Sujanaranjani
           
  సారస్వతం  
 

                                                          రచన :  డా.అయాచితం నటేశ్వర శర్మ

 

శకుంతల (పద్యకావ్యం) - 9      ప్రథమాశ్వాసం              

 
అనుచు ప్రియసఖులీ రీతి ననునయింప
తగిన సమయమిదే యంచు తరలి రాజు
భయము వలదిక నేనుంటి భద్రలార!
అనుచు వారి సమక్షాన కరుగు దెంచె. 61

వ్యాఖ్యానం: తపోవనాలలో ఎవరికి ఏ బాధ కలిగినా వారి బాధలను తొలగించేవాడు దేశాన్ని పాలించే రాజే అని అనసూయాప్రియంవదలు పలుకగానే, ఇదే తగిన సమయమని భావించిన దుష్యంత మహారాజు చెట్టు చాటు నుండి ఆ మునికన్యల ముందుకు వెళ్ళాడు.అలా వెళ్ళి ఓ భద్రలారా! మీకు ఏ భయమూ లేదు.మిమ్మల్ని కాపాడడానికి నేను వచ్చానూ అని అన్నాడు.

పౌరవుడు శాసనము జేయు ధారుణి యెడ
అవినయంబుగ వర్తించు నతడెవండు?
ముగ్ధ తాపస కన్యల ముందు నిలిచి
కీడు తలపెట్ట సమకట్టు వాడెవండు? 62

వ్యాఖ్యానం: పురువంశంలో జన్మించిన ఈ దుష్యంతుడు పరిపాలిస్తూ ఉన్న ఈ భూమిపై అవినయంగా ప్రవర్తించే వాడు ఎవడైనా ఉంటాడా? ఈ ముగ్ధతాపసకన్యలకు కీడును తలపెట్టే సాహసం చేసే వాడు ఎవడుంటాడు? ఎవడూ ఉండనే ఉండడు.

అనుచు సరభసముగ నటకడుగు మోప
సంభ్రమాశ్చర్యముల జూచి సఖులు వెండి
ఆర్య! అవినయంబిచట చూడంగ లేదు
చెలియ మధుకర బాధ్యయై నిలిచె నిచట. 63

వ్యాఖ్యానం: ఇలా ఆ దుష్యంతుడు ఆకస్మికంగా వారి మధ్యకు రాగానే ఆ చెలులు ,శకుంతల సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యారు. వెంటనే తేరుకొని-`ఆర్యా! ఇక్కడ ఎవరూ ఎలాంటి అవినయాన్ని ప్రదర్శించడం లేదు.మా చెలిని తుమ్మెద మాత్రమే బాధిస్తోంది. అందుకే ఇలా మేము భయంతో ఉన్నాము ' అని అన్నారు.


కావున సాంత్వన మొందుము
ఈ వనమున తావు లేదు హింసకు నెపుడున్
పూవుల వోలిక ననయము
కావింపగ ధర్మదీక్ష కమనీయంబౌ. 64

వ్యాఖ్యానం : ఓ పూజ్యుడా! ఇక్కడ ఎలాంటి అవినయం లేదు కనుక మీరు సాంత్వనను పొందండి. ఈ వనంలో హింసకు తావు ఉండదు. ఇక్కడ ఉన్నవారు అందరూ పువ్వుల వలె మృదువైన ప్రవతన గలవారే. కనుక ధర్మాన్ని పాటించడంలో ఎలాంటి ఇబ్బందీ లేదు.


అన విని రాజచంద్రముడయాచిత భాగ్యము చేతి కందిన
త్లనుకొని మేనకాసుతను హార్దత నెక్కొన జూచి పల్కె నో
యనుపమ సేవనోన్నత! సమంచిత రీతిని సాగునే తపం
బనుచితమెందు లేక విధు లాశ్రమ మందున సాగుచున్నవే? 65

వ్యాఖ్యానం: ఆ మునికన్యలు అలా సమాధానాన్ని చెప్పగానే ఆ దుష్యంతమహారాజు అయాచితంగా భాగ్యం ఏదో చేతికి అందినట్లు మనస్సులో మురిసిపోతూ హృదయం పులకించగా శకుంతలను చూస్తూ-`ఓ నిరుపమానసేవానిరతా!
తపస్వినీ! నీ తపస్సు చక్కగా సాగుతోందా? ఈ ఆశ్రమంలో అనుచితప్రవర్తనలు ఎక్కడా జరగడం లేదు కదా!' అని అడిగాడు.

హృదయము నాకర్షించిన
మదనప్రతిరూపు జూచి మానిని యట నే
కదలక మెదలక నేలను
ముదమారయ జూచి మౌనమును వహియింపన్. 66

వ్యాఖ్యానం: తన హృదయాన్ని ఆకర్షించిన మనోహరుడైన దుష్యంతమహారజు తనను అలా ప్రశ్నించగానే సిగ్గుతో తలవంచుకొని కదలక మెదలక నేలను చూస్తూ ఆ శకుంతల మౌనంగా ఉండిపోయింది.

సఖులిటు పల్కిరో భువనచక్రసురక్షక! మీదు రాకచే
మఖఫల మందుకొంటిమి సమమ్ముగ సాగగ ధార్మికక్రియల్
అఖిలతపంబులన్ వ్రతములన్నిటనౌ గృహమేధిధర్మముల్
ముఖములవోలె కట్టెదుట ముందు కనంబడు నెల్ల వేళలన్. 67

వ్యాఖ్యానం: శకుంతల సిగ్గుతో ఏమీ మాట్లాడలేక సిగ్గుతో తలవంచుకొని మౌనాన్ని వహించగానే ఆమె చెలులైన అనసూయాప్రియంవదలు దుష్యంత మహారాజుతో -`ఓ భువనమండలరక్షకా! మీ రాకతో యాగఫలం లభించినట్లు మేము ఆనందిస్తున్నాము.మీ పరిపాలనా సామర్థ్యం వల్ల మా ధర్మకర్మలు చక్కగా సాగుతున్నాయి. మేము చేసే సకల తపస్సులూ,వ్రతాలూ,ఆతిథ్యమర్యాదలూ, ప్రత్యక్షఫలితాలను ఇస్తూ మాకు సంతృప్తిని కలిగిస్తున్నాయి ' అని అన్నారు.

కనుక మీ వంటి అతిథిని గన్న మేము
ధన్యులము గాక యెట్లుండు? మాన్యచరిత!
స్వాగతంబగు నిట మీకు సాధుశీల!
ఫలములర్ఘ్యంబులను గొనుడలయకుండ. 68

వ్యాఖ్యానం: ఓ మాన్యచరితా! సాధుశీలా! మీ వంటి గౌరవనీయుడైన అతిథిని పొందిన మేము ధన్యులము కాకుండా ఎలా ఉంటాము?మీకు స్వాగతం అగు గాక.మీ అలసట తీరే విధంగా అర్ఘ్యాన్నీ,ఫలాలనూ స్వీకరించండి అని ఆ చెలులు అన్నారు.

సముచితాసనమిది మీకు శ్రమదొలంగ
సుఖతనాసీనులై యుండ శుభము గలుగు
అతిథిమర్యాద యుచితమై యలరు మాకు
అనుచు ప్రేమతో బల్కిన యంత రేడు. 69

వ్యాఖ్యానం: ఓ పూజ్యుడా! ఇది మ్మె కోసం ఏర్పరచిన సముచితమైన ఆసనం.దీనిపై సుఖంగా ఆసీనులై మీ శ్రమను పోగొట్టుకోండి. మీకు శుభం కలుగుతుంది. మీవంటి అతిథులకు పరిచర్యలు చేయడమే మాకు ఉచితమైన విషయం అని
ఆ చెలులు దుష్యంతమహారాజుతో అన్నారు.

లలిత వచోవిలాసముల లక్షణలై వెలుగొందు మీ సుధా
కలితములైన మాటలకు గావె మనంబులు పూర్ణబింబముల్
అలసట దీరిపోయె భవదాదర వాక్య్మయైక సేవతో
తులనము లేని రమ్యగుణ తూలితముల్ భవదార్ద్ర చిత్తముల్. 70

వ్యాఖ్యానం: అలా ఆ చెలులు తనను ఆదరంతో సంభావించగానే దుష్యంతుడు-`ఓ లలితహృదయలారా! మీ మృదువైన మాటలకు ఎంతటి కఠినాత్ముల మనస్సులైనా పూర్ణబింబాల వలె మారిపోతాయి. మీ ఆదరవాక్యాలతో కూడిన సేవలతో నా అలసట తీరిపోయింది. మీ మెత్తని హృఇదయాలు నిరుపమానగుణరాజితాలై ఆకట్టుకుంటున్నాయీ అని అన్నాడు.

-(సశేషం)

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

   

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech