పద్యం-హృద్యం

-- తల్లాప్రగడ

ముందుమాట: ఈ శీర్షికతో తెలుగు పద్యంలో ఉన్న అందాన్ని, గొప్పతనాన్ని పదిమందికీ అందించి, వారినీ ఈ ప్రక్రియకు దగ్గిర చేసి, పద్యానికుండవల్సిన మర్యాదని గుర్తుచేయడమే మా సంకల్పం. మరుగు పడిన పద్యాన్ని మళ్ళీ మెరుగు పరచి, భాషను సరళీకృతం చేస్తే, పద్యాలంటే ఉన్న భయం తొలుగుతుంది. వాడుక భాషలో పద్యాలు వ్రాస్తే, అటు పద్యమూ నిలబడుతుంది, ఇటు ప్రజలకూ అర్థమవుతుంది. అందుచేత వాడుకభాషా ప్రయోగాలకు మేము ప్రాముఖ్యత ఇవ్వదలిచాము. ముందు ముందు ఈ శీర్షికను పాఠకులందరూ పాల్గునే విధంగా రూపొందిస్తాము. అలాగే మంచి పద్యాలకు భాష్యం, తాత్పర్యాలు, కూడా ప్రచురిస్తాము. అందరూ ఆనందించాలి, ఆస్వాదించాలి, ఆదరించాలి, అదే మాకు పదివేలు (డాలర్లు)!!!!

సమస్యాపూరణం:

ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము.

మీ జవాబులు ఈ మెయిల్(rao@infoyogi.com) ద్వారా కాని ఫాక్స్ ద్వారా కానీ : 408-516-8945 మాకు సెప్టెంబర్ 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. పద్యంలో యతిప్రాసల నియమాల సులువుగా అవగాహన అవ్వడానికి పాఠకుల సౌకర్యార్థం ఈ లంకెని నొక్కండి..

ఈ మాసం సమస్య

"సీ:// దొరల సాని ఎటుల దొరసాని అయ్యెనో?"

క్రితమాసం సమస్య : "ఆ.వె.// చేరదీసినోడె చేతకానివెధవ"

ఈ సమస్యకి మంచి సమాధానాలు వచ్చాయి. వాటిలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి!

మొదటి పూరణ - డా: ఐ.యస్. ప్రసాద్, హైదరాబాద్

ఆ.వె.// ఎట్టి చదువు లేక ఎనుబోతులకు మల్లె
వాడవాడ దిరుగు వారినెల్ల
చేరదీసినోడె చేతకాని వెధవ
పదవి కొఱకెకాని పనికి కాదు!

రెండవ పూరణ - చదువరి

ఆ.వె.// చేరదీసినోడె చేతకాని వెధవ
చెంత చేరగానె చెమట గక్కె
ఏమి చెబుదునమ్మ ఏలినోడికతను
పారజూడగానె పారిపోయె!


మరొక పూరణ

నడచివచ్చినోడి నడత మంచిదనుచు
మాటమరచినోడి మార్చి మనము
చేరదీసినోడె చేతకాని వెధవ
చేటు కాలమందు చేష్టలుడిగె!

మూడవ పూరణ - పుల్లెల శ్యామసుందర్, శాన్ హోసే

ఆ.వె.// వానిదేశమందు ప్లేనులు కూల్చినా
సౌదిరాజునసలు జంకులేక
చేరదీసినోడె చేతకాని వెధవ,
దేశమేలగలడె, తిరుమలేశ!


మరొక పూరణ

ఆ.వె.// అప్పులెన్నొ చేసి తప్పతాగి తిరుగు
వానినితడు మనకు బంధువనుచు
చేరదీసినోడె చేతకాని వెధవ
తాగితిరుగువాడు బాగుపడునె!


నాల్గవ పూరణ - కోపల్లె మణినాధ్, హైదరాబాదు


కవిత:

కలిమిలేములకన్న చెలిమిబలము మిన్నని తలచి
కష్టాలలో ఆదరించి ఆదుకున్న మిత్రునింటచేరి
కపటస్నేహముతో కుఠిల మనస్సుతో
కల్లాకపటమెరగని అమాయకప్రాణాలు
హరించటమే తమ లక్ష్యముగా ఎంచి
చేరదీసినోడె చేతకాని వెధవ
అందమైన సాయంత్రం సాగర తీరాన
బాంబుదాడితో బీభత్సము సృష్టించెన్!

(ఇటీవల జంటనగరాలలో జంటబాంబుల దాడిలో అసువులు బాసిన మానవాళికి నివాళులు అర్పిస్తూ వ్రాసారు.)


ఐదవ పూరణ - ఊకదంపుడు, హైదరాబాదు

ఆ.వె.// అంతిపురిని వదలి అర్ధాంగినొదిలియు
ఆప్తు, హితుల నొదిలి ఆట వెలది
చేరదీసినోడె చేతకానివెధవ
జచ్చు వైరి విడువ జనుల చేత !


మరొక పూరణ

వయసు వేడి లోన వచ్చితి ఘనుతోడ
తల్లిదండ్రి నొదలి, తప్పి తెలివి,
చేరదీసినోడె చేతకానివెధవ
చేవ లేదు, లేదు చిల్లి గవ్వ!


ఆరవ పూరణ - తల్లాప్రగడ, శాన్ హోసే.

ఆ.వె.// చేరదీసినోడె చేతకానివెధవ,
పాలు పోసి పెంచు పాములోడ!!
కోరలున్నదాన్ని కోరిపెంచుట చూస్తె ,
బిన్నులాడనైన ఖిన్నుడవడ? !!


భక్త హనుమ -- తల్లాప్రగడ

సందర్బం: అశోకవనంలో నిర్భందించబడిన సీతను చూసి, హనుమంతుడు తనతో వచ్చేయమని కోరతాడు. ఈ రాక్షసులబారి నుండి తప్పిస్తానని అంటాడు. అప్పుడు సీత అలా పారిపోవటానికి నిరాకరిస్తుంది. అది శ్రీరామచంద్రుని శొభని తగ్గిస్తుందని వారిస్తుంది. జాగ్రత్తగా లంకదాటి వెళ్ళి రాముని తీసుకొని రమ్మని అంటూ, తల్లిగా ఆశీర్వదిస్తుంది. ఆమె ఇలా అంది.

సీ:// ప్రఘాణ రక్కసి ప్రతిహారంబుండు, ప్రఛ్ఛాదనమివుమా ప్రజ్వలించు
పరిపూర తేజ నీ ప్రన్నదనమునకు, తల్లి యాశిస్సుతో వెళ్లి నీవు
ప్రతిష్టంభములను ప్రభువులకు చెప్పి, ప్రధమ ప్రధన ప్రదులయ్యి,
నీవు ప్రత్యాలీఢునిప్రదర వినాశ ప్రతిమోతీ లంక పరచ వలెను!

తే.గీ.// పతిసుఖంబు యగును ప్రతి పత్ని వరము!
శత్రునాశనమొనరించి శాంత మొందు
నపుడె సుఖము ఏ రాజుకైన! అది వీడి
రాగలన నేను హనుమతో, రామచంద్ర!
రామ రేణువే హనుమంతు రామచంద్ర!

ప్రతిపదార్థం:

ప్రఘాణ = తలవాకిటి మీద, ప్రహరీమీద
రక్కసి = రాక్షసి
ప్రతిహారంబుండు= అడ్డుగా కాపలా ఉంటుంది!
ప్రఛ్ఛాదనమివుమా = దాచిపెట్టి ఉంచు (లేక ఉత్తరీయము కప్పుకో) (లేక ముసుగుగా కప్పుకో)
ప్రజ్వలించు= మిరుమిట్లుకొల్పుతూ
పరిపూర తేజ = పరిపూర్ణమైన తేజస్సుతో కూడినటువంటి
నీ = నీ యొక్క
ప్రన్నదనమునకు! = అందానిని!
తల్లి యాశిస్సుతో = తల్లి దీవనలతో
వెళ్లి నీవు= (క్షేమంగా) వెళ్ళి నీవు
ప్రతిష్టంభములను = (ఇక్కడి) అడ్దంకులన్నీ
ప్రభువులకు = రాముడికి
చెప్పి= వివరించి
ప్రధమ ప్రధన ప్రదులయ్యి= ముందు ఉండే యుద్ధోన్ముఖులుగా అయ్యి
నీవు = నువ్వు
ప్రత్యాలీఢుని= ఎడమకాలు ముందుకి పెట్టి (కుడికాలు వెనుకకి పెట్టి) ఉన్న విలికాడిని, అంటే స్థితిలో ఉన్న రాముని
ప్రదర = బాణముల
వినాశ = వినాశనపు
ప్రతిమోతీ = ప్రతిధ్వని
లంక పరచ వలెను= లంకానగరం అంతా వ్యాపించేటట్టుగా చేయవలెను

పతిసుఖంబు యగును = పతి సుఖముగా ఉండటమే
ప్రతి పత్ని వరము= ప్రతి ఒక్క పత్ని కోరుకునేది!
శత్రునాశనమొనరించి = శత్రువులను నాశనము చేసి
శాంత మొందు నపుడె =శాంతించినప్పుడే
సుఖము = సుఖముగా (ఉంటాడు)
ఏ రాజుకైన= ఏ రాజుకు ఐనా!
అది వీడి = (అలాంటప్పుడు ఆ రాముడి ) ఆ సుఖమును వదలి
రాగలన నేను = నేనెలా రాగలను
హనుమతో= హనుమంతునితో
రామచంద్ర!= రామచంద్రుడా!