Sujanaranjani
           
  సారస్వతం  గగనతలము-31  
 

రచన : డా||పిడపర్తి వెం.భా.సుబ్రహ్మణ్యం, పిడపర్తి పూర్ణ సుందర రావు

 

మన కర్మే మన ఖర్మగా పరిణమిస్తుంది

కర్మఫలం మనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనము సాధారణముగా ఖర్మ అనే పదాన్ని ప్రయోగిస్తాము. వాడుకలో ఇంత విరివిగా కనిపించే ఈ పదము భాషాపరంగా ఎంత ముఖ్యమైనదో తెలియదు గానీ భాగ్యము మరియ భాగ్యహీనత ఈ రెండింటిని స్పష్టంగా తెలియజేస్తుందని తప్పక చెప్పాలి. కన్నుకు కన్ను, కాలికి కాలు అన్న చందముగానే మన ఖర్మ మనము చేసిన కర్మకు ప్రతిబింబము మాత్రమే. చాలా తెలివితేటలు ప్రదర్శించి మనము మరొకరిని మోసము చేసినపుడు మనము దేనినో జయించినట్లు భావిస్తాము. కానీ మనమే మోసపోయినపుడు లబో దిబో మని ఏడుస్తాము. కానీ ఇక్కడ మనము ఖచ్చితంగా గుర్తించవలసినది ఒక్కటే. మనము మోసపోయాము అంటే మనము ఖచ్చితముగ మరొకరిని మోసము చేసామని, దాని ప్రతిఫలమే ఇదని గ్రహించాలి. మరీ నిశితముగా పరిశీలించి మన ఊహలను మరింత ముందుకు తీసుకువెలితే మనము మరికొన్ని నిజాలను తెలుసుకునే అవకాశము లభిస్తుంది.

మనము ఏవిధముగా మోసము చేస్తామో, మోసము చేయడానికి ఏమార్గమునైతే అనుసరిస్తామో మనము కూడ అదే మార్గములో మోసపోతామన్నది నమ్మలేని నిజం. ఇంత ఖచ్చితముగ మనము ఎలా చెప్పగలమనే ప్రశ్న రావచ్చు. కర్మసిద్ధాంతమును పూర్తిగా విశ్వసించే మాటయితే ఇదే నిజము. ప్రస్తుతానికి మనము ఇంకా వైజ్ఞానికముగ ఎదగలేదు కాబట్టి ఋజువులతో దీనిని నిరూపించడము సాధ్యము కాదు. కానీ మన దగ్గరున్న మార్గాలను నేటి విజ్ఞానంతో ముడిపెట్టి పరిశోధిస్తే మాత్రము ఇది ఖచ్చితముగా సాధ్యమే.

21 సర్వీసులకు గాను జరిగే భారతీయ పరిపాలనకు సంబంధించిన ఉద్యోగపరీక్షలో అందరికన్నా అధికముగ ఫలితమును (మార్కులను) పొందిన వాడు పరిపాలనా పరమైన ఉద్యోగానికి, అంత కన్నా ఒక మెట్టు కిందవరకు వెల్లిన వానికి రక్షణాపరమైన సేవకు, అంత కన్నా తక్కువ స్థాయివానికి విదేశసేవకు ఆ తరువాత వారిని ఆ తరువాతి సేవలక ఎంపిక చేయడము జరుగుతుంది. ఇదే విధముగ మంచి చెడు ఫలితాలు రెండూ శేషము లేనివానికి మోక్షము, అంతకన్నా ఓ మెట్టు కిందవానికి మానవ జన్మ, అంతకన్నా కిందవానికి క్రమముగ ప్రాధాన్యత ఆధారముగ జీవుల రూపములు (జన్మములు) లభిస్తాయన్నది మనము ఆలోచించాలి.

వేదసాహిత్యం మొదలుకుని నేటి వరకు కూడ భారతీయత కనిపించే ప్రతీ సాహిత్యములోనూ ఏదో ఒక సందర్భములో , ఏదో ఒక రూపములో మనకు సుభాషితములు కనిపిస్తూనే ఉంటాయి. అవి కొన్ని చోట్ల నిర్దేశాత్మకములుగానూ మరి కొన్ని చోట్ల ప్రేరణ లేక సందేశాత్మకములు గానూ కనిపిస్తాయి. ఉదాహరణకు మాతృదేవో భవ, పితృదేవోభవ, ఆచార్య దేవో భవ అన్న వాక్యములను పరిశీలిద్దాము. జన్మనిచ్చింది కాబట్టి తల్లిని మించిన వేరు దైవము లేదని, కాబట్టి తల్లిని దేవతారూపములో కొలవమని అంతరార్థమును కలిగిన ఈ వాక్యమును మనము అనేక రకములుగ అన్వయించుకోవచ్చు. భారతీయ సంస్కృతి యుగాలుగా శాశ్వతంగా కనిపించడానికి ఇటువంటి ఉత్కృష్టమైన ఆలోచనలు, ఆచరణలే కారణమని మనకందరకూ తెలిసిందే. ఇది ఒక రకమైన అన్వయము.

దీనిని మనము వేరే సందర్భాలలో కూడ గుర్తు చేసుకోవచ్చు. సమాజంలో సహజంగా మనము విభిన్నములైన పరిస్థితులు చూస్తూ ఉంటాము. కొంతమంది తల్లులు తమ పిల్లలు తమ మాట వినరని బాధ పడతారు. కొంతమంది తల్లులు తమ సంతానము తమను సంప్రదించకుండానే వారి వారి నిర్ణయాలు తీసుకుని వెల్లి పోయారని చెబుతారు. కొన్ని సందర్భాలలో తల్లులు పిల్లల దగ్గర ఉండడానికి ఉత్సాహాన్ని చూపెడితే మరి కొన్ని సందర్భాలలో పిల్లలదగ్గర ఉండడానికే ఇష్టపడరు. ఇలా అనేక రకములుగ పరిస్థితులు మనకు కనిపిస్తూనే ఉంటాయి.

ఆ పరిస్థితిలో మనము లేనప్పుడు మనకు సమస్య చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అంతే కాకుండ వారు ఇలా చేసుకోవచ్చు కదా? అలా ఉండచ్చు కదా? అని మనము అనే సందర్భాలు కూడ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న రహస్యము ఒక్కటే. ఆవిడ కడుపున వాడు చెడబుట్టాడమ్మా. ఈ వాక్యము మనము సాధారణంగా అయోగ్యుడు చెడ్డవాడు అయిన కొడుకును కన్న సౌమ్యురాలైన తల్లి విషయంలో జనాలు అనడం వింటూనే ఉంటాము. అంత మంచి మనిషికి అంత దుర్మార్గుడు ఎందుకు కలిగాడు? ఆవిడ లాంటివాడే కలగచ్చు కదా? ఇలాంటి ప్రశ్నలు మనను ఈ సందర్భాలలో వెంటాడుతాయి.

ఈ ప్రశ్నలకు మన దగ్గర సమాధానమున్నదా?
ఉంది.
జన్మజన్మాంతరాలలో మన ఆచరణ, మన కర్మ ఈ జన్మలో మనమనుభవించే ఫలితాలకు కారణము. ఇదే మనము ఖర్మగా చర్చించుకుంటాము. ఈ ప్రశ్నకు వేరే సమాధానము లేనే లేదు. అందరూ సమానులే అని మనము భావిస్తే అందరికీ సమానముగా అన్నీ ఎందుకు లభించుటలేదు?  అందరూ సమానులే అయినా వారు వారు ఆచరించే కర్మలకు అనుగుణంగా వారికి ఫలితములు భిన్నములుగా లభిస్తున్నాయని దీని అర్థము.

సుభాషితములో..
ఆత్మనః ప్రతికూలాని పరేషాం న సమాచరేత్

మనకు ఏవైతే పనులు నష్టాన్ని కలుగజేస్తాయో, దుఃఖాన్ని కలుగజేస్తాయో వానిని మిగిలిన వారి విషయంలో మనము చేయకూడదు అని దీని అర్థము. మీకు ఇబ్బంది కలిగించే పనులు మిగిలిన వారికి కూడ ఇబ్బంది కలుగజేస్తాయి కాబట్టి వానిని మీరు చేయకండి. ఒక వేళ మీరు చేస్తే కాలక్రమేణా ఆ ఫలితములు మీకు కూడ లభిస్తాయి. అది మీరు తట్టుకోలేరు. కాబట్టి మీరు ఇతరులకు హాని, లేక ఇబ్బంది కలిగించే ఏ పనినీ చేయకండి అని మనకు ఈ సుభాషితము చెబుతోంది.

మనము ఇప్పటికే ఆచరించినవి మాత్రము మనను విడుస్తాయా? విడవవు. అవి ఏమిటి? అవి మనను ఎప్పుడు వెంటాడే అవకాశమున్నది అనే సంగతులనే మనము జాతకము ఆధారముగ తెలుసుకుంటామన్న మాట. ఈ సృష్టి పూర్తిగా విజ్ఞానమయం. ఇందులో ప్రతీ అణువు వేరే అణువుపై ఆధారపడినదే. మరియు ప్రతీ అణువు వేరే దానిని ప్రభావితము చేసేదే.

పంచమహాభూతములతో నిర్మితమైన ఈ శరీరాన్ని శాసించేవి పంచమహాభూతముల నుండి ఆవిర్భవించిన గ్రహములే. వానిని గూర్చి. సృష్టిని గూర్చి, మనకు జరుగబోవు మంచి చెడులను గూర్చి వైజ్ఞానికముగ ఆలోచించడము చాలా సులభము. కానీ ఆ ఆలోచనకు ముందు సృష్టి విజ్ఞానమయమన్న నిజాన్ని మనము గ్రహించితీరాలి. అప్పుడే మనము అగమ్యగోచరంగా కనిపించే ఈ ప్రాచీన విజ్ఞానములోనికి పాదము మోపు సమర్ధతను (అర్హతను) పొందగలము.

సశేషము...
 


 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.

 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech