సుజననీయం  
 

 

100వ అంతర్జాల సుజనరంజని సంచిక

 

                                                            రచన: రావు తల్లాప్రగడ

 
 

 

సుజనరంజని సంచిక 100 అంతర్జాల సంచిక అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. 2004లో మొదలయ్యిన అంతర్జాల మాసపత్రిక విజయం వెనుక అందరి కన్నా ముఖ్యపాత్ర పోషించింది పాఠకులే. అందుకే ముందుగా పాఠకులదేవుళ్ళకు  జేజేలు చెప్పుకుందాము.

అంతర్జాల సంచిక 100 సంచిక అవ్వడమేకాదు,.. ..  అక్టోబర్ 6 తేధీనాడు సిలికానాంధ్ర జరుపుకునే పదకొండవ ఆంధ్ర సాంస్కృతికోత్సవంలో, విడుదల చేయబడే ప్రత్యేక సుజనరంజని-సృజనశింజీని (పటుప్రతి = అంటే ప్రింటు చేయబడ్డ సుజనరంజని అని మాట) మన 116 సంచిక అవ్వడం మరొక విశేషము ప్రతి ఆంధ్ర సంస్కృతికోత్సవం వంటి ముఖ్యకార్యక్రమాలలోనూ, ఒక ప్రత్యేక సంచికను విడుదల చేసుకోవడం మనకు ఆనవాయతీయే. అంటే అలా విడుదలచేసుకున్న ప్రత్యేక సుజనరంజనులను, అన్ని అంతర్జాల మాస పత్రికలనూ కలిపితే ఇది 116 సంచికన్నమాట. అటువంటి విశిష్ఠత వున్న సంచిక కనుక సంచికని ఒక ప్రతిష్టాత్మక సంచికగా గుర్తించి, సృజనాత్మకతకు ఒక వింటినారిగా, ఒక సృజనయందెగా, వెరసి "సృజనశింజిని"గా భావించి, గౌరవించి రూపకల్పన చేయడము జరిగింది. ప్రత్యేక సుజనరంజనిలో గత మాససంచికలలో వచ్చిన కొన్ని మంచి కథలను, వ్యాసాలను, కవితలను పునశ్చరణచేసుకోవడమే, మనము గత సంచికలకు ఇచ్చే సరైన నివాళి అని అనిపించింది. అంటే సంచిక నిజంగానే ఒక సంగ్రాహక సంచికగా తయారయ్యింది. దీనిని అందరూ తమతమ ఇళ్ళలో కలకాలము దాచుకుంటారని భావిస్తూ సంచికను నిర్మించడం జరిగింది. అందరూ ఆంధ్ర సంస్కృతితికోత్సవానికి వచ్చి తమతమ ప్రతులను ఉచితముగా తీసుకొని వెళ్ళవలసిందిగా అందరినీ అంతర్జాల పత్రికాముఖంగా కోరుకుంటున్నాము.

అలాగే, ఈ ప్రస్తుత 100 మాసపత్రికను సంచికను విడుదలచేస్తూ, ఈసందర్భంగా, మన సుజనరంజని చరిత్రను ఒకసారి మననము చేసుకుందాము. 2001 సంవత్సరంలో సిలికానాంధ్ర తొలి సాంస్కృతికోత్సవంలో "అక్కిరాజు భట్టిప్రోలు" సంపాదకత్వంలో సుజనరంజని తొలి సంచిక  (పటుప్రతిగా) వెలువడింది. "అలనాడు పరవస్తు చిన్నయసూరి స్థాపించిన, సుజనరంజని పత్రిక నామము తోనే పత్రికను ప్రారంభించాలని సిలికానాంధ్ర సంకల్పించింది", అని కూచిభట్ల ఆనంద్ అంటూ వుంటారు. తరువాత సుజనరంజనిని అంతర్జాలంలోకి తీసుకు వెళ్ళాలని సంకల్పించిన "కిరణ్ ప్రభ" సంపాదకత్వతో ఇది జనవరి 2004లో ఒక "అంతర్జాల మాస పత్రిక"గా రూపుదిద్దుకుంది. తరువాత జనవరి 2007 సంవత్సరము నుంచీ సంపాదకత్వ బాధ్యతలను "రావు తల్లాప్రగడ" (నేను) చేపట్టడం జరిగింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ, ఇది నిర్విఘ్నంగా 73 సంచిక కావడం, వ్యక్తిగతంగా నాకు మరింత ఆనందాన్ని తెచ్చిపెడుతోంది.

ఇలా గత ఆరు సంవత్సరాలలో ఎందరో గురుతుల్యుల సహవాసాన్నీ, జ్ఞానాన్నీ, స్నేహితులను, అభిమానులనూ పూజ్యపాఠకులను సంపాదించుకోవడం జరిగింది. సృజనాత్మతకు ఒక వింటినారియై సుజనరంజని పలువురు ప్రసిద్దులు, నిష్ణాతులు, వర్థమానులుయైన కవిపండితుల రచనలను సంధించి, ప్రతినెలా దాదాపు పది లక్షలకుపైగా క్లిక్కులను సాధించుకుంటూ, వెబ్బు మాసపత్రికలలో నేడు అగ్రస్థానములో నిలిచిందీ అంటే, ఇది ఆంధ్రప్రవాసాంధ్రులలో ఎంత ఆదరాభిమానాన్ని సాధించుకుందో తెలుస్తోంది. ఆదరాభిమానాలు ఇలాగే కలకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

పత్రిక ఇలా విజయవంతం కావడనికి సహకరించిన అందరు సిలికానాంధ్ర ప్రస్తుత, మాజీ కార్యవర్గసభ్యులకు; సుజనరంజని స్థాపకులకు, పాఠకదేవుళ్ళకు, రచయితలకు, సంపాదకసహకారం అందించిన తోటి సంపాదకబృందానికి, అందరు తెలుగువారికి, విఘ్నేశ్వరునికి  శతసహస్రవందనాలు.

మీ

రావు తల్లాప్రగడ

ప్రధాన సంపాదకుడు


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)


పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
   

 

 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

 
     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 
 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech
 


Sujanaranjani