|
మసక మసక చీకట్లను పారద్రోలుతూ
తెల తెల వారు తుండగా
చల్లని వెన్నెల మత్తులో నిద్రమ్మ ఒడిలో
అదమరిచి నిద్రోతున్న మానవాళి
తీయని కలల స్మృతులు నుంచి జారుతూ
మేల్కోలపు రాగాల కు స్పందిస్తుండగా
పచ్చని పట్టు చీరలతో సింగారించుకొని
పర్వతాలు ముస్తాబు అవుతుండగా
గత రాత్రి హిమస్నానం చేసిన పకృతమ్మ
ఆరబెట్టుకొన్న
కురులునుంచి జారిన నీటి ముత్యాలు
ఆ పర్వతాలు కట్టుకొన్న చీరల మీద పడి
జరీ అద్దినట్లు మిళా మిళా మెరుస్తుండగా
గగన వీథులలో రాత్రంతా
చందమామ తో విహరించి
కనీ కననట్లు ముసి ముసి నవ్వులు ఆరబోసిన తారల సముదాయాలు
అలసి వస్తునమ్మా అంటూ సమాయాత్తమవుతుండగా
పొగమంచు పుడమి తల్లిని
తన తెల్లని పైట తో కప్పి దోబూచులాడుతూ
దారి కానక తికమక పడుతున్న బాటసారులను
చల్లని పైట గాలితో కవ్విస్త్తుండగా
కాషాయపు రంగు వస్త్రధారుడైన ప్రభాకరుడు
అంతు చిక్కని,
అమితమైన
తేజస్సు తో వస్తుండగా
రవి
రాక తో
పరవశవం తో నిండిన ఆ నింగి
సిగ్గు మొగ్గలు
ముద్ద బంతులై
ఎరుపు ఎక్కెన మేను తో
స్వాగత వచనాలు పలుకు తుండగా
ఆ ముచ్చట చూసి ఉప్పొంగిన సముద్రుడు
ఆనందపు అలలతో తీరంతో మరింతగా ముద్దులాడుతుండగా
ఉదయభానుడి
కిరణాలు పుడమి ని తాకుతూ
ఆ కిరణాలకి జీవన స్రవంతి చరణాలు
కనరాని గమ్యం వైపు పరుగెత్తెలా
ఉదయించే ప్రతి కిరణం మానవ ప్రగతి కి బీజాలు
సృష్టి ప్రతిసృష్టి అంటూ మానవ మనుగడను
గుర్తు చేసే ఈ ప్రకృతి వలయాల మధ్య
పైకి వచ్చె ప్రతి ఉదయం మానవాళికి శుభోదయం
ఆందుకే అర్పిస్తున్నాను నా తొలి సంధ్యావందనం..........
|