రాతివనం - 10వ భాగం

-- సలీం

జరిగిన కథ: అనూష ఒక సాధారణ మధ్య తరగతి టీనేజ్ పిల్ల. అనూష తల్లిదండ్రుల ప్రోద్బలంతో రెసిడెన్షియల్ కాలేజిలో చేరుతుంది. అందరికంటే భిన్నంగా ఓ జర్నలిస్టు కూతురు, మధుమిత హిస్టరీ గురించి మంచిగా చెప్పి మొదటి బహుమతి గెల్చుకుంటుంది, అనూషకు ఒంట్లో బాగోలేదని తెలిసి తండ్రి విజయవాడ వెళ్ళి ఇంటికి తీసుకువస్తాడు. ఇక అనూషను వెనక్కి పంపకూడదని నిర్ణయించుకుంటాడు తండ్రి.. హిమవర్ష, అనూష లానే తల్లిదండ్రుల ప్రోద్బలం మీద తనకు ఇష్టం లేని చదువుచదువుకుంటూంటుంది. ఇంటికొచ్చిన అనూషను స్నేహితురాళ్ళు హిమవర్ష, మధుమిత కలుస్తారు. మాటల్లో మధుమిత వాళ్ళిద్దరినీ సాంత్వన పరుస్తూ తమ కష్టాల్లోనే జీవితపు విలువలు నేర్చుకోవడమెలాగో చెబుతుంది.

మరో వైపు రామ్మూర్తి అనే ఒక ప్రతిభావంతుడైన శ్రీచరిత కాలేజ్ లెక్చరర్ సునందా కాలేజిలో జేరాడని శ్రీచరిత ఓనరు ఇంటికి పిలిచి బెదిరిస్తాడు. అయినా రామ్మూర్తి లొంగడు. ఇలా ఉండగా సుందరం అనే లెక్చరర్ ఇంటింటికీ తిరుగుతూ తాను పనిచేసే కాలేజికి ప్రచారం చేస్తుంటాడు. శ్రీచరిత, సునంద కాలేజీల మధ్య పేరు గొప్పల కోసం అంతర్యుద్ధం మొదలౌతుంది. సునంద మెడికల్ కోచింగ్, ఎంట్రన్స్ లలో పైచేయిగా ఉంటే, శ్రీచరిత ఇంజనీరింగ్ ఫీల్డులో ఆధిక్యత సంపాదించాలని చూస్తుంది. అందుగ్గాను, మామూలు కాలేజీలో చదివి స్వంత కష్టం మీద ఇంజనీరింగ్ ఎంట్రన్స్ లో మొదటి ర్యాంకు పొందిన పేద విద్యార్థిని శ్రీచరితలో కోచింగ్ తీసుకున్నట్టు ప్రకటించమని ఈశ్వరరావు కోరుతాడు. అందుగ్గాను, ఆ విద్యార్థి ఇంజనీరింగ్ చదవటానికయ్యే ఖర్చులు భరిస్తానని హామీ ఇస్తాడు. అందుకు ఆశపడి ఆ పేద కుటూంబం ఒప్పుకుంటుంది. హిమ వర్ష స్నేహితురాలు క్షితిజకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తూ ఆమెను కృంగదీస్తుంటాయి. ఆ పని చేయించింది ఆమె క్లాస్‌మేట్ తల్లి అయిన ఓ ఆడ కానిస్టేబుల్ అని తెలుస్తుంది.

కల్పనకు వాళ్ళ నాన్నతో మాట్లాడాలనిపించింది.ఇంటికి ఫోన్‌చేసి అమ్మతో మాట్లాడాలనిపించింది.అనూష చెప్పినట్లు నాన్న బిజీగా ఉండొచ్చు. తని తొందరపడి అపార్థం చేసుకోకూడదు.పాపం నాన్న...సమయానికి సరైన వైద్యం అందక తమ్ముడు చచ్చిపోబట్టి తనను దాక్టరుగా చూడాలని కోరుకుంటున్నాడు.తప్పేముంది? మాట వరసకు. అంతే.

అలా అనుకోగానే కల్పనకు వాళ్ళ నాన్న మీద ఇష్టం పెరిగిపోయింది.హాస్టల్లో చరిన కొత్తల్లో తను పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినపుడు 'చచ్చిపోనివ్వండి . దంతోపాటు నేను నా భార్య కూడా చచ్చిపోతాం'అంటూ పసిపిల్లాడిలా వలవలా ఏడ్చిన నాన్న గుర్తురాగానే టెలిపోన్ వైపుకు పరుగెత్తింది.అప్పటికే కొండవీటి చాంతాడంత క్యూ ఉందక్కడ. క్యూలో నిలబడిన అమ్మాయిలు అసహనంగా ఉన్నారు.ఫోన్లో మాట్లాడి బైటకొస్తున్న అమ్మాయిల మొహాలు సంతోషంతో విరబూయాల్సింది పోతి, మాడి పోయి కనిపిస్తున్నాయి.చాలామంది ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు.

కల్పన తను ఫోన్‌చేయాల్సిన నంబరుని రిజిస్టరులో రాసి, తనూ క్యూలో నిలబడింది.నాన్నతో ఏం మాట్లాడాలి? తన పుట్టిన రోజునాడు రమ్మని చెప్పాలా? వచ్చి పిల్చుకెళ్ళమని చెప్తేనో...బర్త్‌డే నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు బైటకెళ్ళటానికి పర్మిషన్ ఇస్తారు.ఆ టైంలోపల గుంటూరు వెళ్ళి అమ్మను కూడా చూసి రావచ్చు. కొత్త డ్రెస్సు కొని పంపమని అమ్మకు చెపతేనో...బ్లూ కలర్ కార్గో జీన్స్ ప్యాంటు వేసుకొని, దానిపైకి పింక్ కలర్ టాప్ వేసుకొని తిరగాలని తనకెంత ఇష్టమో ...నాన్నకు జీన్స్ ప్యాంట్ అంటేనే ఇష్టముండదు.పదో తరగతిలో ఉన్నప్పుడు భయపడ్తూనే అడిగింది.నాన్న కోపంతో భగ్గున మండి, మరోసారి ఆ ఊసెత్తితే ఖాళ్ళు విరగ్గొడ్తానన్నాడు. నాన్నకొచ్చే కోపం గుర్తొచ్చి నవ్వొచ్చింది.

దాదాపు అరగంట నిలబడ్డాక తనవంతు వచ్చింది.సెల్ నంబరు డయల్ చేసి, అట్నుంచి హలో అని వింపించగానే "నాన్నా...నేను" అంది.

"చదుకోకుండా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావ్? ఫోన్ చేయాలంటే గంటలు గంటలు ఎదురు చొడాలని నువ్వేగా చెప్పావు. ఆ టైంలో చదువుకోవచ్చుగా. ఎంసెట్లో ర్యాంకు రావాలంటే ఒక్క నిముషం కూడా వృధా చేయకూడదని చెప్పాగా. మెడిసిన్లో సీటు రావటమంటే ఆషామాషీ వ్యవహారం కాదని ఎన్నిసార్లు చెప్పాలి" అన్నాడు.

కల్పన ఖంగు తింది.కొద్దిసేపు ఏం మాట్లాడాలో అర్థం కాక ఏడుపు తన్నుకొచ్చింది. "నాన్నా గురువారం నా బర్త్‌డే. నువ్వు అమ్మ కలిసి రండి. డే అంతా పర్మిషన్ ఇస్తారు" అంది నీరు గారిన ఉత్సాహాన్ని మరలా తెచ్చుకొంటూ.

"బర్త్‌డేలకేం కొదవ...వద్దన్నా ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి.చదువు ముఖ్యం. మొదట ఆ విషయం చూడు. నువ్వు డాక్టర్ అయ్యాక ధూంధాంగా బోలెడు పుట్టిన రోజులు జరుపుకోవచ్చు.ఏమిటీ.....అర్థమౌతుందా?"

"అమ్మను చూసి చాలా రోజులయింది నాన్నా..ఈ మధ్య బాగా గుర్తొస్తుంది.మొన్న కలలో కూడా కనిపించింది.ప్లీజ్ నాన్నా ...ఈ ఒక్కసారికి రండి. మరలా అడగను."కల్పన కళ్ళు జలపాతాలైనాయి.

"చిలక్కి చెప్పినట్లు చెప్తున్నా బుద్ధి లేకుండా మాట్లాడతావేం...ఏదైనా సాధించాలంటే కొన్నిటిని త్యాగం చేయాలి.కొన్ని ఇష్టాల్ని చంపుకోవాలి.నువ్వు తల్చుకోవాల్సింది అమ్మనో, నన్నో కాదు డాక్టర్ కావాలన్న గమ్యాన్ని.ఇప్పటికే చాలా టైం పోయింది. ఇలా ఐతే నువ్వు వెనకపడి పోతావు. నిన్ను హాస్టల్లో పెట్టిందే మిగతా ధ్యాసలేం లేకుండా చదువుకుంటావని.మాట్లాడింది చాలు.ఫోన్ పెట్టేయి" కల్పన ఫోన్ పెట్టకముందే అట్నుంచి సెల్ కట్టయింది.

కల్పనకు దుఃఖం పొంగుకొచ్చింది.అనూష భోజనానికి పిల్చినా "ఆకలిగా లేదు" అని ముడుచుకు పడుకుంది.

"ఆరోగ్యం బాగాలేదా" అని అడిగితే సమాధానం చెప్పలేదు. డిన్నర్ తరువాత స్టదీ అవర్‌కి కూడా రాలేదు. వార్డెన్ అడిగితే "తలనొప్పిగా ఉందట మేడం" అంటూ అనూష సర్ది చెప్పింది.

ఆ రాత్రి కల్పనకి నిద్ర పట్టలేదు. 'చదువే జీవితమా....చదువు తప్ప మరేమీ మిగిలి లేవా..అమ్మా నాన్నా ఆప్యాయతలూ ఇవేమీ అక్కరలేదా..అసలు తను డాక్టర్ ఎందుకు కావాలి? నాన్నకు ఇష్టం కాబట్టి డాక్టర్ కావాలా? తనకిష్టం లేదు.డాక్టర్ కావటం కోసమేగా అమ్మానాన్నకు దూరమైంది...డాక్టర్ కావటం కోసమేగా నరకంలాంటి ఈ హాస్టల్లో తనను తెచ్చి పడేసింది...అందుకే తనకు డాక్టర్ కావటం అంటే అసహ్యం. తను డాక్టర్ కానే కాదు. ఎంసెట్ రాయదు..రాసినా సరిగ్గా రాయదు.చదవకుండానే పరీక్ష రాస్తుంది.అంతే..మహా అయితే నాన్న ఒక రోజంతా తిడ్తాడు. లేదా ఒక వారమంతా తిడ్తాడు.అంతేగా ...'

నాన్నను తల్చుకున్నా కోపమొచ్చింది.'చివరికి తన పుట్టినరోజు కూడా సంతోషంగా జరుపుకోవడనికి అడ్డుపడే నాన్న కోరికను తనెందుకు తీర్చాలి? తీర్చదు. కసి తీరా ఆయన కోరికను కాల రాస్తుంది.ఈ రోజునుంచి తను చదవనే చదవదు.'

మరునాడు ఎంసెట్ టెస్ట్ పెట్టారు.తెల్సిన సమాధానాలు కూడా రాయలేదు కల్పన. తన రూంలో కొంతమంది పరీక్ష బాగా రాయలేదని ఏడుస్తుంటే కల్పనకు నవ్వొచ్చింది.పరీక్ష బాగా పాడు చేసినందుకు తృప్తిగా అనిపించింది. తనకిష్టంలేకున్నా హాస్టల్‌కి పంపించినందుకు తను చేసిన శాస్తి అది. ఈ దెబ్బతో అమ్మా నాన్న పశ్చాత్తాప పడాలి. హాస్టల్లో జాయిన్ చేయకుండా డే స్కాలర్‌గా చేర్చి ఉంటే తప్పకుండా ర్యాంకొచ్చి ఉండేదని కుమిలిపోవాలి.

బుధవారం సాయంత్రం స్టడీ అవర్. అప్పుడు మార్కులిచ్చారు. కల్పనకు లెక్కల్లో అరవైకి పన్నెండు, ఫిజిక్స్‌లో ఆరు, కెమిస్ట్రీ లో ఐదు మార్కులు వచ్చాయి.జూనియర్లలో కల్పనవే తక్కువ మార్కులు.

కల్పన గర్వంగా అందరివైపు చూసింది.తను అనుకున్నట్లు అమ్మా నాన్న మీద, హాస్టల్ మీద, లెక్చరర్ల మీద, వార్డెన్ల మీద కక్ష తీర్చుకుంది.

"కల్పన ...లేచి నిలబడు.."అనే అరుపు వినపడి ఉలిక్కిపడి చూసింది.సత్యవతి వార్డెన్ ..కాళికలా..

"చదువుకోవడానికొచ్చావా లేక హాస్టల్లో పెట్టే తిండి తిని వళ్ళు పెంచుకోవటానికి వచ్చావా?సిగ్గుందానీకు? ఇవి మార్కులేనా? ఇవి మార్కులేనా అసలు...మీ అమ్మా నాన్న ఎంతకష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారో తెలుసా?కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా?నువ్వు మనిషివేనా...నేనైతే ఇలాంటి మార్కులు వచ్చినందుకు సిగ్గుతో చచ్చిపోయి ఉండేదాన్ని.నీకు సిగ్గు శరమూ ఉంటేగా...నీలాంటి వాళ్ళు బతికుండటం దండగ....అమ్మా నాన్నల్ని క్షోభ పెట్టే నీలాంటి కూతుర్లు భూమికి బరువు.నువ్విలానే తక్కువ మార్కులు తెచ్చుకున్నావనుకో ...అడుక్కు తినటనికి కూడా పనికిరావు. చీ...సిగ్గులెని జన్మ..

ఆమె తిట్లు జడివానలా పడ్డాయి.కల్పనకి ఊపిరాడలేదు.చాలా అవమానంగా అనిపించింది.ఉక్రోషంతో ఏడుపు తన్నుకొచ్చింది.తలొంచుకొని ఏడుస్తూ కూర్చుంది.

సత్యవతి వార్డెంకి ఇంకా కసి తీరలేదు.

"కల్పనా...మరోసారి లేచి నిలబడు" అంది.

కల్పన అయిష్టంగానే లేచింది.

'ఈ అమ్మాయికి అతి తక్కువ మార్కులు వచ్చినందుకు మనం అభినందిచాలి కదా నేను అన్నట్లే మీరూ అనండి షేం షేం" అంది.

ఎవ్వరూ నోరు విప్పలేదు.

"ఓహొ...మీరందరూ ఒకటైనారన్మాట. సరే" అంటూ వార్డెన్లందరినీ పిలిచింది. వాళ్ళందరూ కలిసి చప్పట్లు కొడుతూ "షేం షేం" అని గేలి చేశారు.

అనూషకి చాలా బాధనిపించింది.మరునాడు కల్పన బర్త్‌డే అని రూమ్మేట్లందరూ కలిసి కేక్ కొని, కల్పనకి తెలీకుండా దాచిపెట్టారు.రాత్రి పన్నెండు కాగానే "హేపీ బర్త్‌డే టూయూ" అని చప్పట్లు కొడుతూ వేడుక చేయాలనుకున్నారు.మరికొన్ని గంటల్లో సంతోషంగా తన పుట్టిన రోజు జరపాలనుకుంటే ఇప్పుడు వార్డెన్లందరూ కలిసి చప్పట్లు కొడుతూ షే షేం అని కల్పనని హింసిస్తున్నారు.

కల్పన ఎవరి కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతుంది. నలుగురు కలిసి గుసగుసలుగా మాట్లాడుకుంటుంటే తన గురించేననిపిస్తుంది. ఇంతటి అవమానాన్ని తట్టుకోవటం దుస్సాధ్యమనిపిస్తోంది.

"సత్యవతి గురించి నీకు తెల్సిందేగా.నువ్వంటే మొదట్నించే విరోధమే. లైట్ తీస్కో" రూంలోకి వచ్చాక అంది అనూష.

మిగతా రూమ్మేట్లు కూడా ఏడుస్తున్న కల్పనని సముదాయించారు. "ఇవేమీ ఫైనల్ మార్కులు కాదు కదా.ఇప్పుడు తక్కువొచ్చినా ఫైనల్లో బాగా రాకూడదా? నిన్న నీ మూడ్ బాగా లేదు కదా. అందుకే సరిగ్గా చదవలేదు. మా అందరికీ తెలుసు నువ్వెంత తెలివిగల దానివో. వార్డెన్ మాటల్ని పట్టించుకోకు. అసలు దాని బిహేవియర్ గురించి ప్రిన్సిపాల్ గారికి కంప్లెయింట్ ఇద్దాం" అన్నారు.

మార్కుల ప్రస్తావన వచ్చేసరికి తను కావాలని తెలిసిన సమాధానాలు కూడా రాయలేదన్న విషయం చెప్పాలనుకుంది.కానీ ఎలా చెప్తుంది.తనకు నాన్నంటే కోపం అని చెప్పగలదా? ఎంసెట్ అంటేనే అసహ్యం అని చెప్పగలదా? ఈ హాస్టల్ అంటేనే వెగటని చెప్పగలదా?

"మార్కులే ప్రతిదానికీ కొలమానం కావటం నచ్చటం లేదు.అసలీ మార్కులూ, ర్యాంకులూ లేని చదువంటే ఎంత బావుంటుంది? వీటికోసం పోటీ...ఆ పోటీకి రెడీచేయటాఅనికి జైళ్ళలాంటి కార్పొరేట్ కాలేజీలు....చదువుకోవటం, మనకు తెలీని విషయాల్ని నేర్చుకోవటం చాలా ఉల్లాసంగా ఉండాలి కదా...ఇలా హింసిస్తున్నారేమిటి? ఐనా ర్యంకులే జీవితానికి పరమావధి కావటం మన దురదృష్టం. జీవితంలో మరేమీ లేదు లేదా...జీవితమంతే మార్కులేనా? నాకే పవర్ ఉంటే ఈ ఎంసెట్లనీ, మార్కుల్నీ, పీకి పడేస్తాను.చదువు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండేలా అరేంజ్ చేస్తాను.మీరందరూ ఈ విషయం గుర్తు పెట్టుకోండి.జీవితంలో మీరు ఏ ఏ పదవులు, ఉద్యోగాల్లో చేరినా మన ఆశ్రయం మాత్రం ఒక్కటే కావాలి. మార్కులతో ప్రమేయం లేని చదువు...ఎంసెట్‌లేని చదువు...కార్పొరేట్ కాలేజీలు లేని చదువు" కల్పన చాలా ఉద్రేకంగా మాట్లాడింది.

నిజమేనే.నాకూ అలానే అనిపిస్తుంది. కానీ మనల్ని ఇప్పుడు మిషన్లో పోసి రుబ్బుతోంది డాక్టర్లనీ, ఇంజనీర్లనీ తయారు చేయటానికి కదా! విధాన నిర్ణయం చేసే అధికారం వాళ్ళకుండదే.దాని కోసం మనం పొలిటీషియన్లమయినా కావాలి లేదా కలెక్టర్లమయినా కావాలి" అంది అనూష.

అలా అయితే మనలో ఒక్కరైనా పాలిటిక్స్‌లోకెళ్ళాలి. ప్లీజ్ నాకు మాటివ్వండి. నా చేతిలో చేయి వేసి ప్రమాణం చేయండి. ఇలాంటి చదువులు మనకొద్దు. గాయాలు చేసే మార్కులూ, ర్యాంకులూ వద్దు. అనూషా...నీ ఫ్రెండ్ మధుమిత జీవితాయశం కలెక్టర్ కావటమని చెప్పావుగా. తనతో నా రిక్వెస్ట్‌గా చెప్పు. ఈ చదువుల్ని సంస్కరించమని చెప్పు. స్నేహా..నువ్వు లాయర్‌వి కావాలని కదా కోరుకున్నావు.ఎలాగయినా లా చదివి, జడ్జి అయ్యాక ఇలా మార్కులు రాలేదని అవమానించే మాస్టార్లని, వార్డెన్లని కఠినంగా శిక్షించు. జీవిత ఖైదు వేసేయ్" అంది కల్పన.

"నువ్వు ఎమోషన్‌లో మాట్లాడుతున్నావు కానీ ఇంకెక్కడి లాయర్ కావడం? మా వాళ్ళు తెచ్చి ఈ హాస్టల్లో పడేశారుగా. ఇష్టం లేకున్నా ఇంజినీరు కావడమే నా జీవితంలో మిగిలింది" అంది స్నేహ.

"ప్రాణం లేని మార్కులు, ర్యాంకులూ ప్రాణమూ, మనసూ ఉన్న మనల్ని శాసించటమేమిటి? మన జీవితాల్తో ఆడుకోవడమేమిటి? నాకెంత కసిగా ఉందంటే వాటిని పట్టుకొని మెడ పిసికి చంపేయాలనిపిస్తుంది" పళ్ళు కొరుకుతూ అంది కల్పన.

"ఇప్పుడేగా వాటికి ప్రాణం లేదన్నావు? మరి ఎలా చంపుతావు?" అంది అనూష. అందరూ నవ్వారు. వాతావరణం కొద్దిగా తేలిక పడింది.

మిగతా రూమ్మేట్లందరూ రాత్రి పన్నెండింటికి లేచి కల్పనకు విషెస్ చెప్పాలని అలారం పెట్టుకుని పడుకున్నారు.

కల్పనకు నిద్ర రావటంలేదు. గుండె నిండా గాయాలు సలుపుతున్నాయి. రేపు బర్త్‌డే అన్న ఉత్సాహమే లేదు.అమ్మని నాన్నని రమ్మని కోరుకుంది.అంతే నాన్న రానన్నాడు. తనంటే తన ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు.ఎవ్వరికీ ప్రేమ లేదు.తనేమైపోయినా ఎవ్వరూ పట్టించుకోరు.

తనీ చదువులు చదవలేక పోతుంది.వార్డెన్ ఎలా అవమానించిందో ...ఆ వార్డెన్ని చంపేయాలనిపిస్తుంది.ఇష్టం లేని చదువులు చదవటం తనవల్ల కావటం లేదు.తను జీవితంలో ఓడిపొయింది.నాన్న కోరికను ఎలాగూ తీర్చలేదు. తన ఇష్ట ప్రకారం ఏదీ జరగదు.ఎందుకీ బ్రతుకు వృధా...

కల్పనకు కన్నీళ్ళు ఆగటం లేదు.చచ్చి పోవాలనిపిస్తుంది.చచ్చిపోయిన తమ్ముడు గుర్తుకు వచ్చాడు.అసలు చావంటే ఏమిటి? తను చనిపోతే తమ్ముడు కనిపిస్తాడా? చిన్నప్పుడు వాడితో ఆడిన ఆటలు గుర్తుకొచ్చాయి.వాడితో జరిగిన పోట్లాటలు, గిల్లికజ్జాలు, కబుర్లు....బాల్యం ఎంత బాగా జరిగిందో...ఎంత మధురంగా ఉండిందో....

పన్నెండింటికి అలారం మోగింది మొదట అనూష లేచింది.రూమంతా చీకటిగా ఉంది.లైట్ వేయకుండానే అందరినీ పేరుపేరునా మిగతా అందర్నీ లేపింది.

"కేక్ రెడీగా ఉంది కదా" అని అడిగింది.

"నా దగ్గర దాచి పెట్టాగా" అంది గుసగుసలుగా స్నేహ.

"ఇప్పుడు లైట్ వేస్తాను.ఒన్ టూ త్రీచెప్తాను. అందరూ కోరస్గా హేపీ బర్త్‌డే చెప్పాలి" అంది అనూష.

అందరూ సరే అన్నారు.'ఒన్ టూ త్రీ' అంటూనే లైట్ వేసి అందరూ ఏక కంఠంతో "హేపీ బర్త్‌డే టూ యూ...హేపీ బర్త్‌డే తూ కల్పన" అంటూ కల్పన బెడ్ వైపుకు చూశారు. కల్పన అక్కడ లేదు. అనూష రూమంతా కలయచూసి కెవ్వున అరిచింది.సీలింగు ఫ్యానుకి చున్నీతో వేలాడుతుంది కల్పన.అందరూ కెవ్వున అరిచారు. కొంతమంది భయంతో బైటికి పరిగెత్తారు.

**** **** ****

(సశేషం)

భావుకతను సృజనాత్మకతను రంగరించిన కథనశైలితో విశేష ప్రతిభ కలిగిన కథకుడు, నవలాకారుడు శ్రీ సలీం. కథా ప్రక్రియలో తెలుగు యూనివర్సిటీ ధర్మనిధి పురస్కారం,వెండి మేఘం నవలకు తెలుగు యూనివర్శిటీ సాహిత్య పురస్కారం (రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు), వి. ఆర్. నార్ల పురస్కారం లభించాయి. 'రూపాయి చెట్టూ కథా సంపుటికి మాడభూషి రంగాచారి స్మారక అవార్డు, కాలుతున్న పూలతోట నవలకు బండారు ఈశ్వరమ్మ స్మారక పురస్కారం లభించాయి.