ఆవాహన - అవగాహన

--ప్రఖ్య మధు బాబు

కొందరు జాతకాలని నమ్ముతారు. కొందరు వాస్తుని, శకునాలని నమ్ముతారు. ఇంకొందరు మంత్ర శాస్త్రాన్ని విశ్వసిస్తారు. ప్రపంచంలో అన్నిటికి భౌతికమైన రుజువులు చూపించలేక పోవచ్చు. ఎవరికి వారు అనుభవంలో దర్శించవలసిందే. కీ||శే||చెన్నూరి కృష్ణముర్తి గారు క్షణంలో విబూదిని సృష్టించేవారు. Green Card సక్రమంగా, త్వరగారావడంకోసం ఒక గురువుగారు చెప్పిన 'కార్తవీర్యార్జున ' మంత్రం చాలమందికి బాగా పని చేసింది. ఆధునిక జీవితానికి కావలసిన అనేక సందర్భాలలో శ్రీ లక్ష్మి గణపతి మంత్రం అనేకమందికి సహకరించింది.

ఒం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వ జనమ్మే వశమానయ స్వాహా

ఈ మంత్రంలో 'శ్రీం' రూపంగా లక్ష్మి కనిపిస్తుంది. ఈ ప్రసిద్ధ మంత్రం గురుముఖంగా ఉపదేశాన్ని పొందినవారికి కల్పతరువై సంకల్పాన్ని సిద్ధింపచేస్తుంది అని మంత్ర శాస్త్రగ్రంధాలు చెపుతున్నాయి.

మంచి పంటలు పండాలంటే మంచి భూమి, మంచి విత్తనాలు, శ్రమకోర్చే రైతు ఎలా కావాలో అలాగే మంచి ఫలితాలు కలగాలంటే కూడా మంచి గురువు, సాధకుడు, మంత్రం కలిసి రావాలి.

గురులక్షణాలని శాస్త్రంలో ఇలా చెప్పారు. దేవతోపాసకశ్శాంతో విషయేష్వతి నిస్పృహః అధ్యాత్మ విద్బ్రహ్మవాదీ వేదశాస్త్రార్ధ కోవిదః

మంత్రొపదేశకుడైన గురువు శాంత స్వభావము కలవాడు, ప్రాపంచిక విషయాలలో ధ్యాసలేని వాడు, ఆధ్యాత్మికవిషయాసక్తుడు, బ్రహ్మ జ్ఞానము కలవాడు, వేదశాస్త్రముల అర్ధములు బాగా తెలిసిన వాడు అయివుండవలెనని తెలుస్తోంది. మరి అటువంటి గురువు అందుబాటులో లేనప్పుడు ఎలా? అని ప్రశ్నిస్తే 'మేరు తంత్రం ' లో చెప్పారు, గురువు అందుబాటులో లేనప్పుడు ఒక మంత్రాన్ని సాధకుడు ఉపాసించదలిస్తే, ఆ మంత్రాన్ని ఒక పత్రం మీద లిఖించి ఫరమేశ్వరుని ముందు కాని, ఇష్ట దేవత ముందు కాని వుంచి వారినే గురువుగా భావించి, పూజించి ఆ మంత్రాన్ని స్వీకరించి సాధన చేయవచ్చును. ఆ విధంగా స్వీకరించిన మంత్రాలు కూడా ఫలితాలనిస్తాయి.

మంత్ర సిద్ధికి సాధన అవసరం. సాధనకు భక్తి, స్థిర చిత్తం అవసరం. ఇవన్నీ ఏకమైనప్పుడు దేవత ఆవాహన జరుగుతుంది. ఆవాహన అంటే ఆ దేవతయొక్క శక్తి వలయం సాధకుడిని అతని చుట్టూ వున్న అన్నిటిని చైతన్యవంతం చేస్తుంది. మామూలుగా అర్ధంకానివి, కంటికి కనపడని అనేక విషయాలు సాధకునికి గోచరమవడం జరుగుతుంది. సాధకునిలో నూతన తేజస్సు శుభచింతనం (Positive Thinking) పెరుగుతాయి. అకారణమైన కోపం, అవేశం తగ్గి, శాంతంగా, వివేకిగా సాధకుడు మారతాడు. సాధన పెరిగే కొద్ది దేవతకి దగ్గరవడంచేత కొన్ని శక్తులుకూడా లభిస్తాయి. 'ఒక యోగి ఆత్మ కధ ' లో గంధ బాబా అనే మహానుభావుడు వస్తువుల్లోంచి చక్కని సువాసన సృష్టించే వారు. అయితే ఇలాంటి సిద్ధులు, ఆశ్చర్యకరంగా భూతభవిష్యత్వర్తమానాలు చెప్పటం లాంటివి సాధనలో ముందుకు వెడుతున్న చిహ్నాలు మాత్రమే.

మంత్రశాస్త్రం ఒక రహస్య ప్రపంచం. విషాన్ని హరించే సర్ప మంత్రాలనించి మొదలుపెట్టి, అద్భుతమైన మాలా మంత్రాలు, దశమహావిద్యల దాకా అనేక మంత్రాలు కేవలం మన శాస్త్రాలలో వున్నాయి.ఇవికాక బౌద్ధ మతంలో పాళి, బ్రాహ్మి మంత్రాలు, ఇతర మతములలో అరబిక్, లాటిన్లోను మంత్రాలున్నాయి. అయితే తెలుగులో కూడా మంత్రాలున్నాయా? వుంటే వాటి స్వరూపం ఏమిటి? తెలుగువారిలో సిద్ధులైనవారు వారి విశేషాలు ఏమిటి? ఇవి వచ్చే సంచికలలో పరిశీలిద్దాం.

శ్రీ గురుభ్యో నమః