పర"దేశి" కతలు: కర్రీ అనగా ఏమిటి మరియు ఇతర ఇండియన్ తిండి తిప్పలు కథ

-- తాటిపాముల మృత్యుంజయుడు

సాయంత్రం హైవే మీద డ్రైవ్ చేస్తున్నాన్న మాటేగానీ రోడ్డుమీద మనసు నిలపలేకపోతున్నాను. మనసంతా ఈరోజు ఆఫీసులో జరిగిన సంఘటనల చుట్టే పరిభ్రమిస్తోంది. అసలు దీనికంతటికి కారణం 'ఆ వెంకటరమణే'. అలా అనుకొంటుంటే నాకు అప్పుడెప్పుడో చూసిన సినిమాలో ఓ డైలాగ్ గుర్తొచ్చి వవ్వొచ్చింది. ఆ సినిమాలో ఏ పని చేయడం చేతకాని కమెడియన్ పేద తండ్రిని పట్టుకొని 'అస్సలు నిన్ను కాదు, చచ్చిపోయిన మీ నాన్నని అనాలి ' అంటూ కసురుకుంటాడు. 'మధ్యలో మా నాన్నేం చేశాడురా?' అని తండ్రి అడిగితే, 'మీ నాన్న బాగా కష్టపడి పనిచేసి సంపాదించుంటే, ఆ డబ్బు నాకు వారసత్వంగా వచ్చి ఉండేదిగా' అంటూ లా పాయింటు లేవదీస్తాడా ప్రబుద్ధుడు. 'ఆడలేక మద్దెల ' అన్నట్టు నాలో రేగుతున్న తిక్కకు వెంకటరమణను వేలెత్తి చూపడం నాకు సమంజసం అనిపించలేదు. అసలు జరిగిన విషయం ఏమిటంటే...

ఈరోజు శుక్రవారం. శని, ఆదివారాలు జెట్ స్పీడులో ఇలావచ్చి అలా వెళ్ళిపోయినట్టు, అలాగే సోమవారం నుండి శుక్రవారం వరకు కాలచక్రం నత్తనడకలా సాగినట్టు అనిపించడం అమెరికా మానవనైజం. శుక్రవారం నాడు ఎవరైనా అమెరికన్ కొలీగ్ ను 'హౌ ఆర్ యూ డూయింగ్?' అంటే ఠపీమని వచ్చే జవాబు 'థాంక్ గాడ్, ఇట్ ఈజ్ ఫ్రైడే'. అదే ప్రశ్న సోమవారం ఉదయం అడిగామనుకోండి, నీరసంగా వచ్చే జవాబు 'యూ నో, ఇట్ ఈజ్ మండే మార్నింగ్'. నేనుకూడా ఈ వీక్ డేస్, వీకెండ్ అనే కాలచట్రం ఇరుక్కుపోయి జీవితాన్ని చాలా ఫాస్ట్ గా వెళ్ళబుచ్చుతున్నాను. ఎంత అమాయకుణ్ణి. కాని నా మనస్సులో అప్పుడప్పుడు 'త్వమేవాహం'లో ఆరుద్ర ఒక కవితలో అన్న కొన్ని పంక్తులు గుర్తుకొస్తాయి. 'ఎందులోంచి ఎప్పుడు ఎలాగ పుట్టింది కాలము?, ఎవరివల్ల, ఎవరికోసం జరిగిందీ ఇంద్రజాలం?...ఎలాగో పుట్టిందా ఈ కాలం?, ఆ కాలానికి పుట్టిందా కొలమానం?' అంటూ ఫిలాసఫీ చెబుతాదు. అదే మహాకవి శ్రీశ్రీ రాసిన 'ఖడ్గసృష్టి ' కావ్యంలో 'గాలంవలె శూలంవలె వేలాడే కాలం, వేటాడే వ్యాఘ్రం అది వెంటాడును శీఘ్రం' అంటూ మనలను భయంతో పరుగులు పెట్టిస్తాడు. ఇవన్నీ అలోచిస్తే 'ఏంటో ఈ అమెరికా జీవితం' అని మెట్టవేదాంతంలోకి వెళ్ళిపోతాను. సరే అవన్నీ వదిలేసి ఇక అసలు విషయానికొస్తాను.

ఈరోజు శుక్రవారం కాబట్టి 'అసంకల్పిత ప్రతీకార చర్య ' లా ఆఫీసులో బయటకు లంచ్ కు వెళ్దామన్నారు. (అసంకల్పిత ప్రతీకార చర్య అంటే ఉదాహరణకు, మన చెంప మీద ఓ దోమ ఎంచక్కా కుడుతూ రక్తం పీలుస్తుంటే, మన మెదడు మన చేతికి దోమను కొట్టమని ఆదేశాన్ని పంపిస్తుంది. వెంటనే చేయి గాల్లో లేచి చెంపను వాయిస్తుంది...అదే దోమను చంపుతుంది. దీనినే అసంకల్పిత ప్రతీకార చర్య అందురు అని చిన్నప్పుదు సైన్సు పరీక్షలో సమాధానం రాసేవాణ్ణి.) ఆఫీసులో చాలామందికి వేరే పనులున్నాయి కాబట్టి పదకొండికే లంచ్ కు వెళ్దాన్నారు. 'మరీ పదకొండింటికే లంచా, విపరీతంగానీ. ఇంకా పొద్దున తిన్న ఇడ్లీలు అరగందే' అంటూ నాతో గొణిగాడు వెంకటరమణ. అతనితో ఎప్పుడూ ఉండే గొడవే ఇది, ఒంటిగంట కానిదే అతనికి కడుపులో ఆత్మారాముడు కదలడు.

'ఐ వాంట్ టు ఈట్ ఇండియన్ ఫుడ్ టుడే' అన్నాడు జేమ్స్. ఈమధ్యలో ఇండియన్ తిండంటే ఇష్టపడుతున్నాడు కాబట్టి, 'ఇట్ లుక్స్ యూ ఆర్ డెవెలపింగ్ టేస్ట్ ఫర్ ఇండియన్ ఫుడ్ నౌ ఏ డేస్ ' అన్నాను నేను. వెంటనే వెంకటరమణ అందుకొని ఇంగ్లీషులో 'దీన్ని గురించే నేనెక్కడో చదివాను. ఒక్కసారి మన శరీరం రకరకాల మసాలా రుచులకు అలవాటుపడితే మళ్ళీమళ్ళీ కావాలని, ఇంకా ఘాటుగా, కారంగా ఉండాలని కోరుకుంటూందనీ, దీన్నే 'కర్రీ అడిక్షన్ ' అంటారని చదివాను ' అన్నాడు. ఆ మాటలకు అందరం నవ్వుకున్నాం.

ఎక్కడికెళ్దామని డిసైడ్ చేస్తుంటే, ఈ మధ్యనే తెరిచిన 'అంబా విలాస్ ' కు వెళ్దామన్నాడు సుందర్రావు. 'మరీ పోయిన శుక్రవారమే వెళ్ళంగా. అందునా అది ప్యూర్ సౌత్ ఇండియన్ వెజిటేరియన్ కదా. ఈసారి నార్తిండియన్ ఫుడ్ నాన్, చనామసాల వగైరా ట్రై చేడ్డాం' అంటూ వెంకటరమణ ప్రపోసల్ పెట్టాడు. ఆంధ్ర భొజన వీరాభిమాని అయిన సుందర్రావు మొహం అదోలా పెట్టాడు. ఈ చోద్యాన్ని గమనిస్తున్న జేమ్స్ స్పందిస్తు 'స్ట్రేంజ్! మీలోను, మీ ఫుడ్లోను ఇన్ని తేడాలున్నాయని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది.' అన్నాడు. నిజమే! అప్పుడు నాక్కూడా ఇంతకు ముండు జరిగిన ఓ వివిత్ర సంఘటన గుర్తుకొచ్చింది.

కొన్నేళ్ళ క్రితం నేను అమెరికాలో ఇంతకు ముందు పనిచేసిన ఆఫీసుకు విజిటింగ్ మీడ ఇండియానుండి ఒక ఇంజనీర్ వచ్చాడు. అతను బీహారీ. మద్రాసు నగరంలో పనిచేసేవాడు. పనిచేసిన ఐదేళ్ళు సరైన తిండి దొరక్క తిప్పలు పడ్డాట్ట ఆ జీవి. పుష్కలంగా తిండి దొరికే చెన్నైలో పస్తులుండడం ఏంటబ్బా అని ఆరా తీస్తే ఈ విధంగా చెప్పుకొచ్చాడు. లంచ్ కు ఏ హోటల్ కెళ్ళినా సర్వర్లు సైనికుల్లా యుద్ధప్రాతిపదికన ఒకడు అరిటాకు వేస్తే, ఇంకొకడు కూరలు, పప్పు, కొళుంబు వగైరాలు ఆకు చుట్టూ అంచున వడ్డించేవాడట. ఆ వెంటనే మరొకడు క్షణం ఆలస్యం చేయకుండా ఆకు మధ్యలో అన్నం శిఖరం నమూనాలో వడ్డించేవాడట. వెనువెంటనే ఇంకొకడు వాయువేగంతో వేగంతో వచ్చి అన్నంపై గంపెడు సాంబార్ గుమ్మరించే వాడట. ఇవన్ని రెప్పపాటు కాలంలో జరిగేవట. కొత్తలో 'చపాతీలున్నాయా' అని అడిగితే పిచ్చివాణ్ణి చూసినట్టు చూసేవారట. అటు చపాతీలు దొరక్కా, ఇటు సాంబారన్నంలో కూరలు కలుపుకొని తినలేక అష్టకష్టాలు పడ్డాట్ట మానవుడు. అలా బక్కచిక్కిన బీహారీని అమెరికాకు వచ్చిన మొదటిరోజున అఫీసుకు దగ్గర్లోనున్న 'టాకోబెల్ 'కు తీసుకెళ్ళాను. అతనికేం ఆర్డరు చెయ్యాలో తెలియకుంటే నేనే ఒక 'బీ న్ బర్రీటో' ఆర్డర్ చేసాను. చుట్టగా వచ్చిన బర్రీటోని విప్పి పరచుకొని అంచులు ముక్కలు చేసుకొంటూ మధ్యలో బీన్స్ నంచుకుంటూ లొట్టలేస్తూ తిన్నాడు. తింటూ 'అరె యార్! చెన్నైసే అమెరికా అచ్చా హై. ఇధర్ చపాతీ దాల్ మిల్తా హై' అని అన్నాడు. అలా చెన్నైలో పోగొట్టుకున్న చపాతీని అమెరికాలో దొరికించుకొన్నాడన్న మాట ఆ గురుడు, కొలంబస్ అమెరికాను కనుక్కొన్నట్టు!

ఏమాటకామాటే చెప్పుకోవాలి. నాకు కాలేజీ రోజుల్లో ఇంకో స్నేహితుడుండేవాడు. అతడికి చపాతీలకి ఆమడ దూరం. అతనికి భోజనంలోకి తెల్లన్నం, చికెనో, మటనో ఉంటే చాలు, పంచభక్ష్య పరమాన్నంతో లెక్క. 'మరీ నార్త్ ఇండియన్ కర్రీలంటే అంత వెగటు ఉండనక్కర్లేదు. ఎంతైనా మనమంతా భారతీయులమేగా' అన్నాడు వెంకటరమణ.

'బై ది వే? వాట్ ఎక్జాక్ట్లీ ఈజ్ ఏ కర్రీ?' ప్రశ్నించాదు జేమ్స్.

నేను, సుందర్రావు, వెంకటరమణ సమాధానాలు చెప్పటానికి ప్రయత్నించాం. మా జవాబుల్లో ఒకదానికొకటి పొంతన లేదు.

నేను, సుందర్రావు, వెంకటరమణ సమాధానాలు చెప్పటానికి ప్రయత్నించాం. మా జవాబుల్లో ఒకదానికొకటి పొంతన లేదు.

నిజమే, జేమ్స్ ఎంత అమాయకంగా, చిన్న ప్రశ్న వేసినా ఎన్నో రెట్లు కఠినమైన ప్రశ్న అది.

మావూళ్ళో నా చిన్నప్పుడు, మా వీధిలో ఓ మోస్తరుగా చదువుకున్న పెద్దాయన ఉండేవాడు. అతను నేను అగుపడినప్పుడు 'ఎమోయ్, ఈరోజు మీ ఇంట్లో కర్రీలేమిటీ?' అని చాలా అందంగా, స్టైలిష్ గా అడిగేవాడు. మరి ఆ కోణంలో ఆలోచిస్తే మనం ఇంట్లో వండుకునే కూరను కర్రీ అనాలేమో. ఇక్కడ కూడా ఇంకో మాట చెప్పుకోవాలి, ఏ ఆధునిక వంట పరికరాలు, వసతులు, మసాలాలు లేని మా ఇంట్లో మా అమ్మగారు టమాటా, బెండకాయ కలిపి చేసే కూర రుచి అమోఘం. నాకు అలాంటి రుచి ఇంకెక్కడా దొరకదు.

'మసాలా వేసి చేసిన కూరను కర్రీ అంటారు. లేదంటే అది వట్టి వెజిటెబుల్ అవుతుంది.' అని స్టేట్మెంట్ ఇచ్చాడు వెంకటరమణ.

'టాకింగ్ అబౌట్ మసాలా, దేర్ ఆర్ మెనీ మసాలాస్ ఇన్ ఇండియన్ గ్రోసరీ స్టొర్ ' అన్నాడు జేమ్స్.

'మరి, సాంబార్ మసాలా, రసం మసాలా దొరుకుతాయి కదా! మరి సాంబారు, రసాన్ని కూడా కర్రీ అనాలా?' ప్రతీ విషయాన్ని లాజికల్ గా ఆలోచించే సుదర్రావు ప్రతి ప్రశ్న వేసాడు.

నేను తొందరగా లాప్ టాప్ పై గూగ్లింగ్ చేసి నా వీపు మీద నేను 'ఆంధ్రుడా, శభాష్' అంటూ చరుచుకున్నాను. అది చూసి విషయమేంటని అడిగారు. అసలు విషయం చెప్పాను. వెనకట ఆంగ్లేయులు మన ఆంధ్రులు సువాసన కోసం తాళింపులో 'కరివేపాకు ' వేయడం చూసి అలా చేసిన వంటకాల్ని 'కర్రీ' అని పిలవటం మొదలెట్టారట.

'కాని దుకాణాల్లో దొరికే కర్రీమసాలా డభ్భా మీద చూస్తే, అది తయారు చేయటానికి కరివేపాకు ఉపయోగించినట్టు రాయరు. అంటే, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో, కర్రీ మసాలాలో కరివేపాకు అంతుందన్నమాట ' అంటూ కఠోర సత్యాన్ని కనుగొన్నాడు సుందర్రావు.

ఇలా 'కర్రీ అనగా ఏమిటీ?' అన్న ప్రశ్న 'నేను ఎవరు?' అని రమణ మహర్షి తన చిన్నతనంలో వేసుకొన్న ప్రశ్న కంటే కఠినంగా తోచింది.

అలా తర్జనభర్జనలు చేసుకొంటూ రెస్టారెంటూకు చేరుకొన్నాం. భోంచేస్తూ, 'అసలు కర్రీ అంటే ఏమిటో, కర్రీ చేసిన వాణ్ణే అడిగితే సరిపోతుందిగా' అని అక్కడ సర్వ్ చేసే మన తెలుగు సోదరుణ్ణి అడిగాను. నా ప్రశ్న విన్న అతను ఒక్కసారి గంభీరంగా మారిపోయాడు. ముఖంలోకి సీరియస్ నెస్ తెచ్చుకొన్నాడు. నాకు భయమేసింది. 'ఛీ, తెలుగువాడివై ఉండి ఇలాంటి చచ్చు ప్రశ్న వేస్తావా?' అని కోపగించుకొంటాడేమోనని భయపడ్డాను. ఒక్క క్షణం నిశ్శబ్దం ఆవరించుకొంది. అతను నమ్మదిగా నోరుతెరిచి 'కర్రీ అంటే ఓ చెట్టు పైననో, లేదా ఏ పొదల్లోనో దొరికే ఒక్క మసాలా ఐటెం తో చేసే కూర కాదు. నిజాని కర్రీ మసాలా అంటే అన్ని రకాలా గుభాలింపులు సమ్మిళితం చేసిన ఒక పౌడర్. ఈ ప్రపంచంలో ఏ రెండు మసాలాలు ఒకే రకంగా ఉండవు...' అంటూ మొదలెట్టిన అతని వాగ్ధాటిని చూసి నేను అచ్చెరువొందాను. నిజమే, ఎవరి పోపుల పెట్టెలో వాళ్ళ రెసిపీల రహస్యం దాగుంటుంది.

'కర్రీ అంటే కరివేపాకా, ఇంగువా, అవాలా, లేక అన్ని వేసి తయారు చేసి దుకాణాల్లో అమ్మే గరం మసాలా పౌడరా?...' ఇలా ఎన్నో ప్రశ్నలు ఉదయించాయి.

గరం మసాలా అంటే గుర్తొస్తొంది... ఆ మధ్య సినిమా క్యాసెట్టు తీసుకోటానికి ఇండియన్ షాపుకెళ్తే అక్కడ 'గరం మసాలా' అన్న పేరున్న సినిమా అగుపడింది. కవరుపైన అన్ని హాట్ హాట్ బొమ్మలున్నాయి. మనవాళ్ళు ఉద్ధండులు. దేన్నీ అంత ఈజీగా వదలరు.

ఆ నార్త్ ఇండియన్ రెస్టారెంటులో సౌత్ ఇండియన్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఇడ్లీ సాంభార్ తింటున్న సుందర్రావుని చూసి, 'బై ది వే, వాట్ ఈజ్ ఇడ్లీ?' అని ప్రశ్నించాడు జేమ్స్.

ఆ ప్రశ్న విన్న నాకు సొర బోయింది, ఇంకో అవాంతరం ముంచుకొస్తున్నట్టు తలుచుకొని.