నటరంజని

వేదాంత విజ్ఞాన-బ్రహ్మ జ్ఞానాల సమ్మేళనం - కూచిపూడి భామాకలాపం : 1

-- శ్రీ భాగవతుల లక్ష్మీనరసింహ శాస్త్రి

కూచిపూడి అనగానే తెలుగు వారి నాట్యకళా సంపద అనేది అందరికీ స్ఫురించే ప్రత్యేక విషయము. కూచిపూడి పేరులోనే అదొక గ్రామ నామ మయినా ఇచ్చట కుచ్చి అనగా నర్తకులు నడుముకు ధరించే వస్త్ర ఖండమని, పూడి అనగా గ్రామ గ్రాసపు పల్లెయని అర్ధం స్ఫురిస్తుంది. వస్త్రఖండం - ఆహార్యాభరణలలోనిదయిన ముఖ్య ఆభరణము. చతుర్విధాభినయములలో ఒకటి అయిన అహార్యాభరణము సాంకేతికముగా సూచించబడుట విశిష్టతను సంతరించుకొన్నది. "కుచ్చిపూడి" కాలానుగుణమయిన మార్పులు చెందుచూ క్రమంగా కూచిపూడి నామంగా స్థిర రూపం దాల్చినది.

రామభక్తి సారణిలో కరిగి రాముని దర్శించికొన్న తానీషా ప్రభువుచే ఇచటి కళా వేత్తలు ఈనాముగా పొందిన 70 కత్తుల భూమి. ఈ భూమిని అచట గల నర్తకులయిన కుటుంబీకులు - భాగవతుల - వేదాంతం - పసుమర్తి - వెంపటి - చింతా - మొదలయిన వారుపొందిన స్థిరాస్తులు. కూచిపూడి యందు ఉద్భవించిన పరమ గురువు శ్రీ యోగి సిద్దేంద్రులు వారేర్పచిన కలాప ప్రక్రియలో ఒకటయిన భామాకలాప ప్రదర్శన తిలకించిన తానీషా ప్రభువు ఈ కళావేత్తలకు ఏర్పరిచిన బహూకృతి. ఈ సత్కృతిని భావ, స్ఫుర, రాగ, లయ, రసోచితంగా కూచిపూడి వారు తరతరాలుగా ప్రదర్శిస్తున్నారు.

సత్యభామగా
వేదాంతం సత్యనారాయణ శర్మ

ఈ భామకలాపము "శ్రీగదితము" అనే రూపకమునకు చెందినది. ఇందు నాయకుడు ప్రసిద్దుడయిన శ్రీకృష్ణుడు, కలాపం వాగ్వాపారమునకు చెందిన భారతీ వృత్తి. ఇందలి కధా సంవిధానమంతా ఏకాంపిక రూపకము. హాస్య శృంగారములు మిత్ర రసముల ప్రత్యేకతలు ఇందలి విశిష్టతలు. ఈ కలాపంలో సత్యభామ నాయిక. తనకు అప్పటి వరకూ జరిగిన పూర్వ వృత్తాంతమును తన సఖితో చెప్పుకుని భావి కార్యక్రమమును చర్చించు సందర్భము అంతా కలాపములో ద్యోతకమవుతుంది

సత్యభామ విరహ కలాపం ముఖ్యముగా ఇందు కైతికీ వృత్తి ప్రధానము. భామాకలాపంలో భరతశాస్త్రములోని చదుర్విధాభినయ విశేషములు - జడ భరతంలో యోగ శాస్త్ర విషయాలు అడుగడుగునా జ్యోతిశాస్త్ర, వాస్తు శాస్త్ర విషయాలు మొదలుగా గల విషయములు దృగ్గోచరములు.

ఇందు సత్య భామకు సఖిగా,కృష్ణునకు సఖుడుగా, మాధవిగా, మాధవుడుగా ప్రతేక పాత్ర సృష్టి, సిద్దేంద్రులు చిత్రీకరించిన తీరు రసభూయిష్టమయిన ప్రత్యేకత.

