Sujanaranjani
           
  శీర్షికలు  
       ఎందరో మహానుభావులు

         పారుపల్లి రామష్ణయ్య పంతులు

 

 - రచన : తనికెళ్ళ భరణి    

 

 ఆంధ్రదేశంలో రెండు శ్రీకాకుళాలు ఉన్నాయి.
ఒకటి శ్రీకాకుళం జిల్లా.. రెండోది కృష్ణా జిల్లాలోని ‘శ్రీకాకుళం’ గ్రామం. ఈ శ్రీకాకుళంలోనే ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం ఉంది.... శ్రీకృష్ణదేవరాయులు ఈ దేవుణ్ణి దర్శించే.... అదే ప్రాంగణంలోని ఒక మండపంలో ’ఆముక్తమాల్యద’ కావ్యానికి శ్రీకారం చుట్టాడు....
అలా సంగీతసాహిత్యాలకి వెలవైన శ్రీకాకుళంలో 1883 డిసెంబర్ 5వ తేదీన పారుపల్లి శేషాచలం, మంగమాంబ గార్లకు పారుపల్లి రామక్రిష్ణయ్య పంతులు జన్మించారు.
తండ్రి శేషాచలం గారు సంగీత విద్వాంసులు....
కాబట్టి ఉగ్గుపాలతోటే సంగీతం అబ్బింది....
అదే ప్రాంతానికి చెందిన సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రిగారు దాదాపు నూటాయాభై ఏళ్ళ క్రితం..... సంగీతం నేర్చుకోవటానికి కాలి నడకన తమిళనాడు వెళ్ళి... అక్కడ శ్రీ త్యాగరాజస్వామి వారి శిష్యులైన ఆకుమళ్ళ వెంకటసుబ్బయ్య గారు (ఆయన్నే మానాంబు చావడి వెంకటసుబ్బయ్య గారంటారు) దగ్గర శిష్యరికం చేసి మళ్ళీ కాలినడకన ఆంధ్రదేశం వచ్చీ.........
ఎంతోమంది శిష్యుల్ని తయారుచేశారు.
అందులో అగ్రగణ్యులు పారుపల్లి రామక్రిష్ణయ్య పంతులుగారు......
రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి, ద్వివేదుల లక్ష్మణశాస్త్రి, సుసర్ల గంగాధరశాస్త్రి, పట్నం సుబ్రహ్మణ్యయ్యర్, మహావైద్య నాదయ్యర్ మొదలైన మహామహులంతా పారుపల్లి వారి సహాధ్యాయులే....
ఒకసారి ఊహించండి అదో సంగీతగురుకులం....
బ్రాహ్మీ ముహూర్తానికి అంతా నిద్దర్లు లేవడం....
శిష్యులంతా గబగబా క్రిష్ణా నదికెళ్ళి పోయి....స్నానాలూ...సంధ్యలూ....
తర్వాత విబూది పెట్టుకునేవారూ... నమం దిద్దుకునేవారూ....
అంతా వచ్చి నిశ్శబ్దంగా... వినయంగా కూర్చుంటే....
మంద్రమంద్రగా వస్తున్న తంబురా నాదం మధ్యలోంచి సరస్వతీ స్వరూపులైన సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రుల వారి కమ్మని కంఠ స్వరం సంగీత పాఠాలు చెప్తోంటే......శిష్యులు శ్రద్ధగా... ఏకాగ్రతతో వినడం నేర్చుకోవడం.
అంతా ముక్తకంఠంతో ఆలపిస్తోంటే... ఆ నాదం ప్రకృతి అంతా ప్రతిధ్యనించడం
మల్లెలు తెల్లబోయి చూడ్డం,
మామిడిపిందెలు తలలూపడం....
కోకిలలు సిగ్గుతో కొమ్మల్లోకి దూరిపోవడం...
భ్రమరం తేనె కోసం పిల్లల చుట్టూ ప్రదక్షిణలు చెయ్యడం... ఉదయం పాఠాలవగానే....
శిష్యులే వంట ప్రయత్నాలు......కండువాలేసి నడుం కట్టి....
గాడిపొయ్యి మీద గుండిగలు పెట్టేవారు కొందరు.
నీళ్ళు తోడేవారు.... పాలు పితికేవారు.....
కూరలు తరిగేవారు.... పప్పురుబ్బేవారు....
పచ్చడి చేసేవారు......వండేవారు.... వార్చేవారు......వడ్డించేవారు
ఓహ్ అదో పెళ్ళివారిల్లూ!!
పాలూ - పంచదార కలిపి సరళీస్వరాలయేది
కత్తిపీట - కొత్తిమీర జంటస్వరాలయేది
అన్నం కుతకుతలో - ఆలాపన
అప్పడాలు వేగటంలో - వర్ణాలు
పులుసు చేస్తూ కృతులు- పరమాణ్ణం తయారు చేస్తూ కీర్తనలు వంటశాల సంగీతశాలైపోయీ.......
నవరసాల్తో శ్రవణేంద్రియాలన్నీ - అక్షుల్ని - కుక్షుల్ని కూడా నింపేసేది!
అలాంటి వాతావరణంలోంచి వచ్చిన సంగీతవేత్త పారుపల్లి వారు. చల్లపల్లి అడవి చిన రామయ్యగారి దగ్గర ఠాణేదారుగా ఉద్యోగానికి తర్ఫీదు పొందీ - పెదకళ్ళేపల్లిలో ఠాణేదారుగా తన పన్నెండో ఏట నియమితులయ్యరు. కానీ సంగీతం సాహిత్యం అబ్బినవాడికి ఉద్యోగాలు రుచిస్తాయా.... తేనె రుచి మరిగిన వారికి బెల్లం పాకం వెగటేయదూ!
అంచేత ఉద్యోగానికి తిలోదకాలిచ్చి.... అచ్చంగా సంగీతాన్ని ఆపోసన పట్టడం ప్రారంభించీ......వయొలిన్, వేణువు, మృదంగం, కంజిర ఇలా అన్ని వాయిద్యాల్లోనూ నైపుణ్యం సంపాదించారు. సరే గాత్రం ఎలాగ ఉండనే ఉంది.......
ఇంక ఆంధ్రదేశమంతటా సంగీత కచేరీలు ప్రారంభించారు.
1915లో చెన్నపట్నం పాలకులైన పెట్లండ్ ప్రభువు గారిచే తెనాలి పురపాలక వర్గం వారు సమర్పించిన స్వర్ణపత్రాన్ని అందుకున్నారు. బరోడాలో అఖిలభారత సంగీతసభలో పాల్గొని సన్మానితులయ్యారు. 1928 లో కాకినాడ శ్రీరామసమాజం వారు పంతులు గారికి బంగారు గొలుసూ, పతకంతో సన్మానించారు.
పుష్పగిరి పీఠాధిపతుల చేత ’కనకాభిషేకం’ చేయించుకున్నారు.
1906లో పశ్చిమ గోదావరి డిప్యూటీ కలెక్టర్ గా ఉన్న భక్తవత్సలంగారు పంతులుగారి సంగీతానికి ముగ్ధులైపోయి ’తెలుగు రాయని పాలెం’ గ్రామానికి కరణంగా నియమించారు.
1921లో కె.వి.శ్రీనివాసాయ్యంగారు మద్రాసులోని ’గోఖలే’హల్లో పంతులుగారి గానసభ ఏర్పాటు చేశారు.
పారుపల్లి రామక్రిష్ణయ్య పంతులు - గాత్రం
మైసూరు ఆస్థాన విద్వాంసులు చౌడయ్యగారి వయొలిన్
అలహనంది పిళ్ళే - మృదంగం
వేలాయుధం పిళ్ళే - కంజిర
ఆనాటి సంగీత కచేరీ - తరతరాల వరకు విన్నవారి స్మృతిపథంలో ఒక మధురానుభూతి మిగిలించారు. కారణం - అంతా సరస్వతీ పుత్రులే. కిటకిటలాడి పోయిన హాలు ఒక ’రసిక సముద్రం’.
ఆ సంవత్సరంలోనే ఆంధ్రా రీసెర్చ్ యూనివర్సిటీ చేత ’భారతీ తీర్ధోపాధ్యాయ’ అన్న పట్టాన్ని కూడా పొందారు.
1931లో అఖిలాంధ్ర పరిషద్వార్షిక మహాసభలో..... ఎంతోమంది సంగీత విద్వాంసులూ, వేలకొద్దీ రసికులూ..... విద్యావేత్తలు.... పురప్రజల సమక్షంలో సభ దద్దరిల్లిపోయేలా హర్షధ్వనుల మధ్య ’గాయకసార్వభౌమ’ బిరుదు పొందారు.
అంబ.... నవాంబుజోజ్వల కరాంబుజ పులకరించి.... చల్లగా దీవించింది... పంతులుగారి శిష్య వాత్సల్యానికి ఓ మచ్చుతునక.
అరవైడెబ్భై ఏళ్ళ క్రితం.....
తిరువాయూరు త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో కమిటీ మెంబరు పంతులుగారు. సరే తనతో పాటు శిష్యుడు చిరంజీవి మంగళంపల్లి బాలమురళీ కృష్ణని తీసికెళ్ళారు.
అప్పటికా కుర్రాడికి ఎనిమిదేళ్ళు. అయితేనేం చిచ్చర పిడుగు.... సరే ఆరాధనోత్సవాలు మొదలయ్యాయి.
భారతదేశం నలుమూలల్నించీ వచ్చిన సంగీత విద్వాంసులు తమతమ ప్రతిభా పాటవాల్ని చూపిస్తున్నారు.
బాలమురళి గురువుగారికేసి బేలగా చూశాడు! గురువుగారికి అర్ధమైంది... కమిటీ వాళ్ళతో మాట్లాడి మా శిష్యుడు చిరంజీవి బాలమురళీ కృష్ణ కచేరీ చేస్తాడు అన్నారు.....
వీల్లేదన్నరు! అక్కడి పెద్దలు.
అప్పుడు పంతులుగారు ’సరే ఒక పని చేయండి. ఆరాధనోత్సవాల్లో నేను పాడటానికి కేటాయించిన సమయంలో నేను పాడను. నా శిష్యుడు పాడతాడు. మిమ్మల్ని మెప్పిస్తాడని నా నమ్మకం’ అన్నారు.
సంగీత సభ ఆత్రంగా ఎదురుచూస్తోంది.
బాలమురళి గురువుగారికేసి చూసి నమస్కారం చేశాడు. కళ్ళతోటే ఆశీర్వదించారు గురువుగారు.
ఏమి పాడాడో... బహుశా ఎందరో మహాను భావులు అన్న ఉద్దేశంతో పాడివుంటాడు.
బాలమురళి నాదం........సభయావత్తునీ మత్తులో ముంచేసింది. పెద్దలు అంతా చప్పట్లు కొట్టి మంగళాక్షితలు చల్లారు.
గురువుగారు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మురిసిపోయారు. ఈ సంఘటన గురించి మంగళంపల్లి వారు చెమర్చే కళ్ళతో ఎన్నిసార్లు చెప్పుకున్నారో.... ’గురువంటే ఆయన.... ఆయన శిష్యరికం నా పూర్వజన్మ సుకృతం’ అని.
పారుపల్లి వారిదికూడా సుసర్లవారి పద్ధతే. ఆయనకు కూడా గురుకులం ఉండేది. అయితే ఆయన ఇంట్లో అన్ని వర్గాల వారూ, అన్ని వర్ణాల వారూ..... అన్యమతస్తులు కూడ సంగీతం నేర్చుకోవడానికి వచ్చేవారు. అందర్ని సమదృష్టితో చూసిన ఉత్తమ గురువు పారుపల్లి. ఉదాహరణకు అన్నవరపు రామస్వామి, దాలిపర్తి పిచ్చిహరి, పాతూరి సీతారామయ్య చౌదరి, వంకదారి వెంకటసుబ్బయ్య గుప్త,షేక్ చినమౌలానాసాహెబ్, జి.వి రామకుమారి, నల్లాన్ చక్రవర్తుల క్రిష్ణమాచార్యులుగారు, మంగళంపల్లి బాల మురళీకృష్ణ, నేతి శ్రీరామశర్మ, అరుంధతీ సర్కార్, చిలకలపూడి వెంకటేశ్వరశర్మ. ఇలా ఎంతోమంది శిష్యులకి సంగీతంతో పాటు ఇంగితజ్ణానం కూడా నేర్పిన మహానుభావుడు ఆయన.
సుసర్ల దక్షిణా మూర్తిగారు కాలం చేశాక, ప్రతియేటా ఆయన పేరున ఆరాధనోత్సవాలు జరుపుతూ స్వయంగా ’తద్దినం’ పెట్టేవారు పంతులుగారు.
అది 1951......సుసర్లవారి ఆరాధనోత్సవాలు......విజయవాడలో దుర్గాపురంలో శరభయ్య గుళ్లల్లో జరుగుతున్నాయ్. అపరాహ్ణం వేళ!....... గురువుగారికి ఆబ్దీకం పెట్టి.....
మేడదిగి కిందికి వెళ్లీ....తూర్పు వేపున గురువుగారిని స్మరిస్తూ సాష్టాంగ ప్రమాణం ఆచరించిన పారుపల్లి రామక్రిష్ణయ్య పంతులుగారు మరి లేవలేదు!!!!
గురుస్మరణ చేసుకుంటూ నాదబ్రహ్మంలో ఐక్యమైపోయారు.
 


 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     
     

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 
 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech