జయంతి

-- కొమరవోలు సరోజ (టోరంటో, కెనడా.)


కెనడాలో అదొక చిన్న ఊరు. అయితేనేం ఆ చుట్టు ప్రక్కల తెలుగుకు వెలుగు నిచ్చే దివ్యమైన ఆరోగ్యదీపాలు చాలానే వున్నాయి. అందుకే వారికి విటమిన్-యం గురించి వర్రీ ఆల్ మోస్ట్ జీరో అని చెప్పవచ్చు.

సుమారు రెండు ఎకరాల బ్యాక్ యార్డ్ కి చుట్టూ అందమైన నల్లని స్టీలు ఫెన్స్, ఆ ఫెన్స్ కి అల్లుకొని చక్కని ద్రాక్ష తీగెలు.

ఆకులో ఆకునై పూవులో పూవునై... అన్న కృషశాస్త్రి గారి గేయంలా ద్రాక్ష గుత్తులన్నీ ఆకుల రంగులో కల్సిపోయి, గుత్తుల సంఖ్య ఎట్లా వుందంటే ఆంధ్రదేశంలో జనాభాకు గంపల నిండా నింపి పంపినా ఇంకా మిగిలేటట్లే వున్నాయి. అందుకే మరి ఆ గృహిణి ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టడమే కాక ద్రాక్షకాయల "ఆవకాయ" అద్భుతంగా పెట్టింది భారీ ఎత్తున.

ఇల్లు అధునాతనం, భావాలూ, అవగాహన,అన్యోన్యం అంతకంటే నవీనం. ఇల్లు చూసి, ఇల్లాలిని చూడాలి అనే సామెతతో ఒకదానితో మరొకటి పోటీ పడుతుంటాయి ఆ ఇల్లు-ఇల్లాలూను. ఆరోజు వాతావరణం బాగా వేడిగా వుంది. 36 డిగ్రీలు ఉంది. అయినప్పటికీ నందనవనంలో చల్లగా ఆహ్లాదంగా వుంది.

ఆ ఇల్లు డాక్టర్ నందనం హేమంతకుమార్,సహస్రలది.

ఆరోజు కృష్ణాష్టమి. సుమారు యాభైమంది పిల్లలు పాతిక మంది పెద్దవాళ్ళు వెళ్ళారు. ఆడవాళ్ళు గజీబో క్రింద కూర్చుని.. చల్లని పానీయాలు త్రాగుతూ, క్రొత్త రకాల నగలూ, చీరెలు ఏ స్టోర్లలో వచ్చాయో! ఏ ఫర్నిచరు ఎక్కడ రీజనబుల్ గా వుందో! ఏ రకం కేకులు ఎక్కడ ఎక్కువ రుచిగా వుంటాయో ముచ్చటించుకుంటున్నారు.

గొడుగుల క్రింద రెండు గ్రూపులుగా కూర్చుని కాఫీ సేవిస్తున్న మగవాళ్ళు మాల్ ప్రాక్టిస్ గురించీ, వారి వారి హాస్పిటల్సు గురించి పిచ్చా పాటి మాట్లాడుకుంటూ, మధ్య మధ్యలో లేచి అటు ఇటు తిరుగుతూ "పెసర గారెలు" తింటున్నారు. పిల్లలందరూ పదేళ్ళ లోపు వారే కనుక పిక్నిక్ టేబుల్స్ దగ్గర కూర్చుని పిజ్జా తిని, కోక్ త్రాగుతూ, హాయి! హాయి! అంటూ వాళ్ళ లోకంలో వాళ్ళు పడి కోట్టుకుంటూనే......మధ్య మధ్య లో మసాలా! గరం మసాలా!

" నిక్కీ నీకు మీ తాతా, అమ్మమ్మ ఇష్టమా? " అడిగాడొక నాలుగేళ్ళ వాడు

" తాత........వో.కె.. ! అమ్మమ్మ నో "

" వై ???? ...... "

" ఎప్పుడూ నన్ను గట్టిగా ముద్దు పెట్టుకుంటుంది నా కిష్టం లేదు మరి ."

" నువ్వు డాక్టరవుతావా ? " శృతి అడిగింది...

" అవును మరి నువ్వు ? " నిక్కీ అడిగాడు. "నేను మా నాన్నలాగా కళ్ళ డాక్టరవుతా "

" ఏం ! ఎందుకు? నీకు మీ అమ్మమ్మ అంటే బోల్డు ఇష్టం కదా ! వై డోంట్ యూ స్టే అట్ హోం అండ్ కుక్ లైక్ యువర్ అమ్మమ్మ"

"నేనెందుకు కుక్ చేయాలీ ! పెద్దయ్యాక పెళ్ళి చేసుకుంటే వాడే కదా కుక్ చేయాలి. లేకపోతే 'ఐ పే మనీ టు మై అమ్మమ్మ, దెన్ షి కేన్ కుక్ "

"ఓల్డ్ పీపుల్, నర్సింగ్ హోం లో వుండాలి" అనుభవజ్ఞుడిలా సీరియస్ గా చెప్పాడు నిక్కీ

" యస్ ! " చెప్పాడింకో పిల్ల వాడు.

" యూ గైస్ ఆర్ రైట్, మా తాతా అమ్మమ్మ వచ్చినప్పుడు రెండు నెలలు బాగానే వుంది. సరదాగా తరువాత భలే బోర్ కొట్టేనింది. ప్రతి విషయం పదిసార్లు చెబుతారు, వందసార్లడుగుతారు." పేద్ద హీరోలా చెప్పాడు ఎనిమిదేళ్ళ వందన్ చేతులు తిప్పుకుంటూ .

" ముసలి వాళ్ళయ్యాక వీళ్ళందరు ఏమైపోతారు ? " కళ్ళు చిత్రంగా తిప్పుతూ అడిగింది ఆరేళ్ళ ఆణి

" మై మాం సెడ్ దే గో టు గాడ్స్ ప్లేస్ ! "

" యా! మా అమ్మ కూడా చెప్పింది దాన్ని హెవెన్ అంటారట. " ఇంకో పిల్ల చెప్పింది.

" హెవెన్ లొ వీళ్ళ నెవరు చూసుకుంటారు ?" ఇంకో పిల్లవాడి ప్రశ్న.

" ఎవరూ చూసుకోరేమో పాపం ! అందుకే మనందరం పేద్ద పేద్ద డాక్టర్లమై, మన పేరేంట్స్ ఎప్పుడూ ఓల్డ్ కాకుండా, హెవెన్ కి వెళ్ళకుండా చూసుకుందాం!

" ఒకె....ఒకె అవును, అవును ....."

యస్, యస్".... అందరు చేతులు కలుపుకున్నారు.............

హై ఫై, లో ఫై, సైడ్ ఫై లిచ్చుకున్న తరువాత పిల్లలందరూ ఒక నిర్ణ్ణయానికి వచ్చినట్టు............

ఒక్కొక్కళ్ళే........ పిక్నిక్ టేబుల్ మిఆద నుంచోని

" నేను కళ్ళ డాక్టరౌతాను "

" నేను డెం టిస్ట్ "

" నేను కాళ్ళ నొప్పికి "

" నేను హార్ట్ "

" నేను సర్జన్ " అంటు వాళ్ళ చిన్నారి బుర్రల్లోకి వచ్చిన రకరకాల ఆలోచనలు అన్నీ వ్యక్తం చేశారు.

ఇంకా కొంత మంది పిల్లలు లేచి నిలబడి లాయరు కావాలిగా! "

"టిచరు కావాలిగా ! ఇంజనీరు కావాలిగా ! "

మరి ఫార్మసీ కూడా కావాలిగా ! "

"బ్లడ్ టెస్ట్ కి లాబ్ కూడా కావాలిగా! మరి మనం అందరం ఇంచక్కా అన్నీ చేసేద్దాం, హేపీగా చెప్పారు. ఆ పసివాళ్ళ పసిడి హౄదయాల్లో ఒకే ఆలోచన, తమ అమ్మా నాన్నలు ఎప్పటికీ ముసలి వాళ్ళు కాకుండా వుండాలనీ! చనిపోకుండా వుండాలనీ! అందుకుగాను తామందరూ కలసి కట్టుగా పని చేయాలని.

బాలకృష్ణులందరూ రండిరా లోపలికి. సహస్ర పిలవగానే కృష్ణుడి వేషాల్లోవున్న పిల్లలందరూ ఒక్కొక్కళ్ళే పిల్లనగ్రోవిని ఊదుతూ వాళ్ళ రెడీమేడ్ ధోవతులను, తలలోని నెమలి ఫించాలనీ సవరించు కుంటూ,మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ బాలకృష్ణుడి పాదాల గుర్తువున్న ముగ్గును తన్మయంగా చూస్తూ...... సహస్ర వెనుక విశాలమైన పేద్ద బేస్ మెంట్లోకి వెళ్ళరు. అక్కడ నాలుగు పలకల ఆకారంలో అందంగా అమర్చిన ఉయ్యాల తొట్టె.... ముత్యాలూ, పగడాలతో అలంకరించిన నాలుగు గొలుసులూ, బంగారు గులాబీ పూలతో చక్కదనాన్ని ద్విగుణీకృతం చేస్తున్న ఉయ్యాల!

ఆ ఊయ్యాలలో ముద్దులు మూటకడుతూ బోసి నవ్వుల శిశువు, బాలకృష్ణుడు అరమోడ్పు కన్నులతో పడుకుని వున్నాడు.

"జో అచ్యుతానంద జోజో ముకుందా" అంటూ అచ్చు గోపికలా తయారైన ఒక అమ్మాయి మధ్య మధ్యలో తన మేలి ముసుగు సవరించుకుంటూ ఉయ్యాల ఊపుతూ జోల పాట పాడుతోంది. తరువాత పిల్లలందరూ ఒక్కొక్కరే వచ్చి.... నవ్వుతూ ఉయ్యాల ఊపి పసివాడి తల మీద గులాబీరేకులు చల్లారు. పెద్ద వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత మరొకరు తమకు వచ్చిన లాలి పాటలు పాడారు. సహస్ర "రామలాలీ మేఘశ్యామలాలీ" అంటూ పాట పాడింది.

''లాలీ! లాలీ! వట పత్రసాయి! అంటూ ముద్దు ముద్దుగా పాడింది సహస్ర మూడేళ్ళ కూతురు మైనా.

అప్పాలూ, బూరెలు, వెన్న ఉండలూ, పాలకాయలు, మామిడి పండ్లూ, పనసతొనలూ, నైవేద్యం పెట్టారు. తరువాత పిల్లలందరినీ ఒక పంక్తిగా చాప మిద కూర్చోబెట్టి అరటి ఆకులలో ప్రసాదం పెట్టింది సహస్ర. తరువాత పెద్దవాళ్ళ భోజనాలూ అవీ....

యధావిధిగా జరిగాయి.

తాంబూల చర్వణంకుడా అయింది. " మాకు కావాలి కిళ్ళీ" అని అడిగారు కొందరు పిల్లలు...

"ఈ రోజు కృష్ణుడి పుట్టిన రోజు కాబట్టి మీరు వేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పుడూ అడక్కూడదు". అని చెప్పారు తల్లులు.

" సరే మళ్ళీ బుజ్జి కృష్ణుడి బర్త్ డేకి అడుగుతాం". అని చిరునవ్వు నవ్వారు పిల్లలు.

ఆ నవ్వు స్వచ్ఛంగా పాలమీగడలాగా మల్లెపూవు లాగా వుంది.

అప్పటిదాకా విసుగులేకుండా గోపిక జోల పాటలు పాడుతూనే వుంది. ఆమె చిన్ని కృష్ణుడికి వరుసకు మేనత్త అయిన "రాధమ్మ" రూపురేఖలతో వుంది. "థ్యాంక్‌యు సహస్ర! ఇంజనీర్ అంటే నీమాదిరి వుండాలి."

"అవును మరి ఈ గోపిక మన సహస్ర రూపొదించిన సౌందర్యరాశి రాధకద!".

"సహస్ర సృష్టి మహత్యం"

"అద్భుత రూపకల్పన ఈ రోబోట్"

అసలు నీకీ ఆలోచన వచ్చినందుకే అభినందించాలి. అందరి అభినందనలకూ నిగర్వి అయిన సహస్ర చిరునవ్వే సమాధానం.

ఆమె చూపులన్నీ ఊయలలోని పాపాయి మీదే లగ్నం అయివున్నాయి.