరక్షించాలి అనుకునేవారందరూ ఈ ప్రయత్నంలో భాగస్వాములవాలి. దూరాలకు అతీతంగా, ఖాండాలకు అతీతంగా! అలాంటివారందరూ కలిసి వచ్చే ఇలాంటి పెద్ద సంరంభం సిలికాన్ వేలీలో మరొక్కసారి ఈ అక్టోబరులో జరగడం ముదావహం. అందులో అందరూ విరివిగా పాల్గొనడం జరగాలి. ఇలాంటి స్ఫూర్తితో ప్రపంచ వ్యాప్తంగా సంస్కృతి సుసంపన్నమయేలా కొత్త చేర్పులు చేయాలి. అపుడే మన సంస్కృతి నిత్య నూతనంగా, అజరామరంగా ఉంటుంది.

ఐతే, ఇక్కడే తీసుకోవల్సిన జాగ్రత్త కూడా ఎంతో ఉంది. పెద్ద పెద్ద మార్పులు ఒక్కోసారి అలవోకగా ప్రారంభం అవుతాయి. కాలానుగుణంగా, క్రమంగా ఆశయాలు ఏర్పడతాయి. అలా ఏర్పడ్డ ఆశయాలు ఉత్కృష్టమైనవి అయినపుడు పరిరక్షించుకోవడానికి మాత్రం ఏంతో జాగరూకత నిండిన ప్రణాళిక అవసరం. చిన్నగా మొదలైన ఏరులు పాయలు కలిసి క్రమ పధ్ధతిలో ఒకే దిశలో సాగితేనే కదా మహానదులు ఏర్పడేది. ప్రణాళికా బధ్ధమై, ఉన్నత ఆశయ సాధనా లక్ష్యంతో, విశాల సహృదయంతో, ఉద్యమ సారధులు అందరినీ కలుపుకుపోతూ, అలవోకగా అందరిలోనూ ఒకే స్ఫూర్తి పెంపొందించినపుడు ఎంతటి పెద్ద లక్ష్యమైనా అసాధ్యం కాదు.

తమ పిల్లలు ప్రవాసంలో ఉన్నా రాజరాజ నరేంద్రుడి గూర్చి అడుగుతున్నారని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుతున్నపుడు,

సాధారణ జీవనంలో జానపద బాణులను పాడుకుంటూ తోటి పిల్లలతో ఆడుకుంటూన్నారని తెలిసినపుడు,

హరికథ - బుర్ర కథల పట్ల ఆకర్షితులై ఆయా వీడియోలు చూస్తూ తప్ప అన్నాలు తినట్లేదని వింటున్నపుడు,

కార్యక్రమాల వ్యాఖ్యాతలుగా పిల్లలు తెలుగులో ముద్దులొలికే మాటలు చెబుతున్నపుడు,

పెద్దవాళ్ళను బతిమాలి మరీ తోటి పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నపుడు....

సరిగ్గా అలాంటి సమయాల్లోనే అనిపిస్తుంది.. కార్యకర్తలుగా పడ్డ శ్రమ ఎన్నటికీ వృధా పోలేదని. అటువంటి సిలికానాంధ్ర కుటుంబ సభ్యులందరికీ "మా విప్లవ సలాం!"

ఒక ఆంగ్ల సామెత చెప్పినట్లు, "నవ్వు అంటురోగం". అలానే, ఉత్సాహం గాలి ద్వారా వ్యాపించే వైరస్ లాంటిది. ఏమాత్రం పరిచయం లేకపోయినా మన చుట్టూ ఉన్న మనుషుల నుంచి అంది పుచ్చుకున్న ఉత్సాహం మనచే ఊహింప శక్యం కాని పనులను చేయించి, ఏదో సాధించామన్న సంతృప్తి కలిగిస్తుంది. అందుకే ఏదన్నా మంచి కార్యక్రమం తలపెట్టే వారు అన్నింటికంటే ముందుగ ఉత్సాహంగా ఉండాలి.

ఉత్సాహం ఆశకు ఊపిరులూదితే

పట్టుదల ముందుకే పరుగెట్టిస్తుంటే

నిబ్బరం తోడుగా నేనున్నానంటే

సాగేయాత్ర విజయోత్సవ వేడుకకే!


భవదీయుడు

ప్రఖ్య వంశీ కృష్ణ


సుజనరంజని భిన్న అభిప్రాయాలకు వేదిక మాత్రమే. ఇందలి రచయిత(త్రు)ల అభిప్రాయాలను మనస్ఫూర్తిగా గౌరవిస్తాము.