Sujanaranjani
           
  సారస్వతం  
   

మన కల్యాణ విన్నాణాలు (ఆటవెలదుల అలజడులు)

 

- రచన : ఆచార్య వి. యల్. యస్. భీమశంకరం    

   
 

1. నెత్తిమీద రూక ఒత్తిపెట్టిన నైన, కాణి చేయ నట్టి వానికైన,
చదువులేని వట్టి చవటాయకైనను
, పలువకైన గాని తులువకైన

2. పిల్ల నెరిగి యున్న ప్రేమించినాగాని, పెళ్ళి యన్న మాట విన్నపైన,
కాంత తోడ పెళ్ళి కట్నము మగహక్కు
, ఇవ్వలేనివారి కెవరు దిక్కు

3. కాఫి క్లబ్బులందు, కాలేజి లాన్లందు, బలిసి తిరుగునట్టి వయసు నందు
ముక్కు కన్ను తీరు ముద్దుగా నున్నట్టి చెలువ నొకతె ప్రేమ చేత కట్టి

4. మూడు ఏండ్ల డిగ్రి పూర్తగునందాక ముగ్గులోకి దించి ముంచి నాక
పెళ్ళిమాట యన్న పెద్ద లడ్డను వాళ్ళు
, మొగము చాటువేయు మోసగాళ్ళు.

5. నాకు కట్నమొద్దు నాన్నకే యను వాళ్ళు, అక్క పెళ్ళి కోస మనెడు వాళ్ళు,
తెచ్చినట్టి అప్పు తీర్చుట కను వాళ్ళు
, అమ్మ మాట దాట ననెడు వాళ్ళు.   

6. బియ్యె చేత నున్న వేవేల కట్నాలు, ఇంజినీరుకైతె రేంజి నిల్లు,
డాక్టరైన ఢక్క పగులకొట్టు
, కోట్లతోడ జనులు క్యూలు కట్టు. 

7.  చందమామబోలు చక్కని చుక్కైన, చదువుకున్నదైన చతుర యైన,
తగిన కట్నమిచ్చు  తాహతు లేకున్న
, పెళ్ళి జరుగుటన్న పెద్ద సున్న.   

8. అందమెందుకయ్య అందల మెక్కనా, ఇంటి పనులు చేయు ఇంతి వలయు,
చదువుకున్న పిల్ల సంసార మెటు జేయు
, కట్నమిచ్చు కన్య ఘనము నేడు.  

9.  లాంఛనాల పేర లంచంబులను గుడుచు నత్తగారికన్న ఆడపడచు,
పెండ్లి చేసి తండ్రి వేసారు పడి చచ్చి
, తెచ్చినట్టి అప్పు తీర్పుకొచ్చి.   

10.  పెళ్ళినాటనుండి పిల్లను వేథించి, అత్త మామ భర్త లాగ్రహించి,
తండ్రి నడిగి లక్ష త్వరగ తెమ్మను వాళ్ళు
, ఇంటి కంపుచు బెదిరించు వాళ్ళు. 

11.  అడిగినన్నిమార్లు అడిగిన సొమ్మిచ్చి, పిల్ల తండ్రులంత  బిక్క చచ్చి,
ఏడ తెత్తు మింక ఇవ్వలేమను  వాళ్ళు
,   కోడలనక చితక కొట్టు వాళ్ళు. 

12.  పురుగు మందు నిచ్చి, కిరసనాయలు పోసి, ఏక్సిడెంటువోలె ఫిక్సుచేసి
బాల్చి తన్న జేసి
, కాల్చి వేసెడు వాళ్ళు, తిరిగి కొడుకు పెళ్ళి జరుపు వాళ్ళు.     

13.  అసలు కట్నబాధ సిసలైన మూలంబు, తండ్రి తల్లి గారు పిల్లవాడె,
పెళ్ళికొడుకు తనకు కట్న మొద్దన్నచో ముసిలి తండ్రి నోరు మూసుకొనడె!    
 

14. కన్నె పెండ్లి కొఱకు కట్నమిచ్చెడి వ్యవస్థ, వరుని వెదుకు కొఱకు పడు అవస్థ,
కలదె పూర్వమందు తెలుగు దేశము నందు
ఎఱిగి యుంటిమె మన మింత ముందు!        

15. వంద యేండ్ల ముందు వరుడు కన్నెకు కొంత కట్న మిచ్చియుండె కలిగినంత,
జాడ్యమిద్ది యనుచు సంఘసంస్కర్తలు మానిపించినారు మహిత యశులు.
 

16.  కందుకూరివారు, కవిరాజు గురజాడ కథలతోడ నాటకముల తోడ,
ప్రజల కన్నువిప్పి వర విక్రయ పిశాచి
, నలిపినారు దాని నేల రాచి.  

17.  పెళ్ళి సమయమందు పిల్ల కల్లునకును, వస్తు వాహనములు బహుమతులును,
తండ్రి ఇవ్వ వచ్చు తన తాహతును బట్టి
, పెట్టమనుటె తప్పు పట్టు బట్టి.  

18.  తండ్రి కూతుకిచ్చు ధన ధాన్య మేదేని, స్త్రీధనమగు గాని చెంద వెవని,
నని చెప్పె మున్ను మనుధర్మశాస్త్రంబు
-  మార్చ బోకు డిదియె మంజులంబు. 

19.  కాకి తెచ్చినట్టి కట్న నింబపు విత్తు, సంఘభవన కుడ్య చయ విపత్తు,
పీకివేయకున్న వేరుతో సహితమ్ము
, కూల్చు మన సమాజ కుట్టిమమ్ము. 

20.  ఒనర స్త్రీకి చదువు నుద్యోగములు గల్గ, ఆర్థిక స్వతంత్ర మమరి చెలగ,
భర్త విడుచు నన్న బ్లాకుమైలును తప్పు
, అత్త మామ చేత  హత్య తప్పు. 

21.  అంతకన్న మిన్న అధిపుని సుగుణంబు, అత్త మామగార్ల ఆదరంబు
కనుక నొకరి నొకరు కన్యయు పురుషుండు
, వలపు తోడ మెలగ వలసి యుండు.        


 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech