Sujanaranjani
           
  శీర్షికలు  
       తెలుగు తేజోమూర్తులు
 
 

- రచన : ఈరంకి వెంకట కామేశ్వర్. 

 

తమ తమ రంగాలలో నిష్ణాతులై, విశిష్టతనాపదించుకుని, పేరు ప్రఖ్యాతులనార్జించి "గొప్పతనం" సాధించిన తెలుగువారెందరో ఉన్నారు. వాళ్ళు యెదుర్కున్న ప్రతిబంధకాలు, సంక్లిష్ట పరిస్థితులు, అనుభవించిన నిర్భందాలు, పడిన ఆవేదన, చేపట్టిన దీక్ష, చేసిన కృషి, సాధన, కనపరచిన పరాకాష్ట, సాధించిన విజయాలు, ఆ విజయ రహస్యాలు, ఇలాంటి విషయాలని పరిశీలించి, సమీకరించి, పొందుపరచి ఈ కధనాలలో మీ ముందు ప్రస్తుతీకరిస్తున్నాం


కవి, సంగీతజ్ఞుడు, కళాప్రపూర్ణ బాలాంత్రపు రజనీకాంత రావు

సంగీత సాహిత్యాలలో దిట్ట. ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో) లో నాలుగు దశాబ్దాల పాటు వినూత్న ప్రయోగాలు చేస్తూ సరికొత్త కార్యక్రమాలను శ్రీకృతం చేశారు. ఆయన ఆరంభించిన "భక్తిరంజని" కార్యక్రమం విశిష్ట ఆధరణ పొంది చాలా కాలం సాగింది. ఈయన రచించిన ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర ఈ శతాబ్దపు మేటి రచనలలో ఒకటిగా నిలిచింది. అంతే కాదు అనేక అపూర్వ సంగీత రూపకాలను నిర్మించారు. ఇలా తెలుగు కళామాతకు సేవలు అందించిన వారు అరుదు. సంగీతకారుడిగా, రచయితగా, కవిగా, రూపక కర్తగా, ఆకాశవాణి సంచాలకుడిగా తెలుగు సంగీత సాహిత్య రంగాలలో తనదైన ముద్రవేశారు కళాప్రపూర్ణ శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు గారు.

జననం, చదువు, ఉద్యోగం:
జనవరి 29, 1920 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గోదావరి జిల్లాలోని నిడదవోలులో జన్మించారు. వీరి తండ్రి కవి రాజహంశ బాలాంత్రపు వెంకట రావు గారు (వెంకట పార్వతీశ కవులలో ఒకరు). ఇలా పండిత వంశంలో పుట్టి చక్కటి విద్యాభ్యాసానికి ఉపక్రమించారు రజని గారు. తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో చదువుకున్నారు. తరువాత కాకినాడ పీ ఆర్ కాలేజి నుండి ఉత్తీర్ణులయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బి ఏ పట్టా అందుకున్నారు. అప్పటి ఉప కులపతి కట్టమంచి రామలింగారెడ్డి గారు రజనీకాంత రావు గారితో కలసి పాడేరట. మనలో మాట రామలింగా రెడ్డి గారికి తెలుగు భాష మీద అవ్యాజమైన ప్రేమ!.

1941 ఆల్ ఇండియా రేడియో మద్రాసులో తన ఉద్యోగ పర్వం మొదలుపెట్టారు. స్వతంత్ర భారత దేశంలో తెలుగులో వ్రాసి, ఆలాపించిన ప్రప్రధ పాట మాది స్వాతంత్ర దేశం రజనీకాంత రావు గారు రాసరట. ఆల్ ఇండియా రేడియో విజయవాడలో ఉన్నపుడు భక్తి రంజని కార్యక్రమం రూపొందించారు. ఇది చాలా కాలం నడిచింది. పిన్నా పెద్దా అందరూ ఈ కార్యక్రమాన్ని విని ఆస్వాదించేవారు.

ఆల్ ఇండియా రేడియో అహ్మదాబాద్, ఆల్ ఇండియా రేడియో విజయవాడ (1956-1960), ఆల్ ఇండియా రేడియో బెంగళూరు (స్టేషన్ డైరెక్టర్ గా) పనిచేసి, ముప్పై ఆరేళ్ళ సుగీర్ఘ కాలం తరువాత విశ్రాంత వాసి అయ్యారు బాలంత్రపు రజనీకాంత రావు గారు.

సేవలు:
ధర్మసందేహాలు అన్న కార్యక్రమానికి రూపకర్త కూడా రజనీ గారే. నిత్యం అన్నమాచార్య కీర్తనలని ప్రసారం చేయించారు.

రజనీ గారు తన ఇరవై ఒకటవ ఏట నుండి పాటలు వ్రాయడం మొదలుపెట్టారు. కొంత కాలం నళిణి, తారానాథ్ కలం పేర్లతో రచనలు చేశారు. స్వర్గశీమ, గ్రుహాప్రవేశం తదితర చలనచిత్రాలకి పాటలు రాశారు. ఆయన రచించిన కూచిపూడి, యక్షగానాలలో శ్రీకృష్ణ శరణం మమ , మేనకా విశ్వామిత్ర, విప్రనారాయణ, చండిదాశ, మేఘ సందేశం, కళ్యాణ శ్రీనివాసం ఇత్యాది రూపకాలు ఉన్నాయి.

వీరు రచించిన ఆంధ్ర వాగ్గేయకార చరిత్ర బాగా మన్నన అందుకుంది. ఈ గ్రంధంలో ప్రముఖ వాగ్గేయకారుల చరిత్ర, వారి విశిష్ట పాటలను ఇందులో పొందుపరిచారు. 1961 లో కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం అందుకున్నారు. 1980 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నారు. కొంత కాలం తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ ఆచార్యుడిగా వ్యవహరించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వేంకటేశ్వర కళాపీఠం స్పెషల్ ఆఫీసర్ గా నాలుగేళ్ళ పాటు పనిచేశారు. క్షేత్రయ్య పాటలు, గీత గోవిందం, గాంధార గ్రామ రాగాలు ఇత్యాది అంశాల మీద పరిశోధనా పత్రాలు వెలువడించారు రజనీకాంత రావు గారు. తన జీవితానుభవాలని క్రొడీకరించి రజని భావ తరంగాలుగా, ఆంధ్ర ప్రభ పత్రికలో ప్రకటించారు. వీరు రూపొందించిన రూపకాలలో వెంపటి చిన సత్యం, శోభా నాయుడు తదితరులు నృత్యం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళాప్రపూర్ణ గౌరవం అందుకున్నారు.

వీరి రచనలలో కొన్ని ముఖ్యమైనవి:
సూర్య స్తుతి
ఆంధ్ర వాగ్గేయకార చరిత్రం
విశ్వవీణ
శతపత్ర సుందరి
క్షేత్రయ్య
రామదాసు
జేజిమామయ్య పాటలు
త్యాగరాజు
ఏటికి ఎదురీత
మువ్వగోపాల పదావళి
చతుర్భాణీ
ఏటికి ఎదురీత
శతపత్ర సుందరి (రజని గేయాలు)
ఉత్తమ గేయరచయితలలో రజనీకాంతరావు ఒకరు. ఈయన ఉత్తమశ్రేణికి చెందిన గేయ కవి. శాస్త్రీయమైన రాగ తాళ జ్ఞానంతో స్వయముగా పాడి కూర్చిన గానకళా నిపుణులు; వాగ్గేయకారుడు, విశేష ప్రజ్ఞాశాలి అని ప్రముఖ సాహిత్యకారుడు శ్రీ పింగళి లక్ష్మీకాంతం గారు అభివర్ణించారు.

యాబై తెలుగు చలన చిత్ర పాటలు వ్రాశారు. వందకు పైగా లలిత గీతాలను తన కలం ద్వారా విలువడించారు రజనీకాంత రావు గారు. ఇటీవలే రజని గారి ఆత్మకధా విభావరి, విశాఖపట్నంలో విడుదల చేశారు.

అందుకున్న గౌరవ పురస్కారాలలో ముఖ్యమైనవి:

2011 ఠాగూర్ అకాడమి రత్న (సంగీత నాటక అకాడమి)
1980 లో కళాప్రపూర్ణ (ఆంధ్ర విశ్వవిద్యాలయం)
కళా రత్న పురస్కారం (ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం)
కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం (1961)
2001 లో, అప్పాజ్యోసుల విష్ణుభొట్ల ఫౌండేషన్ నుండి ప్రతిభా మూర్తి జీవిత పురస్కారం

పైవాళ్ళకి పేరు వచ్చినా తన వంతు కృషి చేస్తూ కార్యక్రమాలని చక్కగా నిర్మించారు. తృప్తి పొందారు. ఒక సాధనగా అలవరచుకున్నారు. ఈ అనుభవాలు వీరిని బాగా సాన పట్టాయి. దక్షతతో ఉన్న వారితో కలసి పనిచేశారు. ఇవన్నీ వీరి రచనా కౌసలానికి దోహదపడ్డాయి.

సితాపతి గారి సంసారం ధారావాహిక నాటకం రూపొందించారు. మునిమాణిక్యం, స్తానం నరసిం హా రావు, దేవులపల్లి వంటి మేటి సాహిత్య, కళాకారులతో పనిచేసి, ఆణి ముత్యాలాంటి కార్యక్రమాలు అందించారు బాలంత్రపు రజనీకాంత రావు గారు.

సజీవ సాహిత్యవేత్త గురించి ఎంత మాట్లాడించవచ్చు, ఎంత పొగడవచ్చో నిర్ధారించి కార్యక్రమాలు సవ్యంగా నిర్వహించారు. బి కే రావు గారి అనుమతితో తిరువన్నమలైలో ఉన్న గుడిపాటి వెంకట చలం గారిని కలసుకుని " చలం - కలం వెలుగులు " కార్యక్రమం నిర్వహించారు. అలానే కృష్ణ శాస్త్రి గురించి పని చేశారు. అలాగే విశ్వనాధ సత్యనారాయణ గురించి విశ్వనాధ కవితా సరస్వతి నిర్వర్తించారు. నేను కర్తని కాను; నిమ్మిత్త మాత్రుడిని విజయవాడ కేంద్రం కర్త అని సౌమ్యంగా చెప్పుకున్నారు;

1974 లో అబ్బూరి రామకృష్ణా రావు గారిని ఇంటర్వ్యూ చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, సి ఆర్ రెడ్డి, టంగుటూరి ప్రకాశం తదితరుల కార్యక్రమాలు నిర్వహించారు.

హేమా హేమిలందరూ ఈయన రాసిన చలన చిత్ర పాటలు పాడారు. వీరిలో జిక్కి, భానుమతి, ఎం ఎస్ రామా రావు, ఘంటశాల, పీ సుశీల, బాలసరస్వతి దేవి ఉన్నారు.

తండ్రికి తగ్గ తనయుడు. సంగీతకారుడిగా, రచయితగా, కవిగా, రూపక కర్తగా, ఆకాశవాణి సంచాలకుడిగా తెలుగు సంగీత సాహిత్య రంగాలలో తనదైన ముద్రవేశారు. భక్తిరంజనితో లక్షల మనసులను రంజింప జేశారు మన రజని గారు. తెలుగు కళామ తల్లి ముద్దుమిడ్డ మన రజనీకాంత రావు గారు.
ఇప్పుడు తొంబై రెండేళ్ళ పండు వయసు మన రజని గారికి. వీరి సేవా నిరతి, చేసిన కృషి, సాధించిన ఘనత యువతకు ఆదర్శం. రజని గారి ఆత్మ కధా విభావరి చదవండి. అది చీకటి, వెలుగుల రంగేళి.

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
   

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech