Sujanaranjani
           
  కథా భారతి  
 

కథా విహారం

బాధమయ జీవిత పర్శ్వానికి మైక్రోస్కోప్ డా|| వాసా ప్రభావతి కథ ‘గెద్ద’

 

                                                                           రచన : విహారి

 
సామాజిక జీవనాన్ని అధ్యయనం చేస్తూనే, అందులో కొందరు ప్రత్యేక వ్యక్తులు చేస్తున్న బతుకు పోరుని అవగాహన చేసుకుని కథానికలు రాస్తున్న ఉత్తమ రచయిత్రులు చాలామంది ఉన్నారు. వీరి చూపు మొత్తం సమాజం వైపు ఉంటూనే, కొంతమంది చీకటి కోణాల్లో నిలిచినవారి మీద కేంద్రీకృతం అవుతుంది. వీరి ఆలోచన సామాజిక సమస్యల మీద సాగుతూనే, ఆ సమస్యల మూలాల గురించిన సంవేదనలోనూ సుడి తిరుగుతూ ఉంటుంది. ఏ వాదానికో ముడిబెట్టు క్కూర్చోకుండా, ఉత్తమ మానవీయ విలువల పట్ల చిత్తశుద్ధిని ప్రకటిస్తూ ఉంటారు వీళ్లంతా. మనిషి జీవితంలోని ఘర్షణల్ని చిత్రిస్తూ, ఆయా ప్రత్యేక వ్యక్తుల ప్రవర్తనలోని వైరుధ్యాన్ని పాఠకులకి ఆర్తితో అందిస్తారు. దౌష్ట్యం పట్ల, దుర్మార్గం పట్ల, పరపీడన పట్ల ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కథానికని అచ్చమైన కళారూపంగా తీర్చిదిద్దుతారు. ఈ కోవకి చెందిన ఉత్తమ రచయిత్రి డా|| వాసా ప్రభావతి.

డా|| ప్రభావతి ఉత్తమ ఉపాధ్యాయని, ఉత్తమ కవయిత్రి, ఉత్తమ రచయిత్రి, చక్కటి వక్త, కార్యకర్త, పరిశోధకురాలు, నవలా రచయిత్రి, నాటకకర్త, సెన్సార్ బోర్డ్ లో సభ్యురాలు. సాహితీ సాంస్కృతిక సంస్థలతో, ప్రత్యేకించి ఈనాటి ’లేఖిని’ తో దృఢమైన అనుబంధం ఉన్నదామెకు. డా|| ప్రభావతి పొందిన సన్మానాలూ, సత్కారాలూ, అవార్డులూ, రివార్డులూ, సంఖ్యాపరంగానూ, ప్రతిష్టాత్మకంగానూ ఎంతో విలువైనది.

డా|| ప్రభావతి రాసిన ’గెద్ద’ చాలామంది మెచ్చుకున్న కథానిక. ఈ కధ చదవగానే వరలక్ష్మి గారి ’మంత్రసాని’ జీవనసమరమే రెండు కథల్లోనూ కేంద్ర ఇతివృత్తం. వస్తువు, కథనం, శైలిలో రెండు వేర్వేరు పట్టకాలుగా దర్శనమిస్తాయి. ’గెద్ద’ సోది చెప్తుంది. కాన్పులు చేస్తుంది. కథనం ఎంతో ఉత్కంఠతో, ఆర్ద్రంగా సాగుతుంది. పాఠకుడిగా ’గెద్ద’ కథనాన్ని విభజించుకుంటే రచయిత్రి గెద్ద కథని మూడు అధ్యాయాలుగా చెప్పారని తెలుస్తుంది. మొదటి అధ్యాయం - గెద్ద సోది చెప్పే విధానం. ఆ కళలో ఆమె నైపుణ్యం, కలుపుగోరుతనం, సోది చెప్పించుకునే వారి ఆదరణని పొందే మంచి మాట తీరు..... ఇవీ... కన్నెపిల్లలకి పెళ్ళిచూపులు జరిగాయి. నిన్నమొన్ననే. ఇవ్వాళ ఆ సంబంధం ఖాయమవుతుందా లేదా అనే అలతి ఆందోళనలో సోది చెప్పించుకుంటారా ఇంటివారు. ఆ పిల్ల మదిలో కోటికోరికల విరుల్ని పూయించి, మంచి మొగుడు రానున్నాడనే పుట్టెడు ఆశల్ని పంచటం ’గెద్ద’ సోదిలోని ప్రత్యేకత! వారిచ్చే అన్నం, కూర, చిల్లర డబ్బులతో - రెండు పూటలు ఇంట్లో ముగ్గురి పొట్టలూ నిండుతాయి.గెద్దకి మొద్దు రాచిప్పలాంటి ఒకే కొడుకు - నారిగాడు. కోడలు జగ్గి ఉన్నారు. నారిగాడేమీ పనిచేయడు, సంపాదన లేదు. జగ్గి బతుకు తెరువు కోసం కాన్పు చేయటం మాత్రమే నేర్చుకుంది. పిల్లల్లేరు, రెండో భాగంలో గెద్ద ప్రస్తుతం జీవిక దినవెచ్చానికి దేవులాట, బాధావ్యధల చిత్రణ. మూడో అధ్యాయంలో మంత్రసానిగా ఆమె పాత్ర వర్ణన వస్తుంది. నడుం పట్టేసి కుక్కి నులక
మంచంలో పడుకుని వుంది గెద్ద. పెద్దబ్బాయి గారి కూతురికి కాన్పు చేయాలని కబురొస్తుంది. ఊళ్ళో ఈనాటి మంత్రసాని అందుబాటులో లేనందువల్ల ఈ అవకాశం వచ్చింది. కోడలు జగ్గిని పంపింది. జగ్గి ఆ విద్యలో ఆరితేరింది. చాలా నేర్పుగా పురుడు పోసింది. అంతా సవ్యంగా జరిగింది. బియ్యం, ధాన్యం, రెండు చీరలూ వచ్చినై, జీవితం ఇలా గడిచిపోతే చాలు అని ఊపిరి పీల్చుకుంది గెద్ద. చీరెని అత్తకిచ్చింది జగ్గి. కోడలు తెచ్చిన ధాన్యం, బియ్యం చూసి ’ఈరిది పెద్ద సెయ్యి. ఇలా కాన్పులకి పిలుస్తుంటే మన బతుకులు బాగుపడతయ్యే’ అని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది గెద్ద. ఊసులాడుకుంటూ ఉండగానే, గెద్దకి గుండె నొప్పి వచ్చింది. "ఆ సాయంసంధ్యలో ఓ కృష్ణ గెద్ద ’కృష్ణా’ అనుకుంటూ ఆకాశంలో ఎగురుకుంటూ పోయింది. ఈ గెద్ద ఆ మట్టి అరుగు మీద వాలిపోయింది" అంటూ కథ ముగిసింది.

గెద్ద కథనశిల్పం వాస్తవానికతాధునిగా సాగింది. కాలప్రభావం వలన బడుగు జీవుల జీవన విషాదం ఏ స్థాయిలో పరిణామం చెందుతుందో చిత్రితమైంది. కథంతా చదువరిని ఒక ఆత్మీయ స్పర్శతో, ఆర్ద్రంగా తాకుతుంది. ’సామాజికస్పృహ’ వంటి పడికట్టు పదాలు కూర్చే కథనంలోకి పోకుండా, అట్టడుగు వర్గానికి చెందిన స్త్రీ జీవితంలోని ఎత్తుపల్లాల్ని ధ్వన్యాత్మకంగా, కథాత్మకంగా చిత్రించారు రచయిత్రి. కథానికని అలవోకగా, అవలీలగా చెప్తున్నా. పాత్రపోషణలో సాంద్రతనీ, జీవనచిత్రణలో గాఢతనీ శిల్పపరంగా క్లుప్తతనీ - పాటిస్తూ ఎంతో నైపుణ్యంతో తీర్చిదిద్దారు రచయిత్రి.

డా|| ప్రభావతి కథల్లో ఒక మట్టివాసన, పల్లెచల్లదనం మనుషుల ఆత్మీయతా, గ్రామీణుల అమాయకత్వం - అన్నీ సహజ సుందరంగా భాసిస్తాయి. ఆచార వ్యవహారాలూ, ముత్తయిదువలంతా పురుటి స్నానం చేయించటం వంటి విలక్షణమైన సంప్రదాయాలూ కథకి అదనపు సంభావ్యతాగుణాన్ని ఆపాదిస్తాయి. మాలతీ చందూర్ అన్నట్లు డా|| ప్రభావతి కథల్లోని మాండలికాలు, జాతీయాలు, కాలగర్భంలో మరుగుపడిన తెలుగుతనాన్ని మళ్ళీ మళ్లీ పలకరిస్తాయి.

కథా రచయిత్రిగా డా|| ప్రభావతి సున్నిత మనస్వినిగా దర్శనమిస్తారు. ఉత్తమ మానవ సంబంధాలు నిలవటానికి మనిషి సంస్కారం, మంచితనం, సమాజ హితానికి దోహదం కావటానికీ కథానిక ఒక సాధనంగా పని చేయాలనే ఆరాధనా భావం ఉన్న రచయిత్రి డా|| ప్రభావతి, అందుకనే ఆమె కథల్లో అమ్మ ఉతికి ఆరేసిన చీర కప్పుకున్నంతటి ఆత్మీయస్పర్శ. ఆ అనుభూతి స్పురణమే ’గెద్ద’ ని అంత మంచి కథని చేసింది. డా|| ప్రభావతిగారికి అభినందనలు!!
 
 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 


సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech