కదిలే కొవ్వొత్తుల కబుర్లు

-- తల్లాప్రగడ


కాలుతూ వెలుగుతూ కదలాడుతూ మాటాడుతూ
మెదులుతున్నాయి నాల్గు కొవ్వొత్తులు!
ఆ నిశీధి నిశబ్ధంలో చిరుగాలికి రెపరెపలై
ముచ్చట్లు చెప్పాయి, ఇక్కట్లనిప్పాయి!

మొదటిదనింది, నా పేరు శాంతి!
శాశ్వతం కాదు నా కాంతి,
నన్నునిలపడం ఒక భ్రాంతి,
అని వీచిన గాలికి ఆరిపోయిందా శాంతి!

రెండవదనింది, నా పేరు నమ్మకం!
కాలేను ఏ పేరిట నేను అమ్మకం,
ఈ జనుల మధ్యన నాకేది వ్యాపకం,
అని వీచిన గాలికి ఆరిపోయిందా నమ్మకం!

మూడవదనింది, నా పేరు ప్రేమ,
ఏ గాలి నన్నాపలేదు, ఇది నా సీమ,
కానీ, అపార్థమగు నా బతుకు వృధా! రామ రామ!
అని వీచిన గాలికి ఆరిపోయిందా ప్రేమ!

అప్పుడే ఆ గదిలోకి ఓ బాలుడు వచ్చాడు!
ఆరిన ఆ మూడు దీపాలను చూచాడు!
కరగకుండానే కొండెక్కాయని వగచాడు!
ఏడుస్తూ అవి వెలుగుతూనే ఉండాలని తలచాడు!

అప్పుడు నాలుగవదంది, ఏడ్పాపి వినునా బాస!
ఆ మూడింటినీ వెలిగించగలదు నా స్వాస,
జగమంత వెలుగేను, నా మీద నిలుపిన నీ ధ్యాస,
మరింక మరవకెపుడు, నా పేరు ఆశ!

ఆశన మెరసిన అరమోడుపు కన్నుల
మిగిలిన మూడింటిని వెలిగించి, మిన్నుల
చూసి ఆ బాలుడు అనుకున్నాడు, తన కోరికలన్నీ తీరాలనీ
ఈ ఆశాజ్యోతిని, ఎప్పటికీ ఇలాగే కాపాడుకోవాలని!