Sujanaranjani
           
  కబుర్లు  
  సత్యమేవ జయతే  - అమెరికాలమ్ – 22
         

ఆలసించిన ఆశాభంగం!

 
 

- రచన : సత్యం మందపాటి

 
 

 

నారదుడు హడావిడి పడుతూ వచ్చాడు చిత్రగుప్తుడి దగ్గరకి.

చిత్రగుప్తుడు మామూలు రోజుల కన్నా ఎక్కువగా క్రిందా మీదా పడుతూ, ఊపిరి పీల్చుకోవటానికి కూడా సమయం లేనంతగా పనిచేసుకుంటున్నాడు. నారదుడు రావటం కూడా గమనించలేదు.

"చిత్రగుప్తా! ఎలా వున్నావ్?" అడిగాడు నారదుడు, చెమటలు పట్టిన శరీరం మీద జారిపోతున్న తంబూరా సర్దుకుంటూ.

"ఓహో! మునీంద్రులవారా! రండి. చూస్తున్నారుగా ఇక్కడ జంఝాటం. శ్వాస పీల్చి ఎంతసేపయిందో కూడా తెలియటం లేదు. ఒకటే హడావిడి" అన్నాడు చిత్రగుప్తుడు, రెండు చేతులతోనూ ఒకేసారి చిఠ్ఠాలు తిరగేస్తూ. 

"అయితే నేను విన్నది నిజమేనన్నమాట. ఇంద్రుడు యమధర్మరాజు కలిసి ఆడిన నాటకం ఇది. లేకపోతే భారతదేశంలో విహారానికి వెళ్ళినవాళ్ళు, అటు అమెరికా దేశానికి వెళ్ళటమేమిటీ, అక్కడ పెట్టుబడిదారి వ్యవస్థని చూసి, వీళ్ళు చేతులు కాల్చుకోవటమేమిటీ. ఇంతకీ అసలు కథ ఏమిటో చెప్పు నాయనా" నారదుడుకి జరిగిన విషయం పూర్తిగా తెలియక కాదు. చిత్రగుప్తుడికి ఎంత తెలుసో కనుక్కుందామని అడిగాడు.

చిత్రగుప్తుడు రెండు చేతులతో చిఠ్ఠాలు తిరగేస్తూ, వాటిని రెండు కళ్ళతోనూ వేరువేరుగా చదివేస్తూ, వున్న ఒక్క బుర్రతో ఆలోచిస్తూ, నారదులవారికి నోటితో జవాబిచ్చాడు. 

"నీకు తెలియందేముంది నారదా! ఇంద్రుడూ, యమధర్మరాజూ భారతదేశం మీదుగా అటు అమెరికా వెళ్ళినప్పుడు చూశారుట. అక్కడ సంవత్సరానికి ఒక వారాంతం అందరూ కొనుగోలు పన్నులు కట్టకుండా వస్తువులు కొనుక్కోవచ్చుట. దానివల్ల అక్కడ వస్తువులు ఎక్కువగా అమ్ముడుపోయి, ఆర్థికంగా దేశం ముందుకు పోవటానికి అవకాశం వుంటుందట! అది వీళ్ళిద్దరికీ ఎంతో నచ్చింది. అలాటిదే ఇక్కడా ఏదో చేసి, స్వర్గ నరకాలను ఆర్థికంగా మెరుగు పరచాలని అనుకున్నారుట!" 

"అవును మరి. ఈమధ్య ఇక్కడ కూడా కొంచెం ఆర్థిక మాంద్యం వచ్చింది కదా. అయితే మరి ఇక్కడేం చేస్తున్నారిప్పుడు" అన్నాడు నారదుడు.

“రేపూ ఎల్లుండీ భూలోకంనించీ ఇక్కడికి వచ్చేవారికి, అక్కడినించి ఇక్కడికి మనిషికి ఒక్క సామాను, పోనీ వస్తువు అందామా... తీసుకురావచ్చు అని తీర్మానించి, బాహ్య ప్రపంచానికి ప్రచురించారు. కనుక రేపూ ఎల్లుండీ ఇక్కడికి వచ్చే ప్రతివాళ్ళు వాళ్లకి ప్రియమైనది ఏదో మోసుకుంటూ వస్తారన్నమాట”

నారదుడు బిత్తరపోయాడు. “అదెలా సాధ్యం? బొందితో రావటం కుదరక అక్కడే శరీరాల్ని వదిలేసి ఇక్కడికి ఆత్మలు వస్తుంటే, ఇంకా వాళ్లకి ప్రియమైన సామాన్లు కూడా తీసుకురావటం ఏమిటి? అందులోనూ బరువుగా వుంటే మోసుకు రావటం కూడాను! వీళ్ళేమయినా పుష్పక విమానాల మీద వస్తున్నారా, ఏమన్నానా? ఇది మన మత సంప్రదాయానికి పూర్తిగా వ్యతిరేకం!” అన్నాడు.

“అవునూ.. నిజమే.. ప్రకటనలు కూడా ఇచ్చేశారు కనుక ఇక మనం చేసేదేమీ లేదు. రేపూ ఎల్లుండీ ఎలా నెట్టుకురావాలా అని చూస్తున్నాను. ఈ వారాంతం వచ్చేవారి చరిత్రలు మిత్రగుప్తుడికి ఇచ్చి, అతన్నే ఈ వ్యవహార మంతా చూసుకోమంటాను. కావాలంటే మీరు రేపు ప్రొద్దున్నే వచ్చి, ఇక్కడేం జరుగుతుందో చూడండి” అన్నాడు చిత్రగుప్తుడు. 

“వస్తాను. తెల్లవారు ఝామునే వచ్చి మిత్రగుప్తుడి పక్కనే కూర్చుంటాను.. “ అన్నాడు నారదుడు లేస్తూ.    

౦                           ౦                           ౦

మర్నాడు నారదుడు మిత్రగుప్తుడి దగ్గరకు వచ్చేసరికే, అక్కడ ఎంతోమంది వరుసగా నుంచునివున్నారు. ప్రతివారి చేతుల్లోనూ ఏవేవో వున్నాయి.

(ఈ వ్యాసంలో నేను చేస్తున్న ఈ చిన్న ప్రయోగానికి అవసరం కనుక, కల్పించిన పాత్రలతో పాటూ ఏనాడో పరమపదించిన కొందరు ప్రముఖుల్ని, ఇప్పుడే చిత్రగుప్తుడి దగ్గరకు వస్తున్నట్టుగా వ్రాస్తున్నాను. చిత్తగించండి)

ముందుగా తాయారమ్మ వచ్చింది. ఆవిడ ఏ పెట్టెలూ, బేడాలూ తనతో తెచ్చుకోలేదు. చేతిలో ఒక్క ఫోటో మాత్రమే వుంది. ఆవిడ అందించిన ఫోటోని చూశాడు మిత్రగుప్తుడు.

“అదేమిటమ్మా! ఈ ఫోటో తెచ్చుకున్నారు. మీవారి జ్ఞాపకాలు తెచ్చుకోకపోయారా?” అన్నాడు.

          తాయారమ్మ ముందుకి వంగి రహస్యం చెబుతున్నట్టుగా నెమ్మదిగా అంది “మా వెంకయ్యగారు పైకి ఎంతో మంచివాడిగా కనిపిస్తాడు కానీ, ఆయనకి ఒక చిన్నిల్లు కూడా వుంది. బీబీయో, బేబీయో... దాని దగ్గరే ఎక్కువ సమయం రహస్యంగా గడుపుతుంటాడు. ఖచ్చితంగా నరకానికే వెడతాడు. అందుకే ఆయన జ్ఞాపకాలు అక్కడే వదిలేసి, నాకెంతో ప్రాణంలో ప్రాణమైన నా మనవడి ఫోటో తెచ్చుకున్నాను”

          మిత్రగుప్తుడు చిరునవ్వి, “అవునమ్మా. అదంతా ఇక్కడ వ్రాసి వుంది. దీంట్లో రహస్యమేమీ లేదు. కాకపొతే ఆయన నరకానికి వెళ్ళడనుకుంటాను. మీరు జీవితాంతం పతియే ప్రత్యక్షదైవం అని నమ్మారు. ఒక్క సంవత్సరం కూడా తప్పకుండా ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరీ వ్రతం చేసేవారు. ఆయన ఆ పుణ్యాలన్నీ మూట కట్టుకున్నాడు మరి. సరే! ముందుకు పదండి” అన్నాడు.

          తర్వాత వస్తున్న ఆయన్ని చూసి, మిత్రగుప్తుడు లేచి నిలుచుని నమస్కారం చేశాడు. ఆయనే, మనల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిన ముళ్ళపూడి వెంకటరమణగారు.

          “అయ్యయ్యో! మీరు లేచి నుంచుంటారేమిటి? కూర్చోండి. ఇదిగో ఈ ఒక్క చిత్రపటాన్ని మాత్రమే తీసుకు వచ్చాను” అన్నారు, చేతిలోని రంగురంగుల చిత్రాన్ని చూపిస్తూ.

          మిత్రగుప్తుడు ఆ చిత్రాన్ని అందుకుని చూశాడు. ఆంజనేయులవారితో సహా సీతారామలక్ష్మణుల బొమ్మ. పట్టాభిషేక  సన్నివేశం. మన బాపుగారు ఎంతో అందంగా గీసినది.

          ఆ బొమ్మ చూసి మురిసిపోయాడు మిత్రగుప్తుడు. “ఇది నేను దాచుకోవచ్చా?” అని అడిగాడు ఆత్రంగా.

          రమణగారు నవ్వి, ఆ చిత్రాన్ని తీసుకుని తన గుండెలకి హత్తుకుంటూ, “అచ్చంగానే కాదు అప్పుగా కూడా ఇవ్వనుగాక ఇవ్వనుగాక ఇవ్వను” అని ముందుకి వెళ్ళిపోయారు.  

అప్పుడే వచ్చాడు ఆయన. గత పదేళ్లుగా చాల తెలుగు సినిమాలకి నిర్మాత, దర్శకుడు, కథ, మాటలు,

పాటలు, సంగీత దర్శకుడు.

          “ ఈమధ్య వస్తున్న తెలుగు సినిమాలకి మీరే ప్రతీక. మీరేం తెచ్చారు?” అడిగాడు మిత్రగుప్తుడు.

          “ఏం తెస్తాను... నేను చనిపోయే ముందు రోజే పూర్తయిన నా కొత్త సినిమా డిజిటల్ కాపీ. నా సినిమా కనీసం నేనయినా చూసుకోవద్దూ!”  అన్నాడు.

          పక్కనే వున్న విచిత్రగుప్తుడు “నేను తెలుగు సినిమాలు చూసి పదేళ్ళ పైనే అయింది. మీ సినిమా పేరు ఏమిటండీ.. ఎవరూ దాంట్లో తారలు?”  అడిగాడు కుతూహలంతో.

          “ఆ సినిమా పేరు అంట్ల వెధవ. చెప్పానుగా నేనే నిర్మాతని, దర్శకుడిని, రచయితని, సంగీత దర్శకుడిని. నాయకుడు మా అబ్బాయి”

          “అయితే మీ అబ్బాయికి నటనలో శిక్షణ ఏమైనా వుందా?”

          “వాడు నా కొడుకు. వాడికి శిక్షణ ఎందుకు. తెలుగు సినిమాల్లో ఇప్పుడిది కొడుకుల యుగం కదా. అన్ని పెద్ద వూళ్ళల్లోనూ సినిమా ఆడించటానికి నాకు సినిమా హాళ్ళు కూడా వున్నాయి. పైగా నా ఫాన్స్ నా వెనకనే వున్నారు. వాళ్ళు చాలు అ సినిమాని నడిపించటానికి”  

          “మరి ఆ సినిమాలో నాయకురాలు మీ అమ్మాయా?” అడిగాడు విచిత్రగుప్తుడు అమాయకంగా.

          ఆయనకి ఒక్కసారిగా కోపం వచ్చింది. “నా స్వంత కూతురికే పూర్తిగా బట్టలు విప్పి, బూతు పాటలకి నృత్యాలు చేయించేంత దుస్థితికి దిగజారలేదు నేను. నాకేం ఖర్మ. ఉత్తర భారతదేశంనించీ వేల మంది అలా చేయటానికి ముందుకు వస్తున్నారు. అందుకే ఒక హీరోయిన్ కాదు, ముగ్గురి చేత అలాటి డాన్సులు చేయించాను”

          అలాటి సినిమాలు చూడటం ఇష్టం లేని విచిత్రగుప్తుడు ఇక మాట్లాడలేదు.

          “అలాటి సినిమాలు ఇక్కడి సభ్య ప్రపంచంలో చూపించటానికి వీల్లేదు. అదిక్కడ పడేసి వెళ్ళండి” అన్నాడు మిత్రగుప్తుడు.          

          తర్వాత వచ్చాడు ఒక నాటకాల రాయుడు. అతని చేతిలో ఒక గద వుంది.

          “అదేమిటి? మా ఇంద్రుడు, యముడు దగ్గర వుండాల్సిన గద మీ దగ్గర వుంది” అన్నాడు మిత్రగుప్తుడు.

          “నాటకమాడిన ప్రతిరోజూ, ఆయా దుస్తులతో పాటూ గదలు, కిరీటాలు, నగలు ఇంటికి తీసుకుపోవుట మాకు ఆచారం, అలవాటుగదా! వాటిలో ఇదొక్కటి మాత్రమే మేమిక్కడికి తెచ్చాం!” అన్నాడు నాటకాలరాయుడు. 

          “ఇక్కడికి ఆయుధాలు తేకూడదు” అన్నాడు మిత్రగుప్తుడు.

          “అలాగని మాకు ముందుగా మీరు తెలుపలేదు. తెలుపితిరిబో, మీ వద్ద ఆయుధాలు పెట్టుకుని మమ్మల్ని వలదని అడ్డుట మీకు పాడి కాదు. అయినదిబో, నాతో గదా యుద్ధమున గెలిచి అప్పుడు చెప్పుదురుగాక!” అన్నాడు గద భుజం మీద పెట్టుకుని. 

          మిత్రగుప్తుడు పక్కనే వున్న శత్రుగుప్తుడి వేపు చూశాడు. బలాధ్యుడైన శత్రుగుప్తుడు అతని దగ్గర్నించీ గద లాక్కుని,  లోపలికి పంపించాడు.

          ఆయన వెనుకనే వచ్చాడు భారానా. అతని పూర్తి పేరు భారతదేశ రాజకీయ నాయకుడు. అతని వెనుకనే

అరవై ఆరు సూట్కేసులు వరుసగా వున్నాయి.

          “ఇవన్నీ ఏమిటి? తలకి ఒక్కటి మాత్రమే అని చెప్పాం కదా?” అడిగాడు మిత్రగుప్తుడు.

          “నేను భారతదేశంలో రాజకీయ నాయకుడ్ని. ఎన్నో తలలు మార్చాను. ఎన్నో తలలు తీసేసాను. కొన్ని

తలలకి ఆంధ్రా తలలు, తెలంగాణా తలలు, రాయలసీమ తలలు అని పేరుపెట్టి, వాటిని విడగొట్టి మరీ నరికేశాను. అవన్నీ లెఖ్కలు వేస్తే, నేను ఇంకో రెండు వందల సూట్కేసులు తేవచ్చును. కానీ నేను తెచ్చింది అరవై ఆరే కదా. మొత్తం కలిపితే నా సంపాదనలో పదో శాతం కూడా తేలేదు” అన్నాడు భారానా.

          “ఎందుకు అంత కక్కుర్తి పడి, ఎన్నో తలకాయలు తీసేసి ఇంతింత సంపాదించటం? వెళ్ళేటప్పుడు ఏవీ లగేజ్ తీసుకువెళ్లనీయరని తెలీదా?” అడిగాడు మిత్రగుప్తుడు.

          “కక్కుర్తి ఏమీ కాదు. ప్రస్తుతం భారతదేశంలో ప్రజలు మత్తులో వున్నారు. వాళ్లకి వారానికి రెండు కొత్త హింసాత్మక సినిమాలు విడుదల చేసి, మద్యం తాగిస్తూ మధ్యే మధ్యే క్రికెట్ ఆటలు చూపిస్తుంటే చాలు, చుట్టూ ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోరు. చరిత్రలోఎక్కడ చూసినా అధిక సంఖ్యలో వున్నవారు, తక్కువ సంఖ్యలో వున్నవారిని బాధించటం చూస్తున్నాం. ఒక్క భారతదేశంలోనే అలా జరగటంలేదు. నాలాటి దోపీడీలు చేసేవారూ, హత్యలు చేసేవారూ, లంచాలు తినేవారూ, ఒక్కమాటలో చెప్పాలంటే.. దుర్మార్గులు భారతదేశం మొత్తం మీద ఒక కోటి మంది వుంటారేమో.. మరి ఆ ఒక్క కోటి మంది దుర్మార్గులు నూట ఇరవై కోట్ల మందిని తమ చేతుల్లో పెట్టుకుని ఆడిస్తున్నారంటే ఏమనుకోవాలి? వాళ్ళని అడిగే దిక్కు లేదు. ప్రజలేమో మాకెందుకులే అని టీవీలో చెత్త సీరియల్స్ చూసుకుంటూ నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటారు. అందుకే మంత్రులు, పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రులు, వాళ్ళ పిల్లలు, చుట్టాలు, గిట్టాలు అందరూ యధాశక్తి దేశాన్ని దోచుకుతింటున్నారు. దీంట్లో నా తప్పేమీ లేదు”

          మిత్రగుప్తుడికి అతన్ని చూస్తే అసహ్యం వేసింది. “ఏదో ఒకే ఒక్క వస్తువుని తెచ్చుకోమన్నాం కానీ, ఇలా సూట్కేసుల్తో కోట్లకి కోట్ల రూపాయలు తెచ్చుకోమనలేదు. అందుకని శత్రుగుప్తా! ఈ డబ్బంతా మన ధనశాలకి పంపించు. వీడు నరకానికి వెళ్లేలోగా రోజుకి ఇరవై నాలుగు గంటలూ కొత్త తెలుగు సినిమా పాటలు ఆపకుండా వినిపించి, వీడి చెవుల్లో హోరెత్తించు. బుర్రకి పట్టిన తుప్పు వదిలిపోతుంది” అన్నాడు కోపంగా.

          తర్వాత వస్తున్నాడు ఒక వయసుమళ్లిన ఆయన, ఆయన ముఖంలో మంచి తేజస్సు కనిపిస్తున్నది. ఆయన కరుణశ్రీగా పేరు పొందిన జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు. తను కొత్తగా వ్రాసిన పద్యాలు చదువుకుంటూ వస్తున్నారు.

          “మీ చేతిలో వున్న పుస్తకం ఏమిటి?” అని అడిగాడు మిత్రగుప్తుడు.

          “ఇది నేను కొత్తగా వ్రాసిన పద్య కుసుమమాల. పేరు భారతశ్రీ. ఈ పద్యాలు కూడా ఘంటసాలవారితో పాడించుకోవాలని నా కోరిక. ఇంతకు ముందు నా పద్యాలెన్నో ఆయన ఎంతో మధురంగా ఆలపించారు. ఆయన స్వర్గంలో ఎక్కడ వున్నారో దారి చూపించగలరా?” అన్నారు కరుణశ్రీ.

          అప్పటిదాకా అక్కడే నిలబడి అన్నీ గమనిస్తున్న నారదుడికి, అంతకు ముందే కరుణశ్రీ సాంధ్యశ్రీ ఉదయశ్రీ మొదలైనవి చదివాడు కనుక ఆ కొత్త పద్యాలు చదవాలనిపించింది. కానీ చదవటం కన్నా, ఘంటసాలగారి ద్వారా పాడించుకుని వింటేనే బాగుంటుందనిపించింది నారదుడికి.

          అందుకే కరుణశ్రీ గారితో అన్నాడు “నేను అటే స్వర్గం వేపు వెడుతున్నాను. నాతో రండి. ఘంటసాలగారి దగ్గరకు తీసుకు వెడతాను” అన్నాడు.  

          “అంతకన్నా భాగ్యం ఏముంది?” అంటూ కరుణశ్రీగారు నారదుడి వెంట నడిచారు.

 

 
 
నా రచనలకు స్ఫూర్తీ, స్పందనా ఇచ్చిందీ ఇస్తున్నదీ నా అభిమాన రచయితల కథలూ, నా చుట్టూ ఉన్న ప్రజలూ ప్రపంచం.

చైతన్య భారతి, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, ఆటా, తానా, వంశీ కల్చరల్ ట్రస్ట్, ఫ్రెండ్ షిప్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, వంశీ ఇంటర్నేషల్, సప్నా, సిరి ఫౌండేషన్, శీ సువర్చలా ఛారిటబుల్ ట్రస్ట్ అంతర్జాతీయ సాహితీ పురస్కారం, రచన మాసపత్రిక కథాపీఠం పురస్కారం, అంతర్జాతీయ తెలుగు సాంస్కృతిక - సారస్వత సంఘం మొదలైన సంస్థల ద్వారా బహుమతులూ, పురస్కారాలూ, అభిమానుల ఉత్తరాలూ, పాఠకుల స్పందనా, పత్రికా సంపాదకుల ప్రోత్సాహం నాకూ, నా రచనలకూ విటమిన్లు.
1968 వ సంవత్సరం నించీ ఆనాటి యువ, జ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంద్రజ్యోతి, ఆంధ్రప్రభల నుంచీ ఈనాతి స్వాతి, విపుల, ఆంధ్రభూమి, రచన, చతుర, ఇండియా టుడే, స్వప్న మొదలైన భారత్దేశంలోని దాదాపు అన్ని తెలుగు పత్రికల్లోనూ, అమెరికాలోని తానా పత్రిక, అమెరికా భారతి, తెలుగునాడి, సుజనరంజని, కౌముది మొదలైన పత్రికల్లోనూ 350కి పైగా నా రచనలు వచ్చాయి. మొత్తం తొమ్మిది పుస్తకాలు ప్రచురించబడ్డాయి. ఆంధ్రభూమి, రచన, సుజనరంజని, కౌముది, స్వప్న మొదలైన పత్రికల్లో ధారావాహికంగా నా శీర్షికలు ప్రచురించబడ్డాయి.
సాలూరి వాసూరావు సంగీత దర్శకత్వంలో, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శైలజలు పాడిన సంగీత నృత్య రూపకం ‘వేయి వసంతాలు’ అట్లాంటా ఆటా కార్యక్రమంలో ప్రదర్శించబడింది.
ట్రివేండ్రంలో నాలుగు సంవత్సరాలు, హ్యూస్టన్ లో రెండు సంవత్సరాలు, ఆస్టిన్ లో ఎన్నో సంవత్సరాలుగానూ తెలుగు బడి నిర్వహిస్తున్నాను. 1998 నుంచీ టెక్సాస్ లో తెలుగు సాహిత్య సదస్సులు సంవత్సరానికి రెండుసార్లు, సాహితీ మిత్రుల సహకారంతో నిర్వహిస్తున్నాం.

సత్యం మందపాటి

 

పుట్టింది తూ.గో.జిల్లాలో ఆత్రేయపురం. పెరిగింది గుంటూరు.
చదువు గుంటూరు, కాకినాడ, విశాఖపట్టణం. ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీ.
ట్రివేండ్రంలో పదేళ్ళు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో సీనియర్ మేనేజర్ గా ఉద్యోగం.

ప్రస్తుతం, అంటే మూడు దశాబ్దాలుగా అమెరికాలో, టెక్సాస్ రాష్ర్త్ర రాజధాని ఆస్టిన్ నగరంలో.
వృత్తి ఇంజనీరింగ్ అయితే, ప్రవృత్తి సాహిత్యం. సాహిత్యరంగంలో ఒక చిన్న దీపం వెలిగించడానికి నాలుగు దశాబ్దాలుగా ఎన్నో కథలు, కవితలు, నాటికలు, నవలలు, శీర్షికలూ, మూడు సీడీలకు (వేయి వసంతాలు) పాటల ద్వారా ప్రయత్నం.

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
 
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech