Sujanaranjani
           
  కథా భారతి  
 

అలౌకికానందం

 

 

                                                                         రచన:  ప్రతాప వెంకట సుబ్బారాయుడు


నాకెందుకో మానవ సంబంధాలు చిత్రాతి చిత్రంగా అన్పిస్తాయి.

తొంభై తొమ్మిది శాతం మానవ సంబంధాలకి  అవసరాలు మూలు కారణం..అని నా నమ్మకం. ఇంతోటి దానికి మనిషికి మానసిక పరిణతి ఉండాలి..మనసు నిష్కల్మషంగా ఉండాలి.లాంటి పెద్ద పెద్ద మాటల్ని ఉదహరించడం..పుస్తకాల్లో, సినిమాల్లో మంచితనాన్ని ఓహ్! గుప్పించేస్తారు కానీ వాస్తవానికి అదో అభూత కల్పనగా నిలిచి వెక్కిరిస్తుంటుంది.

నా విషయమే తీసుకుంటే నా భార్య రుక్మిణి గురించి చెప్పాలి. నేను కాణీ కట్నం తీసుకోకుండా పెళ్ళి చేసుకోవడమే కాకుండా..మామగారి నుండి ఇంతవరకు ఏమీ ఆశించలేదు. అందుకే నేనంటే నా భార్యతో సహా వాళ్ళందరికీ ప్రత్యేక గౌరవం అభిమానమూను. అంతేకాకుండా నాది కష్టపడే మనస్తత్వం కావడం వల్ల ఆఫీసులో అంచెలంచలుగా ఎదుగుతూ చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాను. నా భార్యగా తను సుఖపడుతోంది..గౌరవించబడుతోంది. కాబట్టే మా వైవాహిక జీవితం సక్సెసయిందని నా ప్రగాఢ విశ్వాసం. తన అవసరం నాకు ఉంది..అలాగే నా అవసరం తనకి ఉందని గుర్తెరిగి ఉన్నాం కనుకే శాంతియుత అవగాహనతో జీవనం సాగిస్తున్నాం. మాలో ఏ ఒకరికి మూర్ఖత్వమున్నా..నేను పైన చెప్పిన వాటిలో ఏ ఒక్కదానిలో అపశృతి చోటు చేసుకున్నా మా బంధం మానసికంగా పటాపంచలయ్యేది. నలుగురికీ కనిపించేలా పటాటోప..కృతక బంధపు ముసుగులో బ్రతికే వాళ్ళం..సో..మా వైవాహిక బంధంలో అవసరమే ప్రథాన పాత్ర వహించిందన్నమాట నిర్వివాదాంశం.

ఇహ నా ఒక్కగానొక్క కొడుకు పద్నాలుగేళ్ళ సుబ్రహ్మణ్యం. వాడి గురించి ఇప్పుడే నా అభిప్రాయం చెప్పడం కరెక్టు కాదు. కానీ ఫ్యూచర్ లో వాడికి రెక్కలొచ్చాక వాడికి మాకూ మధ్య ఓ గోడ ఏర్పడుతుంది. వాడిలో కాస్త మంచితనం మిగిలుంటే అది పిట్టగోడై కనీసం పైనించి క్షేమ సమాచారాలు తెలుసుకోవచ్చు. పరిపూర్ణ చెడ్డవాడయితే గోడ ఆకాశమంత ఆక్రమించుకుని ఉంటుంది. అప్పుడు వాడేక్కడో...మేమెక్కడో..ఎవరి అవసరాలు వారివన్నది కూడా అక్షర సత్యమే. వాడికి మేము అక్కర్లేదు అనే స్థాయి అప్పటి వాడిది.

నా మిత్రుడు..శ్రేయోభిలాషి..కొలీగ్..విశ్వనాథం.. మెరా జిగ్రీ.. ఆఫీసులో మా ద్వయానికి ప్రాణమిత్రులని పేరుపెట్టారు. మేము ఒకరిని విడిచి ఒకరం ఉండలేం(?) వాడు వాడికి కావలసినవన్నీ డబ్బుతో సహా నా దగ్గరనుండీ చొరవగా తీసుకుంటాడు. నేనూ అంతే..అయినా మరీ వాడంత కాదు. అదే మా మధ్య సత్సంబంధానికి ..పటిష్టమైన స్నేహబంధానికి కారణమన్నది నా నమ్మకం. ఒకవేళ వాడి అవసరాలకి నేను సొల్యూషన్ కాకపోతే..వాడి ఎంట్రీని రెస్ట్రిక్ట్ చేస్తే అంతటి పటిష్టమైన బంధమూ బలహీనమవుతుందనీ నాకూ తెలుసు. అది ఊహించడానికి కూడా భయం కలుగుతుంది. అందుకే స్నేహ బంధాన్ని మెయిన్ టెయిన్ చేస్తాము(ను).

పాలవాడు, పూలవాడు నమస్కారం చేసినా, పచారి కొట్టతను నవ్వుతూ పలకరించినా, బట్టలు..నగల షాపుల్లోని సేల్స్ పర్సన్స్ కూల్ డ్రింక్స్ ఆఫర్ చేసినా అవన్నీ అవసరాల నిమిత్తం కాక మరేమిటి? మనిషి ఇగో సంతృప్తి పడటం చాలా ముఖ్యం. అదే జరిగితే అవసరం సులువుగా తీరిపోతుంది. ఎవరు కనుక్కున్నారో కానీ మా గొప్ప సూత్రం.

ఆఫ్టరాల్ సాఫ్ట్ స్కిల్స్ లోను, పర్సనాలిటీ డెవలెప్ మెంట్ లోను చెప్పేదేమిటి? ఎదుటి వాడిని ఎలా ప్లీజ్ చేసి..మన పబ్బం గడుపుకోవాలనేగా!
కాకపోతే జెంటిల్ గా..స్మూత్ గా డిమాన్ స్ట్రేట్ చేస్తారు. కార్పొరేట్ ఆఫీసుల్లో కస్టమర్ లని ఎలా సాటిస్ఫై చెయ్యాలో క్లాసులు చెప్తారు. అంటే అవసరాలు తీరాలంటే అవతల వాళ్ళని ఎలా పడెయ్యాలనే కదా! మనుషులంటే అవసరాలే! డబ్బు ఒక ప్రథమ అవసరం. అది తీరాలంటే మరొకరి మరో అవసరం తీర్చాలి. చదువుకావాలంటే మంచి విద్యార్ఢులమవుతాం. ఇంక్రిమెంట్లు..ప్రమోషన్లు..కావాలంటే మంచి ఉద్యోగులవుతాం. రేపన్న రోజు ఎవరితో ఏ అవసరం పడుతుందో..అని అందరితో సత్సంబంధాలు కలిగిఉంటే మంచి పౌరులమవుతాం.

నటన..అవసరార్ధం నటన! సమాజమంటే రంగస్థలి. నటుల మయం.

నా నిశ్చితాభిప్రాయం నాది. నా కెదురవుతున్న మనుషులు..సంఘటనలు దాన్ని బలపరుస్తున్నాయే తప్ప..మార్చడం లేదు..పుట్టినప్పటినుండి ఎంతో మందిని కలిసాను. ఈ ప్రపంచమే ఓ వ్యాపారస్థలి. లావాదేవీల మయం. మనిషి భగవంతుడ్ని సృష్టించింది కూడా అందుకే. భగవంతుడి ద్వారా మనఎన్నో అవసరాలు తీరుతున్నాయి. పురోహితులు..వేదబ్రాహ్మలు ఆయన్ని నమ్ముకుని జీవితాలు గడిపేస్తున్నారు. చందాలిచ్చి ఇన్ కంటాక్స్ తప్పించుకునేది కొంతమందైతే దేవుడి మాన్యాలతో లాభ పడేవాళ్ళు మరికొందరు. ఇహ ఆ దేవుడి ప్రాంగణం అంతా వ్యాపారమయం. చివరికి దైవదర్శనానికి కూడా డబ్బులు సమర్పించుకోవాల్సిందే కదా!

ఒక్కసారి తల్చుకుంటే అవసరాలు లేని విధి విధానం మనకు కన్పించదు. అందుకే ఈ జీవితం మీద విరక్తి కలుగుతుంది. కానీ రొటీన్ కి అలవాటైన జీవితం కదా! మళ్ళీ షరా మామూలే!

- - -

నువ్వన్నది నిజమే అవసరాల రొటీన్ జీవితాలకి మనం అలవాటయ్యాం..కాని ఇక్కడ మానసిక తృప్తి అనేది ఒకటుంది. అది ఎవరికి వారు పొందవలసి ఉంది. అంతా నిరాశాజనకంగా ఉంది. అని బాధ పడుతూ నిస్పృహతో కూర్చునే బదులు మన తృప్తి కోసం మనం స్వేచ్ఛగా మనకి తోచింది చేసుకోవాలి. కొంతమంది అవయవాలు.. రక్తం దానం చేస్తారు. అవి ఎవరికి ఉపయోగిస్తారో..ఏం చేస్తారో వాళ్ళకి అనవసరం. వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేయగలిగింది చేయడం.. నువ్వన్నట్టు ఇందులో కూడా వ్యాపార పాత్ర ఉండవచ్చు. కనీ దానం చేసే వాళ్ళకి అది అనవసరం. అది ప్రాణ దానానికే పుపయోగపడుతుందన్నది వాళ్ళ ఫీలింగ్. ఆ ఫీలింగ్ ని అనుభూతించి చూడు. అలాగే మనని నమ్ముకున్న వాళ్ళు. అది అవసరం కోసమైనా సరే మనం వాళ్ళ కోసం బ్రతకడంలో థ్రిల్లుండదా? మా ఆఫీసులో సంవత్సరం క్రితం చేరిన శరత్ లంచ్ చేస్తున్నప్పుడు నాతో పై విషయాలు చెప్పాడు. నేను అప్పటి దాకా నా ఆలోచనలే గొప్పవని అనుకునేవాణ్ణి. కాని నా మనసు తెరలు తొలగిస్తున్నాడు. వాడిని గురువు అనవచ్చా? అదే విషయం అడిగాను. వాడు నవ్వాడు. ఎవరైనా కొత్త యాంగిల్లో రూట్ క్లియర్ చేస్తే గురువేనా? నువ్వు చదువుకున్న వాడివి కాబట్టి కాస్త జెంటిల్ గా అన్నావు అదే అనాగరికుడైతే కాళ్ళమీద పడి దణ్ణాలు పెట్టేవాళ్ళు.. మందహసం చేశాడు.

గురువూ లేడు లఘువూ లేడు..మనిషి మనిషంతే..
బలహీనతతో ఎవరికీ లొంగిపోకూడదు.
మనకి సమస్యలు ఎదురైనప్పుడు మనసులో చీకటి వ్యాపించినప్పుడు..దారులన్నీ మూసుకున్నాయనుకున్నప్పుడు ...ఎవరినో ఒకరిని సంప్రదిస్తాం..
వాళ్ళ మనసు స్వేచ్ఛగా ఉంటుంది కనుక సొల్యూషన్ చెప్పే స్థితిలో ఉంటారు. అంత మాత్రం చేత వాళ్ళు తెలివైన వాళ్ళు కాదు వాళ్ళకి అతీత శక్తులు ఉండవు.
దానికి మనని మనం సరెండర్ చేసుకోనక్కర్లేదు. కొంతమంది ప్రొఫెషనల్ గా హెల్ప్ చేస్తే..మరికొందరు మంత్ర తంత్రాలతో మోసం చేస్తారు..నవ్వాడు.

శరత్ పరిచయం మనసుకి ఏదో కొత్త మార్గాలు చూపిస్తోంది. ఇన్నాళ్ళూ ఇతనితో పరిచయం లేకపోవడం నా దురదృష్టం..
ఆ మాట కూడా అతనితో అన్నాను.. దానికి మనిషికి డిపెన్డెన్సీ ఉండకూడదు. సాధ్యమైనంత వరకూ తన మార్గాన్ని తనే చూసుకోవాలి. అవసరమైతే సహాయం తీసుకోవాలి. ఆధారపడడం ఎప్పుడు మొదలవుతుందో..మెదడు మొద్దు బారడం ప్రారంభమవుతుంది.

ఏవిటితను? పురుషుల్లో పుణ్య పురుషులు వేరయ..అన్నట్లు మనుషుల్లో ఆణిముత్యంలా భాసిస్తున్నాడు. అవసరమన్నది నేను ప్రపంచాన్ని నడిపిస్తోందనుకుంటే..కాదు అవసరం అన్నది అత్యల్పంగా పరిగణించాలని బాహ్య రూపంలో కనిపించేది అదైనా అంతః రూపాన్ని దర్శించగలగాలని అంటున్నాడు.

ఆఫీసు నుండి నడుచుకుంటూ వెళుతున్న మేము కొద్ది దూరంలో స్కూటర్ని లారీ గుద్దడం చూశాము. వెంటనే కొంతమంది చుట్టూ మూగి అంబులెన్స్ కి ఫోన్ చేసి గాయపడిన వాళ్ళని అందులోకి చేర్చారు. చూశావా! అందులో నిస్వార్ధంగా సహాయం చేసే వాళ్ళతో పాటు ఇదే సందని పర్సులూ, ఖరీదైన వస్తువులు కొట్టేసే వాళ్ళూ ఉన్నారు. మనం ఎవర్ని చూస్తున్నామన్నదే ముఖ్యం. కావలసిన మొక్కలతో పాటు కలుపు మొక్కలుంటాయన్నది ప్రకృతి పాఠం. కలుపు మొక్కలు గురించి ఆలోచిస్తుంటే జీవితం రస హీనమవుతుంది. కావలసిన మొక్కలు గురించి ఆలోచిస్తుంటే జీవితంతో పాటు మరికొందరి జీవితం బాగుంటుంది ఏమంటావు?

ఏమంటాను..! ఇంతకు ముందైతే అజ్ఞానాంధకారంలో ఉన్న నాకు వెలుగుబాట చూపాడని అనేవాణ్ణి కాని ఇప్పుడు ఆలోచనలు ఆరోగ్యవంతంగా ఎలా ఉండాలో తెలుసుకున్నాను.

మానవ సంబంధాలు మానవులని సంధానించే లింక్స్. అవే మనిషికి జీవితాన్ని..ఒక్కోసారి పునర్జీవితాన్నిస్తాయి. నాలో మార్పు వచ్చింది. సారీ నా ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. జీవితాన్ని సంపూర్ణవంతం ఎలా చేసుకోవాలో అవగతమయింది. ఇప్పుడు నా భార్య..కొడుకు..స్నేహితుడు..అందరు నాకెంత అవసరమో తెలిసింది. కథ మొదట్లోని అవసరానికి అలౌకికానుబంధానికీ తేడా తెలిసింది. అలా అనుకున్నాక మనసు అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యింది.

జీవితం మధురస్మృతి కావడానికి ఇంతకంటే ఏం కావాలి?

 

 
 
 
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech