Sujanaranjani
           
  కబుర్లు  
  సెటైర్
          BABOI  - అరెంజ్డ్ మారేజ్ పై చర్చ  
 

- రచన : మధు పెమ్మరాజు

 
 

బావగారు! సాయంత్రం మర్చిపోకుండా రావాలి మా వాళ్ళకి మీ గురించి పెద్ద బిల్డ్-అప్ ఇచ్చాను.. రాకపోతే నా పరువు పోతుంది

నీ పరువూ నా పరువూ వేరా? నాలాంటి సామాజిక పరిశోధకులు, ప్రేమికులు ఇలాంటి అద్భుతమైన అవకాశాలు మిస్ కారు, తప్పకుండా వస్తా...ముందు సీట్ అట్టే పెట్టు

'ఇంకో మాట....మీరు వచ్చి ఆర్.కే. లక్ష్మన్ ఆన్లుకర్ లా సమాజాన్ని ప్రేమిస్తూ, పరిశీలిస్తూ ఉంటే కుదరదు, కలగచేసుకుని నాలుగు షార్ప్ సలహాలు అదిరిపోయేలా ఇవ్వాలి"

సమస్యలతో సంబంధం లేకుండానే మన దగ్గర బోలెడు ఉచిత సలహాలు ...ఇక సమస్యలు వింటే నాకు పూనకం వచ్చేస్తుంది, వీలు చూసి విసురుతా, నువ్వు ధైర్యంగా ఉండు...ఒకే సీ యూ ఇన్ ది ఈవినింగ్ బాయ్

                ----

కాన్ఫెరెన్స్ హాల్లోకి అడుగుపెట్టగానే అగరబత్తి గుభాళింపు, షేహ్నాయీ వాయిద్యము, వినాయకుడి ప్రతిమ, వరుస కుర్చీలు కుర్రాళ్ళు చాలా ఈస్తటిక్ గా అరేంజ్మెంట్స్ చేసారు, వెనకాల రజనీకాంత్- కొత్త సినిమాలా    పెద్ద బ్యానర్ BABOI- అరెంజ్డ్ మారేజ్ పై చర్చ  చూస్తుండగా హాల్ ఆడ, మగవారితో నిండి కోలాహలం మొదలు...మాటలతో కాదు, కీ-బోర్డ్ టప టపలతో - సెల్ ఫోన్లు, ఐపాడ్, లాప్-టాప్లతో వారి సొంత ప్రపంచ విహారానికి వెళ్ళిపోయారు.

నేను వెళ్లి కోక్ డబ్బా పట్టుకుని కూర్చోగానే...నా పక్క హడావిడి సోడా బుడ్డి సెటిల్ అయ్యాడు, కాసేపు అటు ఇటు చూసి ఏదో నిర్ణయించుకుని ప్రశ్న వేసాడు "ఏవండీ! రౌండ్ టేబుల్ సమావేశం అన్నారు, ఇక్కడ కుర్చీలు, బల్లలు ఏవీ గుండ్రంగా లేవు"

చర్చ అని చెప్పడానికి అలా అంటారు, అంతే కాని కుర్చీలు, మనుషులని కాదు, అన్నీ పట్టించుకోకూడదు ఆ అబ్బాయి పెద్దగా కన్విన్స్ అయినట్టు కనపడలా (ప్రశ్నలతో పీడించే యక్షుడే, ఇక ఆపకుండా ప్రశ్నలు మొదలు పెట్టాడు)

అన్నట్టు BABOI అంటే ఏమిటండి?

బే ఏరియాకి కొత్తా?. BABOI అంటే బే ఏరియా. బాచిలర్స్.అఫ్ ఇండియా  అమెరికాలోని దేశీ అసోసియషన్లలో అన్నిటికంటే ముందుకి దూసుకుపోతున్న యువ సంస్థ, మా Q n A సెషన్ జరుగుతుండగా, ప్రెసిడెంట్ గారు సభా వేదికపైకి చేరి   చిరునవ్వు నవ్వి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కామ్రెడ్స్! దయచేసి మీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్  ఆపివేస్తే కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

      ( రెండు నిమిషాల తర్వాత నిశ్శబ్దం)

మీ పనులు మానుకుని ఇక్కడకి విచ్చేసినందుకు పేరు పేరునా కృతజ్ఞతలు..కొత్తగా చేరిన సభ్యుల కోసం మన సంస్థ అజెండా గురించి క్లుప్తంగా చెప్పి, తర్వాత రోజు కార్యక్రమం యొక్క క్రమం చెపుతాను-

ఇక్కడకి విచ్చేసిన ప్రతీ వ్యక్తీ సగటు తెలుగువాడి కంటే ఏభై శాతం ఎక్కువ .క్యూ ఉన్నవాడు, ఇండియాలో IIT, NIT, University కాంపస్ లు దాటుకుంటూ Stanford, UCLA, Caltech, UCB లాంటి చోట్ల చదివాం, రోజు మన కష్టంతో, తెలివితో కంపెనీలని తారాస్థాయికి తీసుకెళ్ళి....మన వాళ్ళకి, దేశానికీ ఎంతో పేరు తెచ్చాం ( మాటలు వినగానే ఒకడికి కన్నీళ్ళు ఆగలే), అలాంటి మనం రోజు ఎం.క్యూ (matrimony quotient) అనే సమస్యలో చిక్కుకున్నాం, మన మిత్రులంతా విషయంలో దెబ్బలు తింటూ, అవమానాలు భరిస్తూ, వ్యధని దిగమింగుకుని- ఫ్లాప్ సినిమాలు చూస్తూ, హోటల్ తిండి తింటూ కాలాన్ని కరిగిస్తున్నారు...మనం చేసిన తప్పు ఏమిటి- పద్దతిగా పెద్దల కుదిర్చిన పెళ్లి అనుకోవడమేనా? మన సంస్కృతిని గౌరవించడమేనా? అని నొక్కి అడుగుతున్నాను.

 

వేదిక .. నేను మన చైర్మన్ గారు ఐదేళ్ళ కిందట అనుకున్నాం, అప్పటికే అయన ఐదేళ్ళ నించీ అవమానాలు భరిస్తూ జుట్టుని, మనశ్శాంతినీ పోగొట్టుకున్నారు...ఇప్పటికీ ఆయన పెళ్లి కాకపోయినా సంస్థని ఎంతో ఎత్తుకి తీసుకెళ్లాలన్న కోరిక మాత్రం అయన ప్రమేయం లేకుండా నెరవేరింది రోజు అయన పెళ్లి చూపులులేక లేక రెండేళ్ళ తర్వాత వచ్చిన సంబధం..పాపం అయన రాలేక పోయినా అయన మనసు ఇక్కడే ఎక్కడో సమోసాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది.. మీన్ మన మధ్యే తిరుగుతూ ఉంటుంది.    రోజు చర్చాంశం కొద్దిగా విడమర్చి చెప్తా  -

"అరెంజ్డ్ మ్యారేజ్ అంటే పెద్దలు తెమల్చని పెళ్లి, దీనిపై తోటివారి అనుభవాలు తెలుసుకుని, పరిష్కారాలు వెలికి తీద్దాం..ఇక్కడ ప్రత్యేక ఆహ్వానితుల్లో సీనియర్ బాధితులు-లేడీస్ అండ్ జెంటిల్ మెన్ ఉన్నారు, వారు ఉత్సాహంగా పాల్గొని విలువైన కోణాలు మనకి అందజేస్తారు….ఇక సభ మొదలెట్టక ముందు ఇంకొక్క విషయం కొత్త ఐపాడ్ ఆప్- iBABOI త్వరలో విడుదల చేస్తున్నాం దాన్ని డౌన్లోడ్ చేసి..విరివిగా, వెర్రిగా వాడి మీ అభిప్రాయాన్ని తెలియచేయగలరు…     జై కళ్యాణ లక్ష్మి!!! ఇక సభని ప్రారంభిద్దాం"

బుడ్డీ కళ్ళజోడు  సర్! ఇప్పుడు సంబధాలు ఏమైనా చెప్తారా

నీకలా అర్థమయ్యిందా, సంబందాలు చెప్పరు - సమస్యలు , సలహాలు చెప్తారు, వీలైతే రెండు సమోసాలు ఇస్తారు!

వెనకాల  జుట్టులేని, గెడ్డం పెరిగిన మహేష్ బాబు చెయ్యెత్తి ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు  -

అధ్యక్షా! గత ఆరేళ్లుగా అంతరంగాలు సీరియల్లా ఆపకుండా అమ్మ, నాన్నా సంబంధాలు చూస్తూనే ఉన్నారు ..వారికి ప్రక్రియ రిటైర్మెంట్ లో మంచి టైం పాస్ అయ్యింది- ఫ్రీ టిఫిన్లు, కాఫీలకి, కారబ్బూందికీ నా యవ్వనం కొవ్వొత్తు..కాదు కాదు  కర్పూరంలా కరిగిపోతోంది.. మధ్య సంబంధం చూసొచ్చారు..అమ్మాయి ఎలా ఉంది నాన్నా అని ఆశగా అడిగితే కాఫీ బాలేదు అని జవాబు చెప్పారు  (అని ఏడుపు)

 

 ప్రెసిడెంట్ గారు ఆయనకి చేబురుమాలు ఇవ్వండి పాపం మగబ్బాయికి  (ఆడపడుచులా )  ఎంత  కష్టమోచ్చిందో  అనగానే పది తడిసిన జేబురుమాళ్ళు వెంటపడ్డాయి

కళ్ళు తుడుచుకుని నేను ఏమి చెయ్యాలో చెప్పండి

       (ఉషశ్రీ గారి గొంతుతో గొంతు వినపడింది)

నాయనాఇక్కడ మీ పేరెంట్స్ ఇండిఫరెంస్ కొట్టొచ్చినట్టు, విరక్కొట్టినట్టు కనపడుతోంది, దీనికి విరుగుడు ఒకటి చెప్తా-

మీ వాళ్ళకి నేను మెక్సికన్ అమ్మాయితో ప్రేమలో పడ్డా, వాళ్ళూ చూడ్డానికి మనలానే ఉంటారు, మనలానే అన్నం, చపాతీలు తింటారు...పెళ్లి అనుకుంటున్నా అని ఈమెయిలు కొట్టు, దెబ్బకి మీ నాన్నగారు రిటైర్మెంట్ నించి బయటకి వస్తారు     ( అబ్బాయి మోహంలో కొంచం వెలుగు కనపడింది)

 

తర్వాత సభ్యుడు-

మావాళ్ళకి జాతకాల పిచ్చి- నీ పెళ్లి మాట దేవుడెరుగు, మాకు చెడు జరగక్కోడదు, ముప్పై ఆరు పాయింట్లకి ముప్పై ఎనిమిది కలవాలి  అనే  బాపతువాళ్ళ IIT ఎంట్రన్స్లో ఆరు నెల్లకి సంబంధం క్లియర్ అవుతుంది, అప్పుడు నాకు మొదలవుతుంది, ఎలాగో మధ్య జరిగిన విషయం చెప్తా - టెస్ట్లో పాసయిన  అమ్మాయితో మాట్లాడమంటే ఇక పెళ్లి ఖాయం అనుకుని కొత్త బట్టలు వేసుకుని, సెంట్ కొట్టుకుని ఫోన్ చేశా, నాలుగు మాటలయ్యకా నన్ను పాడమంది, రాదు మొర్రో మంటే అన్నా వినలేదు.. విపరీతమైన బలవంతం పెట్టిందిఇక తప్పదని సరదాగా రెండు లైన్లు పాడాను.

(ఒకడు సస్పెన్స్ భరించలేక)

అన్నా! అప్పుడు ఏమయ్యింది?

మా అమ్మాయికి  అబ్బాయి  గొంతు  నచ్చలేదని కబురొచ్చింది..

 

(సలహా గొంతు)

స్వీయ అనుభవం కొద్దీ చెబుతున్నా...మార్కెట్ని  బట్టి  మనం  నడుచుకోవాలి..ఒక  మంచి  చోట  పాటలు, భరతనాట్యం, పైంటింగ్, టైం ఉంటె వంటా-వార్పు  నేర్చుకో.. సారి ప్రశ్న అడిగినా చచ్చినా  దొరక్కోడదు...ఇలా చేసే నేను లటుక్కున పెళ్లి చేసుకున్నా పాత తెలివికి, కొత్త పులకరింత కలిపి హాయిగా నవ్వుకున్నారు  

( అబ్బాయి ఐపాడ్ లో పాటలు నేర్పే సెంటర్ కోసం గూగుల్ ని ఆశ్రయించాడు)

 

అంతా చేతులు ఎత్తి గొడవ చేస్తుంటే ఉప-ప్రెసిడెంట్ గారు, బల్లని కొట్టి-

మనమంతా సివిలైజ్డ్ గా ప్రవర్తించాలిఓపిక పట్టాలి, అందరికి అవకాశం వస్తుంది, ఇలా గొడవ పడితే  ఎట్టా

(కొద్దిగా గ్యాప్ ఇచ్చి)…..తర్వాత నేను మాట్లాడతాను అని మొదలెట్టారు

 

నాదో పెద్ద గాధ, లీలగా  గుర్తొస్తోంది- సంబంధాలు వెతకడం మొదలుపెట్టిన కొత్తలో ఆకాశం నీ హద్దురా అనే పాటలు పాడేవాడిని, నా దారి రహదారి అనే డైలోగ్ సెల్ ఫోన్ రింగ్ టోన్ కూడా...ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎల్లలెరగని ఆత్మ విశ్వాసం నా hallmark! అప్పుడు మా వాళ్ళకి ఒక పుస్తకం సైజు పెళ్లి కూతురు specs ఇచ్చా, సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇస్తే మరో విండోస్, గూగుల్ తయ్యారయ్యేవి….ప్రతీ ఏడు, నా ఈడు పైబడే సరికి specs తగ్గిస్తూ ఇప్పుడూ ఒక్క లైన్ లోకి వచ్చా

ఒక్క లైన్ ఏమిటన్నా?

పెళ్లి కూతురు అమ్మాయి అయితే చాలని, అయినా లాభం లేదు

(ఎక్కడి నించో గొంతు)

అది తెల్ల కాగితం చేసేయ్, ఫలితం ఉంటుంది

ప్రెసిడెంట్ గారు కలగజేసుకుని ప్లీజ్! అసందర్భపు వ్యాఖ్యలు చెయ్యొద్దు అనగానే సలహా గొంతు వినపడింది

 

ఇందులో పెద్దల తప్పేమీ లేదు నాయనా!! తప్పంతా అమజాన్ (Amazon ) వాడిది, ఎందుకంటే మీ కుర్రాళ్ళు సైట్ వాడి, వాడి...అక్కడ షాపింగ్ కార్ట్ కి, మాట్రిమొని సైట్ కి తేడా తెలీకుండా పోయింది....అరెంజ్డ్ మ్యారేజ్ అంటే మనకి కావాల్సిన చదువు, అందం, నడక, పొడవు, వినయం...సెలెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటున్నారు

 (వెనకాల కొందరికి చాలా కోపమొచ్చి అఫెంసివ్ అయ్యారు)

 

ఎవరైనా తప్పుగా ఫీల్ అయితే సారీ, కానీ నేను చెప్పేది ఒక్కటే, మనుషులు ప్లస్సులు తక్కువుగా, మైనస్సులు ఎక్కువుగానే ఉంటారు- have realistic expectations, థాంక్స్ అని కూర్చున్నారు

 మాష్టారు! మరి సలహా ఏమిటి

 

మన ప్రయారిటీలు అంటే మూడో, నాలుగో అంతేకాని ఇరవై, ముప్పై కాదు.. అవి ఏమిటో తెలుసుకుని  వెతుక్కోవాలి, తప్పకుండా మంచి వాళ్ళు దొరుకుతారు.

 

గుంపులోని చేతికి అవకాశం వచ్చింది -

మధ్య జాతకాలు, బాక్గ్రౌండ్ అన్నీ బాగా కలిసినయ్, అప్పుడు ఎం జరిగిందంటే

(అబ్బాయి మోహంలో సున్నాలు)

బాబూ! ఏడ పన్ చేస్తున్నావ్?

లింక్డ్-ఇన్ వర్క్ జేస్తున్న అంకుల్

గదేంది చిన్న కంపనీనా, ఇన్ఫోసిస్, టీ.సీ.ఎస్ లా రాలే  ?

పెద్దదే  అంకుల్

మరి నేను ఇన్లె

మనసులో (మీరు ఇనని కంపెనీలే ఎక్వ ఉంటయ్)

తనఖా ఎంత ఇస్తర్

లక్ష డాలర్లు

మా మేనల్లుడికి లక్ష ఏభై వేలు ఇస్తరు, కృష్ణారావ్ సాబ్ కొడ్కుకి రెండు లక్షలు, మా రెండో బామ్మర్ది మేనల్లుడికి లక్ష ఇరవై వేలు ఇస్తర్ నువ్వు గింత పెద్ద సదువులు సదివి ఇంత తక్కువ పైసలా?

(సున్నాలు వెనక్కి వచ్చాయి)

 

మా అమ్మకి అయన జీతం అడిగిన తీరు నచ్చలే.....పెళ్లి కాన్సిల్

(ఇక నా అవకాశం వచ్చింది, బట్టీ పట్టినవి బయట పెట్టా)

 

మధ్య నాకు చిర్రెత్తుకోస్తున్న ట్రెండ్ ఏమిటంటే ఆల్రెడీ మనకున్న వెయ్యా నూటపదహారు వేరు భావాలకి, పెద్దలు మధ్య తమ శక్తీ కొలది కొత్తవి సృష్టించి పరిస్థితిని జటిలం చేస్తున్నారు....కంపెనీ ఫీలింగ్, హోదా, వీసా స్టేటస్-కొత్త కుల, గోత్రాలు…..అసలు ఇన్ఫోసిస్ అయితే ఏమిటి గోంగూర అయితే ఏమిటి ..పిల్లాడు మంచివాడా కాదా, అమ్మాయిని సరిగ్గా చూసుకుంటాడా? అనే విషయం చివరి ప్రయారిటీ అయిపోయింది.. మధ్య వింటున్న సాఫ్ట్వేర్ కబుర్లలో పడి పెద్దలు మళ్లీ నిక్కర్లు వేసుకోక్కర్లెదు"అని ముగించా

అయితే పరిష్కారం ఏమిటి

పెద్దలు పెద్దరికం నిలుపుకుంటే చాలు

 (పాపం ఒక చెయ్య గంట నించి పైకే ఉంది, ప్రెసిడెంట్ గారు సింపతి కోటాలో అవకాశం ఇచ్చారు )

 

నాదో వింత సమస్య, మధ్య రెండు సంబంధాలు వచ్చాయి.. మా వాళ్ళు జాతకాలతో కాచి, ఇంటి పేర్లతో వడ గట్టి, మిగిలిన వాటితో తూచి నా ముందు పెట్టారు, నాకు అన్నీ బాగా కలిసాయి అని ఆనందం వేసింది, అమ్మాయిలతో మాట్లాడమని ఫోన్ నంబర్ ఇచ్చారు..ఒకళ్ళకి శనివారం, ఇంకోళ్ళకి ఆదివారం చేశా.. సోమవారం మాట్రిమొని సైట్ని హోం పేజి చేసుకున్నా

అన్నా! ఏమయ్యింది?

 

మొదటి అమ్మాయి అమెరికా రాను అంది, అమెరికాలో ఉన్న రెండో అమ్మాయి ఇండియా అంటే కంపరం, కాపురం ప్రశ్నే లేదు అంది.

(సలహా గొంతు)

 

ఏమీ అనుకోనంటే సలహా, నువ్వు లండన్లో గానీ, దుబాయ్లో గాని ఉద్యోగం వెతుక్కో..అప్పుడు వస్తారేమో

 

అదేమి వెర్రి సలహా అండీ.. పెళ్లి కోసం దేశాలు పట్టి తిరుగుతారా ఏమిటీ? బాబులాంటి సంబందాలు వస్తాయి బాబూ .నువ్వు దేశాలు వెళ్ళక్కర్లా

(చుట్టూ ఉన్న వాళ్ళని చూస్తుంటే తుఫాను ముందు నిశ్శబ్దంలా అనిపిస్తోంది)    

 

-సశేషం-

 

 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech