కవిత్వంలో వ్యకిత్వ వికాసం - 7

శ్రీకాళహస్తీశ్వర శతకం - వ్యక్తిత్వ వికాసం

-- ద్వా. నా. శాస్త్రి

శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో గల ధూర్జటి భక్తకవి.రాజనింద చేసినవాడు.తన గుండె విప్పుకొని అంతరంగ కథనాన్ని ప్రకటించినవాడు.అసలు ఏ శతకమైనా సమాజ వికాసం కోసం, వ్యక్తిత్వ వికాసం కోసమే రచింపబడుతుంది.కావ్యంలో కంటె శతకంలో కవికి స్వేచ్చ వుంటుంది. ఆత్మావిష్కరణకి అవకాశం వుంటుంది. సామాన్యంగా భక్తి,భక్తి రచన అంటే చాందస భావాలతో కూడుకొన్నదనీ, మూఢ నమ్మకాలు గలదనీ - సమాజ చైతన్యానికీ, వ్యక్తి వికాసానికీ సంబధంచినదై ఉండదనీ భావిస్తారు. అందుకే శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని పరిశీలించాలి.ఇది భక్తి శతకమైనా వ్యక్తిత్వ వికాసానికీ, సామాజిక అభ్యుదయానికీ తొడ్పడే శతకమని తెలుసుకొంటాం.

"అంతా మిథ్యతలంచి చూచిన నరుండట్లౌరింగిన్ సదా
కాంతల్పుత్రులు నర్థముల్ తనువు నిక్కబంచు మోహార్ణవ
భ్రాంతింజెందిచరించు గాని, పరమార్థంబైన నీయుడుదా
చింతాకంతయు చింతనిల్పడు కదా శ్రీకాళహస్తీశ్వరా!

- ఈ జీవితం, ఈ లోకం అంతా మిథ్య, మాయ అని తెలిసికూడా మానవుడు ఎల్లప్పుడూ భార్య, పుత్రులు, ధనం, శరీరం - ఇవన్నీ శాస్వతం అనుకొని మోహ సముద్రంలో కొట్టుమిట్టాడుతూ వుంటాడు.అంతే కాని - పరమార్థ మైన శివుడిపై (దేవునిపై) చింతాకు అంత మనసు కూడా నిలపడు కదా - అని పద్య భావం.

ఈ పద్యం ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో బోధిస్తుంది. పూర్వీకులు ద్ఖాలకీ, సమస్యలకి మూడు కోరికలే కారణమనీ చెప్పారు.

దారీషణ - భార్య కావాలన్న కోరిక
పుత్రీషణ - కుమారుడు (సంతానం) కావాలన్న కోరిక
ధనేషణ - ధనం కావాలన్న కోరిక

అంటే అర్ధం పెళ్ళి చేసుకోకూడదని, పుత్రులు వద్దనీ, డబ్బు వద్దనీ అర్థం చేసుకొంటే పప్పులో కాలేసినట్టే. ధూర్జటి చెప్పిందే అర్థం చేసుకోవాలి -

బార్య
పుత్రులు
ధనం
శరీరపోషణ అవసరమే కాని వ్యామోహం, మోజు, అతి పనికిరాదు.

భార్య, పుత్రులు, డబ్బు,శరీరం మాత్రమే లోకం కాదు, జీవితం కాదు.

"మా ఆవిడ లేనిదే ఏ పనీ చేసుకోలేను"
"మా ఆవిడ లేనిదే ఒంటరిగా ఉండలేను"
"కొడుకుని చూడకుండా ఉండలేను"
"కొడుకు నా దగ్గరే ఉండాలి"
"ఈ డబ్బు చాలదు - ఇంకా సంపాదించాలి"
"శరీరం నల్లబడి పోయింది, అయ్యో"
ఈ మచ్చలేమిటి బాబోయ్!
బ్యూటీ పార్లర్‌కి వెళ్ళాలి"

- వీటిని ధూర్జటి ఖండించాడు. ఇవాళ మనం ఈ వ్యామోహంలనుంచి బయటపడుతున్నాం కానీ పూర్తిగా కాదు.కొడుకులు దూరంగా వెళ్తే, విదేశాలకు వెళ్తే ఉండలేక - వాళ్ళ ఆశల్ని, ఎదుగుదలని అడ్డుకొన్న తల్లితండ్రులు చాలామంది వ్న్నారు.డబ్బు కావాలి కానీ - అత్యాశ - "టూమచ్ గా, త్రీమచ్ గా" సంపాదించటం కూడా వ్యసనమే! ఈ మోహంలో, వ్యామోహంలో కొట్టుకు పోవటం సరికాదు.దాని వల్ల జీవితం ద్ఖమయం అవుతుంది. ప్రేమ, అనురాగాలు ఉండాలి - మితిమీరిన బంధం (ఒవెర్ అటాచ్‌మెంట్) కూడదనీ - వాటికంటే జీవితంలో చేయవలసింది, సాధించవలసింది చాలా వున్నాయనీ ధూర్జటి ఆనాడే చెప్పాడు.ఇది వాస్తవం. లేకపోతే వివేకానందుడు, గాంధీ, బుద్ధుడు, ఐన్‌స్టీన్, మదర్ థెరిస్సా వంటివారు ఉండేవారా??

భక్తికి ఆడంబరాలు ప్రధానం కావు.వేదాలు చదివితేనే, శాస్త్రపఠనం చేస్తేనే, మంత్రతంత్రాలు తెలిస్తేనే పురాణాలు చదివితేనే ముక్తి లభిస్తుందనీ, దైవానుగ్రహం లభిస్తుందనీ చెప్తారు. కానీ ధూర్జటి వీటిని నిరసించాడు. భక్తికి అవే తార్కాణాలు కాదన్నాడు -

"ఏ వేదంబు పఠించె లూత? భుజంగంబేశాస్త్రంల్సూచె? దా
నే విద్యాభ్యాసనం బొనర్చి కరి? చెంచే మంత్రమూహించె? బో
ధా విర్భావని దానముల్ చదువులయ్యా, కావు? మీ పాదసం
సేవాసక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా??


- సాలెపురుగు ఏ వేదం చదివింది?
- పాము ఏ శాస్త్రాల్ని అధ్యయనం చేసింది?
- ఏనుగు ఏ విద్య నేర్చింది?
- తిన్నడు ఏ మంత్రాలు నేర్చుకున్నాడు?

- అయినా వీరందరికీ మోక్షం లభించింది కదా! దైవానుగ్రహం పొందారు గదా! కాబట్టి మోక్ష ప్రాప్తికి పాదార్చనే ముఖ్యం తప్ప - అవన్నీ కావు - అని బల్లగుద్ది మరీ చెప్పాడు ధూర్జటి.భక్తులందరూ గమనించాల్సిన అంశం ఇది. దీనినే వేమన "చిత్తశుద్ధి" అన్నాడు.

"కొడుకుల్ పుట్టరటంచు నేడు రవివేకుల్ జీవనభ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రునకనేకుల్, వారి చేనేగతుల్
పడసేన్? పుత్రులు లేని యా శుకునకున్ వాటిల్లినే దుర్గతుల్?
చేడునే మోక్ష పదంబ పుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వరా!!!

ఈ పద్యం మానవవ్యక్తిత్వవికాసానికి ఎవరూ చెప్పని గుణపాఠం! ధూర్జటికి ఎంత సాహసం? మన సంప్రదాయానికి నిరసనగా గళమెత్తిన అతని ఆలోచనకి నమస్కరించాలి - స్వాగతించాలి. కొడుకు పుడితే "ప్లస్" గా కూతురు పుడితే "మైనస్" గా భావించే సంస్కృతి మనది! ఆడది గుండెల మీద కుంపటిగా చెప్పుకొనే ఆచారం మనది!కొడుకు కొరివి పెట్టాలనీ, కొడుకు వల్లనె పున్నామ నరకాన్ని దాటగలమనీ, కొడుకు వంశోద్ధారకుడనీ, కొడుకు లేకపోతే మోక్షం లభించదనీ....ఏవేవో చెప్తారు.కొడుకైనా కూతురైనా ఒకటే అనే ఆధునిక భావన ఇటీవల వ్యాప్తి చెందుతున్నా - ఇంకా కొడుకుల కోసం ఎదురు చూసే వారూ, కొడుకులకోసం నలుగురు అమ్మాయిలను కన్నవారూ ఉన్నారు. ఈ భావాన్ని ధూర్జటి 16వ శతాబ్దంలోనే వ్యతిరేకించటం గొప్ప కదూ?

కొడుకులు పుట్టలేదని ఏడ్చేవాళ్ళని "అవివేకులు" అని మరీ చెప్పాడు.ధృతరాష్ట్రునికి వందమంది కొడుకులు పుట్టినా - అధోగతే సంభవించింది. పైగా వంశనాశనమూ అయింది.పుత్రులు లేని శుకమహర్షికి మోక్షం లభించింది తప్ప దుర్గతి పొందలేదు కదా? కాబట్టి పుత్రులులేని వాళ్ళకి మోక్షం రాదనటం సరికాదు - అని నిష్కర్షగా చెప్పిన ధూర్జటిని అభినందిస్తూ - మనం కూడా కుమారుడే కావాలన్న మొడితనం వీడి, కూతురైనా కొడుకైనా ఒకటే - అనే భావాన్ని పెంపొందించు కోవాలి! ఇదీ అభ్యుదయ భావం అంటే?? భక్తకవులూ అభ్యుదయం కోరతారు అన్నదానికి ఈ పద్యం ఒక మచ్చు తునక!

కలలంచున్మకునంబులంచు గ్రహయోగంబంచు సాముద్రికం
బులటంచుందెవులంచు, దిష్టియనుచునూతంబులంచు న్విషా
దులటంచున్నియషార్థ జీవనములందుంబ్రీతి పుట్టించినా
నిలుగుల్ ప్రాణుల కెన్ని చేసితివయా శ్రీకాళహస్తీశ్వరా!!

- ధూర్జటి కంటే అభ్యుదయవాది ఆనాడు మరొకడు లేడనిపిస్తుంది.మానవుడు మూఢనమ్మకాలకి వశం కాకూడదని హితవు చెప్పాడు.కలలు, శకునాలు, గ్రహచారం, సాముద్రిక శాస్త్రం, తెగులు - దిష్టి అంటూ మనిషి ఎన్ని వలయాలలో చిక్కుకొంటున్నాడో? మనం మన జీవితాన్ని చేతులారా ద్ఖమయం చేసుకొంటున్నాం. శకునాలు, మూఢనమ్మకాలు, గ్రహాలు - దోషాలు ఇవీ శాస్త్రసమ్మతాలూ, హేతుబద్దాలూ కాదు. సాముద్రికం - పామిస్ట్రీ - ద్వారా చాలామంది జీవితాలు దుఖమయం కావటం నా అనుభవమే! "దిష్టి" అనేది కూడా మూఢవిశ్వాసమే! ఇవాళ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు కూడా "దిష్టి తగులుతుంది" అంటం అసమంజసం! 16వ శతాబ్దం నాటి ధూర్జటికివున్న దృక్పదం మనకి లేక పోవటాన్ని ఏమనాలి??

ధూర్జటి చాలా కోపిష్ఠి.నిజాయితీ గలవాడు కాబట్టి కొన్ని అవాంచనీయాలపై కన్నెర్ర జేశాడు - "చదువుల్నేర్చిన పండితాధములు స్వేచ్చాభాషణ క్రీడలన్ వదరన్ ....." ఆన్నాడు. చదువుకొన్నవారే ఇష్టం వచ్చినట్టు "వాగుతారు" అన్నాడు. "తెలివైన నీచులు"అని పండితుల్ని అన్నారు. చెప్పేదొకటి - చేసేదొకటి!! అటువంటి వ్యక్తిత్వం పనికిరాదన్నాడు ధూర్జటి. పండితుడై వుంటే గొప్ప కాదు - తను పలికిన మాటకి - విలువ, పరువు వుండలన్నాడు. ఇదీ మనం నేర్చుకోవాల్సింది!

"ఒకపూటించుక కూడతక్కువగనే నోర్వంగలేదెండకో
పకనీడన్వెదకుం చలింజడిసి కుంపట్లెత్తు కోజూచు, వా
నకు ఇండ్ర్లిడ్లును దూరు, నీ తనువు దీనన్వచ్చు సౌక్యంబురో
సికడాసింపరుగాక, మర్త్యులకటా, శ్రీకాళహస్తీశ్వరా!!

- మనుష్యులు ఒకపూట అన్నం తక్కువైతే చాలు సహింపలేరు - నిజమే కదా! ఒకసారి మనకి ఎక్కువ తినాలనిపిస్తుంది.అన్నం వుండదు.అప్పుడు చూడాలి మన ప్రతాపం! "ఎంత వండాలో తెలీదా? నేను అర్ధాకలితో వుండాలా? అంటూ తెగ వేధిస్తాం. పోనీలే, ఓ పూట తక్కువైతే ఏమైంది? - అని సర్దుకుపోలేం గదా?

ఎండ ఎక్కువైతే - నీడ కోసం వెదుకుతాం
చలి రాగానే - కుంపట్లు పెట్టుకుంటాం
(పూర్వం మంచంకింద బొగ్గుల కుంపటిని పెట్టుకునేవారు - వెచ్చదనం కోసం)
వాన వస్తే - ఇంటింత్టికి దూరుతాం

ఈ శరీరాన్ని అంత "ఇది" గా చూసుకొంటమేమిటి? ఈ జన్మ సార్ధక్యాన్ని ఆలోచించకుండా శరీరం మీదనే దృష్టి పెడటరేమిటి? - ఇదీ ధూర్జటి ప్రశ్న

నిజమే. మానవుడు మేధావి.బుర్రగవాడు. దేనినైనా సాధించగలడు. అటువంటివాడు ఎందుకిలా అవుతున్నాడు? ఎండాకాలం వస్తే అమూఎ వేడి అంటాడు.వానాకాలంలో తడిసిపోతాం బాబోయ్ అంటాడు. చలికాలంలో - తట్టుకోలేక వేడి కావాలని తహతహ లాడతాడు.

మరి మనిషికి ఏ కావాలి? ఏది సుఖమంటాడు? - ప్రకృతికి అనుగుణంగా మనం మారాలి. ప్రకృతి స్వభావాన్ని మనం అనుకూలంచేసుకోవాలి. ఈ శరీర పోషణ, శరీర సుఖం, శరీర సౌందర్యం కంటె మిన్నయిన పోషణ, శరీర సుఖం, శరీర సౌందర్యం కంటె మిన్న అయిన లక్ష్యాలు ఎన్నో వున్నాయి. వాటి పట్ల మనం శ్రద్ధ చూపాలి. ధూర్జటి రాసిన "శ్రీ కాళహస్తీశ్వర శతకం" - ఈ విధంగా మనం మన జీవితాన్ని ఎలా బాగు చేసుకోవాలి? వేటికి ప్రాధాన్యం ఇవ్వాలి? వేటికి ప్రాధాన్యం ఇవ్వకూడదు? ఎందువల్ల? వంటి వాటికి సమాధానం చెప్పే వ్యక్తిత్వ వికాస శాస్త్ర గ్రంధం - అనడం సమంజసం!!!