సిలికానాంధ్ర విశేషాలు

ఆంధ్ర సాంస్కృతికోత్సవ సంరంభం!!

అక్టోబరు మాసం వస్తున్నదంటే సిలికాన్ వేలీలో పండుగ వాతావరణం ఉట్టిపడుతూ ఉంటుంది. సాయంత్రం ఆరు అవగానే ఎక్కడెక్కడినుంఛో వందలాది మంది తెలుగు పిల్లా జెల్లా, పిన్నా పెద్దా తెలుగు సంస్కృతీ సంబరం అంబరం అంటేలానిర్వహించడం కోసమని అహోరాత్రులూ, అవును! నిజంగానే రాత్రీ పగలూ లెక్కచేయకుండా ఎంతో ఉత్సాహంగా ఎన్నో పనులు చేసేస్తుంటారు. వీరందరినీ ఒక్కతాటిపై కలిపి ఉంచేది సిలికానాంధ్ర కుటుంబం, తెలుగుదనంతో పునీతులమవుతున్నామన్న భావన. నిత్యనూతనంగా ప్రతియేడూ సిలికనాంధ్ర నిర్వహించే పండుగే, "ఆంధ్ర సాంస్కృతికోత్సవం".

ప్రతియేడు లాగే ఈసారీ కాలిఫోర్నియాలోని (సిలికాన్ వెలీలో) క్యుపర్టినొలో ఫ్లింట్ సెంటర్ కళాప్రాంగణంలో అక్టోబరు 6వ తేదీన 2007వ సంవత్సరపు "ఆంధ్ర సాస్కృతికోత్సవం" కన్నులపండుగగా జరపడానికి నిర్వహణా ఏర్పాట్లు చురుకుగా చేస్తున్నారు సిలికానాంధ్ర కార్యకర్తలు. సంస్థ అధ్యక్షుడు శ్రీఫణి విస్సంరాజు ఆధ్వర్యంలో, వైస్-చైర్మన్ కొండిపర్తి దిలీప్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సంచాలకులుగా చివుకుల రవి వ్యవహరిస్తూ, అందరినీ ఉత్తేజితులను చేస్తూ కార్యక్రమం అద్భుతంగా రూపుదిద్దుకోవడానికి పరిశ్రమిస్తున్నారు.

అక్టోబరు 6వ తేదీన ఎప్పటిలాగే మధ్యాహ్నం 1:00గం. లకు సరిగ్గ ఒక్క నిముషమన్నా ఆలస్యం లేకుండా ఉత్సవంప్రారంభమవుతుంది. విభిన్న అంశాలతో 7 సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించబోతున్నారు. విరామంలో పదహారణాల తెలుగు భోజనం ప్రత్యేకంగా తయారుచేయించి కొసరి కొసరి వడ్డించడం సిలికానాంధ్ర ప్రత్యేకత. "నవయుగ నిర్మాతలు సంప్రదాయ స్ఫూర్తితో కన్న సుందర స్వప్నం! చైతన్యపు లోగిళ్ళు క్రొత్త ఒరవడిలో తలపెట్టిన తెలుగు సంస్కృతీ సుసంపన్నం!!" అన్న ఉత్సవ స్ఫూర్తీ వాక్యాలే ధ్యేయంగా పనిచేస్తున్నారు సిలికానాంధ్రులు.

తెలుగు సంస్కృతీ వైభవాన్ని రాబోయే తరాలకు అమలినంగా అందించాలన్న తపనతో ఈ కార్యక్రమాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని సంస్థ అధ్యక్షుడు శ్రీఫణి విస్సంరాజు ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయ కుటుంబ విలువల పరిరక్షణే ధ్యేయంగా, మన జాతి విలువలను విదేశంలో ఉన్న మన పిల్లలకు చేరువలో తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించామని, అందులో భాగంగానే "మాతృత్వం" అనే అంశంపై ఒక ప్రత్యేక నృత్య రూపకం "జగమంతా జనని" రూపొందించామని నిర్వాహకులు కొండిపర్తి దిలీప్ వివరించారు. సంచాలకులు రవి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో యువతకు పెద్దపీట వేస్తూ పిల్లలు ఎక్కువమంది పాల్గొనేలా కార్యక్రమాల రూపకల్పన జరిగిందని, ఆధునికత నిండిన సంప్రదాయాన్ని ఆవిష్కరిస్తున్నామని తెలిపారు.

కార్యక్రమాల వివరాలు:

పిల్లలూ పెద్దలూ కలిసి లావణ్య ఉట్టిపడే తెలుగు మాటలకు లలితమైన రాగల శోభ కూర్చి మనసులను కట్టిపడేసే మధురమైన పాటలతో తోరణాలు కట్టి సంరంభానికి సాకల్యం కల్గించే అంశం, "తెలుగు గాన లాలిత్యం"

స్వరాల సహజ సౌందర్యాన్నీ, అభినయపు అందమైన అనుభూతులను కలగలిపి సంప్రదాయ సంగీత స్వారస్యాన్ని మనోహరంగా ప్రస్తుతపఋఅచే అంశం, "స్వరాభినయ స్వారస్యం"

బుడిబుడి నడకల బుల్లి ఆరిందలు, తాత-బామ్మలు చెప్పిన కథలలోని నీతులను తమ బుజ్జి బొమ్మలతో కలిసి చేసే ఆట-పాట, "బొమ్మలు చెప్పిన కథలు"

ఏడు సముద్రాల ఆవలనున్నా ఏకైక దీక్షగా ఎదురుచూసేటి, ఏ నిముషమైనా ఏమరుపాటులేక మనకోసమెటువంటి కష్టాలకైనా ఎదురొడి నిలిచేటి ఏడురకాల "అమ్మ"ల గూర్చి ఎలుగెత్తి చెప్పి ఎదకదిలించే దృశ్యకావ్యం, "జగమంతా జనని"

అఖండ భారతావనిని మధ్యయుగాలలోనే ఒక్క గొడుగు కిందకి తీసుకువచ్చిన భారతదేశ రూపశిల్పి, అర్ధ-తర్క-రాజకీయ శాస్త్ర ద్రష్ట, ఆర్య చాణక్యుని ఉద్యమమూలం తెలియజెప్పే చారిత్రాత్మక నాటకం, "చాణక్య శపధం"

తెలుగు రంగస్థలంపై మొట్టమొదటి సారిగా అద్భిత ప్రయోగం, ఛాయచిత్రాన్నీ రంగ స్థలాన్నీ ఒకే వేదికపై కలుపుతూ ఆడబోయే హాస్యనాటిక, "ఛాయా <--> రంగం"

తెల్లారి నుండి పొద్దువాలి కంటికి కునుకట్టే దాక జానపదాల బతుకుల్లో ఇంపుసొంపులు, కట్టనట్టాలు, కలిమిలేములు ఏకరువు పెడుతూ పల్లెతల్లికి వేసే పాటల పూదండ, "ధినాక్.. ధిం.. ధిం.. ధినాక్.. ధిం.. ధిం.."

ఇలా ఏడు అంశాలతో శోభాయమానంగా సప్తవర్ణ చాపం ఆవిష్కరింపబడుతోంది. ఈ సంరంభంలో పాల్గొని, అపురూపమైన అనుభూతులను స్వంతం చేసుకోవడానికి సిలికానాంధ్ర అందరినీ సాదరంగా ఆహ్వానిస్తోంది.

ఉత్సవ టికెట్లకై శ్రీ నరల దేవేందర్ గారిని (408-603-7734)సంప్రదించండి.

సిలికాన్ వేలీ ఎల్లలు దాటిన "మనబడి"

మనబడి వారంతపు తరగతులు బే ఏరియాలో ఏప్రిల్ మాసంలో 173మంది పిల్లలతో ప్రారంభించిన సంగతి అందరికీ విదితమే. ఈ విజయమిచ్చిన ఉత్సాహంతో మేము మనబడిని కాలిఫోర్నియా రాష్టంలో బే ఏరియా లోని ఎవర్‌గ్రీన్, ఫ్రీమాంట్, క్యూపర్టీనో, డబ్లిన్ లోనే కాకుండా, నెబ్రాస్కా, ఒరెగన్, వర్జీనియా, కొలొరాడో, సెయింట్ లూయిస్ రాష్ట్రాలలో కూడా మనబడి ప్రారంబించటం జరిగింది. ఈ రాష్ట్రాలలో మొత్తం 170మంది పిల్లలు ప్రతి వారం మనబడిలో తెలుగు నేర్చుకుంటున్నారు.దీనికంతటికీ కారణమైన తల్లితండ్రులకీ, సంధాన పరిచిన వారందరికీ 'సిలికానాంధ్ర మనబడి ' పేరుపేరునా వందనాలు తెలుపుతోంది . ఈ విజయం మనందరిది. మన భాషని మన తరువాత తరాల వారికి అందివ్వాలన్న తపనతో చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిద్దాం.