ఈ కలాపమంతయు సంపూర్ణముగా "శ్రీకృష్ణచిద్విలాసం"గా రూపొందించ బడింది. భామాకలాపం అన్న పేరు బాహ్యంగా శృంగార భూయిష్టంగా వున్నా, వేదాంతం పరమార్ధం మూలముగా కలిగినదీ కలాపం. భామాకలాపం వేదాంత ప్రబోధకై ఏర్పడిన గాధ. ఈ గాధ వెనుక ప్రత్యేక ధ్వని సిద్దాంతం తెలియబడుతూ వుంటుంది. సతి చరిత్ర నుడవ బడుతుంటే, పతి చరిత్ర వినబడుతూ వుంటుంది. అనంద వర్ధనుని ధ్వని సిద్దాంతమునకు ఉత్కృష్టమయిన ఉదాహరణ. "నయతి వృత్తం ఫలం ప్రపోతిచ ఇతి వినాయక" నాయకుడు ఫలమునకై ప్రయత్నించి తుదకు పొందువాడు. మువ్వురికి ఆది మూలమై శేషునిపై పవ్వళించి యున్న శ్రీకృష్ణ పరమాత్మ ఇందలి నాయకుడు. నాయిక ఇట్టి నాయకుని రూపురేఖా విలాసములు భావ, రాగ, నాట్య గతులచే పర్ణించుచూ, శృంగారముగా కన్నుల నిండా జూచి బంగారు పూవుల పూజ సేయును. మాధవి పాత్ర ప్రత్యేకముగా మాధవుడు గనే గోచరం అగుచూ వుంటుంది. మాధవి అనంప్పుడు అది ఒక స్త్రీ వేషంలో వచ్చిన శ్రీకృష్న అంశ. సత్య భామ అంతరంగం అట్టడుగు వరకూ చూడగలిగి తెలిసి అందునా భగవత్ సాక్షాత్కారానికి ప్రతిబంధకాలయిన అహంకార మమకార గుణాలను వెలికి తీయుటకు తర్క రూపమయిన పరీక్ష బెట్టి అజ్ఞానం తనంతట తాను మాయం జేసుకునేటట్లు మార్గంచూపించుటకై, సాధనకై, భగవత్ భక్తికై యేర్పడిన మానవ రూపం.

మూర్తీభవించిన మానవ రూపం కాబట్టి "మాధవీ" అని స్త్రీ ప్రత్యయంత రూపంగా సృష్టించబడ్డ స్త్రీ రూప భ్రమప్రకృతిలో ఇన్ని ఆకృతులుండగా మూర్తీభవించిన మాధవ భావం కాబట్టీ ఈ ఆకృతినే సత్యభామ పెంచుకొనుట జరిగినది. జాలిమాలి మగని బాసి తాళజాలని సత్య సల్లలిత ప్రసంగయగు ఇష్ట సఖితో "రావే మాధవి యేమే కుందరదనా రావే సరోజానన" యని పిలచి స్వామి వారికి, తనకు జరిగిన శృంగార సన్నివేశమును వర్ణించి చెప్పును. నా స్వామి యేపొన్నలందున్నాడో, యే పొగడలందున్నాడో, యే కేళికా గృహములందున్నడో కొని వచ్చి చూపరే..." అంటూ తన గోడు చెప్పుకొనుటలో కలాష కధ ప్రారంభం కాబడుతుంది. సత్య భామ ఇచట మాధవి సాయం అర్ధించుట గోచరిస్తుంది. మాధవి వేసే ప్రశ్నలు క్లుప్తంగాను, అర్ధవంతంగాను వుంటాయి. ముఖ్యంగా స్వామి వారి రూపురేఖా విలాసాలు వర్ణించమని అడుగుతుంది.

నా స్వామి మదనమోహనా కారుడని - మందర గిరిధరుడని అంటుంది - సత్య

అలాకాదు కొన్ని గుర్తులు చెప్పమంటుంది - మాధవి

నా స్వామి శంఖము ధరించిన వాడంటుంది - సత్య

శంఖము ధరించిన వాడు జంగాల వారి చిన్న వాడేకాని నీ భర్త కాడు అంటుంది - మాధవి

మాధవి అభినయం నుండి పరోక్షంగా "పాంచజన్యం" పూరించిన పరమాత్మ గోచరం అవుతుంది. తరువాత సంభాషణలలో తర్కము ముదిరి విషయం పాకాన పడుతుంది.

చక్రము ధరించిన వాడే వోయమ్మా! - సత్య

కులాల వారి చిన్న వాడంటుంది - మాధవి

ఆయన కాదని అందోళన చెందుతుంది - సత్య

కామావస్థల్లో ఒకటయిన విలాపము శోకము కంటే కొంత విలక్షణమయినది.ఒకనాడు పడక మందిరానికి వచ్చి గానం చేసారు:

"హంసతూలికా తల్పమున తనను పర్యంకమున కూర్చొండ బెట్టుకొని నగలచే అలంకరింప జేసి"

అన్వయం: భ్రాంతిని కలిగించుట

స్వామి వారు నిలువుటద్దమున నీడలు చూచును

అన్వయం: మాయలోకి లాగుట

ఇదంతా అహంకారాన్ని పరీక్షిస్తున్నట్లుంది. తత్వం తెలిస్తే గదా అహంకారం నశించేది. ఇచ్చట పరమాత్మ తత్వం తెలియాలి. స్వామి వారు దిగ్గున కసిరి లేచి వెళ్ళిపోతారు, కారణం జగన్నాధుడు తనకు మాత్రమే నాధుడనే స్వాధీన పతిక లక్షణం,అజ్ఞాన లక్షణం.

ఒకనాటి పడక మందిరం విషయం తలచుకొని చేసిన విలాపం ఆద్యంతమును ఉద్విగ్నమై, అధైర్యముతో, ఔత్యుక్యముతో విలాపం కలాపంలో వినిపిస్తూ వుంటుంది. ముఖ్యంగా దశవిధ కామావస్థలు "మదనా"దర్వులో "మారుని శరల బారి కోర్వలేడ""ఎందుబోతివి రారా నంద నందన "లో, అవస్థలన్నీ అభినయంలో చూపిన అభినయజ్ఞులెందరో. శృంగారభినయమును పంపించి ఒద్దిక ఒయ్యారాలకు నిర్వచనం పలికారు. పయిన సిగ్గు అభినయించినపుడు తన జీవుడు కాక ఒక "స్త్రీ" అనే పరిమిత భావం కలుగుట వలన - మాధవి సత్యభామ పాత్ర ద్వారా భక్తుని యొక్క అపరిపక్వ దశను ఈ స్థితిలో అభినయం ద్వారా అందుకుంటాము.

ఈ కలాపంలో నాయిక పడే వేదన మధుర భావన స్వామి కొరకై సత్య యేకాగ్ర చిత్తయై ఆరాధించిన మధుర భావన మాధరీ భక్తికి త్రోవతీయ భగవంతుని ప్రసన్నునిగా జేసుకొనును. సిద్దేంద్రులు భగవదయిక్యముగోరి తాను భావనలో స్త్రీమూర్తియై రెప్ప పాటయినా పతి వియోగమోర్వలేని సత్య అవస్థా బేధములను తాను అనుభవించి ఆమె విరహ కలాపము భామాకలపముగా మలచినాడు.

(తరువాయి వచ్చే మాసం )

హైదరాబాదు వాస్తవ్యులయిన శ్రీ భాగవతుల లక్ష్మీనరసింహ శాస్త్రి గారు ప్రస్తుతము కార్నింగ్, న్యుయార్క్ నివాసస్తు లయిన తమ అబ్బాయి భాగవతుల శాస్త్రి గారి దగ్గరికి వచ్చి వున్నారు. ఎంతో మంది సంగీత విద్వాంసులకు వాద్య సహకారం అందిస్తూ ఎంతో కళా సేవ చేస్తూ పేరుప్రఖ్యాతులు సంపాదించికున్న శాస్త్రి గారిని, వారి రచనలను సుజనరంజని ద్వారా పాఠకులకు పరిచయం చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాము.