ముఖపత్రం    
  వాఙ్మయ చరిత్రలో వ్యాస ఘట్టాలు - 10

పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి కావ్యాలు

సాహిత్య చారిత్రిక విశేషాలు (రెండవ భాగము)

 

                                             పరిశోధన వ్యాసం : డా. ఏల్చూరి మురళీధరరావు

 

సుజనరంజని గతమాసపు సంచికలో ప్రకాశితమైన “పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి కావ్యాలు” అన్న నా వ్యాసం మొదటి భాగంలో శ్రీ పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి గోత్రనామాదిక చర్చను చూసి ఈ వ్యాసపరంపరను గుణావగుణవిమర్శపూర్వకంగా ఎంతో ఆదరంతో చదువుతూ, లేఖాముఖముఖరితంగా నాకు అఖండమైన ప్రోత్సాహాన్ని కల్పిస్తున్న సహృత్సౌజన్యమూర్తి శ్రీ పిల్లలమఱ్ఱి కృష్ణకుమార్ గారికి నా వ్యాసాన్ని అభిప్రాయార్థం పంపించగా, వారు ఫెర్మాంట్ నుంచి – పిల్లలమఱ్ఱి వెలనాటి వైదికులలో తమది కౌశిక సగోత్రమని; నా వ్యాసంలో ఈ కౌశిక సగోత్రికుల ప్రసక్తి లేదని; అందులో భారద్వాజ సగోత్రులని ప్రస్తావితులైన శ్రీ పిల్లలమఱ్ఱి హనుమంతరావు గారు తమకు సన్నిహితబంధువులని; పూర్వం డా. ప్రసాదరాయ కులపతిగా ప్రసిద్ధులై ఇప్పుడు కుర్తాళం పీఠాధిపత్యాన్ని వహించి భక్తులకు ధర్మమార్గాన్ని ప్రబోధిస్తున్న శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి వరేణ్యులు ఆ రోజులలో “పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి మీ పూర్వికు” డని తమతో అంటుండేవారని – నాకు వ్రాశారు. శ్రీ కృష్ణకుమార్ గారి సహృత్పూర్ణమైన సుహృల్లేఖను సకృతజ్ఞంగా అందుకొని నేను ఈ విషయమై గుంటూరులోని నా మిత్రుల ద్వారా విచారింపగా పిల్లలమఱ్ఱి వారు వెలనాటి వైదికులలో కౌశిక సగోత్రులున్నారని; శ్రీ పిల్లలమఱ్ఱి హనుమంతరావు గారిది కౌశిక సగోత్రమేనని; శ్రీ కృష్ణకుమార్ గారు వ్రాసినదే వాస్తవమని; భారద్వాజ సగోత్రమని ఇంతకు మునుపు నాకు వివరాలను చెప్పినవారు పొరబడ్డారని రూఢమయింది. ఈ విశేషాలను నా సహవ్రతమిత్రులైన శ్రీ మద్దూరి లక్ష్మీనరసింహమూర్తి గారితో చర్చింపగా వారు గుంటూరులో ఉన్న తమ మామగారు శ్రీ మోరపాకల కామేశ్వరరావు గారి ద్వారా విచారించి, పిల్లలమఱ్ఱి వారిలో ఆరువేల నియోగులలోనూ కౌశిక సగోత్రులున్నారని మఱొక క్రొత్త విషయాన్ని తెలియజేశారు. దీనిని బట్టి సర్వశః పిల్లలమఱ్ఱి వారు వెలనాటి వైదికులలో కాశ్యప - కౌశిక సగోత్రాల వారు; ఆరువేల నియోగులలో కౌశిక - భారద్వాజ సగోత్రులు, వెలనాటి నియోగులలో భారద్వాజ సగోత్రులు ఉన్నారని తెలిసివచ్చింది. శ్రీ మల్లంపల్లి దుర్గామల్లికార్జున ప్రసాద్ శాస్త్రి గారి సంపాదకత్వంలో గొల్లమూడి వీరాస్వామి సన్ వారు 2006లో ప్రకటించిన బ్రాహ్మణుల గోత్రములు : ఇండ్లపేర్లు – శాఖలు అన్న పుస్తకంలోనూ ఇన్ని వివరాలు లేవు. పినవీరభద్రుని శృంగార శాకుంతలము (1-20)లో

          “క.    ఆ సుకవిచేత శివభజ

                నాసక్తుని చేతఁ గశ్యపాన్వయు చేతన్

                భాసుర నవకవితాలక్ష్మీ

                సదనునిచేత వలయుఁ గృతిఁ జెప్పింపన్.

          అని మాత్రమే ఉన్నది. అక్కడ “కౌశికాన్వయు చేతన్” అన్న పాఠాంతరం కూడా ఉన్నదేమో - ఇప్పటివఱకు బయల్పడలేదు. పెనుమళ్ళ సోమన పిల్లలమఱ్ఱి వారిది భారద్వాజ సగోత్రమని చెప్పాడు. అందువల్ల వ్రాతప్రతులను సాకల్యంగా పరిశీలిస్తేనే కాని ఈ గోత్రనిర్ణయాన్ని గూర్చిన తుదినిర్ణయం ఇప్పట్లో సాధ్యం కాదని మఱొక్కసారి వెల్లడయింది.

          ఈ మంతవ్యవిశేషాన్ని నాకు సూచించిన విద్వన్మణి శ్రీ కృష్ణకుమార్ గారికి నా సప్రశ్రయ సాధువాదాలను సమర్పించుకొంటున్నాను.

          వంశావళిని గుర్తించటానికి అధికరించిన చారిత్రకపరిశీలనమే గాని ఇది ఏతదతీతమైన మఱే ప్రస్తావనమూ కాదని గతసంచికలోనే నేను పఠితలకు విన్నవించుకొన్నాను.

* * *

          సుజనరంజనిలో నా వ్యాసాలను పరీక్షగా చదువుతున్న సహృదయమిత్రులు శ్రీ సంగుభొట్ల శ్రీనివాసమూర్తి గారు కనిగిరి నుంచి పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి రచనలలో ఒకటైన “మనువంశ పురాణము”ను నేను ప్రస్తావింపలేదని గుర్తుచేస్తూ – ఆ విషయమై తాము విన్న సంగతిని గుఱించి నాకు దయతో లేఖ వ్రాశారు.

          పినవీరభద్రకవి గాని, ఆయన వంశీయుడైన పెనుమళ్ళ సోమన గాని, తదితరులు కాని పినవీరభద్రకవి రచనావళిలో ఈ “మనువంశ పురాణమును పేర్కొనలేదు. అయితే ఇది పినవీరన పేరనే ముద్రితమయిందని, శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు గారు అచ్చువేసిన ఆంధ్ర వాఙ్మయ సూచికలో దాని వివరాలు ఉన్నాయని, 1898లో ముద్రితమని, తమ చిన్నప్పుడు ఆ “మనువంశ పురాణము” తమ ఇంట ఉండినదని, తాము చూశామని, ఆ తర్వాత అన్నదమ్ముల ఆస్తిపంపకాల కాలంలో అది తమ అన్నగారింటికి చేరిందని, ఇప్పుడు తమ అందుబాటులో లేదని, పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి రచనలలో దానిని చేర్పవలసి ఉంటుందని - సంస్కృతాంధ్రమహావిద్వాంసులు, సత్కవి, నాకు అత్యంత ఆత్మీయులైన శ్రీ విక్రాల శేషాచార్యుల వారు 1978 ఫిబ్రవరి భారతి పత్త్రికలోని “కలగూరగంప” శీర్షికాంతర్గతంగా ఒక చిన్ని లేఖారూపమైన వ్యాసాన్ని ప్రకటించారు. శ్రీ శ్రీనివాసమూర్తి గారి లేఖకు ఆధారం ఆ లఘువ్యాసమే.

          కర్తృత్వవిషయమై శ్రీ విక్రాల శేషాచార్యులవారు పొరపడ్డారని, పినవీరన “మనువంశ పురాణమును రచించిన మాట వాస్తవం కాదని - ఆ రోజులలో నేను వారికి లేఖ వ్రాసి, ఆ లేఖ ప్రతిని భారతికి పంపించాను. ఆ తర్వాత ఆ విషయమే గుర్తులేకపోయింది.

          అయినా, ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ విశేషాలను ఇక్కడ సంక్షిప్తంగా పొందుపరుస్తున్నాను.

          విశ్వదాత, భాషోద్ధారక శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి ఆంధ్ర వాఙ్మయ సూచిక తొలుత 1930లో అచ్చయింది. నా వద్ద హైదరాబాదు ప్రాచీ పబ్లికేషన్స్ వారు 1993లో ప్రకటించిన దాని పునర్ముద్రిత ప్రతి ఉన్నది. అందులోని ౧౪౬-వ పుటలో  శ్రీ విక్రాల శేషాచార్యుల వారు పేర్కొన్నట్లు “మనువంశ పురాణము” కర్త “పిల్లలమఱ్ఱి వీరభద్రకవి” అని ఉదాహృతమై ఉన్నది.

          అంతే కాదు. పిల్లలమఱ్ఱి పినవీరన రచించిన “శృంగార శాకుంతలము,జైమిని భారతము” కావ్యాల ఆరోపాలున్న చోట్ల కూడా శ్రీ నాగేశ్వరరావు పంతులు గారు కర్తృనామాన్ని “పిల్లలమఱ్ఱి వీరభద్రకవి” అనే ఉదాహరించారు. ౨౦౫-వ పుటలో 1910లో అచ్చైన “శృంగార శాకుంతలము; ౭౪-వ పుటలో 1875లో అచ్చైన “జైమిని భారతము” అన్న గ్రంథారోపాల వద్ద కృతికర్త పేరు “పిల్లలమఱ్ఱి వీరభద్రకవి” అనే ఉన్నది. ఈ విధంగా “మనువంశ పురాణము సందర్భంలోనూ కర్తృనామం ఏకరీతిని “పిల్లలమఱ్ఱి వీరభద్రకవి” అని ఉండటం విక్రాల వారి పొరపాటుకు కారణమై ఉంటుంది. ఎప్పుడో బాల్యవయోవస్థ నాడు చూచిన ముద్రిత ప్రతిని జ్ఞాపకం చేసికొని వారు భారతికి లేఖను వ్రాసి ఉంటారు.

          ఇంతకీ, ఈ “పిల్లలమఱ్ఱి వీరభద్రకవి” రచించిన “మనువంశ పురాణము” నిజానికి శ్రీ నాగేశ్వరరావు పంతులు గారు ఆంధ్ర వాఙ్మయ సూచికలో పేర్కొన్నట్లుగా 1898లో గాక 1897లో మచిలీపట్నంలో అచ్చయింది. 1897లో మొదట అచ్చై, ఆ తర్వాతి సంవత్సరమే 1898లో పునర్ముద్రణ జరిగిందేమో తెలియరావటం లేదు. 1912లో ఎల్.డి. బార్నెట్ సంకలనించిన A Catalogue of The Telugu Books in the Library of the British Museum లోనూ దీని ముద్రణ 1897 నాటిదనే ఉన్నది.  

          ఈ “మనువంశ పురాణము”ను రచించినది పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి కాదు. ఆయన పేరు పోచిరాజు వీరభద్రకవి. శ్రీ నాగేశ్వరరావు పంతులు గారు ఆంధ్ర వాఙ్మయ సూచికలో పొరపాటున “పిల్లలమఱ్ఱి వీరభద్రకవి” అని ఉదాహరించారు.

          ఈ “మనువంశ పురాణము” ఐదాశ్వాసాల చిన్ని పద్యకావ్యం. చంపూకృతి. కవితారీతి అంత ప్రౌఢం కాకపోయినా, ప్రశస్తమైన ధారాశుద్ధితో అలరారుతున్నది. దీనిని ఆ రోజుల్లో సుప్రసిద్ధ సంపాదకులైన మల్లంపల్లి భైరవమూర్తి అయ్యవార్లం గారు పరిష్కరించారు. వీరేశలింగం గారి “ఆంధ్ర కవుల చరిత్రము” ఆధారంగా పోచిరాజు వీరభద్రకవి క్రీ.శ. 1790 నాటి వాడని “శతక కవుల చరిత్రము” (పుటలు 402-3)లో నిడుదవోలు వెంకటరావు గారు వ్రాశారు. కాని, ముద్రితగ్రంథాన్ని బట్టి కవి 1750 – 1820 మధ్యకాలంలో జీవించినట్లున్నది. “కృష్ణార్జునసంవాద ప్రబంధము,ఆంధ్ర పంచకావ్యములు,విభూతి మాహాత్మ్య ద్విపదకావ్యము,మనువంశముఖ్యనృప పురాణము,శ్రీ ముక్తదేవకథ, సంస్కృతం నుంచి “ఆనందలహరి – “సౌందర్యలహరి,భర్తృహరి శతకత్రయము” అనువాదాలు;భల్లాణ చరిత్ర ప్రబంధము” ఈయన కృతులు.

          పోచిరాజు వీరన రచించిన “మనువంశముఖ్యనృప పురాణము” లేదా,మనువంశ పురాణము” బెజవాడ మల్లేశ్వరస్వామికి అంకితం. దీనికి ఖండ కాపాలకాఖ్యానము అనికూడా పేరున్నది. ఇందులోని పద్యాలలో రెండింటిని కందుకూరి వీరేశలింగం గారు ఆంధ్ర కవుల చరిత్రలో ఉదాహరించారు:  

        “మ.     ఖల! దుష్టాత్మ! మనుప్రభూత! బుధధిక్కారంబుఁ గావించి తీ

                        విల నీ యన్వయ మింతనుండి వసుధాధీశత్వనిర్ముక్తమై

                        తిలఘాతవ్యవహారలక్షణముతో దీనత్వముం బూని ని

                        ష్కళమై యుండెదుఁ గాత సర్వజనము ల్గర్హింప హైన్యంబనన్.

            శా.        భూనాథోత్తమ! మేదినీసురధనంబు ల్గోరఁగాఁ గూడ దీ

                        ధేనూతంసము యజ్ఞకార్యమున కాదిద్రవ్యమౌఁ గావునన్

                        దీనిం బట్టఁగరాదు మీ రఖిలధాత్రీపాలకుల్ ధర్మని

                        ష్ఠా నైపుణ్యులు మీ రెఱుంగని కథాసంఘం బిలం గల్గునే.”  

          ఏనాడో విస్మృతిపథంలో అంతర్హితమైన ఈ విషయాన్ని దాదాపు 35 ఏండ్ల తర్వాత స్మరింపజేసిన మిత్రులు శ్రీ శ్రీనివాసమూర్తి గారికి నా కృతజ్ఞతాపూర్వక నమస్సులను అర్పిస్తున్నాను.  

* * *   * * *   * * *

       పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవికి తెలుగు పలుకులు విరజిమ్మే విరజాజి విరుల పరిమళాలంటే చెప్పలేనంత మక్కువ. బహుశః కవులలో సుకవితాసౌగంధ్యానికి ఆయన వలె లోగి అంజలిబంధాన్ని ఘటించినవారు వేఱొకరు లేరనటం అతిశయోదితం కాదేమో. ఆయనకు “నన్నపార్యుని ప్రబంధప్రౌఢవాసనలు,తిక్కన యజ్వ వాగ్భక్కికామోదంబులు,నాచిరాజుని సోము వాచామహత్త్వంబు సౌరభంబులు,శ్రీనాథభట్టు భాషానిగుంభంబుల పరిమళంబులు” అభిమానపాత్రాలు.  ఆ మహాకవుల కావ్యాలకు సాటిగా “కర్పూర కస్తూరికా వస్తువితతికి శ్రీఖండచర్చ వాసించినట్లు” తన కవిత గుబాళించాలని ఆయన ఆదర్శం. సరస్వతిని ప్రార్థించినా,నా పలుకులలో పరిమళమేమన్నా లోపిస్తే, ఆమె చెవిసోకినప్పుడు కర్ణావతంసంగా ఉన్న కల్హార కుసుమపు విభ్రమాస్పదమైన సౌగంధ్యాన్ని ఆమె కొంత నా వాక్కులకు అలవరించును గాక!” అనే – “పొసఁగ న్నేఁ గృతిఁ జెప్పఁగాఁ బరిమళంబుల్ చాల కొక్కొక్కచోఁ, గొస రొక్కించుక గల్గె నేనియును సంకోచంబు గాకుండ నా, రసి యచ్చోటికి నిచ్చుఁగాత పరిపూర్ణంబొంద యిం, పెసలారం దన విభ్రమశ్రవణకల్హారోదయామోదముల్ (1-7) అనే ఆయన ఆకాంక్ష. వాక్సౌరభాన్ని అంతగా ఆరాధించిన మహాకవులు మనకు వేఱొకరు కనబడరు. ఆయన సాహిత్యసౌహిత్యమహావిహాయసంలో వెలసి వర్ణనాతీత సౌవర్ణకిర్మీరితమైన హరివిల్లును విరియింపజేసి వెలకట్టలేని వెలుగు బాటలు పఱిచిన మహాకవు లెంతోమంది ఉన్నారు కాని వారి ప్రభావాల నుంచి బైటపడి స్వీయవ్యక్తిత్వాన్ని సంతరించుకోవటానికి ఆయన చేపట్టిన ప్రస్థానం ఎటువంటిదో పరిశీలించటం ఆసక్తి గలవారికి ఆనందకరంగా ఉంటుంది.

 

రాఘవ భట్టు అర్థద్యోతనిక: పినవీరన శాకుంతల శృంగార కావ్యము   

       పినవీరన శాకుంతల శృంగారకావ్యమును రచించేనాటికి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలమునకు ఆసేతుశీతాచలవిశేషవ్యాప్తి ఉండినా, వ్యాఖ్యానాలు మాత్రం అప్పటికింకా చెప్పుకోదగినన్ని వెలువడలేదు. కాటయ వేమారెడ్డి గొప్ప వ్యాఖ్య కుమారగిరిరాజీయము ఒక్కటే  ప్రసిద్ధమై ఉన్నది. పినవీరన దానిని శ్రద్ధగా చదువుకొన్నాడు. నాటకంలో బహుధా ప్రయోగింపబడి ఉన్న వివిధ ప్రాకృత భాషాప్రయోగాలను అర్థంచేసుకోవటానికి, వ్రాతప్రతులలో మిక్కుటంగా ఉన్న పాఠదోషాలను సమన్వయించుకోవటానికి, రసవదర్థావగాహనకు, కవిహృదయావిష్కరణకు ఆ వ్యాఖ్య ఉపకరించింది. నచ్చినప్పుడు దానిని పెక్కుచోట్ల అనుసరించాడు. మైథిలేయ శంకరార్యుని అద్భుతావహమైన వ్యాఖ్య రసచంద్రిక క్రీ.శ. 1450 – 75 (±) నాటికే వెలసినా ఆ సంగతి పినవీరనకు తెలిసినట్లులేదు. ఆయన అనువాదంలో శంకరుని వ్యాఖ్య రసచంద్రిక ప్రభావం ఏ మాత్రం కనబడదు. శంకరునికి దాదాపు సమకాలికుడు, సమప్రాంతీయుడైన నరహరి మహామహోపాధ్యాయుడు రచించిన అభిజ్ఞాన శాకుంతల టిప్పణిని సైతం పినవీరన చూచినట్లు లేదు. చంద్రశేఖరుని సందర్భచింతామణి, అభిరాముని దిఙ్మాత్రదర్శన, దక్షిణావర్తనాథుని శాకుంతల వ్యాఖ్య, నారాయణభట్టు అభిజ్ఞాన శాకుంతల ప్రాకృత వివృతి, శ్రీనివాసాచార్యుల సాహిత్యటీక, నీలకంఠ దీక్షితుల శాకుంతల వ్యాఖ్యానము, బాలగోవింద వారిజుని గోవింద బ్రహ్మానందీయము, శ్రీకంఠాచార్యుని శాకుంతల వివృతి, ఘనశ్యాముని అభిజ్ఞాన శాకుంతల సంజీవని, ఇంకా అజ్ఞాతకర్తృకమైన శాకుంతల చర్చ మొదలైన ప్రసిద్ధవ్యాఖ్యలన్నీ ఎంత అమోఘములైనా అవి ఆయనకు తర్వాతి కాలంలో వెలసినవి.  అప్పటికి లేవు. ఆలంకారికులు తమ లక్షణగ్రంథాలలో కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలములోని పెక్కు శ్లోకాల సౌందర్యసారాన్ని మనోరమంగా విశదీకరించిన ప్రకరణాలన్నీ ఆ సమయంలో ఆయనకు దారిదీపాలై నిలిచాయి. ఇదంతా 1470 – 85 (±) నాటి మాట.

       ఆ కాలంలోనే 1480 (±) ప్రాంతాల పినవీరనకు వ్యాఖ్యాతృశిరోమణి రాఘవ భట్టు రచించిన సర్వవ్యాఖ్యానశిరోమణి అర్థద్యోతనిక అందుబాటులోనికి వచ్చింది. రాఘవ భట్టు సాహిత్యం, కాళిదాస హృదయావిష్కరణం, ఆ మహామహుని జీవితం; సరస్వతీదేవి నిత్యారాధనారూపమైన ఆ మానసస్నానం, ఆ మంత్రోపాసనం, ఆ నిదిధ్యాస, విజాతీయవృత్తులకు తావులేని సజాతీయవృత్తిప్రవాహం, మనస్సును నిర్విషయంగా ఉంచుకొని ధ్యానధారణ చేయగలగటం, ఆ మహాపాండిత్యం, ఆ ధర్మదీక్ష  ఆయనను లోగొన్నాయి. ఆ ఆదర్శానుసంధానమే ఆయనకు కర్తవ్యబోధ కావించింది. జీవితంలోనూ, సాహిత్యంలోనూ ధ్యానానికొక ధ్యేయవస్తువు లభించి కొత్త వెలుగులు పఱచుకొన్న శుభవేళ అది.  రాఘవ భట్టు అర్థద్యోతనికలో నిర్దేశించిన ప్రకారమే తన ఇతివృత్తాన్ని మలచుకొన్నాడు. అందుకు తగినట్లుగానే, కృతిపతి చిల్లర వెన్నమంత్రి ఆయనతో - 

        “శా.  ప్రఖ్యాతం బన మిశ్రబంధ మన నుత్పాద్యం బనంగాఁ ద్రిధా

                వ్యాఖ్యాతం బగు వస్తు; వందు మఱి యధ్యాహారముం జేయఁగాఁ

                బ్రఖ్యాతం బితివృత్తమైన కృతి చెప్పన్ వక్తకున్, శ్రోతకున్

                విఖ్యాతిం గలిగించుఁ బుణ్యమహిమన్ విశ్వంభరామండలిన్.

        క.     శృంగారము ముఖ్యం బగు

                నంగియు నంగములుఁ దలఁప నన్యరసములున్

                సాంగ మగునేనిఁ డంకము

                బంగారముతోడి యొర ప్రబంధమువొందున్.  శృం.శా.(1-24,5)

       అని పలికాడు. ఈ రెండవ పద్యంలోని “అన్యరసములున్” అన్నచోట “అష్టరసములున్” అన్న పాఠాంతరం కనుపించినందువల్ల ఆరుద్ర గారు కొంత విపులంగా చర్చించి, ఎఱ్ఱాప్రగడ నృసింహ పురాణములోనూ “అష్టరస” “ఇష్టరస” అని కనబడుతున్న పాఠభేదాలను గుఱించి విశదీకరించి, మొత్తంమీద “అష్టరస” పాఠానికే మొగ్గుచూపి సమగ్రాంధ్రసాహిత్యం (నాలుగవ సంపుటం)లో “క్రీ.శ. 14-15 శతాబ్దాలలో సోమరాజుపల్లె ప్రాంతాలలో విద్వాంసులు అష్టరసవాదు లనుకోవాలి” అన్నంతదాకా ఆలోచించారే కాని,అష్టరసములు” అన్నది అపపాఠమని; అది నాట్యసంబంధిరచనలకే వర్తిస్తుందని; శ్రవ్యకావ్యవిషయి కాదని;అన్యరసములున్” అన్నదే సత్పాఠమని; పినవీరన ఈ వాక్యాలను రాఘవ భట్టు అర్థద్యోతనిక నుంచి గ్రహించాడని;  రాఘవ భట్టు మాతృగుప్తాచార్యునిదిగా ఉదాహరించిన “శృఙ్గారవీరాన్యతరప్రధానరససంశ్రయమ్” అన్న దళాన్ని “శృంగారము ముఖ్యం బగు, నంగియు నంగములుఁ దలఁప నన్యరసములున్, సాంగ మగునేని” అని తెలుగుచేశాడని గుర్తించలేదు. గుర్తించి ఉంటే ఈ అపార్థానికి తావుండేది కాదు.

       అభిజ్ఞాన శాకుంతలమునాంది”లో రాఘవ భట్టు నాటకలక్షణాలను వివరిస్తూ మాతృగుప్తాచార్యుడు చెప్పినట్లుగా ఈ శ్లోకాలను ఉదాహరించాడు:

       “లక్షణ ముక్తం మాతృగుప్తాచార్యైః -

                ప్రఖ్యాతవస్తువిషయం ధీరోదాత్తాదినాయకమ్

                రాజర్షివంశచరితం తథా దివ్యాశ్రయాన్వితమ్

                వృద్ధివిలాసాద్యై ర్గుణై నానావిభూతిభిః

                శృఙ్గారవీరాన్యతరప్రధానరససంశ్రయమ్

                ప్రకృత్యవస్థాసన్ధ్యఙ్గసన్ధ్యన్తరవిభూషణైః

                పతాకాస్థానకై ర్వృత్తిం తదఙ్గైశ్చ ప్రవృత్తిభిః

       ఈ లక్షణానుసారమే పినవీరన తన లక్ష్యాన్ని నిర్ణయించుకొన్నాడన్నది స్పష్టం. “ప్రఖ్యాతవస్తువిషయం” అన్న సూచనను అందుకొని యథోచితంగా లక్షణాన్ని విస్తరించాడు. “శృఙ్గారవీరాన్యతరప్రధానరససంశ్రయమ్” అన్న దళానుసారం “శృంగారము ముఖ్యం బగు, నంగియు నంగములుఁ దలఁప నన్యరసములున్, సాంగ మగునేని” అని యథాతథంగా తెలుగుచేశాడు. ఇందులో ఏ అష్టరసవాదానికీ అవకాశం లేదు. పినవీరన చెప్పిన ఈ పద్యాన్ని చక్కగా చదువుకొన్న మహాకవి జక్కన తన “విక్రమార్క చరిత్రము (8-4)”లో “శృంగారాదిరసప్రసంగములుగాఁ జెప్పంగ నేర్తుం గథల్, సాంగోపాంగము గాఁగ” అని సువర్ణకలశం మాటగా విక్రమార్కుడు పద్మావతి కథను చెప్పించిన సన్నివేశంలో దీనినే అనుసరించాడు. రాఘవ భట్టు వ్యాఖ్యానుసరణం సంగతిని గుర్తించి ఉంటే ఆరుద్ర గారికి, ఇతర సాహిత్య చరిత్రకారులకు, విమర్శకులకు పినవీరభద్రకవి కాలనిర్ణయం సులభమై ఉండేది. కాళిదాసు మూలాన్ని, రాఘవ భట్టు వ్యాఖ్యను, పినవీరన అనువాదాన్ని దగ్గఱుంచుకొని పరిశీలిస్తే ఈ అనుసరణవిషయం మఱింత స్పష్టపడుతుంది. “శుకగర్భకోటరముఖభ్రష్టాః తరూణా మధః” అని కాళిదాసు. “వృక్షాణా మధః తృణధాన్యాని సన్తీతి; శుకా గర్భే మధ్యే యేషాం తాని చ కోటరాణి తరువివరాణి తేషాం ముఖాని తేభ్యో భ్రష్టాః” అని రాఘవ భట్టు. “శుకగర్భకోటరచ్యుతములై నివ్వరి ప్రా ల్కిందఁ జెదరిన పాదపములు” అని పినవీరన. “ఇఙ్గుదీఫలభిదః సూచ్యన్త ఏ వోపలాః” అని కాళిదాసు. “ఇఙ్గుదీ తాపసతరు స్తత్ఫలాని భిన్దన్తీతి భిదః. ఉపలాః పాషాణాః” అని రాఘవ భట్టు. “తలలకు గారకాయలు నూఱ నందులఁ జమురంటి మెఱయు పాషాణతతులు” అని పినవీరన. ఇంకా తోయాధారపథా శ్చ వల్కలశిఖానిష్యన్దరేఖాఙ్కితాః అని కాళిదాసు. “నిబిడవల్కలశిఖానిష్యన్దరేఖల జాఱులు గల జలాశయపదములు (వ్యాఖ్యానుసారం “జలాశయపథములు” అని దిద్దుకోవాలి)” అని పినవీరన. ఇటువంటివన్నీ రాఘవ భట్టు అర్థద్యోతనిక ఆధారంగా తెలుగుచేసినవే. కేవలం అవతారికా సందర్భంలోనే కాక పినవీరన రాఘవభట్టు లోకోత్తరమైన మహావ్యాఖ్య అర్థద్యోతనికను పెక్కుచోట్ల అనుసరించటం కనుపిస్తుంది. “ఆలవాలపూరణే” అని కాళిదాసు. “వృక్షసేచనే” అని రాఘవ భట్టు. “వృక్షసేచనము సేయన్” అని పినవీరన. “మృగానుసారిణం” అని కాళిదాసు. “మృగరూపధరయజ్ఞానుసారిణం అని రాఘవ భట్టు. “యజ్ఞమృగము వెంబడి” అని పినవీరన. “ముక్తేషు రశ్మిషు నిరాయతపూర్వకాయా, నిష్కంపచామరశిఖా నిభృతోర్ధ్వకర్ణాః, ఆత్మోద్ధతై రపి రజోభి రలఞ్ఘనీయా, ధావ న్త్యమీ మృగజవాక్షమయేవ రథ్యాః (1-8)” అని కాళిదాసు. “శ్రవణములు నిక్క నిష్కంపచామరాగ్ర, ములను నిర్యాతపూర్వాంగములఁ దనర్చి, ఘనఖురోద్ధూతరేణువు గడవఁ బాఱి, నిగిడె భువి తేరి హయములు మృగజయములు (1-118)” అని పినవీరన. “నిరాయతో నితరాం దీర్ఘః పూర్వకాయః యేషాం తే;నిభృతోర్ధ్వకర్ణాః నిభృతౌ నిశ్చలా వూర్ధ్వకర్ణౌ యస్య సః;మృగస్య జవో వేగ స్త దక్షమయా త దక్షాన్త్యేవ” అని రాఘవ భట్టు. “నిభృతోర్ధ్వకర్ణాః అన్నదానికి “నిశ్చలా వూర్ధ్వకర్ణౌ” అన్న వివరణానుసారం “శ్రవణములు నిక్క అని చక్కటి తెలుగుసేత. నిరాయత” అంటే “సాగిన – సుదీర్ఘమైన – నితరాం దీర్ఘః” అని అశ్వాలకు అన్వయం. నిర్యాత” అంటే “బయలు వెడలిన” అని అనువాదదోషం. మూలాన్ని బట్టి, రాఘవ భట్టు వ్యాఖ్యానుసారం  

       “గీ.   శ్రవణములు నిక్క, నిష్కంపచామరాగ్ర

                ముల నిరాయతపూర్వాంగములఁ దనర్చి,

                ఘనఖురోద్ధూతరేణువు గడవఁ బాఱి

                నిగిడె భువి తేరి హయములు మృగజవములు 

       అని పద్యాన్ని సవరించుకోవాలి. ముద్రితప్రతులలో ఇటువంటివి కోకొల్లలున్నాయి. రాఘవ భట్టు వ్యాఖ్యలో లేనప్పుడు కాటయ వేమారెడ్డి నుంచి ఆయన గ్రహించిన భాగాలూ అనేకం ఉన్నాయి. “శాన్త మిద మాశ్రమపదం స్ఫురతి చ బాహుః కృతః ఫల మిహాస్య” అని కాళిదాసు. రాజుకు కలిగిన కుడిభుజం అదరిపాటును శకునవిశేషంగా గ్రహించి రాఘవ భట్టు విశేషవ్యాఖ్యను వ్రాయలేదు. కాటయ వేమారెడ్డి “అస్య స్ఫురణస్య ఫలం ప్రియాలిఙ్గనరూపం” అని చక్కగా వినిర్దేశించాడు. పినవీరన అందుకొన్నాడు:

 

       “చ.   చనునెడ నంతలోఁ గుడిభుజం బదరంగఁ దొణంగినన్, మనం

                బునఁ గడుఁ జోద్యమందుచుఁ, దపోవన! మిచ్చట దీనికిన్ ఫలం

                బొనర మనోజ్ఞమూర్తి యగు యుగ్మలిఁ గౌఁగిలిఁ జేర్పఁగా వలెన్;

                గొనకొని యీశ్వరుండ యెఱుఁగుం గనరానిది మానుషంబునన్.

 

       అని (1-51) విపులీకరించాడు.   

కథాసంవిధానంలో మార్పుతీర్పులు   

       అయితే పినవీరన కేవలం రాఘవభట్టు వ్యాఖ్యానపంక్తులను మాత్రమే అన్వయించుకొంటూ శాకుంతలానువాదాన్ని చేపట్టలేదు. అసలు కాళిదాసు మూలం కూడా ఆయనకు మాతృక అని చెప్పలేము. అందుకు కారణం అనువాదవిషయంలో ఆయన సర్వతంత్రస్వతంత్రత, కృతిస్వీకర్త చిల్లర వెన్నమంత్రి ఆదేశం:        

       “గీ.    భారతప్రోక్తకథ మూలకారణముగఁ

                గాళిదాసుని నాటకక్రమము కొంత

                తావకోక్తికి నభినవశ్రీ వహింపఁ

                గూర్మిఁ గృతిసేయు నాకు శాకుంతలంబు.      శృం.శా.(1-26)

 

       అని వెన్నమంత్రి పినవీరనను తనకు శాకుంతల కథను చెప్పమని కోరాడు. ఆ కోరినట్లుగానే, పినవీరన ఆయన అభీష్టానుసారం కావ్యాన్ని కొంత భారతంలోని కథానుసారం గానూ, కొంత కాళిదాసు నాటకానుసారం గానూ, కొంత తనకు నచ్చిన తీరు మార్పుతీర్పులతోనూ మలుచుకొన్నాడు. కావ్యారంభంలో కాళిదాస దుష్యంతుడు వేటకు బయలుదేరి, అడవిలో హరిణాన్ని చూసి - దానిని వెంబడిస్తూ కణ్వాశ్రమానికి రావటం – అన్న ఉదంతాన్ని గ్రహించి అతివిపులంగా హస్తినాపుర వర్ణనను, కథానాయకుడు దుష్యంతుని రూప యౌవన పరాక్రమాదులను, పుళిందకులు వచ్చి రాజు తమను కాపాడటానికి అడవికి వచ్చి దుష్టసత్త్వాలను మట్టుపెట్టాలని కోరటం, ఆ వేటకు ఏర్పాట్లు, దుష్యంతుని అరణ్యాగమనాన్ని, మృగయావినోదాన్ని ప్రవేశపెట్టాడు. తెలుగు ప్రబంధాలలోని అష్టాదశ వర్ణనలలో వేటకొక వరవడిని కల్పించాడు. దుష్యంతుడు మృగాన్ని అనుసరించి ఆశ్రమప్రవేశం చేయటం; అక్కడొక తపస్వి అతనిని చూసి చక్రవర్తిలక్షణోపేతుడైన కొడుకు కలగాలని దీవించటం; రాజుకు కుడిభుజం అదరిన శుభసూచన; కాంతాసమాగమమం సిద్ధింపనున్నదన్న ఆలోచన; ఆశ్రమంలో దుష్యంతుడు అనసూయా ప్రియంవదలతో ఉన్న అందాలరాశి శకుంతలను చూడటం; వారి సరసప్రసంగాలు; శకుంతల ముఖంపైకి తుమ్మెద వాలబోవటం; దుష్యంతుడు వారి కంటబడటం; శకుంతలా దుష్యంతుల ప్రేమ -  ఇవన్నీ యథాతథంగా కాళిదాసు నాటకం నుంచి గ్రహించిన సన్నివేశాలు. కాళిదాసు కమనీయంగా సూచించి విడిచిన శకుంతల పుట్టుకకు సంబంధించిన అతీతఘటనను చెలికత్తెల నోట చెప్పిస్తే అనుచితమని ఒక మునికుమారునిచేత రాజుకు చెప్పించాడు. అంతలో భారతాన్ని అందుకొని మేనకా విశ్వామిత్రుల ప్రణయగాథను, శకుంతల జన్మవృత్తాంతాన్ని నోరారా వర్ణించాడు. నర్మసఖునితో దుష్యంతుడు తన మనోగతాన్ని వెల్లడించటం; లతామంటపంలో శకుంతల విరహవేదన; దుష్యంతుడు చాటున ఉండి వారి ప్రసంగాన్ని ఆకర్ణించటం; నాయికా నాయకుల గాంధర్వ వివాహం - కాళిదాస నాటకానుసారం నడిచిన ఘట్టాలే. అక్కడ స్వతంత్రించి శకుంతలా దుష్యంతుల శృంగారాన్ని ప్రబంధోచితమార్గాన అతివేలంగా నిరూపించాడు. ఆ సమయంలో శచీతీర్థంలో పరమేశ్వరుని గూర్చి తపస్సు చేసుకొంటున్న కణ్వ మహర్షి ఆశ్రమంలో జరిగిన వృత్తాంతమంతటినీ తన దివ్యదృష్టితో గుర్తెఱిగినట్లు; వెనుదిరిగి వచ్చిన తర్వాత ఆయన ఆశ్రమవాసులకు గాంధర్వవిధిని జరిగిన శకుంతలా దుష్యంతుల కళ్యాణగాథను తెలియజేసినట్లు ప్రకల్పించాడు. అందువల్ల ఆశ్రమంలో శకుంతల శీలాన్ని గుఱించి నిష్కారణంగా అపవాదులు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకొన్నట్లయింది. ఆ తర్వాత శకుంతల గర్భాన్ని దాల్చటం; కణ్వ మహర్షి ఆశ్రమంలోనే ఉండి, కొడుకు పుట్టిన కొంతకాలానికి కణ్వుడు ఆమెను భర్త వద్దకు పంపించటం అన్నదాన్ని మళ్ళీ మహాభారతం నుంచి తీసుకొన్నాడు. కణ్వుడు ఇంట లేనప్పుడు దుష్యంతుడు ఆమెకు తన పేరున్న ఉంగరాన్ని ఆనవాలుగా ఇచ్చి నగరికి వెళ్ళిన తర్వాత శకుంతలను దుర్వాస మహర్షి శపించినట్లుగా ఉన్న ఘట్టాన్ని కాళిదాస కృతినుంచి గ్రహింపక కణ్వుడు స్నానార్థం మాలినీ తీరానికి వెళ్ళినప్పుడు దుర్వాసుని శాపం వాటిల్లినట్లు చిత్రీకరించాడు. అవివాహితలైన అనసూయా ప్రియంవదలను శకుంతలతోపాటు రాజువద్దకు పంపించటం సమంజసం కాదనుకొన్నాడేమో – కాళిదాసు వారిని కణ్వాశ్రమంలోనే నిలిపివేశాడు. దుర్వాస మహర్షి శాపం సంగతిని చెప్పక అనసూయా ప్రియంవదలు శకుంతల అత్తవారింటికి వెళ్ళేముందు ఆమెతో “నీ ఉంగరం జాగ్రత్త” అని మాత్రం హెచ్చరించినట్లు కాళిదాసు వ్రాశాడు. పినవీరన వారిని కూడా తోడుగా పంపించటమే గాక వారిచే అక్కడ ప్రభావశీలమైన పాత్రను పోషింపజేశాడు. శచీతీర్థంలో స్నానంచేస్తున్నప్పుడు ఆమె చేతి ఉంగరం నీటిలో జాఱిపోవటాన్ని యాథాతథ్యంతో స్వీకరించాడు. భారతంలో వలెనే “ఆకాశవాణి” నిండుసభలో శకుంతలను గూర్చిన నిజాన్ని లోకానికి వెల్లడించినట్లుగా అనువదించుకొన్నాడు. లోకానికి నిజం తెలిసిన వెంటనే మహాభారతం, పద్మపురాణం, అభిజ్ఞాన శాకుంతములు వేటిలోనూ లేని విధంగా నిజం వెల్లడైన తర్వాత అనసూయా ప్రియంవదలు ఉంగరాన్ని బయటికి తీసి తీవ్రమైన నిష్ఠురోక్తులతో నిండుసభలో రాజుమీదికి విసరివేసినట్లుగా కసిదీఱ వ్రాశాడు. శకుంతలా దుష్యంతులు ఒకరినొకరు అర్థంచేసుకొని ఏకమైన తర్వాత నారద మహర్షిని ప్రవేశపెట్టి రాజనీతిని బోధించిన సన్నివేశం సరిక్రొత్తగా ఉన్నది. ఆ తర్వాత దుష్యంతుడు పెద్దవాడ నైనందున కొడుకు భరతునికి యౌవరాజ్యపట్టాభిషేకం చేసి వానప్రస్థానికి వెళ్ళాలని నిశ్చయించుకొంటాడు. మొత్తానికి ఆ విధంగా “శకుంతలయు దుష్యంతుఁడును బెద్దకాలంబు రాజ్యసౌఖ్యంబు ననుభవించుచుండిరి” అని కథను నిర్విఘ్నపరిసమాప్తం చేశాడు. ఇవన్నీ నూత్నకల్పనలే.  

సందర్భగ్రంథాభిమానం  

       పినవీరన ప్రాచీనకవు లందరి వలెనే భూయోగ్రంథశీలితకు అలవాటుపడినవాడు. కవిత్వాభ్యాసానికి దైవదత్తమైన ప్రతిభతోపాటు వ్యుత్పత్తిగౌరవం తప్పనిసరి అని భావించిన రోజులవి. ఈ విషయంలోనూ పినవీరనకు శ్రీనాథుడే గురువు. శాకుంతల శృంగారకావ్యమును చదివినా, ఆ తర్వాత రచించిన జైమిని భారతమును చదివినా గ్రంథమంతటా పఱచుకొని ఉన్న విశాలవిచక్షణతా; బహురూప శాస్త్రపాండిత్యాన్ని ముద్దచేసి అరచేతిలో   పెట్టుకొన్న వ్యుత్పత్తిగౌరవమూ; సంధానగ్రంథాలలోనూ, వ్యాఖ్యాతౄదాహృతాల లోనూ తాను తెలుసుకొన్న సమస్త విజ్ఞానసంపదను రసికవశంగతం చేయాలనే అనువివక్ష – శ్రీనాథపథీనతను జ్ఞాపకం చేస్తాయి. ఎక్కడెక్కడివో ఘట్టితాంశాలను తన పద్యకల్పనలో అంతర్భావింపజేయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. హస్తినాపురంలో ఉచ్చైఃశ్రవాల వంటి ఉత్తమాశ్వాలను వర్ణిస్తూ (1-80) అంటాడు:

 

       “శా.   పక్షంబుల్ మును శాలిహోత్రుఁడు శపింపం బోయినం బోవనీ;

                శిక్షానైపుణి నర్కు తేజుల నధిక్షేపింపఁగాఁ జాలిన

                ట్లక్షీణత్వర నింగి నైన గతిసేయంజాలు నుచ్చైఃశ్రవ

                స్సాక్షాత్కారము లప్పురిం దురగముల్ ఝంపాకళాసంపదన్. 

       అని. పర్వతాలకు వలెనే పూర్వం అశ్వాలకు కూడా ఱెక్కలుండేవట. ఇంద్రుడు పర్వతాల ఱెక్కలను తెగనఱికిన కొంతకాలానికి శాలిహోత్ర మహర్షిని కలిసికొని, ఆశ్వాలకు సైతం ఱెక్కలు లేకుండా చేయమని ఆదేశించాడట. హస్తినాపురంలోని ఆశ్వాలు మాత్రం ఱెక్కలు లేకపోయినా సూర్యరథాశ్వాలను సైతం ఆక్షేపింపగలిగిన శిక్షానైపుణిని కలిగినవట. తేజి = ఉత్తమాశ్వం. “అర్కు తేజులు” అనటం సాభిప్రాయం. అర్చ = పూజాయామ్ అన్న అర్థంలో ఘఞ్ ప్రత్యయం. అర్క = స్తవనే అన్న అర్థమూ భావ్యమే. పూజింపదగినవీ, మిక్కిలి పొగడదగినవీ అయిన సూర్యాశ్వాలను సైతం అధిక్షేపింపగలిగిన దేహదార్ఢ్యం, ఆకాశంలో తేలిపోతున్నట్లు పరిగెత్తటం వల్ల ఉచ్చైఃశ్రవాన్ని ప్రత్యక్షీకరించే వేగసంపద, కామగమనం కలిగినవని విషయగతమైన ప్రకృతోపయోగితకు నిర్ణాయకంగా విషయతాద్రూప్యాన్ని పరిణామశరీరంగా నిలిపాడు. నకులుడు అశ్వచికిత్సలో చెప్పినట్లుగా భోజుడు తన యుక్తికల్పతరువులో ఈ ఉదంతాన్ని స్మరించాడు:  

       “సపక్షా వాజినః పూర్వం సంజాతా వ్యోమచారిణః

        గన్ధర్వేభ్యో యథా కామం గచ్ఛన్తి చ సమన్వితాః

        ఇన్ద్రాదేశా చ్ఛాలిహోత్ర స్తేషాం పక్ష మథాచ్ఛినత్

        తతః ప్రభృతి నిష్పక్షా స్తరఙ్గా ధరణీం గతాః.”    యుక్తికల్పతరువు (శ్లో. 23,4) 

        పినవీరన నకులుని అశ్వచికిత్సనే చూశాడో, భోజుని యుక్తికల్పతరువునే చదివాడో కాని తెలుగు పాఠకులకు మాత్రం ఆ విశేషాన్ని కన్నులకు కట్టాడు. 

       సామాన్యంగా అందరికీ అందుబాటులో లేని అపురూపములైన గ్రంథాలను చదవటం వల్ల వాటిలోని అనర్ఘకల్పనలను ఆంధ్రీకరించటం ఆయనకు చాలా ఇష్టం.  

       మఱొక్క ఉదాహరణను చూపుతాను:  

       “ప్రభు రసి వయం మాలాకారవ్రతవ్యవసాయినో

        వచనకుసుమం తేనాస్మాభి స్తవాదరఢౌకితం

        యది తద్గుణం కణ్ఠే మా థా స్తథోరసి మా కృథా

        నవమితి కియత్కర్ణే ధేహి క్షణం ఫలతు శ్రమః.

 

       అని శ్లోకం. ఇది క్రీస్తుశకం 11-వ శతాబ్దికి పూర్వుడైన వీర్యమిత్రాచార్యునిదట. “ఓ ప్రభూ! నేను నీ తోటలో పువ్వులను దండకట్టే మాలాకారుని వంటివాణ్ణి. నీ యందలి గౌరవంతో నీ ఆదరాతిశయం మూలాన వికసించిన ఈ వచనకుసుమాన్ని నీకు సమర్పిస్తున్నాను. నీ కంఠసీమను అలంకరించుకోవటానికి తగిన గుణసంపద లేకపోతే, నీ వక్షఃస్థలాన రాణించదంటే – కనీసం నవవికసితమన్న ఆదరంతో క్షణమాత్రం ఈ వాక్పుష్పాన్ని నీ చెవిసోకనివ్వు.  నా శ్రమకు తగిన ఫలం అదే కదా! అని భావం. వచనకుసుమానికి ప్రభువుకు సమర్పింపదగినంత గుణసంపద లేకపోతే – అంటే, వికాసగుణం లోపిస్తే అని ఒక అర్థం; పువ్వులను కట్టివుంచిన గుణం - దారం బలంగా లేక విడిపోనున్నవేమో అని కొంత సంకోచం. పువ్వుకు తగిన సుగంధం లోపించినా, నవవికసితం అన్న ఆదరాన్నైనా చూపించు – అంటే, తన వచనంలో (రాజుకు వినిపించిన పొగడ్తలో) అంతగా కావ్యగుణాలు లేకున్నా ఎన్నుకొన్న మార్గం సరిక్రొత్తది కాబట్టి ఆదరం చూపమని ప్రార్థన.

 

       వీర్యమిత్రాచార్యుని ఈ శ్లోకాన్ని క్రీస్తుశకం 11-వ శతాబ్ది (±) నాటి విద్యాకరుడు తన సుభాషితరత్నకోశంలో 1418-వదిగా ఉదాహరించాడు. దీనిని చదువుకొన్న పినవీరన తన శాకుంతల శృంగార కావ్యము (1-7)లో

 

       “మ.  పొసఁగన్ నేఁ గృతిచెప్పఁగాఁ బరిమళంబుల్ చాల కొక్కొక్కచోఁ

                గొస రొక్కించుక కల్గెనేనియును సంకోచంబు కాకుండ నా

                రసి యచ్చోటికి నిచ్చుఁగాత పరిపూర్ణంబొంద వాగ్దేవి యిం

                పెసలారం దన విభ్రమశ్రవణకల్హారోదయామోదముల్.

 

       అని, సరస్వతీ స్తోత్రవర్ణనకు పరికరింపజేసుకొన్నాడు. వీర్యమిత్రుని శ్లోకానికి అద్భుతంగా మెఱుగులు దిద్దాడు. పరిమళం చాలక తన కృతికుసుమంలో సంకోచం వాటిల్లినట్లయితే, కనీసం రాజు చెవిసోకినా చాలునని వీర్యమిత్రుడు ఆశించాడు. పినవీరన తన చెవికమ్మగా ఉన్న సౌగంధిక పుష్పం నుంచి ఉదయిస్తున్న ఆమోదాలు (పరిమళపరంపర) పాఠకలోకంలో తన కృతికి ఆమోదాన్ని ప్రసాదింపజేయాలని ప్రార్థించాడు. రాజు చెవిసోకితే కవికి సమ్మానాలు దక్కుతాయని కాబోలు. వాగ్దేవి చెవిసోకితే కృతికి సురభిళమైన పరిమళం అబ్బి విశ్వవ్యాప్తం కాగలదని పినవీరన ఆశించాడు. తన రచనలో పూరణీయమైన లోపం ఎక్కడైనా కొద్దిగా ఉన్నట్లయితే “కొసరు ఒక్కించ్చుక కల్గెనేనియును” ఆ చోటును వాగ్దేవి ఆరసి – అచ్చోటికి ఇచ్చుగావుత అనటం వల్ల తన కృతి సహజపరిమళంతో కూడుకొన్నదని; ఎంతటి వాగ్దేవికైనా “ఆరసి” చూడవలసి ఉంటుందని (ఆరస = విచారించి అని సామాన్యార్థం; వెతికి అని ఉద్దేశితార్థం) సూచించాడు.                              

పినవీరన కాలం 

       శాకుంతలంలో పినవీరన కాలాన్ని నిర్ణయించటానికి చారిత్రకాధారాలు తక్కువ. కొర్లపాటి శ్రీరామమూర్తి గారు తెలుగు సాహిత్య చరిత్ర (ద్వితీయ భాగము)లో కావ్యం చిల్లర వెన్నమంత్రికి అంకితమైనందువల్ల వెన్నమంత్రి కాలాన్ని ఊహించే ప్రయత్నం చేశారు. ఆయనకు నాలుగు తరాల మునుపు “పంట నృపకౌస్తుభములకు పాలవెల్లి” అయిన సోమరాజుపల్లి “పైతామహస్థానం”. పంటనృపులు అంటే రెడ్డిరాజు లన్నమాట. ఆ రెడ్డిరాజులలో మొదటివాడు ప్రోలయ వేమారెడ్డి రాజ్యకాలం క్రీ.శ. 1324,25 – 53ల మధ్య కనుక చిల్లర వెన్నమంత్రి పితామహుడు మేడన ఉన్నట్లయితే వెన్నమంత్రి ప్రాభవకాలం క్రీ.శ. 1454,55 – 1483 కావచ్చునని నిర్ణయించి శ్రీరామమూర్తి గారు పినవీరన ఆయనను ఆశ్రయించి కృతిసమర్పణ చేసినది క్రీ.శ. 1480 అని నిశ్చయించారు. రాఘవ భట్టు కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలమును అధికరించి వ్రాసిన అర్థద్యోతనిక కూడా క్రీ.శ. 1480 – 85ల నాటిది. అందువల్ల పినవీరన శాకుంతలానువాదం ఆ పైని మూడు నాలుగేళ్ళకు జరిగినదనుకొంటే, క్రీ.శ. 1485 - 90 ప్రాంతాల చిల్లర వెన్నమంత్రికి కృతిసమర్పణ జరిగిన దన్నమాట. ఇక, జైమిని భారతమును గుఱించి చర్చింపనున్న చిట్టచివరి వ్యాసంలో వచ్చే నెల ఈ విశేషాలను క్రోడీకరిస్తాను.          

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech