Sujanaranjani
           
  కథా భారతి  
 

పాలుత్రాగిన బాలకృష్ణుడు

 

 

                                                                         రచన: ఆదూరి.హైమవతి 

 

వేసవి శలవులకు ఏలూరు పక్కనున్న తాతయ్య గ్రామానికి బయల్దేరారు బాబి, తంబి...

తాతయ్యగారి ఊర్లో కొత్తగా ఆలయం కట్టిస్తున్నారనీ బాలకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తున్నారనీ అందరూ తప్పక రావాలనీ తాతయ్య కబురు మీద కబురు చేసినందున అందరి తరఫు నా పిల్లలను పంపను అంగీకరించాడు బాచి నాన్న నాగభూషణం.
తంబి “బాబీ! తాతగారి ఊరంటే నాకు మహాఇష్టం. తాగినన్నికమ్మని, చిక్కనిగుమ్మపాలు మీగడగడ్డ పెరుగు తలచుకుంటేనే నాకు నోట్లో నీరూరిపోతుంది..ఇహ బామ్మ చేసే నేతిగారెలూ, జున్ను, పాయసం లాంటివి కలలో తలచినా నోట్లోనీరూరిపక్కతడిసిపోతుంది.” అన్నాడు.
“కొబ్బరిబోండాలు,మామిడిపండ్లుతిన్నన్ని , ఎంతల్లరిచేసినా బామ్మ తాతకోప్పడనే పడరు.” అన్నాడు బాబి.అందుకే హుషారుగా పిల్లలు బయల్దేరి తాతగారి ఊరుచేరారు.
రెండు రోజులుహాయి గా అన్నీ తిని మూడోరోజున మామిడి తోపుకు బయల్దేరారు పాలేరు పాపయ్యతో కలిసి.. దార్లో వారికి మురుకి నీటికాలువ పక్కనే ఉన్నగుడిసెలు కనిపించాయి. అంతదూరం నుండే ముక్కు మూసుకుని నడుస్తూ, పాలేరునడిగి వివరం తెల్సుకున్నారు.
“బాబూ! వీళ్ళంతా దూరప్రాంతాల నుండీ వచ్చి యాడాది పొడుగునా పొలాల్లోనూ, పక్కనే ఉన్ననగరంలో ఇళ్ళకట్టడం పనులు చేసే దినవారి కూలీలు, యాడాదికి ఒక్క నెల మాత్రం తమ స్వంత ఊర్లకు వెళ్ళివస్తారు. నగరంలో బాడుగలు కట్టలేక ఇక్కడ గుడిసెలు వేసుకుని నివసిస్తూ ప్రతిరోజూ మూడుమైళ్ళు నడిచి పల్లెబస్సెక్కి వెళ్ళి పనిచేసుకునివస్తుంటారు.” అనిపాలేరు చెప్పాడు.

మురికి గుడ్డలు, మురుగుకాలువ పక్కనబ తుకులు, పిల్లలు పాలకోసం ఏడుస్తుంటే తల్లులు కోప్పడుతున్నారు. ఎఱ్ఱ మిరపకాయల కారంతో అన్నం తింటున్న పిల్లల కంచాలు చూసి ,మీగడపెరుగుతోఅన్నం తిన్న తమకడుపులు బరువనిపించాయి వారిద్దరికీ .

"పాపన్నా ! మన ఇంట్లో అన్ని పాలు, పెరుగుఉన్నాయికదా! వీరందరికీ తెచ్చి పంచితే పాపం హాయిగా ఈ పిల్లలు పాలు, పెరుగు తింటారుకదా? అని అడిగారుబాబీ , తంబి. తప్పుబాబూ అలాంటి పనులు చేయకండి. ఎవరికున్నవివారు తినాలి, మీలాగా మేము పెరుగు జున్ను తినలేంకదా ! అలాగే వీరూనూ.. " అనిచెప్పాడుపాపన్న.

ఆరాత్రి పడుకున్నారే కానీ వారిద్దరికీ ఎఱ్ఱకారం అన్నం, పాలకు ఏడ్చేపిల్లలుకనిపించ సాగారు కలలో.

వీరికోసం ఏదైనాచేయాలనిసంకల్పించారు. ఏడోతరగతి చదువురున్న బాబి, తంబి.

తెల్లవారి గుడి కడుతున్న ప్రదేశం చూడను వెళ్ళారు. అక్కడ గర్భగుడి బయట నిర్మాణం పనులు సాగుతున్నాయి. ఆ పనులు చూసే ఇంజనీర్ ను చూసి ఆశ్చర్యపొయారు. అంకుల్! మీరు గోపీ తండ్రి కదూ! మా తాత గారి ఊరు ఇది,  అని పలకరించి ఆయనతో వారిరువురూ చాలాసేపు మాట్లాడి ఇంటికి వచ్చి హాయిగా పెరుగన్నం తిని కబుర్లు చెప్పుకుంటూ గడిపారు.

మూడో రోజున బాలకృష్ణుని విగ్రహ ప్రతిష్ట. ఊరు ఊరంతా లోపల జరిగే ప్రతిష్టను వరుసల్లో వెళ్ళి చూడను ఆలయం చుట్టూ కట్టిన కఱ్ఱల వరుస దారిలో చేరారు. అంతా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార , అరటిపండ్లు, పాత్రల్లో తీసుకుని భక్తిగా హరే కృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే అని దైవనామం చేస్తూ నిల్చుని ఉన్నారు.

అభిషేకాలు మొదలవగానే బాలకృష్ణుడు పాలు త్రాగుతున్నాడు. బాలకృష్ణుడు పాలు త్రాగుతున్నాడు .. అనే మాటలు లోపలి నుండీ వినిపించాయి. అంతా భక్తి పారవశ్యంతో కృష్ణనామాన్ని జపిస్తూనే మరిన్ని పాలు తీసుకుని లోనికివెళ్ళి స్వయం గా అభిషేకించను తొందరపడసాగారు.

వరుసగాకట్టిన కఱ్ఱల వలన అందరూ ఆవరుసల్లోనే వెళ్ళవలసి వచ్చి తోపులాటలు జరగ కుండా గ్రామ పెద్దలు జాగ్రత్త పడ్డారు.

బాల కృష్ణుని పై అభిషేకించిన పాలు ఆయన చేతిలో పట్టుకున్న వేణువులోకి వెళ్లడం చూసిన జనం భాక్తి తో ఊగిపోసాగారు. విగ్రహ ప్రతిష్ట అనంతరం అంతా పంక్తి భోజనాలు చేసి ఆనందంగా ఇళ్ళు చేరారు, అందరినోటా పాలుత్రాగిన బాలకృష్ణుని మహిమ, తమ ఊరు చేసుకున్న పుణ్యం గురించిన మాటలే!

బాబీ, తంబి ఎంతకూ ఇంటికి రాక పోడంతో తాతయ్యగారు పాపయ్యను పంపి వెతికి రమ్మని చెప్పారు. పాపయ్య నేరుగా మురికివాడ వెళ్ళాడు, ముందే బాబీ అతగాడికి చెప్పి ఉంచడం వలన, పిల్లలిద్దరూ అక్కడ వేరు వేరుగా కడవలలో పట్టి ఉంచిన పాలు, పెరుగు, తేనె, అన్నీ అక్కడి పిల్లలకు పంచుతూ ఆనందిస్తూ ఉండటం చూసిన పాపయ్య వారు తనకూ ఇచ్చిన పాలు కడుపు నిండా తాగాడు.

"ఎంతతెలివిగలవారయ్యా! మీరు ? పట్టణంలో చదువుతున్నారు గనుకే ఇంతతెలివి?!  అని మెచ్చుకున్నాడు. మేమే కాదు ఇహ నుండీ ఆలయంలో జరిగే అభిషేకం పాలు నీవు తెచ్చి వీరికంతా పంచు. తాతయ్యకు చెపుతాంలే భయపడకు. అనిచెప్పి పంపకం పూర్తయ్యాక ఇద్దరూ పాపయ్య తో తాత ఇంటికివచ్చి, జరిగిన విషయమంతా తాతకు వివరించారు.

 తాతగారూ! నిజం బాలకృష్ణులు పాలుత్రాగి సంతోషించిన రోజు ఇది. అని తాము ఇంజనీరుతో మాట్లాడి, అభిషేకంపాలు ఎలా దూరంగా బయటికి వచ్చేలా లోపల నుండే గొట్టాలు పెట్టించిందీ చెప్పి , ఆ పసిపిల్లలు పాలకోసం పడే బాధ చెప్పి, తప్పుంటే మన్నిం చమని కోరారు తాతను.

అదిసరేరా! మరి బాలకృష్ణుడుపాలు ఎలాత్రాగాడు? దీనికీ మీరేమన్నా చిత్రం చేశారా ఏంటి ? అన్నారు తాతగారు నవ్వుతూ.

అదేం లేదు తాతగారూ! ద్రవం పల్లానికి ప్రవహిస్తుంది కదా! అది సైన్స్ సూత్రం! విగ్రహం పైన పోసిన పాలు మురళి వెంట క్రిందికి జారి నోట్లోకి వెళ్ళాయి. ఐతే ఆ ప్రచారం కేవలo మేము పుట్టించిన మాటే. నిజానికి ఆమాట వలన అందరిదృష్టీ అటేవెళ్ళడం వలన మేము పాలు, పెరుగు పట్టే పని తేలికైంది ఎవ్వరూ మమ్ము గమనించలేదు. ఇహ మీదట తాతగారూ! ఆ పాలు వృధాగా నేల పాలు కాకుండా చిన్నిచిన్ని కృష్ణులైన ఆ పేదల కడుపుకు చేరేలా మీరూ శ్రధ్ధ వహించండి చాలు, ఇది మా వేడికోలు. అంటున్న ఆ పిల్లలను హృదయానికి హత్తుకుని ముద్దాడారు తాతగారు, వారి హృదయాల్లోని మానవతకు మురిసిపోతూ.
  
 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 
సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech