Sujanaranjani
           
  సారస్వతం  
  పుస్తక పరిచయం - 1

 పరిణితి చెందిన భావాలతో "జీవన శిల్పం''

 

                                                                                 - సమీక్షకులు ; శైలజామిత్ర

 

bookrelease

రచన : అనసూయ

 
 

కధ కధలా ఉండాలని, కధంటే ఉహాజనితమయినదని, కధానిక ఆంటే వాస్తవ చిత్రీకరణ అనేది  సుప్రసిద్ధ కధా రచయిత వేదగిరి రాంబాబు గారి  మాట.   విషయాన్ని గ్రహించడానికి ఒక రచయితకు ఎంతకాలం పడుతుందో కాని కన్నెగంటి అనసూయ గారు మొదటి గ్రంధంలోనే గ్రహించారు.. కధలలో  సామాజిక స్పృహతో పాటుగా అభివ్యక్తీకరణ ఎంతో అవసరం. ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకునే రీతిలో ఎంతో సాధారణంగా పాత్రలను మలిచేరు. సమాజానికి ప్రతి విషయం తెలపడానికి ప్రయత్నించేరు. స్వతహాగా ఎంతో మంచి మనసు కలిగి ఉన్న వీరు  ఆంటే సమాజ సేవకై తన సమయాన్ని వెచ్చిస్తున్న అనసూయ గారు మనసున్న కధలు రాయడం అనేది పెద్ద కష్టం కాదు.   ఇరవై కధలున్న సంపుటి అనసూయ గారి ప్రయోగమే అని చెప్పాలి.             

              ఒక విజయానికి ఒకరికి ఒకరు భాధ్యులు అని తల్లి తండ్రిని అనరు కాని భార్య భర్తల్ని మాత్రం ఖచ్చితంగా అంటారు. ఎందుకంటే కుటుంబ వాతావరణంలో ఒక్కరి అభిప్రాయం మరొకరికి నచ్చకపోయినా జీవితం ముందుకెళ్ళడం అనేది చాలా కష్టం. అందుకే ఒకరి అభిప్రాయాలని మరొకరు గౌరవించుకుంటూ, ఒకరి ఆశయాలకు మరొకరు తోడవుతూ ఉన్నప్పుడే బంధాలు అలాగే ఉంటాయి. అనుకున్నవి సాధించగలుగుతాయి. అదే కోణం లో రచించిన కధ "జీవన శిల్పం'  ఎంతో ఆదర్శవంతంగా ఉంది. భార్య శిలలా మౌనంగా ఉన్నా సరే ఆమెను స్నేహితురాలి మాటలతో మారిన శేఖర్ తన భార్య లక్ష్మిని శిల్పంలా మర్చి చివరకు అవార్డు సంపాదించుకునే దశకు చేర్చుతాడు. భర్తలో అర్థం చేసుకునే గుణమే ఉంటే స్త్రీ ఏదైనా సాధించగలదనే విషయాన్ని ఎంతో అందంగా మలిచారు

                  ఆకాశం నీలంగా ఉంటుందని అందరికి తెలుసు. అనాధకు ఆదరణ లేదని తెలుసు. కాని విషయాన్ని చెప్పగలిగేలా చెప్పడం ఒక్క రచయితకే సాధ్యం. నిదర్శనంగా "పడమటి సంధ్యారాగం" అనే కధలో పుస్తకాలను మోస్తున్న ఒక అనాధ స్త్రీ పాత్ర గుండెను కదిలిస్తుంది. అనాధల జీవితాలను తరచి చూస్తుంటే కలచివేస్తుంది. ఆఖరికి ఆమెను ఏదైనా ఒక హోం లో చేర్చి సాయం చేయాలనే తపనాఠకులను ఎంతో ఆదర్శవంతంగా నిలుస్తుంది. కధ ఎండిపోయిన గుండెలో తడినే నింపుతుంది. మనసున్న ప్రతీవారు సంఘసేవకులే. సంమజానికి సేవ ఎన్నో రకాలు ఉన్నాయి. కాని రచయితలకు మించిన సంఘసేవకులు లేరనేదే నా భావన. ఏదైనా సేవ మానసికంగా అందించేదే నిజమయిన సేవ. అలాంటి సేవతో పాటు వీరు ఎన్నో రకాలుగా సామాజిక సేవ చేస్తున్న వీరు గొప్ప మనసున్నవారు అనడంలో సందేహం లేదు.                

                            అక్షరాస్యత అనేది అందరికి అవసరం అని ఎంతగా మొత్తుకుంటున్నా. పూట గడవని పేదవారి విషయం లో మాత్రం ఇది అమలు జరగటం లేదు. రెక్కాడితే కాని డొక్కాడని జీవితాలు లెక్కలేనన్ని ప్రపంచంలో. దృష్టితో రచయిత్రి 'చైతన్యం' అనే  కధ రాసేరు. అందులో లెక్కలు రాని ఇస్త్రి అమ్మాయి ఒక్కసారిగా తనకు అంకెలు కొద్ది కొద్దిగా వచ్చు అనగానే అందులోని యజమానురాలు ఏంటో మురిసిపోతుంది. అక్షరం మనిషిలో ఎంతటి ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుందో అనేది ఆమె కళ్ళల్లో చూసి మురిసిపోవడం ఎంతో అర్థవంతంగా, ఆదర్శ వంతంగా తీర్చిదిద్దేరు. కధ చదివాక ఏదో ఒక రకమయినృప్తి పాటకుడికి కలుగుతుంది.                 

                           పసిపిల్లల హృదయాలు చాలా సున్నితం గా ఉంటాయి. రాను రాను సహవాసం వల్లో పెద్దవాళ్ళ మధ్య మసలటం వల్లొ వారి అలవాట్లలోనూ, జీవిత విధానం లోను ఎంతో మార్పు వస్తుంది కాదు బలవంతంగా మార్పు తెచ్చుకుంటారు. కాని పసిపిల్లలు మాత్రం దైవంతో సమానమే అనడానికి నిదర్శనంగా అనసూయ గారు ఒక అద్భుతమయిన కధ రాసారు. కధ పేరే " సంధి?". ఇందులో ఒక పిల్లవాడు తాను తన స్నేహితుడు ఇద్దరు ఒకేలా వ్యాసం రాశామని కాని ఒక మార్కు తన స్నేహితుని కంటే తక్కు మార్కులు వచ్చాయని అక్కడే పేపర్స్ దిద్దుకుంటున్న టీచర్ ను అడిగాడు. టేచెర్ ఎక్కడో ఏదో తప్పు రాసి ఉంటావుెళ్ళు అని సర్ది చెప్పినా అక్కడే ఉండడం టీచర్ కు ఆశ్చర్యం కలిగిస్తుంది. తీరా పేపెర్ చేతిలోకి తీసుకుని గమనిస్తే ప్రియమయిన తల్లికి అని రాయడానికి బదులు ప్రియమయిన పిన్నికి అని రాసి ఉండటం చూపిస్తుంది. అప్పుడు విద్యార్ధి. నాకు తల్లి చనిపోతే అక్కడే పిన్నె ఉంది టీచర్ అందుకే.. అనడం గుండెను ఒక్కసారిగా పట్టి కుదిపేస్తుంది. నవల ఆంటే అది ఎవరైనా అభ్యాసం తో రాయగలరు. కాని చిన్న కధ రాయలంటే మాత్రం ఎంతో రచయిత గా ఎదగాల్సిందే! ఎదుగుదల రచయిత్రి కన్నెగంటి అనసూయ గారిలో ఉంది  అనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.                 

                     మానవత్వానికి అర్థం కాదు అసలు పేరే మరచిపోయిన రోజుల్లో మానవులకు దారి చూపు అంటూ వేడుకున్న తీరు కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి తత్వానికి కాస్తంత దగ్గరకు చేరుకోవాలని వీరు రచించిన కధలు ఎంతో ఉపయోగ పడతాయి.                     

                      ఇలా ప్రతి కధా పాఠకుల బుర్రలకు పదును పెట్టేవే. రెండొందలు, మధురిమలో, చిరునవ్వు, బియ్యపు రవ్వ ఉప్మా,కొత్త మల్లెలు, పెరటి మొక్క, గమ్యం కధలన్నీ కంట తడి పెట్టించక మానవు. కధలంటే మన చుట్టూ జరిగే సంఘటనలే. అలాంటి సంఘటనలకు మనకు కొదవ లేదు. కొదవ రాదు కూడా!  సమాజం, ఇళ్ళు, మనసు, మనిషి కి మించిన కధా వస్తువులు లేవు. అలాంటి మంచి కధలను అందించిన అనసూయ గారికి అభినందనలు. మంచి మనస్తత్వం ఉన్న రచయిత్రి మరిన్ని ఉత్తమమయిన కధలు రాసి పాటకులకు అందిస్తారని ఆశిస్తున్నాను                                                

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech