కృష్ణ శాస్త్రి కావ్యరస శివా(శివానీ) ఆనందలహరి

శంకరాచార్య సౌందర్య లహరుల నునుజల్లులు.

పరిశోధనాత్మక వ్యాసం: మొదటి భాగం

-- సుమతి

సాహిత్యం పరమార్థ సిద్ది కొరకు కవి సాగించే జీవన ప్రస్థానం. కాబట్టి కవి తన గమ్యం వైపుగా అన్వేషిస్తూ ఎన్నో మజిలీలు చేయాల్సివుంటుంది. కవి గడిపిన విడిదిలోని ఒక్కోక్క మధుర ఘట్టం ఒక్కోక్క కావ్యం అవుతుంది.

కృష్ణ శాస్త్రి పల్లకిలో "గురుదేవుడు" 24వ పేజీలో "మ్రోలను పురాణభారత పుణ్యమ్మూర్తి; మాకు దినదినదివ్యయాత్రాకృతోత్స వానుభూతి నొసంగు" అంటాడు. అంటే ఇక్కడ పురాణభారత అన్న పదానికి ప్రాచీన భారతమన్న అర్థంలో తీసుకోకూడ్దు. కవి పురాణ భారత పుణ్య మూర్తి అంటె మన భారతీయ సంస్కృతికి నెలవైన పారమార్థిక సంపదతో కూడిన సాహిత్య సరస్వతి. కవి యొక్క ఈ పురాణ భారతి కావ్య ప్రస్థానం దివ్య యాత్రా స్థలం. నిత్య నూత్న పవిత్రతా, ఆనందములను ప్రసాదించు గొప్పధామం. వేదాలు పురాణాలు, శృతులు, స్మృతులు వెలసిన ధాత్రీమతల్లి. ఈ అర్థం కవి భావనలోనిది. అందుకే కవి ఊర్వశిలోని "నా హృదయమందు" (135 పుట)లో ఉర్వశితో

"తిరుగరాని దొరకబోని
శీతాచల శిఖరోజ్జ్వల
హిమ పీఠాగ్రమున కెగసి
శిరము లెత్తి కరము లెత్తి
కురియింతమో వినిపింతమో,
మేలుకొనిన శృతు, లనంత
కాలమె వికసించి వినగ,
గంగా పవిత్రకాంతుల!
యమునా శీతమథువుల!"
అంటూ ఉదాత్తమైన దివ్యానుభూతితో పలికాడు.


కవి కావ్యం ఊర్వశి దివ్యసౌందర్యాన్ని, విశ్వమోహన లావణ్యాన్ని శంకరాచార్య సౌందర్యలహరితో స్పర్శిద్దాం.
ఆ ఊర్వశి ఎవరో కూడా తెల్చుకుందాం.

ఊర్వశి - (పుట:139)

"మఘవ మస్తక మకుట మాణిగ్య రాజ్ఞీ ! నీ
వెలుగు చూ పొకరేయి వికసించి వాసించి
మిలమిలా తళతళా మెరసినది కురిసినది
పాతాళ భువనాంత పరిసర తమస్సులకు!
...........................................................................
...........................................................................
ఓరగా ఓరగా నొరగు నింద్రుని శిరను
విడిపోయి దిగిపోయి పడినావు నా మ్రోల!

వైకుంఠ మృదుకంఠ వైజయంతీ మాల
తెగెనేమొ దిగజారు జగములన్నీ దాటి!
సురభి సౌదామనిగ తరళ మధు ధారగా
ఈశ్వరాలోకమే ఇటు వెడలెనో నేడు!

మూతవడనే లేని ముక్కోటి దేవతల
కనుతారకలు కోరకములై సుమములయ్యె;
ఓసరిలి యెండొరులు నొరసికొని విరుగబడి
దిశలంట చీకటులు నిశయే దివస మయ్యే!

ఆకాశ సికతాళి నడిగి ప్రాకు స్రవంతి
మూడు లోకాలలో మ్రొయు పుణ్యమ్మయ్యె!
నరకలోకపు టింట నవయు శోకతమస్సు
వెలుగు నమృతమ్మయ్యె! వీని భగ్యమ్మయ్యె!"

ఈ పద్య భాగం అపూర్వంగా ఉందని ఎందరో ప్రశంసించారు. ఆ భావం తరచి చూస్తే ఊహకు అందనంత గొప్పది. ఓ తల్లీ! దు:ఖవేదనతో ఆక్రోశిస్తున్న ఈ దీనుని మొరవిని మాతృహృదయంతో తల్లడిల్లి నీవున్న ఫళంగా పరుగు పరుగున ఊరడింప వచ్చావా. నీ దయా దృష్టి నా మీద ప్రసరింప పూనుకున్నావా. నిన్ను ప్రేమించేవారి దు:ఖాన్ని పంచుకొనే నిత్యక్లిన్నురాలివైన నీవు కరుణారస సాగరురాలిని. నీదయా వీక్షణ సరంలో విరిసిన ప్రేమ సుమాల తళుకులు, ఘుమ ఘుమలు దివినుండి భువికి చేరినవి కదా భువనేశ్వరీమాతా. మాణిక్య కిరీటధారులైన దేవేంద్ర, ఉపేంద్ర బ్రహ్మాదులు నతమస్తకులై పాదాభివందనం చేస్తుండగా సర్వలోకంలో నీవు కొలువై యుండగా నా ఆక్రందన నీ చెవిన పడిందేమో నన్ను ఊరడించ నేగిరపడ్డ నీపాదాలకు తన కిరీటం తగిలి పడిపోతావో అన్న ఆలోచనతో దేవేంద్రుడు తన తలను ప్రక్కకు ఓరగా తిప్పుకోగా, వైకుండ్తుడు కూడా అదే ఆలొచనతో వందిన తన మెడను ఎత్తేసరికి నీ కాలికి వైజయంతీమాల చిక్కుకొని తెగి పై జగాల నుండి నేల పడింది. భవానీ మాత! దివినుండి నా కొరకు క్రిందికి దిగుట బంగారు కాంతితో విద్యుల్లత మెరసినట్లు, అమృత ధార కురిసినట్లు, భవుని కరుణామృత దృష్టి భువికి దిగినదా అన్నట్లున్నదమ్మా. ఆకాశగంగ నేలకు పొంగి ప్రాకి స్వర్గ, మర్త్య, పాతాళ లోకములను పవిత్రము చేయుచున్నదా అన్నట్లు నీరాక తలపిస్తున్నదమ్మ. నిన్ను సేవిస్తున్న మూడు కోట్ల దేవతలు హఠాత్తుగా నీవు నేల దిగుట చూసి అశ్చర్యచెకితులై అనిమేషులైన వారి మూసుకుపోయిన కళ్లు పూమొగ్గలైనవి. తెరచుకొని సుమములుగా విచ్చుకున్నవి. నీరాకతో నాకు అమావాస్య చీకటి రాత్రియే అనంతవెలుగుల ఉషోదయమైనదమ్మ. కవి ఈ విధంగా వర్ణించడం శంకరాచార్య సౌందర్యలహరిని తలపిస్తున్నది. అందులోని 29 వ్శ్లొకం:

"శ్లో|| కిరీటం వైరించాం పరిహర పురః కైటభ భిదః
కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం,
ప్రణమ్రేష్వేతేషు ప్రసభ ముపయాతస్య భవనం
భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విచయతే."

శ్రీదేవి మందిరంలో ఇంద్రుడు, ఉపేంద్రుడు, బ్రహ్మ దేవుడు మొదలగు సమస్త దేవతలు సేవిస్తూ ఉండగా హఠత్తుగా శివుడక్కడికి విజయం చేస్తున్నాడన్న విషయం ఆ లలితా మాతకు తెలిసింది. భర్థ ఆగమనానికి ఆనందించిన ఆసతి త్వరపడి, తన భర్తను ఎదురు కొనుటకు గాను లేచి వెళ్ళ ఉద్యమించింది. ఆమెకు పాదాభి వందనం చేస్తూ నతమస్తకులైన వారి నుద్దేశించి చెలులు ఇలా ఆమెకు హెచ్చరికలు చేస్తున్నారు. "ఓ తల్లి నీ ముందు బ్రహ్మమొకరిల్లి ఉన్నడు. అతని రత్న కిరీటం నీ కాలికి తగల గలదు. ఇదిగో తరువాత విష్ణువు కఠినమైన బంగారు కిరీటం కాలికి తగిలి జారగలవు. ఆ తరువాత మఘవుని కాంతులీనే మాణిక్య కిరీటం. కోంచెం తొలగి నడువుమమ్మా. ఇలా సమస్త దేవతలతో పరిజనులతో సేవింపబడే నీ వైభవం నిర్వచనానికి అందనిది."

పై శ్లోకంలో సంకరార్యుడు లలితా మాతను తన హృదయ కమలాన్ని తన పతి కర్పణము చేసిన శివపరాధీనమైన మనస్సు గలిగిన సతిగా, పతివ్రతా శిరోమణిగా అభివర్ణించాడు. కాని మనకవి ఆ లలిత లలితాంబ భక్తకల్పవల్లి, భక్త పరాధీమైన ప్రేమార్ద్ర హృదయ. బిడ్డల దుఃఖానికి తల్లడిల్లే మాతృమూర్తిగా, ప్రేమార్తులైన వారికి ప్రేమను పంచిచ్చే ప్రేమారూపా ప్రియంకరిగా ఆ శ్రీదేవిని వర్ణించడం విశేషం. అంతేకాదు ఆ తల్లి అవ్యాజ కరుణామూర్తి. ఆమె కవిని కరుణించడానికి దిగడంతో ఈశ్వరుని కరుణావలోకనముల ప్రసారం, దేవతలు ఆశ్చర్య చకితులై, దిగుతున్న ఆమెను చూపులతో వెన్నాడడంతో సమస్త దేవతల కటాక్ష వీక్షణాలు తల్లి ప్రేమతో పాటు కామధేనువూ, కల్ప వృక్షాలు కవికి లభించాయి.

ఇక్కడ ఈ శ్లోకం ఊటంకించాల్సిన కారణం ఏమటే బ్రహ్మ ఉపేంద్ర శిరోరత్న రంజితాయై అనేనామంగల ఆ దేవి నేలకు దిగి వచ్చి కవిముందు వాలింది. అంటే మానవుని ఉత్కృష్టతను చాటి చెపుతుంది. దేవేంద్రాదులే దాసోహం అన్న ఆ దేవి మానవుని దివ్య ప్రేమకు వశీభూతురాలు. ఆ తల్లి కరుణించిందంటే ముక్కోటి దేవతలు కరుణించినట్లే. సమస్త హృదయాంభోజ నిలయా ( లలితా అష్టొత్తర శతనామవళి 63) ఐన ఆ దేవి మన మానస సుందరి. అంతర్ముఖ జనానంద ఫలదా (లలితా అ.శ.51) ఐన ఆ జనని ధ్యానులకు సులభ సాధ్యురాలు. మనం ఎలాంటి బాహ్యపూజలు చేయకుండగనే దర్శనాన్ని ఇచ్చే భావనామాత్ర సంతుష్ట హృదయా (లలిత అ.శ. 71). ఆమె శ్రీచక్రపురవాసినై సమస్త దేవతలతో పరివేష్టింపభడి సృష్టి నిర్వహణ కార్యం చేస్తుంది. ఈ చక్రం సర్వ భువనాలతో కూడిన సృష్టి చక్రం. ఆ దేవి అంశతో వచ్చిన మనందరి హృదయ పీఠంపై ఆ శ్రీచక్రముంది. అంతేకాదు ఆ దేవి పరంజ్యోతి రూపిణి. మన శరీరంలో ఆ చైతన్యమయి మన ఆత్మ తేజస్సుగా భాసిస్తుంది. సచ్చిదానంద రూపమైన మన ఆత్మను ఆ పరాదేవతగా దర్శించుకుందాం ( స్వాత్మా న స్థలనీభూత బ్రహ్మాద్యా నంద సంతతిః... లలితా సహస్రనామం).

రోజూ మనకు ఎదురుగా కంపించే మన జీవన వెలుగులు, కనువెలుగులు, నభోమణులు, దినకర, రజనీకరులు. శ్రీ సూక్తంలో "ఆర్ద్రాం పుష్కరిణీం.. సూర్యా హిరణ్య్మయీం లక్ష్మీ.. ఆర్ద్రాం పుష్కరిణీం.. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీ.. అని చెప్పినట్లుగా మహాకాళీ మహా లక్ష్మీ, మహా సరస్వతీ దేవతామూర్తుల సమాహారంగా చెప్పబడే శ్రీమాత సూర్యునిలోని తేజస్సు, చంద్రునిలోని కళాతేజస్సు. అందుచే సూర్య, చంద్ర బింబములను శ్రీ చక్ర స్వరూపములుగా ఎంచి, ధ్యానించి తరించాలి. ఉషోదయ, చంద్రోదయ వేళల్లో పూజాధ్యానాదుల ద్వారా దైవ దర్శనన్ని, ఆత్మదర్శనాన్ని పొందాలి.

కృష్ణ శాస్త్రిగారి పల్లకిలో ఒక గొప్ప కవితాఖండిక "నాకు జరలేనిదా యౌవనమ్మునిమ్ము" పరిశీలిద్దాం.

"దూరదూరాల నీహారతుంగ శృంగ
మకుట మాణిక్యమో; ప్రభామమడలమ్మొ!
పిలుచు నన్ను పదే పదే; నిలువలేను;
నాకు జరలేనిదా యౌవనమ్ము నిమ్ము;

గండు శిలలివి చరణాలు, కనులు చీకు
చీకు చీకటిరేలు, 'ఏకాకి దారి
అంధ వైతరణీ ధార; ఆగలేను;
నాకు జరలేనిదా యౌవనమ్ము నిమ్ము:

నా పదమ్ములు రెక్కలు, నయనయుగళి
ఆరిపోవని తారలు, యాత్ర శిశిర
మధుర మధుజీవనవాహిని; మసలలేను;
నాకు జరలేనిదా యౌవనమ్ము నిమ్ము;

వెలుగుతో, ఇరులతో, మధువీచితోడ,
మరుగు విషకీల లోడ, సుమధుర మధుర
మైన బ్రతుకిది కల్పమ్ములేని వలయు;
నాకు జరలేనిదా యౌవనమ్ము నిమ్ము

కవియొక్క కవితలోని ఈ రెండు చరణాలు "దూరదూరాన నీహారతుంగ శ్రంగ - మకుట మాణిక్యమో; ప్రభామండలమ్మొ!" చూడగానే కవి ఎంత ఉన్నత పథానికి ఎగయడానికి ప్రయత్నిస్తున్నడో మనకు అవగతమవుతుంది. ఈ భావానికి సారూప్యంగా లలితా సహస్రనామ ధ్యాన శ్లోకం, శంకరాచార్యుని సౌందర్యలహరి 42వ శ్లోక భావాలు సరిపడతాయి. లలితా సహస్రనామ ధ్యాన శ్లోకం:
సింధురారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరాం
లలితా అష్టోత్తర శతనామావళి "వజ్రమాణిక్య కటక కిరీటాయై"
సౌందర్యలహరి 42 వ శ్లోకం

"గతైర్మాణిక్యత్వం గగనమణిభిస్సంద్రఘటితం
కిరీటంతే హైమ హిమగిరిసుతే కీర్తయతి యః
సనీడేయఛ్ఛాయా ఛ్ఛురణ శబలం చంద్రశకలం
ధనుః శ్శౌనాసీరం కిమితిననిబధ్నాతి ధిషణాం."

భావం: ఓ హిమగిరి సుతా! నీ మాణిక్య కిరీట కాంతుల సౌందర్యం అనుపమానమమ్మ. నీ మహిమాన్విత కిరీటమంతటా సూర్యకాంతమణులు పొదగబడి జిగేలున మెరసే ఆ కాంతులు నయనానందకరంగా ఉన్నాయమ్మా! నీకు శిరోభూషణమై స్వఛ్ఛస్ఫటికంలా భాసించే నెలవంకపై ఆ మాణిక్య కాంతులు ప్రతిఫలించి చూపరులకు ఇంద్రధనస్సుగా కంపిస్తున్నది తల్లీ! నీ భక్తులని యీ సప్తవర్ణ హరివిల్లు సమ్మోహనపరుస్తుంది.

ఇక పద్య భావానికి వద్దాం. దూర తీరాన హిమశైల కైలాస సిఖరం మీద మనిక్యపీఠంపై ఆసీనురాలైన లలితామాత దేహసూర్యకోటి సమప్రభలు కవిని తనవద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నాయి. సహర్స్ర ఉదయ సూర్య తేజస్సుతో (ఉద్యద్భాను సహస్రాభా - 6వ లలితా సహస్రనామ) వెలుగొందే ఆమె మణిద్వీపవాసిని. ఆ దివ్యురాలి సన్నిధికి వెళ్ళాలంటే కవికి పంచేంద్రియాలతో కూడిన ఈ భౌతిక శరీరంతో వెళ్ళడం సాధ్యం కాదు. అందుకే కాళ్ళుండియు చైతన్యము లేని జడుడిలా వెళ్ళలేడు. అవి కవి పాలిట కదలని గండ శిలలు. బాహ్య దృష్టితో ఆ అనంత తేజోమయిని చూడలేడు. కాబట్టి నేత్రములుండియూ అంధుడే. "ఏకాకిగా చీకటి రాత్రుల్లో వెళ్ళినట్లే. ఆమాతను సమీపించాలి అని తలంచుకున్న కవికి దుస్సహతాపాన్ని కలిగించే భయంకర సుడిగుండాలు, క్లిష్ట ఘట్టాలతో నుండే సంసార సాగర వైతరణి ఎదురైంది. ఇలాంటి విషమ పరిస్థితుల్లో కవి ఆ దేవి దయవల్లనే దర్శించగలడు. ఆమె పాదధూళీ కణాన్ని సిరసావహించడమే గత్యంతర మర్గం. ఆతేజశ్శాలిని పాదరజం అజ్ఞానుల హృదయాంతర అంధకారాన్ని పోగొట్టే ద్వాదశాదిత్యుల తేజస్స్థానం మిహిర ద్వీపనగరం. జడుల పాలిట చైతన్య పుష్ప గుఛ్ఛముల మధుర మకరందం. దరిద్రుల పాలిటి (అసంతృప్తుల పాలిటి) కోరిన కోర్కెలు యీడేర్చు చింతామణి. కర్మ ఫలంగా పరంపరాగతమైన చావుపుట్టుకలను వైతరణిలో మునిగి తల్లడిల్లుతు వుండే జీవులను వుధ్ధరించు వరాహమూర్తి కోర. సౌందర్య లహరి శ్లోకం 3:

"అవిద్యానామంతస్తిమిర మిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తబక మకరంద శృతి ఝరీ,
దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దమ్ష్ట్రామురరిపు వరాహస్య భవతి."

అలాంటి వాత్సల్య మూర్తిని కృష్ణ శాస్త్రి ఆమె పాదధూళి స్పర్శతో తనను పునీతుడిని చేసి జరలేని యవ్వనాన్ని ప్రసాదించమంటున్నాడు. కవి తలంపులోని "నాకు జరలేనిదా యౌవనమ్మునిమ్ము" ఏమిటో వచ్చే మాసం తెలుసుకుందాం.

(సశేషం)

సుమతి గారు తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి పదవీ విరమణ చేసి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి ఉన్న ఈవిడ అనేక వ్యసాలు వ్రాస్తూ సరికొత్త దృక్కోణాలను ఆవిష్కరిస్తున్నారు. భారతీయ సాహిత్యంలో పారమార్ధిక సంపద పైన విశేష రచనలు చేస్తున్నారు. కృష్ణశాస్త్రి గారి రచనలకు అభిమానిగా ఆయన రచనలోని శివాని ఆనందలహరులను మనకు పంచి ఇవ్వడం ఎంతో ముదావహం.