Sujanaranjani
           
  కబుర్లు  
  యాత్రానుభవాలు
         వంద వత్సరాల నగరం సన్నివేల్ [Centennial City of Sunnyvale]  
 

- రచన :రాపోలు సుదర్శన్

 
 

గెలాక్సీలమయమైన విశ్వంలోని పాలపుంతలో ఉన్నసౌర కుటుంబంలోని భూగ్రహంలోనున్న ఏడు  ఖండాలలోని ఉత్తర అమెరికాలో వున్న అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశ మందలి కాలిఫోర్నియా రాష్ట్ర  స్యాంటాక్లారా కౌంటి నందలి పట్టణాల్లో ఒకటి సన్నివేల్ నగరం. ప్రస్తుతం నగరం వంద సంవత్సరాలు 24 -12-2012  నాటికి పూర్తి చేసుకుంటున్నది. సుసందర్భంగా నగర వికాసం, విస్తృతి, విశేషం వివరంగా  వివరించడం, చివరగా సన్నివేల్ నగర వంద సంవత్సరాల వేడుకలను తెలపడం వ్యాసపరిధి.

 

"ఇదేనండి ఇదేనండి మన భాగ్య నగరం, మూడు కోట్ల ఆంధ్రులకు ముఖ్యపట్టణం..." అని చెప్పుకునే మన హైదరాబాద్ పట్టణం ఏర్పడి 400 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా "చార్ సౌ సాల్ షహేర్ హమారా" గా హైదరాబాద్ పురాతనత్వాన్ని గర్వంగా మహోత్సవాలని జరుపుకున్నాం. అదేవిధంగా అమెరికా దేశంలోని మహారాష్ట్రాలలో ఒకటైన కాలిఫోర్నియాలోని వేగంగా అభివృద్ధి చెందుతోన్న ప్రముఖ నగరాలలో ఒకటైన, సిలికాన్ వ్యాలీకి గుండెకాయ [Heart of the Silicon valley] గా పేరుగాంచిన నగరం 'సన్నివేల్'.

 

ప్రస్తుతం తూర్పున స్యాంటక్లార, పడమరన మౌంటైన్ వ్యూ, ఉత్తరాన స్యానౌజ్, దక్షిణాన కోపెర్టినోల మధ్యనున్న ప్రాంతమే సన్నివేల్ నగరం. దీని విస్తీర్ణం 58.765 స్క్వైర్ కిలోమీటర్లు (22 .689 sq. mile). దీనిలో 2010 అమెరికా జనాభా లెక్కల ననుసరించి 1,40,095 మంది ప్రజలు నివసిస్తున్నారు. ప్రాంత వాతావరణాన్ని గమనిస్తే మధ్యస్థ వాతావరణం (Mediterranean Climate) కలిగి వుంటుంది. ఎండా, వానా, చలి ఏదీ అధికంగా ఉండక అన్నీ సమంగా వుండే ప్రశాంత వాతావరణ ప్రాంతమిది.

 

ఒక దేశానికి ఒక జెండా, ముద్రాచిహ్న, పక్షి, జంతువు వున్నట్టుగానే అమెరికాకు వున్నై. ఇలాగే అమెరికాలోని ప్రతీ రాష్ట్రానికీ ఇవి వున్నై.  అంతేకాదు నగరాలకూ ప్రత్యకమైన చిహ్నమూ వున్నది. ఇలాగే సన్నివేల్ కు సంబంధించింది క్రింది చిహ్నాన్ని వాడతారు.  

                                                                                           

చరిత్ర:

సన్నివేల్ ప్రాంతంలో చరిత్ర  అందినప్పటి నుంచి కోస్టానోన్ (Costanoan) అని పిలవబడే ఒహలోన్ (Ohlone) అనబడే జాతీయులు జీవిస్తున్నారు. వీరు వుటైన్ భాషా కుటుంబానికి  చెందిన ఉపకుటుంబ భాషలో మాట్లాడతారు. వీరు వేటాడడం, చేపల్ని పట్టడం వంటి ఒక ప్రత్యేకమైన జీవన విధాన సంస్కృతి కలిగిన వారు. 18 శతాబ్దంలో ఉత్తర భాగంలో స్పెయిన్ దేశం నుండి కొందరు పరిశోధకులు, మత సంస్థలు (Messionaries) పంపబడ్డ వ్యక్తులు సన్నివేల్ ప్రాంతానికి వచ్చారు. ఇందువల్ల ఇక్కడి ప్రాంతీయులు చాలా మంది మారుమూల (interior) ప్రాంతాలకు తరలిపోయారు. కొందరు క్రిస్టియన్ (christian) మతస్తులుగా మారారు.

 

9,066 ఎకరాల స్థలాన్ని స్యాంటాక్లారా  కౌంటి గవర్నరైన హున్ అల్ వారాడో  1842 లో ఫ్రాన్సిస్ కో  ఎష్ట్రా డాకు ఇచ్చారు. భూభాగమే తర్వాతర్వాత సన్నివేల్ మరియు మౌంట్ వ్యూ నగరాలుగా పరిణామం చెందాయి. 1850 లో భూమిని మార్టిన్ మర్ఫి జూనియర్ కొన్నాడు. ఇందులో గోధుమలు పండించాడు. ఇక్కడే తన ఇంటిని నిర్మించుకున్నాడు. ఇక్కడ సరైన రవాణా సౌకర్యాలు లేవని 1860 లో స్యాన్ ఫ్రాన్సిస్కో (San Fransisco), స్యానోజ్ (San Jose) మధ్య ఏర్పడుతున్న రైలు మార్గం తన భూభాగం మధ్య లో నుంచి వెళ్ళేట్టుగా చూసి, ఇక్కడ ఒక స్టేషన్ ఏర్పడేట్టుగా చేశాడు. ఇది 1864 లో పూర్తయింది. 1870 లో మర్ఫి రైల్వే స్టేషన్ లో  రైళ్ళు ఆగే రైల్వే టైం టేబుల్ ను సన్నివేల్ పై వచ్చిన పుస్తకం "ఇమేజస్ ఆఫ్  అమెరికా  సన్నివేల్" (Images of America Sunnyvale , సన్నివేల్ లైబ్రరీలో దీని నంబర్ 979 .473 K) లో ముద్రించారు. ఇలా సన్నివేల్ లో ఆరంభమైన "రైలు" అభివృద్ధి అయి 1980 లో "కాల్ట్రైన్" (Caltrain)  అనే పెద్ద రైలును ఆరంభించారు సన్నివేల్ ప్రజల కోసం. 1884 లో మార్ఫి మరణానంతరం తన హక్కుదా  రు (Legal Hairs) కు స్థలం దారాదత్తమైనది. వీరి ఎస్టేట్ పడమర పాత శాన్ ఫ్రాన్సిస్కో రోడ్ లోని రీడ్ ఎవేన్యు (Reed Avenue) మరియు విస్మన్ రోడ్ (Whisman Road) నుంచి  తూర్పు వైపు నేటి వోల్ఫ్ రోడ్ (Wolf Road) / ఫెయిర్ ఒక్స్ అవేన్యు (Fair Oaks Avenue) వరకు విస్తరించి ఉన్న భూభాగం ప్రస్తుత సన్నివేల్ నగర ముఖ్య భాగంలో వుంది. మర్ఫి ఎవేన్యు ప్రాంతం క్రమంగా 'సన్నివేల్ వాణిజ్య కూడలి' (Sunnyvale's Centre of Commerce) గా నేడు ఎదిగింది.  

 

మార్టిన్ మర్ఫి, మేరి గారల సంతానంలో ఒకరైన బేర్ నార్డ్ "బి.ి." మర్ఫి స్యానోజ్ (San Jose) కు మేయర్ గా, కాలిఫోర్నియా రాష్ట్రానికి సెనేటర్ గా పనిచేశాడు.  ఈయనకి తొమ్మిది మంది పిల్లలు. వీరిలో ఒక కూతురు పేరు ఎవెలెన్ అన్ (Evelyn Ann). ఈమె పేరునే సన్నివేల్ లో ఒక రోడ్ కు "ఎవెలెన్" అని పెట్టి వుంటారు. ఇలాగే జూనియర్ మార్టిన్ మర్ఫి యొక్క ఒక మనవడు మార్టిన్ జే. టాఫే (Martin J. Taaffee) పేరు సన్నివేల్ లో బాగా ఎదిగిన (Downtown) ప్రదేశంలోని వీధి పేరు.   మర్ఫి స్థలం లో 1887 లో ఎన్సీన మొట్టమొదటి స్కూల్ ను ప్రారంభించారు.  ఇదే ప్రాంతంలో ఉన్న పోస్ట్ ఆఫీసు పేరు అయిన ఎన్సీన లేక మర్ఫి అన్న పేరును తీసేసి 'సన్నివేల్' అని పేరు పెట్టారు.     

 

ఇలాగే చార్లేస్స్ లింకన్ స్టోవెల్ (Charles Lincoln Stowell) అనే అతను 1907 లో సన్నివేల్ కు వచ్చాడు. ఈయన సన్నివేల్ లో మొట్టమొదటి అతి పెద్ద వాణిజ్య భవనాన్ని నిర్మించాడు, ఇంకా వాషింగ్ టన్ ఎవేన్యు (Washington Avenue) పై మొట్టమొదటి పోస్ట్ ఆఫీసునూ నిర్మించాడు, ఫ్రీమొంట్ ఉన్నత పాశాల కమిటీకి చైర్మన్ గానూ వున్నాడు. తన బావమరిదితో కలసి మర్ఫి మరియు వాషింగ్టన్ అవేన్యుల మూల మలుపున ఎస్ & ఎస్ బిల్డింగ్ (S & S Building) నూ స్థాపించారు.

 

సన్నివేల్ లోని వాషింగ్ టన్ మరియు మర్ఫి ఎవేన్యుల మూలమలుపులో 1921-22 లలో కాంక్రీట్ భవనాన్ని నిర్మించిన చార్లెస్ క్లిఫ్టన్ స్పల్డింగ్ గారు తన బావ గారైన  చార్లేస్స్ లింకన్ స్టోవెల్ (Charles Lincoln Stowell) కలసి 1907 లో  "ఎస్ & ఎస్ బిల్డింగ్" ఆరంభించారు. వీరే 1905 లో బ్యాంకు ఆఫ్ సన్నివేల్ నూ $25,000 లతో ఏర్పాటు చేసి దానికి మొదటి కోశాధికారిగా, అనంతరం అధ్యక్షుడుగా పనిచేశారు. బ్యాంకే 1920 లో "బ్యాంకు ఆఫ్ ఇటాలి" రూపాంతరం చెందింది. ఇదే ఇప్పుడు బ్యాంకు ఆఫ్ అమెరికాగా మారింది.   

 

చార్లేస్స్ ఫుల్లెర్ గారు బాప్టిస్ట్ బోధకుడుగా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా వుంటూనే తనకిష్టమైన ఫోటోగ్రఫి రంగంలో కృషి చేయడం వల్ల అతను తీసిన అద్భుతమైన అలనాటి ఫోటోలు చరిత్రకు సాక్షాలుగా మిగిలినవి. ఇంకా ఇతను 1915-1932 మధ్య సన్నివేల్ పోస్ట్ మాస్టర్ గానూ పనిచేశారు.

 

డబ్లు. కే. రోబెర్ట్స్ (W.K. Roberts) గారు సన్నివేల్ యొక్క మొట్టమొదటి 'Justice of The Peace' గా పనిచేస్తూనే "ది స్టాన్ డెర్డ్"(The Standard) అనే పేరుతో సన్నివేల్ నుంచి తొలి వార్తా పత్రికను వెలువరించారు. ఇది 1905 ఆరంభింపబడింది. అప్పటినుంచి 1970 వరకు వార పత్రికగా వెలువడింది. పత్రిక ఆఫీసు సన్నివేల్ లోని టఫే స్ట్రీట్ (Taaffe Street) మరియు ఎవెలీన్ అవేన్యు (Evelyn Avenue) మూలమలుపుపై వుండేది. 1950 లో "ఫిల్స్ బార్ (Phil's Bar)" పేరు మార్చుకుంది. ఇదే ప్రస్తుతం  సన్నివేల్స్ ప్లాజ డెల్ సొల్ (Sunnyvale's Plaza Del Sol) గా వుంది.

 

 

'మిస్టర్ సన్నివేల్' గా ప్రఖ్యాతి గాంచిన మ్యాన్యుఎల్ వర్గాస్ (Manuel Vargas) గారు 40 సంవత్సరాలు స్యాంట క్లార (Santa Clara) కు 'కౌంటి డిప్యుటీ షేరిఫ్ఫ్'(County Deputy Sheriff) గా వున్నారు (అంటే ఇదొక పోలీసు లాంటి పదవి). వీరు తుది శ్వాస వదిలేవరకు సన్నివేల్ నగర అనధికార చరిత్రకారుడిగా పనిచేశారు. వీరు ప్యాట్ మలోన్ (Pat Malone) తో కలసి సన్నివేల్ చారిత్రక సంస్థ (Sunnyvale Historical Society) ను దశాబ్దాల క్రితమే ఆరంభించాడు.  మార్టిన్ మర్ఫి ఇంటిని 1961  లో కూల్చేశాక నిర్మించిన నూతన భవనాన్ని 'మ్యూజియం' గా మార్చడంలో ప్రముఖ పాత్ర నిర్వహించారు. ఇలా సన్నివేల్ ప్రాంత అభివృద్ధికిగాను మ్యాన్యుఎల్ వర్గాస్ గారు తన శాయశక్తులా నిరంతరం కృషి చేసినందుకు వారి 87 జన్మదినోత్సవం నాడుమిస్టర్ వర్గాస్ డే (Mr. Vargas Day) గా "ప్రతీయేడు అక్టోబర, 20" నాడు సన్నివేల్ లో నిర్వహించాలని ప్రకటించడం జరిగింది. 1893లో జన్మించిన వీరు 1986లో మరణించేనాటికి జీవించి ఉన్న వారిలో వీరే అత్యధిక వయస్కులు. అంతేకాదు వీరు మరణించేనాటికి పెళ్ళిచేసుకొని ఎక్కువ కాలం జీవిస్తున్న జంటగా కూడా రికార్డ్ సృష్టించారు.

 

ఉత్తర డకోటా నుంచి 1886 లో సన్నివేల్ కు వచ్చిన ఫ్రాంక్ చాప్మన్ విల్సన్ (Frank chapman Wilson) గారు ఎల్ కామినో రియల్ (El Camino Real) మరియు పస్తోరియా ఎవేన్యు (Pastoria Avenue) దగ్గర ఒక నర్సరీని ఆరంభించారు. ఇందులో వీరు అతి పొడవైన అక్రోట్ (Walnut) లను పండించి ప్రపంచ ప్రసిద్ధుడైనాడు.     

 

క్రీ. . 1900 ఆరంభ సంవత్సరాలలో సన్నివేల్ కు వచ్చిన నిక్ టిక్వికా (Nick Tikvica) ఇక్కడ 800 ఎకరాల భూమిని కొని పండ్లను పండించారు. ముఖ్యంగా నాణ్యమైన చర్రీ (Cherries) పండ్లను అత్యధికంగా పండించారు. నాణ్యమైన చర్రీలను తిన్న అమెరికా 32 అధ్యక్షులైన ఫ్రాంక్లిన్ డి. రూస్ వెల్ట్ గారు స్వయంగా  ప్రశంసిస్తూ టిక్వికా గారికి 17-06-1935 నాడు లేఖను రాశారంటే మన నోరూ ఊరకమానదు.

 

 ఇలా ఇంకా ఎందరో మహానుభావులు సన్నివేల్ లో స్థిరపడి, తమ అవిరల కృషితో తమతోపాటు తాము  స్థిరనివాసం ఏర్పరచుకున్న నగరమైన సన్నివేల్ నూ సర్వతో ముఖంగా ఎదిగింపచేశారు.    

 

సన్నివేల్ లో జరిగే వార్షిక కార్యక్రమాలు (Annual events in Sunnyvale)  :

ప్రతీ నగరంలో కాని లేక ఒక ప్రాంతంలో కాని ప్రదేశాన్నిఅనుసరించి పండగలో జాతరలో వంటివి వార్షిక ఉత్సవాలుగా జరుగుతావి. అలాగే సన్నివేల్ నగరంలో ప్రతీయేడు ఆర్ట్స్ అండ్ వైన్ ఫెస్టివల్, సమ్మర్ మ్యూజిక్ సీరిస్, హాండ్స్ ఆన్ ది ఆర్ట్స్, డౌన్ టౌన్ అసోసియేషన్ వారు నిర్వహించే హాలిడే ట్రీ లైటింగ్, స్టేట్ ఆఫ్ ది అడ్రస్ ప్రోగ్రామం ఎట్ లైబ్రరీ ఇలా వార్షికంగా జరిగే కార్యక్రమాలలో కొన్ని ఇవి.   వీటిలో ఒకటో రెండో చూద్దాం.

 

ఆర్ట్స్ అండ్ వైన్ ఫెస్టివల్ (Arts and Wine Festivals) : 2012 సంవత్సరపు ఉత్సవాలను జూన్ 2 మరియు 3 తేదీలలో నిర్వహించారు.  ఇది సన్నివేల్ వాణిజ్య మండలి వారి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమాలు మర్ఫి అవేన్యు మరియు వాషింగ్టన్ అవేన్యుల కూడలిలో వున్నసన్నివేల్ డౌన్ టౌన్ ప్రాంతంలో జరిగినవి.

 

సమ్మర్ మ్యూజిక్ సీరిస్ (Summer Music Series) : సంబరాలు ప్రస్తుత (2012) వేసవిలో పది కార్యక్రమాలుగా జూన్ 20 నుంచి ఆగష్టు 29 వరకు ప్రతీ బుధవారం (04-07-2012, బుధవారం అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం నాడు తప్ప)  సాయంకాలం 5.30  నుంచి రాత్రి 8.30 వరకు నిర్వహించ బడినవి. ఇవి నోకియా, పాలో ఆల్టో మెడికల్ ఫౌండేషన్ మరియు సన్నివేల్ డౌన్ టౌన్ అసోసియేషన్ గారల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటైనవి. జూలై 25 నాడు జరిగిన కార్యక్రమంలో వ్యాస రచయిత పాల్గొన్నాడు. రోజున మ్యూజికాల్ ట్రూప్ సేజ్ (SAGE) అనే సంస్థ (వారి అంతర్జాల చిరునామా: www.sagemusic.com)  వారు అందించిన సంగీత కొలనులో ఆకార్యక్రమానికి హాజరైన ప్రతీ ఒక్కరు ఈదులాడినారు తమను తాము మరచిపోయి. ఇది వేసవి సాయంకాలం కావడం వల్ల ఎండ వేడి తగ్గి చక్కటి చల్లటి గాలులు వీస్తూ ఆహ్లాదకర వాతావరణంలో హృదయోల్లాసకరమైన పాటలు పాడుతున్నారు వీనులకు ఇంపైన సంగీతంతో. ఇందులో పాల్గొనడానికి ప్రజలు పిల్లా పాపలతో  సకుటుంబంగా విచ్చేశారు. పెద్దవారు మద్యాన్ని సేవించారు. చిన్నా, పెద్ద, ఆడా, మగ అనే తేడా లేకుండా తమకు తెలిసిన వారితో కలిసి నృత్యం చేశారు. ముఖ్యంగా వేదిక మీద ఆలాపిస్తున్న గీతాలకు భావయుక్తంగా ప్రేయసీ ప్రియులో, భార్యాభార్తలో, పిల్లలో చేసిన నృత్యానికి ఎన్నడూ నృత్యంలో పాల్గొనని వారు సైతం డ్యాన్సు చేస్తారంటే అది అతిశయోక్తి కాదు. ఇక్కడ వందలాది మంది పాల్గొంటున్నా ఇతరులపట్ల అసభ్యంగా ప్రవర్తించకపోవడం, ఎటువంటి అశ్లీలతకు తావులేకపోవడం వల్ల ఇక్కడి ప్రజల మర్యాద పూర్వక ప్రవర్తనకు జోహార్లు చెప్పకమానం.  

 

ఇలా సన్నివేల్ ప్రాంత ప్రజలు సంవత్సరం పొడుగునా కాలానుసారంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ దాని ద్వారా జీవితాన్ని ఆనదమయంగా తీర్చిదిద్దుకుంటున్నారు

 

హోటల్స్ &  రెస్టారెంట్లు (Hotels & Restaurants) :

ఇక్కడ హోటల్స్ కు రెస్టారెంట్లకు కొదవలేదు. ప్రధానంగా ఇక్కడ 10 హోటల్స్, 315 రెస్టారెంట్లు,  05 మొటేల్స్ వున్నై. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవలసింది మెక్సికన్, చైనీస్, ఐరీష్, వంటి ఖండాంతర దేశాల తిండి దొరికే హోటల్లే గాక మన భారత దేశంలోని  పంజాబీ, తమిళ, తెలుగు మొదలైన భిన్న ప్రాంతాల భోజనం కూడా లభిస్తున్నదంటే ఆశ్చర్యమూ, ఆనందంమూ కలుగుతుంది.  ఇకపోతే మన తెలుగు వారి భోజనశాలల్ని చెప్పుకోవలసివస్తే పికాక్, ఆంధ్రా భోజనం, పెసరట్టు అనే హోటల్లు  కనిపిస్తాయి. వీటిలో 'పెసరట్టు' అనే హోటల్ అచ్చంగా తెలుగులోనే బోర్డ్ రాయించినందుకు, ఇక్కడ అమెరికాలో ఒక మారుమూల ప్రాంతమైన సన్నివేల్ లో ఒక హోటల్ కు పేరుగా తెలుగు అక్షరాలు కనిపించినందుకు సుష్టిగా భుజించినంత ఆనందం కలుగుతుంది.

హోటల్  సన్నివేల్ లో 887-899 తూర్పు ఎల్ కామినో  రియల్ (E. El Camino Real) ప్రాంతం లో వున్నది.

తెలుగు వారి పూటకుళ్ళమ్మ ఇళ్ళలో (హోటళ్ళలో) పదహారణాల తెలుగువారి రుచికరమైన వంటకాలన్నీ లభిస్తాయి. ఇక్కడి కొన్ని హోటళ్ళలో బఫ్ఫే విధానమూ వుంది. వీటిల్లో శాఖా ఆహారమైనా  మాంస ఆహారామైనా బఫ్ఫెకి కేవలం 12 డాలరులే.


'ఆంధ్ర' అన్న మన తెలుగు జాతిని సూచించే పదం వాడిన హోటల్ సన్నివేల్ నగరం లో 151-161 తూర్పు ఎల్ క్యామినో ప్రదేశం లో వుంది.

ఉద్యానవనాలు (Parks) :

ఎక్కడైనా నగరానికి శోభను తెచ్చేవీ, పిల్లలనుండి వృద్ధుల దాకా  ఆనందంగా, ఆహ్లాదకరంగా  గడపడానికి వుపకరించేవీ పార్కులే.   సన్నివేల్ లో పదికి పైగా  ఉద్యానవనాలు  వున్నై. వాటిలో  మర్ఫి పార్క్ , కొలంబియా పార్క్, హెరిటేజ్ పార్క్, , ఆర్కేడ్  గార్డెన్స్ పార్క్,  టౌన్ సెంటర్ పార్క్ మెదలైనవి వున్నై. టౌన్ సెంటర్ పార్క్ 356 ట్రిపు రోడ్ పైన వున్నది. పార్కులలోని కొన్నిటిలో ఆటస్థలాల గ్రౌండులు వున్నై. అందులో ఒకటి పిల్లలకు మరొకటి టెన్నిస్ కోర్ట్. ఇంకా  ఒక రెస్ట్ రూం (అమెరికాలో "రెస్ట్ రూం" అంటే మన భాషలో 'మరుగు దొడ్డ్లు' అని అర్థం) వున్నది. ఇలా ఒక్కొక పార్క్ ఎంతో చరిత్ర కలిగి, ఎంతో విశాలంగా, ఆటస్తలాలతో వున్నై.  ఇలా వున్న పార్కులలో ఒక్క దాని గురించి చప్పుకుందాం.

 

వాషింగ్ టన్ పార్క్  (Washington Park) :  ఇది సన్నివేల్ లోని ప్రసిద్ధ ఉద్యాన వనాలలో ప్రసిద్ధమైనది. పార్కు  840  పడమర వాషింగ్ టన్ అవేన్యు ప్రాంతంలో వున్నది. ఇది 1945 లో 12 ఎకరాలలో ఏర్పాటైనది. పార్కు చక్కటి చెట్లూ చేమలతోనే కాకుండా పిల్లలకు ఆటస్థలం, బాస్కెట్ బాల్, టెన్నీస్ కోర్టులు మొదలైన ఎన్నో సదుపాయాలున్నవి.  ఇలా సర్వాంగ సుందరంగా వుంది. 

  

ప్రార్థనామందిరాలు (Temples) :

సన్నివేల్ లోని ప్రార్థనామందిరాలలో అధికంగా చర్చ్ లే వున్నాయి. సన్నివేల్ మొదటి బాప్టిస్ట్ చర్చ్ , బెరేయన్ బాప్టిస్ట్ చర్చ్, హయ్యర్ గ్రౌండ్ చర్చ్, న్యూ కన్వేనంట్ ఆఫ్ ది యునైటెడ్ మెథడిస్ట్ చర్చ్ మొదలైన పది చర్చ్ లు వున్నై.  ఇక్కడ ముస్లింల ప్రార్థనా మందిరం మస్జిద్ 1257 తాస్మాన్ (Tsman) డ్రైవ్ లో  ఒకటిమాత్రమే వున్నది.

 

సన్నివేల్ హిందూ టెంపుల్ & కమ్యూనిటీ సెంటర్ : సన్నివేల్ లో రెండో మూడో హిందువుల దేవాలయాలున్నై. వాటిని చూద్దాం. సన్నివేల్ హిందూ టెంపుల్ & కమ్యూనిటీ సెంటర్ అనేది సన్నివేల్ లోని 420-450 పెర్షియన్ డ్రైవ్ దగ్గర వున్నది. ఇందులో నిత్యం పూజలు జరుగుతున్నాయి. ఐతే ఇది ప్రస్తుతం (ఆగష్టు, 2012) పునర్నిర్మాణంలో ఉండి 50% నిర్మాణం పూర్తయింది.  ఇందులో లక్ష్మి నారాయణ; సీతా, లక్ష్మన, హనుమంతులతో కూడిన రాముడు; రాధతో కూడిన కృష్ణుడు; వేంకటేశ్వరుడు; దుర్గా; సరస్వతి; గణేష్; శివపార్వతులు మొదలైన దేవతా విగ్రహాలను ప్రతిష్టించబోతున్నారు. గుడి నిర్మాణానికి గాను $ 2.5 మిలియన్స్  ఖర్చవుతుందని అంచనా. ఆలయం సంవత్సరం దీపావళి నాటికి పూర్తి అవుతుంది. దేవాలయంలో ప్రతీ ఆదివారం నాడు అమృతవాణి, సత్సంగ్ & భజన, ఆరతి; సోమవారం శివుడికి రుద్రాభిషేకం,అర్చన; మంగళవారం హనుమంతుని పూజ; బుధవారం శ్రీ కృష్ణ పూజ; గురువారం శ్రీ షిర్డీ సాయి బాబా ఆరతి మరియు అర్చన; శుక్రవారం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం మరియు శ్రీ లక్ష్మి పూజ; శనివారం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర పారాయణం, అర్చన మరియు ఆరతి నిర్వహిస్తున్నారు.ఇవేగాక  మరిన్ని విశేషమైన పూజలు కూడా  ఆలయంలో చేపట్టారు. ఇంకా పిల్లల కోసం బాలగోకులం, అన్ని వయసుల వారికి ఉదయం, సాయంకాలాలలో యోగ తరగతులను నిర్వహిస్తున్నారు. ఇవన్నీగాక పండగ, పర్వ దినాలలోనూ ప్రత్యేక పూజలను, వుత్సవాలనూ నిర్వహిస్తున్నారు.

 

దేవాలయ లబ్దికై 2010 లో మే 22 తేదీన "హాస్య కవి సమ్మేళన్" ఇండో అమెరికన్ సొసైటీ అఫ్ బే ఏరియా సంస్థ వారు ఏర్పాటుచాశారు. భారతీయ హాస్య కవులతో కవి సమ్మేళనం నిర్వహించారు. ఇది భారతీయులలో ఉత్సాహాన్ని నింపింది.

 

శ్రీకృష్ణ బలరాం మందిరము : ఇది 1235 రీమ్ వుడ్ ఎవేన్యు (Ream Wood  Avenue) లో వుంది. దీనిని ఇండియన్ హెరిటేజ్ ఫౌండేషన్ వారు 2011 లో నిర్మించారు. మందిరంలో హిందువుల పండగల పర్వదినాలలో ప్రత్యేక పూజలతో పాటు భజనలు, భగవద్గీతపై తరగతులు, విష్ణు సహస్ర నామ పారాయణం మొదలైన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల ఆగష్టు 9, 2012 నాటి శ్రీ కృష్ణ జన్మాష్టమిని ఘనంగా నిర్వహించారు. ఆరోజున ప్రత్యేక అభిషేకాలు, సంకీర్తనలు, ప్రవచనాలు, ఉయ్యాల సేవ, పల్లకి సేవ వంటి వాటితోపాటు  పిల్లలకు వినోద కార్యక్రమాలు, దేవుడి దర్శనం చేసుకున్న ప్రతీ కుటుంబానికి బహుమతిని ఇవ్వడం జరిగినది.

 

షిర్డీ సాయి దర్బార్: సన్నివేల్ లోని 897 కిఫెర్ రోడ్ (Kifer Road) లో 'షిర్డీ సాయి దర్బార్' ఆలయమున్నది. దీని నిర్మాణం 24-02-2011 నాడు ఆరంభమైంది. 19-06-2011 రోజున విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. దేవాలయాన్ని సాయి బాబా బోధనలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం, అర్హులైన పేద విద్యార్థులకు సహాయం చేయడం, పేద మరియు అవసరమైన వారికి వైద్య సహాయం అందించడం, కోరినవారికి ఆహారం మరియు బట్టల విషయంలో సహాయం చేయడం, 24 గంటల్లో ఎప్పుడైనా క్షుదార్తులకు ఉచితంగా ఆహార ప్రసాదాన్ని అందించడం వంటి లక్ష్యాలతో నిర్వహిస్తున్నట్టు తమ వెబ్ సైట్ లో పేర్కొన్నారు. ఈఆలయంలో సాయి ఆరతి, అభిషేకం, భజనలు, సాయి సచ్చరిత్ర పారాయణం వంటి ఎన్నో కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు.  

 

విధంగా సన్నివేల్ లో మతస్తులైనా తమ మత విశ్వాసాల కనుగుణంగా అన్యులకు ఆటంకం కలగకుండా ప్రార్థనలు, పూజలు నిర్వహిస్తున్నారు.

 

విద్యా సంస్థలు (Educational Institutions) :

సన్నివేల్ నగరంలో ఉన్నత ప్రమాణాలు గల పాఠశాలలే ఎక్కువ. ఇక్కడ పబ్లిక్ మరియు ప్రైవేటు పాఠశాలలున్నై. ఇక్కడ కిండర్ గార్డెన్ తరగతుల నుంచి 12 తరగతి వరకున్న పాఠశాలలున్నై.  ఇక్కడి ఎలిమెంటరీ, మిడిల్, హై స్కూళ్ళు అన్ని కలిపి పాతికకు పైగా వున్నాయి. ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ (ISD),  సన్నివేల్ లోని కొల్లిన్స్ రోడ్ లో సన్నివేల్ హై స్కూల్  వున్నది. ఇలాగే ఇంకా సన్నివేల్ నగర నడిబొడ్డు నుండి ఒక గంట లోపు ప్రయాణంతో నాణ్యమైన విద్యనందిస్తూ ప్రపంచ ప్రసిద్ధ మైన  స్టాన్ ఫోర్డ్, స్యానౌసే, స్యాంటా క్లారా, కాలిఫోర్నియా విశ్వ విద్యాలయాలు వున్నాయి. ఇక కొన్ని నిమిషాల ప్రయాణ వ్యవధిలో ఫూతిల్, డి అంజా, వెస్ట్ వ్యాలీ కళాశాలలతో పాటు మిషన్ కమ్యునిటీ, కాగ్స్ వెల్ కళాశాలలూ వున్నాయి.

 

ఇక్కడి విద్యా సంస్థలలో చదివిన వారెందరో జాతీయ, అంతర్జాతీయ మేధావులుగా గుర్తింపు పొందారు. దీనికి ఉదాహరణగా సన్నివేల్ లో చదువుకొని 2006 లో వైద్య రంగంలో నోబెల్ బహుమతిని పొందిన ఆండ్రో ఫైర్ (Andrew Fire) లాంటి వారిని పేర్కొన వచ్చు. అంతేగాదు విద్యాలయాల నుంచి వచ్చిన వారు క్రీడా రంగంలో కూడా అగ్ర స్థానాన్ని అలంకరించి తమ దేశ గౌరవాన్ని విశ్వా వ్యాపితం చేశారు. ముఖ్యంగా  సన్నివేల్ ప్రాంత విద్యా సంస్థలలో విద్యాలో భాగంగా వున్న కర్రికులం తో పాటు కో-కర్రికులం (Co-Corriculum) గా చెప్పబడే  వ్యాస రచన, వక్తృత్వం, నృత్యం వంటి వాటిలోనూ విద్యార్థులను ప్రావీణులుగా తీర్చిదిద్దుతున్నారు. ఇలా సన్నివేల్ ప్రాంత విద్యార్థులు శారీరక, మానసిక సర్వతో ముఖంగా ఎదుగుతున్నారు.ఆట స్థలాలు (Play Grounds) :

సన్నివేల్ లో క్రీడా ఉత్సుకత ఎక్కువ వున్నదని చెప్పడానికి ఇక్కడున్న 132 ఆట స్థలాలే నిరూపిస్తై. ఇంకా విచిత్ర మేమంటే పార్కులలో కూడా టేన్నిసో, వాలీ బాలో వంటి కోర్టులను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుండి జాతీయ క్రీడాకారులుగా ఎదిగి ఒలంపిక్ మెడల్స్ నూ అందుకున్న బెన్ని బ్రౌన్ [(Benny Brown ) 1976 లో జరిగిన ఒలంపిక్స్ లో 4 X 400 రిలే పరుగు పందెంలో బంగారు పథకం సాధించారు] వంటి క్రీడా కారులేందరో ఉద్భవించారు. ఇక్కడి  ప్రజలు ఆడే క్రీడలను టీం (టీం) గా ఆడే ఆటలు, వ్యక్తిగతం (Individual) గా ఆడే ఆటలుగా విభజించవచ్చు. వీటిలో ఇక్కడి ప్రజలు అత్యధికంగా ఇష్టపడే టీం క్రీడల్లో సొకర్ (Soccer), ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, ఐస్ హాకీ (Ice Hokey), హ్యాండ్ బాల్,  కిక్ బాల్ వంటివెన్నో వున్నాయి. ఇక వ్యక్తి గత క్రీడల్లో టెన్నిస్, గోల్ఫ్, బాక్సింగ్, ఈత, సైక్లింగ్ వంటి పలు క్రీడలు వీరు ఆడతారు.   మచ్చుకి రెండు క్రీడల గురించి  చెప్పుకుందాం.

 

గోల్ఫ్ (Golf) :  సన్నివేల్ లోని 605 మ్యకర ఎవేన్యు (Macara Avenue) లో సన్నివేల్ మున్సిపల్ గోల్ఫ్ కోర్సు పబ్లిక్ రంగంలో ఏర్పాటయింది.  ప్రైవేట్ రంగంలో  సుంకేన్ గార్డెన్స్ గోల్ఫ్ కోర్సు, ది గోల్ఫ్ క్లబ్ మొదలైన గోల్ఫ్ క్రీడా స్థలాలు అంతర్జాతీయ ప్రమాణాలతో వున్నాయి.

 

టెన్నిస్ (Tennis) : సన్నివేల్ లో  టెన్నిస్ ఆటకు సంబంధించిన క్రీడా స్థలాలు ప్రత్యేకంగా  ఉండడమే గాక ఉద్యానవనాలలో కూడా వున్నయోంటే ప్రాంతీయులకు టెన్నిస్ పై వున్న మక్కువ అర్థమవుతున్నది. సన్నివేల్ లోని 999 కొర్తే మడేర ఎవేన్యు (Corte Madera Avenue) లో వున్న ఎంసినాల్ పార్క్ , సన్నివేల్ టెన్నీస్ సెంటర్,  లేక వుడ్ పార్క్ ఇలా మొదలైన పది వరకు టెన్నిస్ కోర్టులు వున్నాయి.

 

అమెరికా దేశంలో భాగమైన సన్నివేల్ లో క్రీడలన్నిటికి చెందిన ఆట స్థలాలు వున్నాయి. చాలా సార్లు ఒలంపిక్స్ లో అమెరికా దేశ క్రీడాకారులే అత్యధిక మెడల్స్ గెలుచుకోవడం, అదే సాంప్రదాయం 2012లో జరిగిన ఒలంపిక్స్ లోనూ నిలబెట్టుకోవడం గమనిస్తే వీరి క్రీడా స్పూర్తి అన్య దేశాలకు 'స్పూర్తిదాయకం' అని చెప్పక తప్పదు.

 

గ్రంథాలయాలు (Libraries) :

సన్నివేల్ పబ్లిక్ లైబ్రరీ :  ఇది నాలయ (Reading Room) గా 14-09-1908 నాడు ఉమెన్స్ క్రిస్టియన్ టెంపెరన్స్ యూనియన్ ( Women's Christian Temperance Union) వారిచే స్థాపించబడింది. ఇది 50 పుస్తకాలతో సన్నివేల్ లో నివసిస్తున్న శ్రీమతి ఎఫ్ .. డెవేర్ట్స్ గారి ఇంట్లో, ఆమె అజమాయిషిలో మొదట్లో నిర్వహించబడింది. ఏడాది తిరక్కుండా 500 పుస్తకాలతో, 4 దిన పత్రికలతో, 6 వార పత్రికలతో కాలిఫోర్నియా రాష్ట్ర గ్రంథాలయ సంస్థ యొక్క 'శాఖా గ్రంథాలయం' (Branch Library) గా రూపుదాల్చింది. ఇది 1914 లో 'పబ్లిక్ లైబ్రరీ' గా ప్రకటితమైనది. ఇది పలు ప్రాంతాలకు మారి మారి 1950 లలో సన్నివేల్ లోని మర్ఫి ఎవేన్యు లో వున్న 'ఓల్డ్ సిటీ హాల్' లోకి చేరింది. అనంతరం సన్నివేల్ లో ఆలివ్ అవేన్యు (West Olive Avenue)  దగ్గర దీని నిర్మాణం డిసెంబర్ 14, 1959 నాడు ఆరంభమై, నవంబర్ 5, 1960 నాడు పూర్తయింది. కాలం గడిచిన కొద్ది విస్తృతి పొందుతూ 1988 లో ఆధునికీకరించ బడింది.

 

 

గ్రంథాలయంలో  కల్పనాత్మక (Fiction), కల్పనేతర (Non fiction), పుస్తకాలు, విజ్ఞాన సర్వస్వాలు, నిఘంటువులు, భౌగోళిక పటాలు వంటి ఆచూకి (Reference) ఆకరాలు లభిస్తాయి. ఇంకా సంగీతం, సినిమాలు, వివిధ అంశాలపై డాకుమెంటరీలు సి.ి. రూపంలో వున్నాయి.  పిల్లల విభాగం ప్రత్యేకంగా ఉంది. ఇక్కడ అంతర్జాతీయ సుప్రసుద్ధ భాషలైన ఇంగ్లీష్ తో పాటు చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, జపాన్, కొరియా, రష్యా, స్పానిష్ లతో మన దేశ భాష అయిన హిందీ భాషలో కూడా పుస్తకాలున్నై. ఇక్కడ వేలాది పుస్తకాలు, పలు దేశాల ప్రఖ్యాత పత్రికలు ఉన్నాయి.   గ్రంథాలయం విశాలయమైన ప్రాంగణంలో ఉంది. ఇందులో వందలాది మంది కూర్చొని చదువుకొనే వసతి ఉంది. ఇక్కడ 54 కంప్యూటరులు ఉన్నాయి. వై. ఫై. సదుపాయమూ వున్నది.  వీటిని సభ్యులు ఉచితంగా వాడుకోవచ్చు.   ఇక్కడ పుస్తకాల ద్వారానే విజ్ఞానాన్ని పంచడం గాక, పెద్దలకు పిల్లలకు రకరకాల కార్యక్రమాలూ నిర్వహించి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు గ్రంథాలయ నిర్వాహకులు.   గ్రంధాలయం రకరకాల సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఉదాహరణకి సెప్టెంబర్ నెల 2012 లో 10 తేదీన షేక్  ష్పియర్ రచనలను చదవడం, 5 తేదీన -పుస్తకాల (e-books) , మిస్టరీ పుస్తకాల గూర్చి - ఇలా మొదలైన సాహితీ జిజ్ఞాస కార్యక్రమాలేగాక 19 తేదీన సోషల్ సెక్యూరిటీ గూర్చి, 24 తేదీన న్యాయవాదుల అందుబాటు వంటి భిన్నమైన పలు కార్యక్రమాలు గ్రంధాలయ ప్రాంగణంలో జరుగుతున్నాయి. ఇంతేగాక బాలల వికాసానికి కూడా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. సదుపాయాలన్నీ గ్రంథాలయ సభ్యులే గాక ఎవ్వరైనా వినియోగించుకోవచ్చు. ఇంకోమంచివిషయమేమంటే గ్రంథాలయ సభ్యత్వానికి ఎలాంటి రుసుమూ వసూలు చేయరు. పూర్తిగా ఉచితమే.  

 

ఇంకా సన్నివేల్ లో నగర గ్రంథాలయం, డావెన్ పోర్ట్  పబ్లిక్ లైబ్రరీ, సాంకేతిక గ్రంథాలయం మొదలైన వాటితో పాటు పాశాలల్ల, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లోను వున్న గ్రంథాలయాలు ప్రాంత ప్రజలను విజ్ఞాన వంతులుగా సంస్కరిస్తున్నవి.  

 

తపాలా కార్యాలయం  (Post Office) :  

మానవ అభివృద్ధి క్రమంలో వచ్చిన వాటిల్లో తపాలా కార్యాలయం ఒకటి. ఇది సన్నివేల్ లో 20 శతాబ్ద ఆరంభంలో మొదలైనది. 1907 లో సన్నివేల్ కు వచ్చిన చార్లేస్స్ లింకన్ స్టోవెల్ (Charles Lincoln Stowell) అనే అతను వాషింగ్ టన్ ఎవేన్యు (Washington Avenue) పై మొట్టమొదటి పోస్ట్ ఆఫీసును నిర్మించాడు. బైరాన్ మగిన్నిస్ (Byron Maginnis) అనే అతను సన్నివేల్ పోస్ట్ ఆఫీసుకు మొదటి పోస్ట్ మాస్టర్ గా పనిచేశారు. చార్లేస్స్ ఫుల్లెర్ గారు 1915-1932 మధ్య సన్నివేల్ పోస్ట్ మాస్టర్ గా వున్నారు.

 

సన్నివేల్ పోస్ట్ ఆఫీసులో సహాయ పోస్ట్ మాస్టర్ గా మెయిల్ సార్టింగ్ పనిని చాలాకాలంగా చేస్తూ 1957 -1965 మధ్య పోస్ట్ మాస్టర్ గా జో స్టానిక్ (Joe Stanic) గారు పనిచేశారు. ఇదే పోస్ట్ ఆఫీసు లో  ఉత్తరాలను బట్వాడా చేసే తొలి 'పోస్ట్ మెన్' (అప్పుడు మెయిల్ మెన్ అనేవారు) లుగా ఆనాటి సన్నివేల్ ను చెరిసగంగా పంచుకొని లేఖలను పంచారు బిల్ గోలిక్క్ (Bill golick) మరియు విల్లర్డ్ పెటేర్సన్ (Willard Peterson) గారలు.   సన్నివేల్ లోని మర్ఫి స్థలం లో మొట్టమొదటి స్కూల్ ను 1887 లో స్థాపించిన ఎన్సీన  గారు ఇదే ప్రాంతంలో ఉన్న పోస్ట్ ఆఫీసు పేరు అయిన ఎన్సీన లేక మర్ఫి అన్న పేరును తీసేసి 'సన్నివేల్' అని  నామకరణం చేశాడు.

 

సన్నివేల్ లో ప్రస్తుతం తపాలా కార్యాలయాలు 580, ఉత్తర మేరీ ఎవేన్యు లో; 526, పడమర ఫ్రీమొంట్ ఎవేన్యు లో; 141, దక్షిణ టాఫ్ఫే వీధిలో లో; 1525, గోల్డ్ స్ట్రీట్, అల్విసో లో; 530, లారెన్సు ఎక్స్ ప్రెస్ వే ఇత్యాది ప్రదేశాల్లో వున్నది.  ఇక్కడ అరుదైన స్టాంపుల సేకరణకై 'సన్నివేల్ స్టాంప్ సొసైటీ' (పోస్ట్ బాక్స్ No.2909, సన్నివేల్, కాలిఫోర్నియా-94087) అనే సంస్థ నిర్వహించబడుతున్నది. స్టాంపుల సేకరణదారులు వారానికి రెండు సార్లు కలుసుకుంటారు.  

 

రవాణా సదుపాయం (Transportation Facility) :

సన్నివేల్ లో ప్రజలు రోడు మార్గం పై మరియు రైలు మార్గం గుండా ప్రయాణం చేసే సదుపాయం ఉంది. ఈరైలు మార్గం 1864 లో ఏర్పడింది. మార్టిన్ మర్ఫి జూనియర్ గారి  కృషి ఫలితంగా సన్నివేల్ లో రైల్వేస్టేషన్ ఏర్పాటైంది. అందుకే రైల్వే స్టేషన్ పేరు 'మర్ఫి రైల్వే స్టేషన్' గా నామకరణం చేయడం జరిగింది. 1980 నుంచి 'కాల్ ట్రైన్' (Caltrain) అనబడే పెద్ద రైలు మార్గం గుండా వెళ్ళడం ఆరంభమైనది.

 

ఇక ఇక్కడి రోడ్ల నూ గమనిస్తే సన్నివేల్ నగరం లోంచి ఎస్ ఆర్-85, యు ఎస్-101,  ఎస్ ఆర్-238, మరియు -280 నెంబరుల 'ఫ్రీవే' (Freeways) రోడ్లు వెళ్లుతు.

 

ప్రాంతంలో రైళ్ళు గాని బసులు గాని 'సాంటక్లార వ్యాలీ ట్రాన్స్ పోర్టేషన్' వారి ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ఇక్కడి రహదారులన్నీ విశాలంగా వుండడం విశేషం. సైకిల్ పై వెళ్ళే ప్రయాణికులకు రోడ్డులో   ప్రత్యేక మార్గం వుంటుంది. ఇతర వాహనదారులందరూ సైకిల్ ప్రయాణికులకు ప్రథమంగా అవకాశం కల్పించడం, వారి రక్షణను దృష్టిలో పెట్టుకొని తమ తమ వాహనాలను నడపడం జరుగుతుంది. నగరంలో బైసైకిల్ ఫ్రెండ్లీ కమ్యూనిటీ అనే సంస్థ ఉంది. సైకిల్ పై ప్రయాణించేవారు హేల్మేంట్ ధరించడం వంటి కొన్ని ప్రత్యేక నిబంధనలను పాటించాలి. పాద చారులు ఫుట్ పాత్ పైన మాత్రమే నడవాలి, రోడ్ దాటడానికి కూడలి (Chow rasta) లోనే దాటాలి. నగరం నుంచి ఒక గంటలోగా ప్రయాణిస్తే చాలు మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలను చేరే అంత దగ్గరలో వున్నై. అవి: స్యాన్ ఫ్రాన్సిస్కో, స్యానౌస్, ఒక్లాండ్ లు.            

 

కేంద్ర కార్యాలయాలు  (Head Offices) :

ప్రపంచ ప్రసిద్ధి చెంది పలుదేశాలలో తమ కార్యాలయాలున్న లేక పలుదేశాలతో వ్యాపారం నెరపుతున్న సంస్థలు  కొన్ని సన్నివేల్ నగరం లో తమ కేంద్ర కార్యాలయాన్ని నెలకొల్పి కార్యకలాపాలని నిర్వహిస్తున్నవి.  అటువంటివాటిల్లో  యాహూ, నెటాప్ (netapp), 8 X 8, అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్, అప్లైడ్ సిగ్నల్ టెక్నాలజీ, ఇంట్యుటివ్ సర్జికల్, త్రిమ్బోల్ నావిగేషన్, సిలికాన్ ఇమేజ్, మాక్సిమ్ ఇంటేగ్రేటేడ్  ప్రొడక్ట్స్ , టేలెనవ్ మొదలైన పాతికకు పైగా  అంతర్జాతీయ సంస్థలు సన్నివేల్ లో ఉన్నాయంటే నగరం చూడ్డానికి చిన్నదైనా పెద్ద పెద్ద సంస్థలను తనలో దాచుకున్నదన్నమాట.

                                                         నెటాప్ కేంద్ర కార్యాలయం

 

సన్నివేల్ నుంచి ఉద్భవించిన ప్రముఖులు (Famous Personalities grown up from Sunnyvale city) :

"కృషివుంటే మనుషులు ఋషులవుతారు..." అన్న మాటను నిజం చేస్తూ సన్నివేల్ లో పురుడు పోసుకున్న కొందరు లేక ఎక్కడో పుట్టి సన్నివేల్ లో జీవిస్తూ తాము ఎన్నుకున్న రంగంలో అపారమైన కృషి చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అలాంటి వారు ఎందరో వున్నారు. వారిలో కొందరినైనా ఇక్కడ ప్రస్తావించుకుందాం.

 

ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) భారత దేశ హిందీ చలన చిత్ర రంగమైన 'బాలివుడ్' లో ప్రముఖ నటుడు. ఈయన 1988 లో 'ఖయామత్ సే ఖయామత్ తక్' అనే హిందీ చిత్రంలో బాల నటుడిగా నటించాడు. అనంతరం జో జీతా వహి సిఖందర్ (1992), జానే తు యా జానే నా (2008) మొదలైన పది చిత్రాలలో నటించి రెండు సార్లు ఫిలిం ఫేర్ అవార్డులను అందుకున్నారు. వీరి తల్లి నుజ్హత్ ఖాన్, తండ్రి అనిల్ పాల్. దంపతులకు  అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రం లో ఉన్న మెడిసన్  ప్రాంతంలో ఇమ్రాన్ ఖాన్ జన్మించారు.  ఈయన ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు మరియు దర్శకుడు మన్సూర్ ఖాన్ గారలకు మేనల్లుడు. మరోదర్శకులు నసీర్ హుస్సేన్ కు మనవడు. ఇమ్రాన్ ఖాన్ సన్నివేల్ లోని 'ఫ్రెమోంట్ హై స్కూల్ లో చదివి తన బాల్యాని ఇక్కడ గడిపాడు.  

 

సన్నివేల్ లో జన్మించి, ఇక్కడే విద్యాభ్యాసం ముగించి దూరదర్శన్ లో ప్రముఖ నటిగా  టేరి హాచేర్ (Teri Hatcher) పేరు ప్రఖ్యాతులను సముపార్జించారు.   ఇంకా  ఇక్కడ పుట్టక పోయినా సన్నివేల్ లోని బడులలో చదివి  బాల్యాన్ని గడిపిన  కొందరిలో ఆపిల్ సంస్థ (Apple Inc.) వ్యవస్థాపకుల్లో ఒకరైన స్టేవ్ వేజ్నియాక్  (Steve Wezniak); ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు, సంకేత లిపి విశ్లేషకుడు, గణిత శాస్త్రజ్ఞుడు అవ్వడమే గాక సన్నివేల్ నగర మాజీ కౌన్సిలర్ సభ్యుడు అయిన లండన్ కర్ట్ నొల్ (Laondon Curt Noll);  

2006 లో వైద్య రంగంలో నోబెల్ బహుమతిని అందుకున్న ఆండ్రో ఫైర్ (Andrew Fire); జర్నలిజం రంగంలో జుజు చాంగ్ (Juju Chang), ఇక క్రీడా రంగంలో ఐతే పీటర్ వెబెర్రోత్ (Peter Ueberroth), బ్రియాన్ బైటనో (Brian Boitano), బెన్ని బ్రౌన్ (Benny brown), ట్రోయ్ టులోవిట్ జ్కి (Troy tulovitjki), ఫ్రాన్సీ లరియో - స్మిత్ (Francie Larrieu-smith), జో ప్రున్ టె (Joe Prunty) మొదలైన ఎందరో క్రీడాకారులు ఒలంపిక్, జాతీయ వివిధ క్రీడలలో తమ ప్రతిభను ప్రదర్శించి పురస్కారాలను అందుకున్నారు.  ఇలా సన్నివేల్ నగరంలో తమ ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసాలకు మెరుగులు దిద్దుకొని 'తారలై' వెలిగి తమ ప్రాంతానికి వన్నెను చేకూర్చిన వారయ్యారు.


https://lh4.googleusercontent.com/SeNzl-oLsk6_eXIP9sLZ6jILZYB2CZcHlxRQF4ukN_4FZkbMtQ1jsSY--3_P_yOyTlsBlRtFUtvgM6IOL46LZE-x6x1XNIDYHLUTJB-681PEqwR0z4w

సన్నివేల్ నగర 100 సంవత్సరాల ఉత్సవాలు (Sunnyvale Centennial Celebrations) :

విశిష్ట నగరాలలో శ్రేష్ట నగరంగా రూపొందుతున్న క్రమంలో సన్నివేల్ నగరం 1912 లో 'నగరం' మారి 2012 నాటికి వంద వత్సరాలైన సందర్భంగా వంద వసంతాల వేడుకలని ఇటీవల జరుపుకుంది. వాటి వివరాలు చూద్దాం.  

 

సన్నివేల్ నగరం 100 వసంతాల పండగ 2012 సంవత్సరం ఆగష్టు 25, 26 తేదీలలో సన్నివేల్  పూర్వ సంస్కృతి ఉద్యానవన పురావస్తుశాల (Sunnyvale Heritage Park Museum) మరియు సన్నివేల్ వాణిజ్య మండలి (Sunnyvale Chamber of Commerce) సౌజన్యంతో ఎంతో ఘనంగా నిర్వహించబడింది. కార్యక్రమాల జాబితా క్రింది విధంగా ఉంది:

 

మొదటి రోజు: శనివారం, ఆగష్టు 25 నాటి కార్యక్రమాలు :  

01.  .10 గం. నుండి 12 గం. వరకు ఫ్రేమొంట్ హై స్కూల్ నుండి హెరిటేజ్ పార్క్ దగ్గరున్న  కమ్మ్యునిటి

      సెంటర్ వరకు  సెంటినల్ పరేడ్.

02. .12 గం.లనుంచి .12 .30 వరకు స్టౌర్ట్ హైలండేర్స్  పైప్ బ్యాండ్ వారు బ్యాగ్ పైప్ సంగీతం

     వినిపిస్తారు.

03. .12 .30 నుంచి గం.1 వరకు ప్రకటనలు & వ్యాగన్ కథా వివరణ

04. . 1 నుంచి 3 గం. వరకు 'ది సేరేనడేర్స్' వారిచే 1940 బిగ్ బ్యాండ్ సంగీతం

05. . 3.15 నుంచి 3.45 వరకు స్వ్కేర్ నృత్యం

06. . 3.45 నుంచి 4 గంటల వరకు పోటీలలో పాల్గొన్న విజేతలు & వ్యాగన్ కథా వివరణ                  

07. సా. 4 గంటల నుంచి 5 వరకు స్టార్ గీజేర్స్ వారిచే 1950 మరియు 1960 సంగీత కార్యక్రమం

08. సా. 5 గంటలకు మొదటి రోజు ఉత్సవాల ముగింపు

09. రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు సన్నివేల్ సీనియర్ సెంటర్ ఆర్కేడ్ పెవీలియన్ లో లిన్డి ల్యాబ్

    మరియు స్వింగ్ నృత్య పాఠాలు

10. రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు టాప్ షెల్ఫ్ బిగ్ బ్యాండ్ వారి నుంచి ఆర్కేడ్ పెవీలియన్ దగ్గర

    వంద వసంతాల (Centennial) నృత్యం       

 

రెండో రోజు: ఆదివారం, ఆగష్టు 26 నాటి కార్యక్రమాలు :

01.  .8.30 గం. నుండి 11.30 వరకు చారిత్రాత్మక ద్విచక్ర (బైక్) వాహనాలపై ఊరేగింపు (Historical

     Bike Tour)    

02.  .11.30 గం.లనుంచి .12 గంటల వరకు మేయర్ గారి ప్రసంగం (State of the City Address)

     మరియు కమ్యూనిటి అందించే బహుమతుల ప్రదానం

03. .12.45 నుంచి 1.15 వరకు స్వ్కేర్ నృత్యం

04. .1.15 నుంచి 1.30 వరకు ప్రకటనలు & వ్యాగన్ కథా వివరణ

05. .1.30 నుంచి 3.30 వరకు 'ది సౌండ్ ఎఫ్ఫెక్ట్' వారిచే రాక్ మరియు పాప్ సంగీతం

06. . 3.30 నుంచి సా. 4 గంటల వరకు విజేతల పేర్ల ప్రకటన

07. సా. 4 గంటల నుంచి 5 గంటల వరకు 'బ్లూ గ్రాస్స్ జామ్' వారిచే ఫోక్సే బ్యాన్జో సంగీతం

08. సా. 5 గంటలకు ఉత్సవాల ముగింపు

 

ఇంకా ఈసందర్భంగా కే-2 చదివే చిన్నారులకు "నాకు నచ్చిన సన్నివేల్ నగర స్మృతి" అనే అంశం పై చిత్ర లేఖన పోటీ; ఇలాగే 3-5 తరగతులు చదివే పిల్లలకు 1. సన్నివేల్ అప్పుడు మరియు ఇప్పుడు; 2. సన్నివేల్ కు మా కుటుంబ ప్రయాణం; 3. కుటుంబము; 4. తాత / అమ్మమ్మ / నానమ్మ గారలతో ఇంటర్వ్యూ  అనే అంశాలతో వ్యాసరచన పోటి నిర్వహించార.  దీని విషయమై పోటీల వివరాలకు కో-చైర్మన్ గా వ్యవహరిస్తున్న లిండ కుబిట్జ్ గారి -మెయిల్ lindakub@sbcglobal.net నూ ప్రకటించారు.  

                                           వేడుకల్లో సంగీతాన్ని ప్రదర్శిస్తున్న దృశ్యం

 

సన్నివేల్ వందవసంతాల వేడుకలలో భాగంగా సన్నివేల్  పూర్వ సంస్కృతి ఉద్యానవన పురావస్తుశాల (Sunnyvale Heritage Park Museum) లో మరియు దాని చుట్టుపక్కల ప్రదర్శనార్థమై కొన్ని స్టాళ్ళను ఏర్పాటు చేశారు. అవి: 1. అలనాటి కమ్మరి (Black Smith) పనికి సంబంధించిన పనిముట్లు, అవి చేస్తున్న పనిని ప్రదర్శించి చూపారు. 2. ఈప్రాంతంలో ప్రాచీన కాలంలో జీవించిన మనుషుల, అన్య జీవుల పుర్రె, కపాలం, ఎముకలు మొదలైన అవశేషాల ప్రదర్శన; 3. వ్యవసాయ కార్యకలాపాల పరికరాలు; 4. దారాన్ని ఒడికే రాట్నం; 5. పురాతన ఎక్స్-రే (x-Ray) యంత్రం; 6. క్షుర కర్మకు ఉపయోగించిన వస్తువులు; 7. సన్నివేల్ ప్రాంతంలో పాతరోజుల్లో వాడిన ఇస్త్రీ పెట్టె, హీటర్, విద్యుత్ పొయ్యి వంటి గృహోపకరణాలు; 8. గుర్రపు నాడలు; 9. పిల్లల ఆటవస్తువులు; 10. కోడి గుడ్లను పొదిగి కోడి పిల్లలుగా మార్చే యంత్రం; 11. వంటింటి పాత్రలు - ఇలా గతంలో సన్నివేల్ లోని వారు ఉపయోగించిన ఎన్నో రకాల వస్తు సముదాయంలో నేటికీ లభ్యమయ్యే సామాగ్రి నంతా ప్రదర్శనకుపెట్టారు. ఇంకా ఇక్కడ మార్టిన్ మర్ఫి లాంటి ప్రముఖుల వస్తువులనూ; అలనాటి జైలు; మార్టిన్ మర్ఫి మందుల కొట్టు; జెనరల్ స్టోర్; 100 సంవత్సరాలను పూర్తి చేసుకున్న బాలికల స్కౌటు వంటి వాటన్నిటితోపాటు యావత్తు సన్నివేల్ నగరం నాడు మరియు నేడు ఉన్న తీరు మొత్తం 'మాదిరి' (Model) నీ ప్రదర్శించారు. ఇందులో రోడ్లను, రైలు మార్గాలనూ చూపారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసినదేమంటే రైలు పట్టాలపై నిజమైన రైలు లాంటి రైళ్ళు నడవడం చూడముచ్చటగా ఉండి చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. దృశ్యాన్ని క్రింది చిత్రం లో చూడొచ్చు


                  సన్నివేల్ వంద సంవత్సరాల వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన వస్తువుల్లో అలనాటి క్షౌర సామాగ్రి

               ఎక్స్-రే లేని రోజుల్లో దానిలా పనిచేసే అలనాటి యంత్రం


                             సన్నివేల్ వంద సంవత్సరాల వేడుకల్లో ప్రదర్శించిన అలనాటి వస్తువుల్లో కొన్ని

 

ఇంకా ప్రదర్శనలో  'ది లేడీస్ హోం జర్నల్'   యొక్క ఫిబ్రవరి, 1910 (Vol.  XXVII, No. 3) సంచికనూ ప్రదర్శనకు పెట్టారు. ఇందులో ప్రఖ్యాతుల పుట్టిన రోజు వివరాలు, స్త్రీల సమస్యల పై, అందాన్ని పెంపొందించే అంశంపై, వంటకాలు మొదలైన మహిళా లోకానికి చెందిన విషయాలపై వ్యాసాలున్నాయి. 1910 నాటికే పడతుల పత్రిక వుండడం, అందులో వారికి సంబంధించి రచనలుండడం ఇక్కడి వారి చైతన్యానికి నిలువుటద్దంగా నిలుస్తాయి. పత్రిక ముఖ చిత్రమే క్రింది ఛాయా చిత్రం.యేడు సన్నివేల్ కు మాత్రమే వంద వసంతాలు పూర్తి కావడం కాక ఇక్కడ స్త్రీల కోసం స్కౌట్స్ ఏర్పాటై కూడా అన్నే సంవత్సరాలైందన్న విషయం ఇక్కడి ప్రదర్శనను తిలకిస్తే తెలుస్తుంది.

ప్రదర్శనలో భాగంగా సన్నివేల్ లో జీవించిన కొందరు ప్రముఖుల ఫొటోలనూ ప్రదర్శించారు. వాటిలో ఇద్దరి ఫోటోలు క్రింద పొందుపరచబడినవి.

కార్యక్రమాలలో స్వయంగా సన్నివేల్ నగర మేయర్ పాల్గొన్నారు.. పాల్గొనడానికి వచ్చిన వారిని చిరునవ్వుతో వాలంటీర్స్ ఆహ్వానించారు, ఎటు వెళ్ళాలో, ఏమేమి ఎక్కడెక్కడ వున్నాయో విశ్లేషణ పూర్వకంగా వివరించి చక్కగా చెప్పారు. అలనాటి సాంప్రదాయ దుస్తులను ధరించి కొందరు వచ్చారు. అలాంటి వారిలో ఒకరితో వ్యాస రచయిత తో పాటు వారి శ్రీమతి తీయించుకున్న ఫోటో ను క్రింద చూడొచ్చు.

https://lh6.googleusercontent.com/V5_-IoLJbCPZkKL5pl3E6zE24H4TaEGNmm6qAMUC68jRnLIL1dtkqb6jAGshq7SmAMpt3G6FAS6706e_PdfKdik05guVWTUzB7BPhU7soKcr3AZU1Mo

ముగింపు :

సన్నివేల్ నగరం వంద వసంతాల మైలురాయిని చేరుకున్న చారిత్రిక శుభసందర్భంగా ఒక పోస్టల్ స్టాంపును విడుదల చేసివుంటే బావుండేది. ఇంకా శాశ్విత గుర్తుగా   సంచిక (Souvenir) ను ముద్రించి వుండాల్సింది. అలాగే నగరంతో విడదీయరాని అనుబంధమున్న ప్రముఖ రాజకీయవేత్తలు, క్రీడాకారులు, విద్యావేత్తలు, కళాకారులు, వ్యాపారవేత్తలు - ఇలా వివిధరంగాల వారిని సంబరాలకు పిలిచి, సన్నివేల్ నగరంతో వారికున్న అనుబంధం,  వారి అనుభవాలను పంచుకునేట్టుగా చేయాల్సింది.

జాతీయ స్థాయిలో వందలాది నగరాలున్న అమెరికాలోని సురక్షిత నగరాలలో 7వదిగా ఎంపికైంది సన్నివేల్ నగరం. ఎంపికకు ఆయా నగరాల పరిధిలో జరిగిన నేరాలు, ఉద్యోగ ప్రాంతాల్లో మరణాలు, ట్రాఫిక్ మరణాలు మరియు ప్రకృతి వైపరిత్యాల వల్ల ఏర్పడే ప్రాణ, ఆస్తి నష్టాలననుసరించి 'సురక్షిత'నగరాలన ఎంపిక చేస్తారు.  సన్నివేల్ నగరం కేవలం సురక్షిత ప్రాంతమే గాక 'ఆనందకర నగరం' (Happiest City) గా అమెరికన్ దూరదర్శన్ (Television) పబ్లిసిటీ ఎగ్సిక్యుటివ్ గా పని చేస్తున్న డా. ఓజ్ (Dr. Oz) గారు పేర్కొన్నారు. నగరం పలు ఉద్యానవనాలతో ఉన్నందునా, దారి పొడగునా అపార్టుమెంట్లలో, ఇండ్లలో చక్కటి 'లాన్' పెంచడం, పెద్ద పెద్ద చెట్లు వుండడం, ఇక కేంద్ర కార్యాలయాలున్నసంస్థలు అందమైన బహుళ అంతస్తులతో ఉండి సన్నివేల్ నగరానికి మరింత శోభను చేకూర్చుతున్నై. వీటన్నిటితో నగరం నగరమంతా పెళ్లి కూతురులా ముస్తాబై నిత్యం కళకళలాడుతూ "ఇంతింతై వటుడింతై ..." అన్న చందంగా సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతున్నది. ఇక మున్ముందు కూడా మరింత వేగంగా, ఉన్నతంగా ఎదిగి అన్య నగరాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ... వంద వత్సరాల సన్నివేల్ కు  వందనాలు.

--------------------------------------------------------------------------------------------------------------------------
వ్యాస రచనలో తోడ్పడిన మా కొడుకు, కోడలు అనన్య కుమార్ రాపోలు, సామవేదుల రత్న సమీర లకు నా ఆశీసులు.

 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech