చాలా కాలం తరవాత పాత మిత్రుడ్ని కలుసుకున్న ఒక సాయంకాలం.

తలుపుతీసి ఆనందంగా, 

కం// "ఎన్నాళ్ళయ్యెను చూడక;
ఇన్నాళ్ళకు కలసినావు, ఏమయ్యావోయ్?
చిన్నప్పుడు కలవడమే,
ఎన్నోమారులు తలచితి, ఈవిడ నడుగోయ్!!" 

అంటూ పరామర్శలయిన తరువాత, 

కం// వేళాకోళము లాడుతు,
ఖాళీ బుర్రను తడుముతు, కబురులు చెబుతూ,
భోళా నవ్వులు నవ్వుతు,
గోళీలాడిన దినములె గొప్పవి అనుచున్.

కం// బొండాం శ్రీనుని తలచిరి,
గుండే ఎల్లప్పుడుండు గుర్నాధాన్నీ,
కండలు తిరిగిన బాలిక
ఆండాళును కూడ తలచి రానందంగా.

కం// ఆడిన సినిమా లన్నియు
చూడ చదువొదలి సెకెండు షోలకు వెళుతూ
తోడగు దొంగల మాదిరి
గోడలు దూకిన దినములు గుర్తుకు తెస్తూ

కం// “ఫైటంటే కాంతారావ్,
పాటంటే ఘంటసాల, బాగా ఫేమస్
షాటంటే ఎన్.టీ.ఆర్,
ఆటంటే జ్యోతిలక్ష్మి, ఆరోజుల్లో”

 అంటూ పాత రోజులను తలచు కున్నారు.

కం// ఇల్లాలిచ్చిన ప్లేటున
పల్లీలను నోటవేసి పటపట తినుచున్,
మెల్లగ సాయంత్రంబున
సిల్లీగా జోకులేస్తు, చీకటిదాకా… 

మిత్రుడితో గడపి, ఆపై

కం// "మళ్ళీ కలవాలయ్యా.
ఊళ్ళోనే ఉండి కూడ ఊసుల కోసం,
వాళ్ళూవీళ్ళెందుకు.  మన
పెళ్ళాలిరువురును మంచి ఫ్రెండ్సయ్యారోయ్"

 అంటూ సాగనంపాడు..

(పైన ఉన్న "ఫైటంటే" పద్యం సర్వ-గురు కందం. కందం నియమాల ప్రకారం 6, 14 గణాలలో తప్ప మిగిలినవన్నీ గురువులే. దీనిని కుఱచ కందం అని కూడా అంటారు)

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలోతెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము.    మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది. (Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 

Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
 
సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.
     
Site Design: Krishna, Hyd, Agnatech