మా పెళ్ళి పల్లకి

-- విజాపురపు వెంకట్రావు, రంగనాయకమ్మ

ఆవిడ

సుజనరంజనిలో ప్రతి నెలా ఈ శీర్షికలో పెళ్ళి ముచ్చట్లు వారి అనుభవాలు ఒక్కొక్కళ్ళ చేత వ్రాయించుచునారు. ఈ నెల మమ్మల్ని మా పెళ్ళి గురించి వ్రాయమని అడిగారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను ఎప్పుడూ కధలుగాని, కవితలు గాని వ్రాయలేదు. సరే చూద్దాం ఆ సంగతులు జ్ఞాపకం చేసుకుందాం అనుకున్నాము.

1960 వ సంవత్సరం మా పెద్ద వదిన చెల్లెలు వాళ్ళ చుట్టాల అబ్బాయి పెళ్ళికి వున్నాడు మీరు మీ అమ్మాయికి చూడండి అని చెప్పారు. అతను సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పారు. వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే పోయారు; తల్లి ముగ్గురు చెల్లెళ్ళు, ముగ్గురు చిన్న తాతగార్లు, మామ్మ గార్లు, చిన్న గార్లు అంతా చాలా పెద్ద కుటుంబం. అతని ముత్తాత గారు విజయనగరం సంస్థానంలో దివాన్ బహద్దూర్ అని చెప్పారు.

మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం, ఇద్దరు అన్నలు. పెళ్ళి చూపులకు విశాఖపట్నం పిల్చుకురమ్మన్నారు. మా పెద్దన్నయ్య పిల్చుకు వెళ్ళాడు. మా వదిన చెల్లెలు ఇంట్లో పెళ్ళి చూపులు జరిగాయి. వారి తాతగార్లు అందరూ వచ్చారు. పాట పాడాను. అటు వాళ్ళు, ఇటు వాళ్ళు అందరూ అంగీకరించారు. 1960 ఫిబ్రవరి లో ముహుర్తాలు పెట్టుకున్నారు. మా వాళ్ళు పెళ్ళి పనులు మొదలు పెట్టారనుకుంటాను.

ఒక రోజు వారి తాతగారు ఉత్తరం వ్రాశారు. పెళ్ళి కొడుకుకు అమ్మవారు పోసింది అని. రెండు నెలలు ఆగి ఏప్రిల్ లో పెట్టుకుందామని. సరే ఏప్రిల్ 14 న మళ్ళీ ముహుర్తం నిర్ణయమైంది.

మాపుట్టిల్లు గుంటూరు. అప్పుడు కల్యాణ మంటపాలు అద్దెకుతీసుకుని పెళ్ళిళ్ళు చేసేవారుకారు. ఇంట్లోనే పెద్ద ఇళ్ళు కాబట్టి చేసేవారు. ఇంటిముందు తాటాకు పందిళ్ళు వేసేరు. 20 రోజులు ముందే చుట్టాలందరు వచ్చేరు. పెళ్ళి మర్నాడు రాత్రి అనగా ముందు రోజు రాత్రి పెళ్ళి వారు విశాఖపట్నం నుండి వచ్చారు. వేణుగోపాలస్వామి గుడిలో వరపూజ చేసి విడిది చూపించారు.

ఆయన చిన తాతగారు, మామ్మగారు ఇటు మా అమ్మ, నాన్న గారు పీటల మీద కూర్చునారు. పెళ్ళి వైభవంగా జరిగింది. వంట బ్రాహ్మలు ఏపూట కాపూట పిండి వంటలు చేసేవారు. అన్నిటికీ మేళంతో పెళ్ళి వారిని విడిది నుంచి పిల్చుకు వచ్చేవారు. మా అమ్మ, మేనత్త కోడలు పెళ్ళి పాటలు చాలా బాగా పాడారు.

అప్పుడు మావారు పర్లాకిమిడి దగ్గర చిన్న గ్రామంలో ఉద్యోగం చేస్తున్నారు. అక్కడ కరంటు మొదలగునవి లేవు. అక్కడికి నేను మొదట వెళ్ళింది. ఆయన తాతగారు మా అత్తగారు కూడా ఉండేవారు. తరువాత విశాఖపట్నం, బొబ్బిలి, తాడికొండ, గుంటూరు తిరిగాం. సూపరెండెంట్ గా పదవీ విరమణ చేసాక, పిల్లలు, అల్లుళ్ళు, కోడలు, మనుమలతో సంతోషంగా ఉన్నాము.

మాకు ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. పిల్లల చదువులు గుంటూర్లోనే అయినాయి. పిల్లల పెళ్ళిళ్ళు అయాయి. అబ్బాయి అమెరికా ఒచ్చాక మేము కూడా ఇక్కడికి రావటం జరుగుతున్నది. సిలికానాంధ్ర కార్యక్రమాలు చూడదం జరుగుతున్నది. వారు చాలా బాగా కార్యక్రమాలు నిర్వహిస్తునారు. చాలా సంతోషంగా ఉన్నది.


ఆయన

సిలికానాంధ్ర వారు మా అలనాటి పెళ్ళి కబుర్లు గురించి వ్రాయమని అడిగారని మా అబ్బాయి చెప్పాడు. సరే జ్ఞాపకం చేసుకుని వ్రాద్దామని ప్రయత్నం చేస్తున్నాను.

అప్పుడు నేను పర్లాకిమిడి దగ్గర మెలియాపుట్టిలో సెంట్రల్ ఎక్ష్చిసె ఇన్స్పెక్టర్ గా ఉన్నాను. మా నాన్నగారు చిన్నప్పుడే పోయారు. తాతగారు మామ్మ చిన్న తాతగార్లు పినతండ్రులు వాళ్ళ పిల్లలు అంతా పెద్ద కుటుంబంలో మా అమ్మ, నేను, ముగ్గురు చెల్లెళ్ళం అందరం వుండేవాళ్ళం. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళయాక,

"నీకు ఒక సంబంధం వచ్చింది, నువ్వు వారం సెలవు పెట్టుకుని విశాఖపట్నం రమ్మ"ని తాత గారు ఉత్తరం వ్రాశారు. మన నరసింగరావు( చుట్టాలు) పెద్ద కూతురి మరదలు పెళ్ళికి వుందట, మంచి సాంప్రదాయ కుటుంబం తెలిసినవాళ్ళని. సరే అన్నాను. తాతగారు సంప్రదించాక పిల్లని విశాఖపట్నం పిల్చుకు వస్తే మేమందరం చూస్తాము అన్నరు. వాళ్ళు పిల్లని పిల్చుకువస్తున్నారు (తాతా) నువ్వురా అని వ్రాశారు. ఆ జిల్లాలో మనుమడిని తాతా అని పిలిచే అలవాటు ఉంది.

నరసింగరావు ఇంట్లో పెళ్ళి చూపులు అయ్యాయి. తరువాత నేను తాతగారితో పిల్ల చాలా సన్నగా వుంది అన్నాను. తాతగారు కొట్టిపారేశారు. మా పెళ్ళికి మీ అమ్మ కూడా సన్నాగా వుండేది, తరువాత అంత లావయింది, కనక అన్ని విధాలా బావుంది, చేసుకో అన్నారు. సరే అన్నాను. ఫిబ్రవరిలో ముహుర్తాలు పెట్టారు.

కాని నాకు అమ్మవారు రావటంతో ఏప్రిల్ కి మార్చారు. మా పెద్దకుటుంబం అంతా చుట్టాలు అందరం రైలులో విజయవాడ, అక్కడి నుంచి వేరే రైలులో గుంటూరు చేరాము. స్టేషన్ నుంచి వాళ్ళ చుట్టాల కారు, ఒక బస్సులో విడిదికి పిల్చుకు వచ్చారు. మర్నాడు అనగా ఏప్రిల్ 14 రాత్రి నాకు, రంగనాయకమ్మతో వివాహం వైభవంగా జరిగింది. పెళ్ళిలో ఏమీ పేచీలు లేవు. అందరం విశాఖపట్నం వచ్చాము. తరువాత తను, మా తాతగారు, అమ్మ అందరం మెలియాపుట్టి వచ్చాము.

గుంటూరు మా పిల్లల చదువులు అయ్యాయి. మాకు ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. పిల్లలు, అల్లుళ్ళు, కోడలు, మనుమలతో సంతోషంగా ఉన్నాము. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు కాబట్టి మేము కూడా ఇక్కడకి వచ్చి ఈ కార్యక్రమాలు చూస్తున్నందుకు చాలా అనందంగా ఉంది.

విజాపురపు వెంకట్రావు, రంగనాయకమ్మ

వెంకట్రావు గారు, రంగనాయకమ్మ గార్లు సిలికానాంధ్ర క్రియాశీల సభ్యులు అనంత్‌రావు గారి తల్లిదండ్రులు. సిలికానాంధ్ర నిర్వహించే ఆంధ్ర సాంస్కృతికోత్సవంలో కోసమని తమ అమెరికా ప్రయాణాన్ని వీలుగా ఏర్పాటు చేసుకున్నారు. రంగనాయకమ్మ గారు కార్యక్రమంలో పాల్గొంటూ లలిత గీతాలు ఆలాపించడం ఎంతో ముదావహం. పెద్దవారైన వారి పెళ్ళిముచ్చట్లు తెలుపమని అడిగినదే తడవుగా అందరితో పంచుకోవడం ఆనందాన్నిస్తోంది.