Sujanaranjani
           
  సారస్వతం  
   

సంస్కృతంలో చాటువులు, విశేష న్యాయాలు. (17వ భాగం)

 

- రచన : " విద్వాన్" తిరుమల పెద్దింటి  నరసింహాచార్యులు. M.A.,M.Phil               

 

20. చర్వితచర్వణన్యాయం:-- (2వ భాగం.)

 
 

౭.స్వాధ్యాయము:--ఋషులు ప్రసాదించిన వేద,ఉపనిషత్,పురాణ,ఇతిహాసాది గ్రంథాలను అధ్యయనం చేసి భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని సన్మార్గంలో నడిపించుటే స్వాధ్యాయము.
౮.తపస్సు.—అరణ్యాలలో ఉండి చేసేతపస్సుకాదు ఇది. శరీరానికి కావలసినంత ఆహారాన్ని మాత్రమే స్వీకరించి, ఉపవాసాది దీక్షలను ఆచరిస్తూ,అతిని వర్జించి నియమ బద్ధంగా జీవితం గడపడమే తపస్సు.
౯.ఆర్జవము. మనోవాక్కాయకర్మల ద్వారా ఒకేభావన,ఒకేమాట,ఒకేపనిని ఆచరించడమే “ఆర్జవము”.
౧౦.అహింస.—అహింసాపరమోధర్మః మానసికంగా కాని,శారీరకంగా కాని ఎవరిని హింసించకుండుటయే అహింస.
౧౧.సత్యము.—సత్యం బ్రూయాత్ ప్రియంబ్రూయాత్/న బ్రూయాత్ సత్యమప్రియం/ప్రియంచ నానృతం బ్రూయాత్ అని రామాయణం తెల్పుతుంది. సత్యమే పరమ ధర్మము. అట్టిసత్యం ఇతరులకు మంచినికలిగించాలి.ఉన్నది ఉన్నట్లు,చూచినది చూచినట్లు చెప్పడమే సత్యము.
౧౨.అక్రోధము.—కోపము లేకుండుట. మనకు ఎవరైననూ మనసుకు బాధకలిగిం చినా వారిపై కోపము తెచ్చుకోకుండా సంయమనం పాటించడమే అక్రోధము.
౧౩.త్యాగము.—మన వద్దనున్నదానిని మనకోసం దాచుకోకుండా సమర్పించుటే త్యాగము. ఉన్నదానిలో కొద్దిగా ఇచ్చేది దానం. సర్వం సమార్పించేది త్యాగం. "రంతిదేవుడు త్యాగానికి నిదర్శనం"
౧౪. శాంతి.—ఇంద్రియములు ఉద్రేకము చెందకుండా అదుపులో ఉంచుకొనుటయే శాంతి. "కోపమోకింతయులేనివాడు, బుధకోటికికొంగు పసిండి,సత్యమారూపము,శాంతి,దయ ఆభరణాలుగా కలవాడు." ధర్మరాజు.
౧౫.అపైశునం.—పైశునం అంటే చాడీలు (కొండెములు)చెప్పి ఇతరులను బాధించుట. అలా ప్రవర్తించకుండా ఉండటమే అపైశునం.
౧౬.దయ.—సర్వ ప్రాణులయడ దయకలిగి ఉండుట. ఎట్టి బాధ కలిగించకుండుట.
౧౭. అలోలుప్త్వము.—అనుభవించిన వాటిని మరల,మరల అనుభవించాలనే కోరిక లేకుండుటే అలోలుప్త్వము.
౧౮.మార్దవము. మృదుస్వభావము. "వదనం ప్రసాద సదనం,సదయంహృదయం,సుదాముచో వాచః" అని సుభాషిత కారుడు అన్నట్లు కరకుగా చిటపటలాడుతూ ఉండకుండా లాలిత్యంగా ఉండటమే మార్దవము.
౧౯.హ్రీ: -- సిగ్గు. చేయకూడని పనులు చేసినపుడు సిగ్గుపడి మరల,మరల వాటిని చేయకుండుటయే హ్రీ: అనే దైవగుణం.
౨౦.అచాపలం.-- అదికావాలి, ఇది కావాలి అనే చంచల స్వభావము లేకుండా దొరికిన దానితో తృప్తి చెందుటయే అచాపలం.
౨౧.తేజస్సు.—క్లిష్ట పరిస్ధితిలో కూడా ధైర్యంగాఉండి,నిశ్చలంగా ఉండుట తేజస్సు.
౨౨.క్షమ.-- "అపకారికి అపకారము" చేయకుండా అనగా ప్రతీకార వాంఛలేకుండా క్షమించడమే క్షమ
౨౩.ధృతి. – ఆపదలయందు ధైర్యం వీడక నిశ్చలమనస్కులై అనుకోన్నపని సాధించుటయే ధృతి.
౨౪.శౌచము.- మనస్సుఅపవిత్రత చెందకుండా సకలేంద్రియములు సక్రమ మార్గములో సంచరించుటయే శౌచము.
౨౫. అద్రోహము. ఇతరులను బాధించకుండా,అపకారము చేయకుండా ఉండుటయే అద్రోహము.
౨౬.నాతిమానితము.—ధన,బల,రూపాదులచే గర్వము చెందకుండుట.
ఇన్ని మంచి గుణములు కలవారు దేవతాస్వరూపులు. వారు భగవదాజ్ఞకి లోబడి యుందురు. ఇంతటి ఉదాత్తమైన ౨౬ దైవగుణములు కాని, వీనిలో కొన్నికాని మనలో ఉన్నచో సాత్వికమైన స్వభావముతో ఆశా,పాశాములకు లొంగకుండా,ఉదాత్తంగా జీవించవచ్చు. ముఖ్యంగా నేటి యువతలో ఈ దైవీసంపదగుణాలున్నచో, సమాజం కలుషితం కాకుండా,సర్వమానవ కల్యాణానికి,సమసమాజ స్థాపనకు కర్తలుగా నిలువవచ్చు."కంప్యూటర్లు, సెల్ ఫోనులే సర్వస్వంగాభావించే నేటియాంత్రిక జీవనవిధానంలో" ప్రశాంతంగా జీవించాలంటే దైవీసంపద పొందుట ఒక్కటే సరియగు మార్గము. అందుకే వీటిని ఇంతవిపులంగా వివరించడం జరిగింది. ఇంతటి మహత్తర విషయాలను బోధించే "భగవద్గీత" మనకి కరదీపికవంటిది. ఎన్నిపర్యాయాలు చదివినా "చర్వితచర్వణం" కాదు.అది నిత్యనూతనమే.
ఇంక అసురసంపద అంటే చెడు గుణాలు. వీటిని కొచంవివరించి,ఈ న్యాయాన్ని ముగిస్తాను.ఇవి కోరదగినవి కావు. కనుక కొంచం తెలుసుకొందాం.
౧.దంభము.—డాంబికము అనగా ఆడంబరంగా జీవించడం. ఇతరులముందు గొప్పగా తనని తాను ప్రదర్శించుకోవడం దంభము.
౨.దర్పము.- అనుకోకుండాధనవంతుడై పూర్వ స్ధితిని మరచి,గొప్పకోరకు చేయకూడని పనులు చేయుట దర్పము.
౩.అతిమానము.—ఇది నేటిసమాజంలో అధికంగా కనబడే దుర్గుణం. అధిక విద్యావంతుడు వినయానికిబదులు, గర్వం కలిగిఉండడం. తానే గొప్ప అనుకోవడం. అతిమానము.
౪.క్రోధము.- ఇంద్రియాలని అదుపులో ఉంచుకోకుండా ప్రతిదానికి ఉద్రేకపడి కోపం తెచ్చుకోవడం దానివల్ల నాశనమవడం. క్రోధము. ఇది మహా చెడ్డ గుణం.
౫.పారుష్యము.—ప్రతి చిన్ని విషయానికి కఠినంగా ప్రవర్తించడం.
౬.అజ్ఞానము.- దైవచింతన లేక, మంచి విషయాలను తెలుసుకొనక,చెడువైపు ఆసక్తి చూపడమే అజ్ఞానము. "మంచి సంపాదించడం కోడపైకి రాయిని కష్టపడి ఎక్కించడం లాంటిది. అదే చేడుఅయితే కొండపైనుండి రాయిని క్రిందకి తోయడం అంత సులభం." కాబట్టి
మన మనస్సులు అసుర గుణాలవైపు పయనించక, దైవీసంపదవైపు, అంటే మంచి గుణాలవైపు పయనించి, మన జీవితాలు లోకకల్యాణానికి అంకితం కావాలని, సర్వమంగళ ప్రదాలు కావాలని కోరుతూ, ఈ "చర్వితచర్వణ" న్యాయాన్ని ముగిస్తున్నాను. (వచ్చేనెల మరోన్యాయం)

(సశేషం.)
  
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech