Sujanaranjani
           
  శీర్షికలు  
  పద్యం - హృద్యం
 

  నిర్వహణ : తల్లాప్రగడ రావు     

 

"సమస్యాపూరణం:

క్రింది "సమస్యని" అంటే వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము. మీ జవాబులు -మెయిల్ (విద్యుల్లేఖ) ద్వారా (padyam@tallapragada.com)  మాకు అక్టోబర్ 20 తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. 

 

ఇక్కడ రెండు సమస్యలను ఇస్తున్నాం. రెండికీగానీ, లేక వొక్క దానికైనాగానీ మీరు మీ పూరణలను పంపవచ్చు

 

నవంబరు మాసము నుంచీ పుల్లెల శ్యామసుందర్ గారు ఈ శీర్షిక బాధ్యతను నిర్వహించనున్నారని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను.

  మాసం సమస్యలు 

1) తే. గీ.||  ఉండె  కన్యా  కుమారియే  ఉత్తరమున (జగన్నాథ రావు గారు పంపినది)

2) "భేదము,నాదము, పాదము, మోదము" నాలుగు పాదాలలో ఒక్కో పదం వచ్చే విధముగా స్వేచ్చావృత్తంలో "శివపార్వతుల కళ్యాణవర్ణన"

(వేదుల బాలకృష్ణగారు పంపినది)

క్రితమాసం సమస్యలు  

తే. గీ. || తలకు  నూనె  వ్రాసుకొనుట  తప్పు! తప్పు!
కం || వగచెను  పురుషార్థమిచట  పరుషార్థంబై

సమస్య లకు వచ్చిన ఉత్తమ పూరణలు ఇలా వున్నాయి.

 

మొదటి పూరణ - గండికోట  విశ్వనాధం,  హైదరాబాద్   

తే.గీ.||అచ్చు తప్పులొకప్పుడు ముచ్చ టౌను

అటులె విపరీతమౌ అనర్థాలు పెంచు

తలకు నూనె రాసుకొనుట తప్పు కాదు

తలకు నూనె వ్రాసుకొనుట తప్పు తప్పు

 

తే.గీ.|| నాల్క తీరుగ తిరగని నాసి రకపు

వక్త తలకు నూనెను వ్రాసి వచ్చి నాడ

నంచు పలుకగా చెప్పిరి నవ్వి నవ్వి

తలకు నూనె వ్రాసుకొనుట తప్పు తప్పు.

  

కం.|| పొగరెక్కి శీలవతులను

వగపించిన వెతల గతికి, భ్రష్టుల విధికిన్

తెగ బలిసిన ఖలు చరితకు

వగచెను పురుషార్ధ మిచట పరుషార్ధంబై. 

 

రెండవ పూరణ - వేదుల బాలకృష్ణ, శ్రీకాకుళం

తే.గీ.|| తలకు నూనెను రాయుట తలను దువ్వు

కొనుట హితమును కూర్చును జనులకెల్ల!

కాని వాతరోగ, మశూచి కాది రుగ్మ

తలకు నూనెను రాయుట తప్పు! తప్పు!

 

కం.||పొగడుట పురుషార్దంబని

తెగవాగుచు సభల నడచు తీరు లెరుగకన్

నగవులపాలై తుదకిటు

వగచెను పురుషార్దమిచట పరుషార్దంబై!

 

మూడవ పూరణ - -యం.వి.సి. రావు, బెంగళూరు

తే.గీ.||తనదు స్థాయిని మరచుచు తగుదు నంచు

పరుల నధికారమెల్లను పైన గొనెడి

జడుడు, పడరాని పాట్లను పడుట యనగ

తలకు నూనె వ్రాసికొనుట తప్పు తప్పు

 

కం.|| పగలనక రేయి యనకను

అగచాట్లను పడుదు రర్ధ కామములందున్

అగుపించదెచట ధర్మము

వగచెను పురుషార్ధమిచట పరుషార్ధంబై

 

నాల్గవ పూరణ- నేదునూరి రాజేశ్వరి, న్యూజెర్సీ 

తే.గీ.|| మాడు నాముదమును బెట్ట వేడు కనుచు

కొమరు దీవించు నాతల్లి కోరి కోరి

పసిడి యలవాటు లీనాడు పనికి రావు

తలకు నూనె వ్రాసు కొనుట తప్పు తప్పు

 

కం . || మగువలు నడుము బిగించగ

మగవారల సరస జేరి మణి మాణిక్యము లై !

తగవులు లేవిక మనకని

వగచెను పురుషార్ద మిచట పరుషార్ధంబై !

 

ఐదవ పూరణ- డా.రామినేని రంగారావు, యం.బి.బి.యస్, పామూరు, ప్రకాశం జిల్లా

తే.గీ.|| యజ్ఞములు చేయు వారును యాజకుడును

సన్యసించిన వారును,  శ్ర్రాధ్ధ కర్మ

నిష్ఠతో చేయు వారును నియమమొప్ప

తలకు నూనెను వ్రాసుకొనుట తప్పు తప్పు.

 

ఆరవ పూరణ - జగన్నాథ రావ్  కె.  ఎల్., బెంగళూరు  

తే. గీ. || వ్రాసెను  విరించి  తలమీద  వ్రాత  నీకు

మరల  వ్రాయ వీలగునె యే మనిషికైన ?

తలకు  నూనె  రాసుకొనుట  తప్పు  గాదు

తలకు  నూనె  వ్రాసుకొనుట  తప్పు! తప్పు!

 

కం || మగువకు  ఆర్థిక  బలమై

తగు  భాగమునీయ,  మగడు  తన  జీతములో ,

తెగువను  చూపగ  లేడని

వగచెను  పురుషార్థమిచట  పరుషార్థంబై

(కేంద్ర మహిళా సంక్షేమ శాఖ ప్రతిపాదన ప్రకారం భర్త తన నెల జీతంలో 10 నించి 20 శాతం భార్యకు ఇవ్వాలి)

 

ఏడవ పూరణ-  సుమలత మాజేటి, కుపర్టినో

తే.గీ.|| నుదుట బొట్టు పెట్టు కొనుట కొప్ప రసలు 

తలకు నూనె వ్రాసుకొనుట తప్పు తప్పు

చెల్ల దసలు చేతికి గాజు లేసుకొనుట

లలన విధ "ముండగ" లైకు ఇపుడు 

 

కం.|| నగవుల పాల్పడి ద్రౌపది

నగధరు వేడుచు నిలువగ కన భీముండున్

పగవాని పంచ నుండియు

వగచెను పురుషార్థంబిచట పరుషార్థంబై

 

ఎనిమిదవ పూరణ -  సింహాద్రి జ్యోతిర్మయి

కం.|| అగపడకున్నది ధర్మము

నగుబాటైనది నియమము, న్యాయము తొలగెన్

జగతిని కామమె నడుపగ

వగచెను పురుషార్ధమిచట పరుషార్ధంబై

 

తే.గీ.|| వలువ ఎదపైన ఎబ్బెట్టు వనితకిపుడు

సిగ్గు సింగార మనుమాట చీదరించు

తిలకమద్దుట అల్లుట తీరుగజడ

తలకు నూనె రాసుకొనుట తప్పు! తప్పు!

 

తొమ్మిదవ పూరణ - నెల్లుట్ల సుదర్శన్ రావు,  హైదరాబాద్

కవిత|| పిచ్చుక గూడులాంటి నాదు ప్రియమైన జుత్తు

నా అభిమాన హీరో అనుకరణ  మహత్తు !

తలకు మాసిన వాడనుకొందురు గాక చూసి నాజుత్తు ,

తలకు నూనె రాసుకొనుట  తప్పు తప్పు !

 

పదవ పూరణ - రావు తల్లాప్రగడ, శాన్ హోసే

తే. గీ. || జుట్టు అసలైన నిగనిగ ఉట్టి పడును,

నూనె రాసిన మంచిదే! నూనె రాయ

జిడ్డు కారును విగ్గున చిమ్మ, యట్టి

తలకు  నూనె  వ్రాసుకొనుట  తప్పు! తప్పు!

 

పదకొండవ పూరణ - పుల్లెల శ్యామసుందర్ - శాన్ హోసె

(క్రమాలంకారము)

తే.గీ||

తలపుకొచ్చును రీటాను తలచినంత,

సెక్రటరి చేయునిది బాసు చెప్పినంత,

'నూనె వ్రాయుట' యన సరియైన మాట?

తలకు నూనె - వ్రాసుకొనుట - తప్పు తప్పు

 

వివరణ:

క్రమాలంకారము సమస్య పూరణములో ఒక పద్దతి. మొదటి మూడు పాదములలో ప్రశ్నలడిగి, ఆఖరి పాదములో సమస్యను ముక్కలుగా విఱిచి ఆ ప్రశ్నలకు సమాధానములుగా చూపబడతాయి.

 


 

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
  

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech