కబుర్లు    
     పట్టాభిరామాయణం

- రచన : బి.వి.పట్టాభిరాం

 

అపజయాలన్నీ అవకాశాలే

ఈ జన్మలో మావాడు టెన్స్ పాసవుతాడనే నమ్మకం నాకు ఆవగింజంతైనా లేదు. అంది ఉస్సూరని కూర్చుంటూ తల్లి.
మధ్యపాపిడితో పెద్ద బొట్టుతో లూజ్ షర్ట్ వేసుకుని బెదురు చూపులతో ఆమె పక్కన కూర్చున్నాడు కొడుకు.
ఇప్పటికి ఎన్నిసార్లు టెన్త్ పరీక్ష రాశాడు? అని అడిగాను.
ఎండుసార్లు రాశాడు. వీడి బుర్రలో ఏదైనా విషయం ఉంటేనేగా రాయడానికి. బుర్రనిండా మట్టి..మట్టి తప్ప ఏమీ లేదు. చచ్చీచెడీ ఫీజులు కడుతున్నాం. వీడెళ్ళి అక్కడ సున్నాలు చుట్టి వస్తున్నాడు. అంది కోపంగా.
కొడుకు మౌనంగా తల దించుకుని వింటున్నాడు.
మరి ఇప్పుడు ఇక్కడకెందుకు తీసుకువచ్చారు? అతను పాసవ్వడనే విశ్వాసం మీకు బాగా ఉంది కదా! పైగా బుర్రనిండా మట్టి ఉందంటున్నారు. అన్నాను గంభీరంగా.

అహ.. అది కాదు మీరు చెప్తే పాసవుతాడేమోనని. అయినా నా బాధ మీ కెలా తెలుస్తుంది. మా ఆడబడుచు కొడుకు ఫస్ట్ టైమే, ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు. మరి వీడికేం రోగం? అప్పటికీ అడిగినవన్నీ సమకూరుస్తున్నాం. తిన్నది అరక్క ఇలా అయ్యాడు. మీరిలాంటి వాళ్ళని బాగు చేస్తారని విన్నాను. వీడికి చదివే యోగం ఉందా లేదా చెప్పండి. అంది మండిపడుతూ.

ఆవిడ మాటలు విన్నాక, ఆమెది అధారిటేరియన్ పర్సనాలిటీ అని తెలిసి పోయింది. ఆ కోవకు చెందిన వారు ఎదుటివారికి విలువ ఇవ్వరు. తాము చెప్పిందే కరెక్టని అనుకుంటారు. అదే తత్త్వంతో భర్తని, కొడుకుని వాజెమ్మలుగా జమకట్టింది. ఇక ఈవిడతో మాట్లాడి లాభం లేదని, అబ్బాయితో సంభాషణ ప్రారంభించాను.

మీ అమ్మ అన్నట్టుగా నువ్వు కూడా ఈ జన్మలో పరీక్ష పాసవ్వలేనని అనుకుంటున్నావా? అని అడిగాను.
నాకూ అలాగే అనిపిస్తోంది. నా బుర్రలో ఏమీ లేదని. పైగా రెండు సార్లు తప్పినవాడిని. మళ్ళీ వెళ్ళటం అనవసరం.

వెళ్ళీనా కూడా గారంటీగా ఫెయిల్ అవుతాను. అన్నాడు అపారమైన విశ్వాసంతో.
అలాగా, సరేలే‘ వచ్చేవారంలో రెండు రోజులు నీతో మాట్లాడి, నీమీద నీకు విశ్వాసం కలిగిస్తాను. అంతవరకూ నువ్వు మళ్ళీ పరిక్ష గురించి ఆలోచించకు. అనిచెప్పి అతని తల్లితో అమ్మా మీరు మీ వాడికి నెగిటివ్ సజెషన్లు ఇవ్వకండి. పరీక్ష గురించి, ఫెయిలవడం గురించి, మీ ఆడబడుచు కొడుకు పాసవడం గురించి.. ఇలా అతనికి సంబంధించిన ఏ విషయాలనూ ప్రస్తావించకండి. అతనిలోని లోపాలను ఎత్తిచూపే బదులు మంచి గుణాలను నేర్పించండి.అని చెప్పి పంపాను.

ఇది జరిగిన రెండురోజులకు, అనుకోకుండా చుట్టాలతో కలిసి ఒక సర్కస్ చూడటానికి వెళ్ళాల్సివచ్చింది. పిల్లలంతా కేరింతలతో నానా హంగామా చేస్తున్నారు. టిక్కెట్లు ఇవ్వటం ఇంకా ప్రారంభించలేదు. సరే, ఏదో కాలక్షేపం చేద్దామని సర్కస్ గుడారం పక్కన కట్టి ఉంచిన ఏనుగులను చూడటానికి వెళ్ళాను.

అంకుల్, అంటూ చెయ్యి తీసుకుని షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే ఎవరా అని చూశాను. రెండుసార్లు టెన్స్ ఫెయిలైన అబ్బాయి. అతనూ సర్కస్ చూడడానికి వచ్చాడు. ఇద్దరం ఏనుగులవైపు వెళ్ళాము. పెద్ద పెద్ద ఏనుగులు నాలుగు, చిన్నవి రెండు ఉన్నాయి. వాటిని చూస్తూనే ఆ అబ్బాయి, నా చెయ్యి గట్టిగా పట్టుకుని అంకుల్, అక్కడ చూశారా, అంత పెద్ద ఏనుగుని చిన్న తాడుతో కట్టారు. అది కానీ కాలు విదిపితే మన గతి ఏమవుతుంది? అటువైపు వద్దు రండి. అని పక్కకు లాగాడు. అక్కడ చూస్తే ఒక చిన్న ఏనుగుని బలమైన చెయిన్లతో కట్టి ఉంచారు. దాంతో మరీ టెన్షన్ పడ్డాడు.

అంకుల్ వీళ్ళు ఎంత పొరపాటు చేశారో మీరు గమనించారా? పాపం బుజ్జి ఏనుగుకు బలమైన సంకెళ్ళతో బంధించారు. కొండంత ఏనుగుని, గడ్డిపోచలతోపేనిన తాడుతో కట్టిపడేశారు. ఆ చిన్నది బాధపడటం మాట అలా ఉంచి, పెద్ద ఏనుగు కానీ కాలు గుంజితే, ఈ గుడారం నేలమట్టమవదూ? ఇంత పెద్ద సర్కస్ కంపెనీకి ఈ చిన్న విషయం తెలీదా? మనం పోదాం రండి. అన్నాడు కంగారుగా.

ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ చేయడానికి మంచి అవకాశం లభించింది నాకు. ఇద్దరం బయటకు వచ్చాక అతనికి చెప్పాను. సర్కస్ వాళ్ళు చేసింది కరెక్టే! చిన్న ఏనుగుని సంకెళ్ళతోనే కట్టాలి. దాన్ని పుట్టినప్పటి నించీ సంకెళ్ళతోనే బంధిస్తారు. ఆ గున్న ఏనుగు చప్పించుకోవడానికి సకల విధాల ప్రత్యత్నిస్తుంది. ఎంత ప్రయత్నం చేసినా లాభం లేదని తెలిశాక చివరకు, అంటే రెండేళ్ళకు ఆ ప్రయత్నం విరమించుకుంటుంది. ప్రయత్నం కూడా చేయదు. చచ్చేవరకు దానికి తప్పించుకోవాలనే ఆలోచన కూడా రాదు. ఎందుకంటే ఎంత ప్రయత్నం చేసినా లాభం లేదు. పైగా రెండేళ్ళు ప్రయత్నం చేశాను కదా అనుకుంటుందట! అన్నాను.

ఓహో అలాగా అన్నాడు ఆశ్చర్యంగా!
నీ పని కూడా అలాగే ఉంది. అది జంతువు కాబట్టి రెండేళ్ళు ప్రయత్నించి ఊరుకుంది. మనం మానవులం. భగవంతుడు మనకు బుద్ధి ఇచ్చాడు. మనకు ఆలోచించే శక్తి ఉంది. కాబట్టి మళ్ళీ ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు. అపజయాలను అవకాశాలుగా మార్చుకోవాలి. నువ్వు ఈసారి మళ్ళీ పరీక్ష రాయి. విజయం నీదే అన్నాను.

ఆ అబ్బాయి మళ్ళీ నాకు నాలుగేళ్ళు కనబడలేదు. మొన్న మద్రాస్ ఐ.ఐ.టి.లో సాంస్కృతిక కార్యక్రమానికి వెళ్ళినపుడు అక్కడ ఉన్నాడు. ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. వచ్చి కలిసి కృతజ్ఞతలు తెలిపాడు

 
Dr. బి.వి. పట్టాభిరాం:

బీ వీ పట్టాభి రాం, పరిచయం అక్కర్లేని పేరు...ఎన్నో ఏళ్ళుగా మేజిక్ రంగం లోనూ, ఇటు సైకాలజీ రంగంలోనూ తనదైన ముద్రతో ఎంతో మందికి స్ఫూర్తి కలిగించే అద్భుతమైన రచనలు అందిస్తూ, అనేక మంది యువతకి లక్ష్య సాధన వైపుకు నడిపించే ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్న డాక్టర్ బి.వి. పట్టాభిరాం రచనల సమాహారం ఈ "పట్టాభిరామాయణం".

 


 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


   
 

   Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech