Sujanaranjani
           
  కథా భారతి  
 
మెరుపు
 

రచన : కొమరవోలు సరోజ   

 

గవేష్ కి మనస్సంతా వికలంగా ఉంది.
శాంభవి భర్త మురహరి కనబడితే అతని గొంతు నులిమి చంపెయ్యాలన్నంత ఆవేశం కల్గుతోంది. గతరాత్రి గవేష్ తమ్ముడు దినేష్ చెప్పిన సమాచారం సామాన్యమైంది కాదు.

శాంభవి వదిన కాల్చుకుని మరీ చనిపోయింది.
ఆమె పెళ్ళి చేసుకుని కనీసం ఐదు సంవత్సరాలు కూడా కాలేదు. అన్నయ్యా, ఆమెను నువ్వు చేసుకుని ఉంటే ఇప్పుడీ దారుణం జరిగి ఉండేది కాదు.
మామయ్యకూ, ఈ కడుపుకోత ఉండేది కాదు. అన్నా వదినల దుఃఖం చూడలేకపోతోంది అమ్మ. నిన్న అక్కడ కర్మకాండ ముగిసాక...మామయ్యనూ, అత్తయ్యనూ, మాతో తీసుకొచ్చాం..

తమ్ముడు చెప్పిన మాటలు కొంతవరకే గవేష్ చెవులకెక్కాయి..

* * *

గవేష్ మేనమామ కూతురు శాంభవి. గవేష్ కంటే రెండేళ్ళు వయస్సుతో పెద్దది కావటం వల్ల వరహీనం అంటూ మామయ్య ఒప్పుకోక పోవడం వల్ల గవేష్ కి శాంభవి కి పెళ్ళి జరగలేదు. తర్వాత చాలా రోజులకు శాంభవి ప్రేమ పేరుతో సుడిగుండంలో పడిపోయింది. అత్తగారూ, ఆడపడచూ, భర్త కలసికట్టుగా పెట్టే బాధ భరించలేక ..ఇలా అయితే ఇంక నేను బతకలేను అన్న శాంభవితో ...కికికి... ఇహిహి ...అంటూ వెక్కిరించి కిరోసి న్ డబ్బా, అగ్గిపెట్టి తెచ్చి అక్కడ పెట్టాడు మురహరి. ఆ తరువాత రెండు రోజుల తరవాత జరిగిన సంఘటనే ఇది..

శాంభవి అత్తగారూ, భర్తా, ఆడపడుచూ ఒక గదిలో కూర్చుని ఏవో గుసగుసలూ, శాంభవిని వంట ఇంటి కుందేలుగా మార్చారు.
ఎంత చేసినా వారికి తృప్తి లేదు. రోజూ ఏదో ఒక పేచీ..గొడావా..

అత్తవారింట్లో జరుగుతున్న భాగోతం ఎవరికీ చెప్పలేదు. ప్రేమ పెళ్ళి కనుక తనే తన సమస్యను పరిష్కరించుకోవాలనుకుంది కానీ.. ఆమెకు సాధ్యం కాలేదు.

ఎట్లాగూ చస్తుంది లేరా..! ఇంకా హాస్పటలెందుకు అందిట మురహరి తల్లి. అంతా కట్ట కట్టుకుని మూడు రోజులు ఇంట్లోనే ఉంచారట. ఆ భగభగ మంటలకు ఓర్చుకోలేక అల్లాడిపోయింది శాంభవి. అప్పుడు హాస్పటల్ కి తీసుకెళ్ళి తల్లిదండ్రులకు కవురు పెట్టారు. వాళ్ళు వెళ్ళే సరికి అంతా ముగిసిపోయింది. విషయం బయటకి పొక్కకుండా జాగ్రత్త పడ్డారు.

గవేష్ విపరీతంగా బాధపడ్తున్నాడు.

శాంభవి కాపురం సవ్యంగా సాగడం లేదని తనకు మాట మాత్రంగా సూచన ప్రాయంగానైనా తెల్సి ఉంటే తను ఆమెను తీసుకొచ్చి పెళ్ళి చేసుకునేవాడు. ఆమెకు ఇష్టమైతే..
లేకపోతే..
ఆమెను చదివించి..తన కాళ్ళ మీద తను నిలబడేలాగా అయినా సహాయ, సహకారాలందించే వాడు. నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా అతనికి గుండెలనిండా గుబులు నిండి ఉండటం వల్ల దుఃఖం ముంచుకొస్తోంది. ఇంతకాలం శాంభవి ఆనందంగా ఉంది అనే తను అనుకున్నాడు. తను కెనడా వచ్చి సుమారు ఇరవై రెండేళ్ళయింది. మధ్యకాలంలో ఎన్నో మార్పులు.

తను టొరొంటోలోపి.హెచ్.డి చేయడం ల్యాబ్ లో ఉద్యోగం అన్నీ జరిగిపోయాయి.

తనకి ప్రొఫెసర్ కి ఉండవల్సిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నప్పటికీ రీసెర్చ్ అంటే మహా ఇష్టం కావడం వల్ల ఇలా సెటిలైపోయాడు.
ఒంటరి జీవితం తనకి బాగా అలవాటయిపోయింది.
ఈ వయస్సులో ఇంకొకళ్ళతో తను కలిసి జీవించలేడేమో అనే భయం..తనని పెళ్ళి దూరంగా నెట్టేస్తోంది.

ఆ రోజు సాయంత్రం యథాప్రకారం ల్యాబ్ నుండి రాగానే టీ కప్పుతో కిటికీ దగ్గర కూర్చుని తదేకంగా బయటకు చూస్తున్నాడు గవేష్.

ఎవరో ఒక తెల్ల పిల్ల. నల్ల పిల్లవాడూ కలిసి ఒకే గొడుగు లో వెళ్తున్నారు. వాళ్ళిద్దరూ అతుక్కుపోయినట్లు ఒకే దేహంలాగా నడుస్తున్నారు. అతనేదో గట్టిగా మాట్లాడుతున్నాడు. ఆ పిల్ల హాయిగా పకపక నవ్వుతోంది. కిటికీ తలుపులు తెరచి ఉండడం మూలంగా వాళ్ళ నవ్వులూ, మాటలూ అస్పష్టంగా వినబడుతున్నాయి.

చిటపట చినుకులు పడుతూనే ఉన్నాయి.
తనకీ ఆ రకంగా వో తోడు ఉంటే బాగుండుననిపించింది. మళ్ళీ అంతలోనే చెప్పలేని భయంతో గుండె ఝల్లుమంది. మనస్సు గతాన్ని గడ్డపారతో తవ్వడం ప్రారంభించింది.

ఇంతలో..బ్రహ్మాండం బ్రద్దలైనట్లు పటపటమనే ధ్వనులతో ఉరుములూ, మెరుపులూ మధ్యలో తెల్లటి వడగండ్లు. అంతటితో ఆగకుండా పేద్ద మెరుపూ. గతంలో అతనికి ఆ మెరుపు అత్యద్భ్హుతమైన, మహోన్నతమైన కాంతిలా అనిపించేది. అయితే ఈ రోజది కొరివి దెయ్యంలా అనిపించింది.

కిటికీ మూసి టీ సింక్ లో పారబోసి, మంచమెక్కి ముసుగు తన్ని పడుకున్నాడు. నిద్రాదేవిని ఎంత స్మరించినా కరుణ శూన్యం.
ఫోన్ చేసి ఎవరితో నన్నా మాట్లాడితే కానీ..అ ఎవరు అనే వ్యక్తి ఎవరు?
ఏమని మాట్లాడాలి?

తన పొరపాటుకు క్షమించమని ఎవర్నడగాలి? శాంభవి రూపం.. మాటలూ పదే పదే కళ్ళముందు మెదులుతున్నాయి.
తనకన్నీ ప్రశ్నలే! ఈ జటిల సమస్యకు పరిష్కారం తనకు తలకు మించిన పని. ఇతరులకు సలహాలిచ్చినంత సులభం కాదు తన ప్రశ్నలకు సమాధానాలు!

ఎవరో మునివేళ్ళతో సున్నితంగా తలుపు మీద తడుతున్న సవ్వడి. రెండుసార్లు విన్న తరువాత లేచి మెల్లగా తలుపుతీసాడు. ఎదురుగా కార్నేషన్ పూల గుత్తితో గుణసుందరి.
ఏంటలా చూస్తున్నారు. ? పూలగుత్తితో ప్రపోజ్ చేస్తారనుకుంటే మరీ అపర ప్రవరాఖ్యుడి గెటప్ ఇచ్చేస్తున్నారు. అందమైన పలువరస తళుక్కుమనేలా నవ్వి.. పూలగుత్తితో పాటు గవేష్ ని కౌగిలించుకుంది.
గవేష్ కొద్దిగా దూరం జరిగి నేను ప్రవరుణ్ణే కాదు. తమరు వరూధినీ కాదు. నేనసలు దారి తప్పనూ లేదు..కానీ ఇంతకీ ఏంటి సంగతీ..? ఇలా ఊడిపడ్డావు?

ఏముందీ..వర్షంలో తడవడం ఇష్టం నాకు. నువ్వు కూడా ఎంజాయ్ చేస్తావ్ గా!
ఏంటి జోరు! బహువచనం నుండి ఏకవచనానికొచ్చావ్?
ఏదో ఒక వచనం గానీ, పద బయటికి..అంటూ అతన్ని బయల్దేరదీసింది. మార్పు అవసరం తన మనస్సుకు అనుకున్న గవేష్ కూడా అడ్డు చెప్పలేదు.

* * *

వాళ్ళిద్దరూ ఒకే గొడుగు కింద నడుస్తున్నారు. క్షణక్షణానికీ గుణసుందరి మామిడిచెట్టుకు అల్లుకున్న మల్లెతీగలా అయిపోతోంది. మత్తుమత్తుగా మాట్లాడుతోంది..
వయ్యారమొలకపోస్తోంది. గారాలు పోతోంది. ఎంగేజ్ మెంట్ ఉంగరానికెప్పుడు ఆర్డరిస్తారు? మరీ ఎక్కువ పెట్టకేం! పదివేల డాలర్లు చాల్లే! మళ్ళీ పెళ్ళికి డబ్బు కావాలి కదా!

గవేష్ ఏదో అనేలోపులోనే అతని నోటిని తన పెదవులతో బంధించేసింది. అంతటితో ఆగిందా అంటే అదీ లేదు. అతని క్రింది పెదవిని కసక్కున కొరికింది. అతను తన చూపుడు వేలుతో రక్తాన్ని తుడుచుకుని నీ సంగతి చెబుతా ఉండు.. అంటూ తన ప్రతిభ చూపించాడు.
అబ్బా నొప్పి..మొరటు..! ముసిముసిగా ముద్దుగా..గోముగా విసుగు నటిస్తూ ఇంకా ఇంకా అతని మీదకి వాలిపోయింది.
ఏయ్ పిల్లా! ఆ మొరటు దనం కోసమేగా పరిగెత్తుకుంటూ తమరొచ్చింది. నవ్వాడు గవేష్.
అబ్బా! తొందరగా పెళ్ళి చేసుకుని నేను ఉద్యోగం మానేశ్తాను. ఎలాగూ నాదేమంత గొప్ప జాబ్ కాదుగా. నువ్వేమో ఆ బేస్ మెంట్ అపార్ట్ మెంట్ ఖాళీ చేసెయ్! ఇంచక్కా మంచి ఇల్లు కొనుక్కుందాం!
ఆమె చెబుతూనే ఉంది అతను వింటున్నాడో! లేదో కానీ! వారిద్దరి శరీరాలు మాంచి స్పందనకు గురై రెస్పాన్స్ చేస్తున్నాయి.
వర్షం హెచ్చయింది.
వాళ్ళిద్దరూ అలా గువ్వల్లాగా గొడుగు క్రింద కొంత సేపు ఉండిపోయారు.
ఆహా! ఎంత హాయిగా ఉంది!

ఈ వాన ఆగకుండా, ఈ చీకటి విడిపోకుండా! మా తనువులు ఇలాగే ఉండిపోతే ...అద్భుతం!
పరమ అద్భ్హుతం..అనుకున్నాడు గవేష్.
మళ్ళీ ఆకాశంలో మెరుపు
బై..! చెప్పాడు గవేష్.
వర్షం పైగా చీకటి, నన్ను డ్రాప్ చెయ్యొచ్చుగా! ఏం కొరుక్కుతింటానా?
చాల్లే కొరుకుడు..పద...!
ఇద్దరూ అలాగే నడుస్తూ గుణసుందరి ఉండే అపార్ట్ మెంట్ బిల్డింగ్ దగ్గరికివెళ్ళారు. ఆమె ఎలివేటర్లో ఎక్కేదాక అక్కడ నిలబడి ఆలోచిస్తూ తన ఇంటివైపు నడక సాగించాడు గవేష్.
** *

అది మార్ఖాం రోడ్ మీద ఉన్న కాఫీ షాప్.
గుణసుందరీ.. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి చెప్పాడు గవేష్.
చిరునవ్వే అమె జవాబు.
శాంభవి అకాల మరణం నా గుండెల్లో తీరని ఆవేదన రేపింది.
అవి నాకు పూర్తిగా అవగాహనలేని రోజులు. లేకపోతే తను నాకంటే రెండేళ్ళు పెద్దదయినంత మాత్రాన కలిగే నష్టమేమిటని ఆలోచించ లేకపోయాను. పెద్దవాళ్ళలా అంటే కాబోలు అనుకున్నాను.

సరే మన విషయానికొస్తే ఎప్పుడూ నగలూ, చీరెలూ, ఇళ్ళూ లాంటివి మాట్లాడే స్త్రీలంటే నాకంత పెద్ద సదభిప్రాయం లేదు. నా ఉద్దేశ్యంలో వాళ్ళ మనస్సు అంతా డొల్లలాగా వెల్తిగా ఉంటుందనీ, ఆ వెల్తిని నగలలాంటి వాటితో నింపుకోవడానికి ప్రయత్నిస్తారని నా అభిప్రాయం. ప్రారంభంలో బంగారమంటారు. తరువాత రత్నాలు, కెంపులూ, గోమేథికాలు, ట్రిప్స్, వగైరా, వగైరా ఇవన్నీ కాదంటే రాక్షసుల్లా బిహేవ్ చేస్తారు. మాటా మాటా పెరిగి పట్టుదలొస్తే డైవోర్సంటారు. ఇంక జీవితాంతం నాకొచ్చే జీతం..నాకు టీ త్రాగడానికి కూడా మిగలదు. అమ్మగార్కి సమరిపించుకోవాలి.

అందరూ అలాంటి వారే ఉంటారా?
లేదు...కానీ నా దురదృష్టం కొద్దీ అదే నా లలాట లిఖితమైతే నేనసలు భరించలేను. అందుకే నేను పెళ్ళి అనే సమరంలో దూకదల్చుకోలేదు.
సమరమని మీరనుకుంటే..నేనేం చెప్పలేను. కానీ..మిమ్మల్ని నేను బాగా ఇష్టపడుతున్నాను. ఇంకా చెప్పాలంటే సీరియస్ గా లవ్ చేస్తున్నాను.
దీన్ని లవ్ అని నేననను. ఒకలాంటి మోజు, వ్యామోహం, మత్తు, కాంక్ష. ఇదంతా తాత్కాలికం.

నాకంటే పదేళ్ళు చిన్న మీరు.
మీలా నేను తెల్లగా లేను.
బట్టతల కూడాను.
నాలో ఏం చూసి మీరు నన్ను కోరుకుంటున్నారో నాకు సరిగ్గా అర్ధం కావడం లేదు కానీ..
మీరు ప్రయత్నిస్తే మీకు అనుకూలుడైన వ్యక్తి అందం, ఐశ్వర్యం అన్నీ ఉన్నవాడు భర్తగా లభించడం అసాధ్యమేమీ కాదు.
ఇప్పుడు ఈ వేడిలో తొందరపడి పెళ్ళి చేసుకున్నా తర్వాత క్రమేపీ మీరు నేను కూడా సంతోషంగా గడపలేం. అందుచేత మనం స్నేహితుల్లాగా ఉండటమే శ్రేయస్కరం. కాఫీ చల్లారిపోతుంది..తీసుకోండి.. కాఫీ కప్పుని ఆమె ముందుకు జరిపాడు గవేష్.

సరేలెండి..మీరు ఏకవచన ప్రయోగం మాని బహువచనంతో సంబోధిస్తుంటేనే నాకనిపించింది...మీరేదో తీవ్రంగా ఆలోచిస్తున్నారనీ, భయపడ్తున్నారనీ, నన్ను కొంత దూరంగా ఉంచాలనుకుంటున్నారనీ..

అవును బాగానే గ్రహించారు! క్రిందటి వారం మన్ మధ్య ఏదైతే ఆవేశంలో, పరిస్థితుల ప్రభావం, పరిసరాల అనుకూలత, మీరు నేను ప్రవర్తించిన తీరూ కేవలం ఒక కలలాగా భావించండి!

గుణసుందరి ముఖం పాలిపోయింది.
మరొక ముఖ్య విషయం మీకు చెప్పాలి.
మీరు నాకంత దగ్గరగా మెలిగినప్పుడు కేవలం నా బాడీ మాత్రమే రెస్పాన్స్ చేసింది. సైన్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తిగా మీకీ నిజం చెప్పాలనిపించింది.

ఒక స్నేహితుడిగా మీకు నా వల్ల జరిగే ఉపకారమేదైనా ఉంటే సంకోచం లేకుండా నన్నడగండి.
నేనీరోజు మీ దృష్టిలో లవ్ అనేదాన్ని త్రోసిపుచ్చినందుకు మీరు కొన్ని రోజులు, కొన్ని గంటలు లేకి కొన్ని వారాలు బాధపడితే పడవచ్చు గానీ, అందువల్ల మీకు తప్పక భవిష్యత్ లో మేలు జరుగుతుంది.

ఈ గులాబీలు తీసుకోండి. స్నేహానికి చిహ్నమైన పసుపురంగు గులాబీల పొట్లాన్ని ఆమె చేతి కిచ్చాడు గవేష్. దుఃఖానికి రాని నవ్వుని తెచ్చుకుని థాంక్యూ..అంటూ కాఫీ అందుకుంది.

మన బస్ 102 వార్టెన్ సబ్ వే వచ్చేస్తోంది రండి పిలిచాడు గవేష్.
నేను నెక్ట్శ్ బస్ లో వెళ్తా. నాకిక్కడ కాస్త పనుంది.
మీ ఇష్టం..గవేష్ బస్సెక్కాడు. బస్సు కదిలి కనుమరుగు కాగానే..చేతిలోని పూల పొట్లాన్ని ముక్కలు చేసి అక్కడే ఉన్న గార్బేజ్ కేన్ లో పడేసి..బోడి గొప్ప.!
వీడు వీడి ఆదర్శాలూను. అనుకుంటూ తన ఆఫీసులో తన వెంట పడ్తున్న వేణు గురించి ఆలోచిస్తూ..అక్కడే ఉన్న బ్యూటీపార్లర్ లోకి అడుగుపెట్టింది గుణసుందరి.

- - -

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech