Sujanaranjani
           
  శీర్షికలు  
  దేవుడున్నాడా? ఓ చర్చా వేదిక - 9
 

 - రచన: ముత్తేవి రవీంద్రనాథ్

 
 

ఇక భారతీయ తత్త్వ విచారణలో దేవుడున్నాడనేదానికి రుజువులుగా వేటిని పేర్కొన్నారో, అవి ఏమేరకు శాస్త్రీయాలుగా నిలబడ్డాయో కూడా ఒకసారి పరిశీలిద్దాం.

                            రుజువులన్నింటినీ ఉదయనుడు అనే న్యాయ-వైశేషిక  తత్త్వవేత్త తన' కుసుమాంజలి'అనే గ్రంథంలో ఇలా పొందుపరచాడు:-

                            శ్లో. కార్యాయోజన ధృత్యాదే : పదాత్ప్రత్యయతః శ్రుతే : |

 

                                వాక్యాత్సంఖ్యా విశేషాచ్చ సాధ్యో విశ్వవిదవ్యయః  ||

 

              కార్యము,ఆయోజనము,ధృతి,పదము,ప్రత్యయము,శృతి,వాక్యము, సంఖ్యా విశేషము-- ఎనిమిదీ  

భారతీయ తత్త్వశాస్త్రం ప్రతిపాదించిన సంప్రదాయ రుజువులు.ఇవి  పాశ్చాత్య తత్త్వశాస్త్రంలో కాంట్ ప్రతిపాదించిన, శల్యపరీక్ష చేసిన  సంప్రదాయ రుజువులతో సరిపోల్చదగినవే

దేవుడున్నాడనేందుకు సంప్రదాయ రుజువులుగా ప్రతిపాదించబడిన ఎనిమిదింటినీ ఒక్కొక్కటిగా  పరిశీలిద్దాం.  

ఒకటి)' కార్య '- ప్రపంచం ఒక కార్యం (Effect).అంచేత దానికి ఒక కారణం(Cause) ఉండే ఉంటుంది.ఇది పాశ్చాత్యుల కారణ సిద్ధాంతం(Causal Theory) లేక కాస్మోలాజికల్ రుజువు(Cosmological Proof) తప్ప   వేరొకటి  కాదు .   సిద్ధాంతం యొక్క విశ్వసనీయతను మనమీవరకే లోతుగా పరిశీలించాం. కనుక వేరే చర్చించాల్సిన పనిలేదు. 

రెండు) 'ఆయోజన' - పదార్థానికి సంబంధించిన  పరమాణువు, ద్వ్యణుకము,త్రస రేణువుల వంటివి వాటికవిగా కలిసి  దృశ్యమాన  ప్రపంచాన్ని సృష్టించలేవు.కాబట్టి భగవంతుడనే ఒక తెలివైన వ్యక్తి చాలా నేర్పుతో పరమాణు సంఘాతం చేసి ఉంటాడు.సృష్టి అలా జరిగి ఉంటుంది. సృష్టి బ్రహ్మ చేసాడనే భావన.  

భారతీయ తత్త్వశాస్త్రం లోని ఆరు ఆస్తిక దర్శనాలలో ఒకటైన వైశేషిక దర్శనంలో కణాదుడు ప్రతిపాదించిన' అణు సిద్ధాంతం' ప్రకారం కంటికి కనుపించని పరమాణువులు(Atoms) రెండు కలిసి ద్వ్యణుకము(Dyad) గానూ, మూడు  కలిసి  త్ర్యణుకము (Triad) గానూ  ఏర్పడతాయని ప్రతిపాదించాడు..త్ర్యణుకాన్నే 'త్రస రేణువు' అనికూడా  అంటారు. మన కంటికి కనుపించే అత్యంత సూక్ష్మ పదార్ధం త్రస రేణువే.రసాయనిక శాస్త్రం పరమాణువుల మధ్య  ఉండే బంధాన్ని గురించీపరమాణు  సంఘాతాన్ని (Atomic Fusion) గురించీ ఎన్నెన్నో శాస్త్రీయ సత్యాలను ఆవిష్కరించింది. పరమాణువులు 'వాలెన్సీ బంధాల'(Valency Bonds) కారణంగా ఒకదానితో మరొకటి కలుస్తాయని రసాయనిక శాస్త్రజ్ఞులు నిర్ధారించారు.ప్రయోగ శాలల్లోనూ ఇలాంటి సంఘాత, విఘాతాలు జరుపుతూ,  ఎన్నెన్నో రసాయనిక పదార్థాలను శాస్త్రవేత్తలు సృష్టించడం మనం చూస్తున్నాం. వివిధ రసాయన మూలకాలు వాటి మధ్య స్వతస్సిద్ధంగా ఉన్న పరస్పరాకర్షణ శక్తి కారణంగా తమకుతాముగా మిశ్రణాలుగా ఏర్పడ్డాయి.

వాటికవే  ఏయే నిష్పత్తిలో కలిసి వివిధ రసాయన పదార్థాలుగా ఏర్పడ్డాయో కనిపెట్టిన మానవుడు అవే మూలకాలను  అదే నిష్పత్తిలో కలిపి ఆయా  పదార్థాలను సృష్టించవచ్చని కనుగొన్నాడు.భగవంతుడు(బ్రహ్మ తన తెలివితేటలతో పరమాణువులను ఒక చోటికిచేర్చి దృశ్యమాన ప్రపంచాన్ని సృష్టించాడని నమ్మడం అశాస్త్రీయం. అందుకెట్టి ఆధారాలూ లేవు.

సిద్ధాంతం కాంట్ ఖండించిన Teleological లేక Physico-Theological Proof వంటిదే.దాని  విషయంలో మనం చర్చించిన అంశాలన్నీ సిద్ధాంతాన్ని పూర్వపక్షం చేసేందుకు సరిపోతాయి.కనుక  మన గత చర్చ వెలుగులో రుజువునూ అశాస్త్రీయమని భావించి తిరస్కరించవచ్చు.  

 మూడు )     'ధృతి '- ప్రపంచానికి భగవంతుడే స్థితికారుడు.అంటే ప్రపంచపు నిర్వహణ, పోషణ భారం నిర్వహిస్తున్నది .  భగవంతుడే.సనాతన మత విశ్వాసాన్ననుసరించి బాధ్యత విష్ణువుది.Teleological Proof గురించి చర్చించిన సందర్భంలో ప్రపంచంలో ఎన్నెన్ని నిర్వహణా లోపాలున్నాయో చెప్పుకున్నాం.సకల పరిపూర్ణుడైన భగవంతుడే నిజంగా దీన్నంతా నిర్వహిస్తుంటే ఒక్క శాతం కూడా నిర్వహణా లోపాలు  ఉండకూడదు. కనుక విశ్వానికి ఒక నిర్వాహకుడు ఉన్నాడనడమూ అశాస్త్రీయమే.అలా   సిద్ధాంతాన్నీ మనం అదే రీతిలో పూర్వ పక్షం చేయవచ్చు

నాలుగు)          ' పదాత్' -- ప్రపంచం ఎన్నెన్నో హస్తకళలకూ,లలిత కళలకూ నిలయం. చక్కటి శిల్పకళ,చిత్రకళ, సంగీతం, నాట్యం వగైరాలన్నీ ఎవరో తెలివైన భగవంతుడు సృష్టించి మనకు అందజేశాడు.అందుకే కళలు దైవదత్తాలనే నానుడి ఏర్పడింది. మన ప్రాచీనులు ప్రతి కళకూ ఒక దైవాన్ని అధినేతగా భావించారు. మన విశ్వ కర్మ, గ్రీకుల హేఫీస్టాస్(Hephaestus) ,రోమన్ల వల్కన్ (Vulcan) కోవకు చెందిన   దేవతలే

సిద్ధాంతమూ శాస్త్ర దృష్టికి నిలిచేది కాదు.లోహాలు తెలియని రోజుల్లో రాతి పనిముట్లు,ఎముకలతో చేసిన ఆయుధాలు వాడిన ఆదిమ మానవుడు క్రమంగా  ఇనుము, రాగి వంటి లోహాలు కనుగొని వాటితో  పనిముట్లు,ఆయుధాలు, కవచాలు మొదలైనవి తయారు చేయడం,ఇత్తడి, కంచు, ఉక్కు వంటి మిశ్రమ  లోహాలనూ కనుగొనడం జరిగింది.ఆదిమ మానవులు గుహలలో గీసిన వర్ణ చిత్రాలలోని కళా నైపుణ్యమే  క్రమంగా వికాసం చెంది, తరువాత కాలపు  అజంతా కుడ్యచిత్రాల వంటి కళా ఖండాలలో  పరిపూర్ణత చెందింది.ఇలా  వృత్తి విద్యలూ, కళలూ మొదటినుంచీ పరిపూర్ణమైనవి కాదు.మానవుల మేధో వికాసం తోపాటు అవి కూడా క్రమంగా అభివృద్ధి చెంది అత్యున్నత స్థాయికి చేరాయి.ప్రస్తుతం కళా పోషణ కరవై,జీవితాలు కళా సృష్టి చేయడానికీ, కళారాధన చేయడానికీ కూడా తీరికలేనంతగా 'బిజీఅయిపోయినందున  క్రమంగా కళలు వెనుకపట్టు పట్టడం మనం గమనించవచ్చు

అంచేత కళలు మొదటినుంచే  పరిపూర్ణమైనవనీ, కళలూ, వృత్తి విద్యా నైపుణ్యాలూ దైవ దత్తాలనీ  భావించేందుకు వీలు లేదు. మానవ మేధస్సుతోనే అన్ని కళలూ అభివృద్ధి చెందాయి.కనీసం భగవంతుడిని నమ్మే కళాభిమానులన్నా ఉన్నాడో లేడో, ఉంటే  ఎక్కడున్నాడో ఎరుకలేని భగవంతుడి ఆరాధనకు ఇకనైనా  స్వస్తి పలికి , మన కళ్ళ ముందే జీవిస్తూ తమ  ప్రావీణ్యంతోకఠోర కృషితో కళా నైపుణ్యాన్ని పరిపూర్ణంగా సాధించిన కళాకారులను ,వృత్తివిద్యా నిపుణులను తాము పరిపూర్ణుడని  భావిస్తున్న భగవంతుడివలె సంభావించి, సమ్మానించడం మంచిది

ఐదు)    'ప్రత్యయతః'- అద్భుత సాహిత్య నిధులైన వేదాలకు భగవంతుడే కర్త.అంతటి  మహత్తర సాహిత్యాన్ని పరిపూర్ణుడైన  భగవంతుడు కాక వేరెవరు సృష్టించగలుగుతారు? భగవంతుడు ఉన్నాడనడానికి ఇంతకంటే రుజువు  ఇంకేం కావాలి?

వేదాలు అపౌరుషేయాలని(అంటే మానవుడి చేత అవి సృష్టింపబడలేదని), అవి భగవంతుడి నిట్టూర్పులుగా బయల్పడి, ఋషులచే వినబడ్డాయని ప్రాచీనుల విశ్వాసం.అందుకే వాటిని 'శ్రుతులు'(వినబడినవి) అన్నారు.భగవంతుని ప్రేరణ చేతనే అనంత శబ్దరాశి ఋషుల హృదయాల్లో ప్రవేశించి, వారి ద్వారా మనకు అందించబద్డదని  కూడా ప్రాచీనుల విశ్వాసం.   కారణంగానే వేదాలు ఋషిప్రోక్తాలు అంటారు.వాటి విషయంలో కాల నిర్ణయం చెయ్యలేమనీ, భగవంతుడు నిత్యుడు కనుక, ఆయన నిశ్శ్వాసలూ నిత్యములే కాబట్టి వేదాలు నిత్యశబ్దరాశి అనికూడా ప్రాచీనుల విశ్వాసం.

వేదాలపై స్వామి దయానంద సరస్వతి, అవనీష్ చంద్ర బోస్ వంటి మహా పండితులు సమగ్రమైన  పరిశోధనలు చేశారు. విషయమై శాస్త్రీయ దృష్టి ఏమిటంటే -- వేదాలలో వాడబడిన భాషఛందస్సు, వాటిలో పేర్కొనబడిన చారిత్రక,భౌగోళిక వివరాలనుబట్టి వివిధ దేశ కాలాలలో వేదాలను వసిష్టుడు,భరద్వాజుడు,విశ్వామిత్రుడు, వామదేవుడు,అగస్త్యుడు, గౌతముడు, జమదగ్ని,నారదుడు,దేవరాతుడు,పరాశరుడు,అంగిరసుడు,మధుచ్చందుడు,శునఃశేఫుడు వగైరా ఋషులు రాశారు.'వేదయతీతి వేదః' అనే నిర్వచనం ప్రకారం నాటి మానవజాతి  ప్రాయికమైన విజ్ఞానమే వేదాలు.మానవజాతి పురోగమిస్తున్నకొద్దీ ఎప్పటికప్పుడు తాము నేర్చుకుంటూన్న ప్రాథమికమైన వివిధ విజ్ఞాన సంబంధిత విషయాలు, పై ఋషులచేత వేర్వేరు కాలాల్లో మూలానికి జతపరచబడ్డాయి.ఆయా ఋషులు చేసిన వర్ణనలనుబట్టీ, వారు వర్ణించిన నాటి దేశకాల పరిస్థితులనుబట్టీ వేదాలలో అతిప్రాచీనమైనదైన ఋగ్వేద  సంహిత రచనాకాలం క్రీ.పూ.2000-1500 మధ్య అయివుంటుందని శాస్త్రజ్ఞులు తేల్చారు.

వేదాలు మానవాళి యొక్క  అత్యంత ప్రాచీనమైన రచనా సంపద అనే విషయం  నిర్వివాదాంశమే అయినా అవి అపౌరుషేయాలనీ, నిత్య శబ్దరాశులనీ భావించడం శాస్త్రీయం కాదు.వేదాల కర్తృత్వం భగవంతుడిదేననే ఊహ మీద ఆధారపడి భగవంతుడున్నాడని భావించడం ఎట్టి తర్కానికీ నిలవదు.వేదాలు భగవంతుడే నిట్టూర్పులుగా విడిచాడనడానికి లేక ఆయనే రాశాడనడానికి రుజువేది? అతి ప్రాచీన సాహిత్యమంతా దైవ సృష్టే అనుకోవాలా? పరిశోధనలన్నీ వేదాలు పౌరుషేయాలనే నిర్ధారించాయి.కాబట్టి వేదాల ప్రాచీనతను చూపుతూ,అవి దేవుడి నిశ్శ్వాసలు అంటూవేదాలే దేవుడున్నాడనేందుకు రుజువు అనడం నిస్సందేహంగా వితండ వాదనే. అది చెల్లదు

ఆరు)         'శ్రుతే :'(శృతి ప్రమాణం)-  భగవంతుడున్నాడని వేదాలు ఘోషిస్తున్నాయి కాబట్టి భగవంతుడున్నాడు.ఇది మరీ వింత వాదన. భగవంతుడు వేదాల సృష్టికర్త. కాబట్టి వేదాలు ప్రమాణాలు(Valid Sources of Knowledge). వేదాలు భగవంతుడున్నాడని చెపుతున్నాయి కాబట్టి భగవంతుడున్నాడు. రుజువులూ లేకుండా ఊహాజనితమైన నిర్ధారణ మీద ఆధారపడి దేవుడున్నాడనే నిర్ణయానికి రావడం తార్కిక దోషం కాక మరొకటి కాదు. వాదనలో ఉన్న గందరగోళం చూడండి. వేదాలు ప్రామాణికాలు.ఎలా అవి భగవంతుడి సృష్టి కాబట్టి.అంటే భగవంతుడున్నాడని రుజువుచేయక ముందే ఆయన ఉన్నాడని ఊహించడం; ఆయనే వేదాలకు కర్త అనికూడా ఊహించడం.

అందుకని వేదాలను ప్రామాణికాలుగా, శిరోధార్యాలుగా భావించడం.ప్రామాణికాలైన వేదాలు చెపుతున్నాయి కాబట్టి భగవంతుడున్నాడనే నిర్ధారణకు రావడం. వాదన అడ్డంగా ఉందని ఏకాస్త ఇంగితం ఉన్నవాళ్ళైనా గ్రహిస్తారు. తరహా వాదనలు అందుకే  వీగిపోయాయి

ఏడు)             ' వాక్యాత్ ' (వాక్య ప్రమాణం) మనకు 'మహా భారతం' ఉంది.దాన్ని వ్యాసుడు రాశాడు.'రామాయణం'ఉంది.   దాన్ని వాల్మీకి రాశాడు. రెండూ అద్భుతమైన వాక్య సముదాయాలు.ఎన్నెన్నో జీవిత సత్యాలతో అవి నిండి ఉన్నాయి.ఇవే కాదు.గొప్ప గ్రంథాలు ఇంకెన్నో ఉన్నాయి.వాటన్నిటికీ సృష్టికర్తలున్నారు.వారంతా  విజ్ఞాన సాగరాలవంటి వేదాలనుంచే విజ్ఞానాన్నీ, వాక్య సముదాయాన్నీ గ్రహించారు . వేదోక్తులే మిగిలిన భారతీయ సాహిత్యంలో ప్రామాణికాలుగా ప్రవేశించాయి. కాబట్టి ప్రాచీన సాహిత్యాన్ని ఇంతగా ప్రభావితం చేసిన వేదాల కర్త ఎంతో తెలివైనవాడు అనడంలో సందేహం లేదు. మరి వేదాల సృష్టికర్త ఎవరు? ఇంకెవరై ఉంటారుఅతడు అందరికంటే తెలివైనవాడైన భగవంతుడే అయివుంటాడు.

మత గ్రంథాలను అపౌరుషేయాలని ప్రచారంచేయడం అన్ని మతాల్లోనూ ఉంది. హిందూ మత గ్రంథాలే కాదు. క్రైస్తవుల 'బైబిల్',ముస్లిం 'ఖురాన్' వగైరా మతగ్రంథాలు కూడా ఒకేలాగా   ఒకానొక చారిత్రక దశలో ఎవరో రచయితలచేత  గ్రంథస్థం చేయబడి, తరువాత కొన్ని శతాబ్దాలపాటు పలు విషయాలు చేర్చబడుతూ,ఒక దశ దాటిన తరువాత --అంటే  వాటికి పవిత్రత ఆపాదించబడిన తరువాత ఇక ఒక్క ముక్క కలపడంగానీ,ఒక్కముక్క తీసివేయడం కానీ నేరమని భావిస్తూ దానినే వల్లిస్తూ,క్రమంగా అర్థవిచారణ కంటే భట్టీయం పట్టడానికే(Learning by Rote) ప్రాముఖ్యం ఇస్తూవచ్చారు.అవి ఏరకంగా అపౌరుషేయాలు కాదని రుజువైందో పైనే చర్చించాం.కనుక వాటి కర్త భగవంతుడేననే వాదన  నిలిచేది కాదు

ఎనిమిది) 'సంఖ్యా విశేషాత్'--  పరమాణువులను ఎవరో లేక్కించినట్లుగా సరిగ్గా అదే నిష్పత్తిలో కలపడం ద్వారా వివిధ పదార్థాలను సృష్టించడం అందరిలోకీ తెలివైనవాడైన భగవంతుడికే  సాధ్యమౌతుంది.కాబట్టి వివిధ పదార్థాల సృష్టికర్త అయినట్టి భగవంతుడు ఉన్నాడనడానికి అదే రుజువు. పరమాణువుల మధ్య బంధం ఏమిటో, అవి వేర్వేరు పదార్థాలుగా ఎలా ఏర్పడతాయో 'ఆయోజన' సిద్ధాంతాన్ని పూర్వపక్షం చేసేటప్పుడే వివరంగా చర్చించాం.దీనికి తిరిగి ప్రత్యేకించి ఖండన అవసరం లేదు.

భారతీయ తత్త్వశాస్త్రం లోని పై  ఎనిమిది  ఆస్తిక  రుజువులకు తోడు ఉదయనుడు మరోదాన్నికూడా చేర్చాడు. తోమ్మిదోదీ , చివరిదీ అయిన   రుజువు 'అదృష్టాత్'- అదృష్టం(కనుపించనిది) మానవులు చేసే మంచి,చెడ్డ లేక తటస్థ కార్యాలనుబట్టి అతడు సముపార్జించే పుణ్య పాపాల 'బాలెన్స్ షీట్' ని  ' అదృష్టం ' అంటారు.ఇది కంటికి కనబడేది కాదు; స్వంత ఆలోచన, తెలివితేటలు కలిగినదీ కాదు.కనుక దీన్ని అదుపు చేస్తూ ఎవరెవరి కర్మలనుబట్టి తెలివిగా వారికి పుణ్యపాపాలను బట్వాడా చేసే ఒక చైతన్యవంతమైన, తెలివైన శక్తి అవసరం. శక్తే భగవంతుడు.                              

ఆత్మలనూ,పునర్జన్మలనూ నమ్మిన మానవుడు తనుచేసే మంచి, చెడు పనులను బట్టి తన ఆత్మకు అంతిమంగా  స్వర్గమో నరకమో ప్రాప్తిస్తుందనీ,అది జన్మరాహిత్యమనీ నమ్మాడు.ఈలోగా తన ఆత్మ వివిధ జన్మలు ఎత్తుతుందని కూడా విశ్వసించాడు.గత జన్మలలో చేసిన పాప, పుణ్యాలలో ఏది మిగులో దాన్నిబట్టి పుణ్యానికి ప్రతిఫలంగా స్వర్గప్రాప్తి, పాపానికి ప్రతిఫలంగా నరక ప్రాప్తి కలుగుతాయనీ నమ్మాడు.గత జన్మలలో చేసిన కర్మల మూలంగా సంపాదించిన  పుణ్య పాపాల మూటను ' సంచిత కర్మ అంటారు. జన్మలో చేస్తున్న మంచి, చెడు పనుల కారణంగా ఇప్పుడు  మనం పోగేసుకుంటున్న మూటను 'సంచీయమాన కర్మ' అంటారుతన ప్రభావాన్ని ఇప్పటికే చూపించడం మొదలుపెట్టిన కర్మను 'ప్రారబ్ధ కర్మఅనీ, ఇంకా తన ప్రభావం చూపడం మొదలు పెట్టని కర్మను 'అనారబ్ద కర్మ' అంటారు

ఆత్మలు, పుణ్య పాపాలు, స్వర్గ నరకాలు,కర్మల సిద్ధాంతం అశాస్త్రీయమనీ, అదొక చిక్కుల చిట్టడవి అనీ మనం లోగడే విపులంగా చర్చించాం.'కర్మఫలదాత'గా భగవంతుడి పాత్రను ఎలాగైతే నిర్ధారణ చేయడం సాధ్యం కాదో , అలాగే దానిమీద ఆధారపడి దేవుడున్నాడని రుజువు పరచడమూ సాధ్యం కాని పని.

సందర్భంగా ఒక్క విషయం మనం చెప్పుకోవాలి.సమాజంలో నేర విస్ఫోటనం జరుగకుండా కట్టడి చేసేందుకు భగవంతుడు, పాప పుణ్యాల సిద్ధాంతం కొంతమేరకు ఉపయోగపడ్డది.అయితే సమాజంలోని ఎడతెగని వైరుధ్యాల కారణంగా పాపాలు పెరుగుతూనే ఉన్నాయిగానీ తగ్గుతున్న దాఖలాలులేవు. కేవలం  కర్మ సిద్ధాంతం పై విశ్వాసం కారణంగానే  నేరాలు తగ్గుతాయనేది ఒట్టి భ్రమే.ఇది కట్టుబడే అమాయకులనూ,దోపిడీకి గురౌతున్నవారిని కట్టి పడేసే సిద్ధాంతమే.

కట్టుబాటూ లేకుండా సమాజాన్ని యథేచ్చగా దోచుకుంటూ, పైకి దైవభీతి నటిస్తూ, అశాస్త్రీయ సిద్ధాంతాల ప్రచారానికి నడుం బిగించి,నిర్భాగ్యులైన దోచబడుతున్న సామ్మాన్య జనాన్ని విశ్వాసాల మత్తులో ముంచెత్తుతూ, వారిచేతనే 'పరమ భాగవతోత్తములు'గా  కీర్తించబడుతున్న దోపిడీ దారుల ఆట కట్టించే సిద్ధాంతం మాత్రం  కాదు. అశాస్త్రీయ సిద్ధాంతాలను జనం నమ్ముతూ ఉండబట్టే, 'నేరస్తులు  వాళ్ళ పాపాన వాళ్ళే పోతారులే' అనుకోబట్టే శతాబ్దాలపాటు వారి ఆటలు ఎలాబడితే అలా  చెల్లుబాటయ్యాయి.

సమాజంలో  విజ్ఞత,సామాజిక చైతన్యం పెరిగి సామాజిక బాధ్యతలను గుర్తించి,వాటిపట్ల విధేయుడై ఉండే నవ్యమానవుడు తయారవడమే దీనికి పరిష్కారం. ఎవరో శిక్షిస్తారనే భయం తోనో , ఎవరో తమ పుణ్యానికి పురస్కారంగా తమకు స్వర్గప్రాప్తి కలిగిస్తారనే ఆశతోనో కూడిన విశ్వాసాలను   నమ్ముతూ వచ్చిన జనం ఇన్ని శతాబ్దాల  తమ విశ్వాసాలు ఏమేరకు ఫలవంతమయ్యాయో బేరీజు వేసి చూసుకునే సమయం త్వరలోనే వస్తుంది. అప్పుడిక వివేకానందుడు,రవీంద్రనాథ్ టాగూర్ మొదలగువారు ఆశించిన విధంగానే  జనం  నిర్భయంగా ఆలోచిస్తూఅంకితభావంతో   శ్రమించే , బాధ్యతాయుతంగా తమ విధుల్ని నెరవేర్చే ఉత్తమ పౌరులుగా రూపొందగలరు.వారు  చుట్టూ ఉన్న సమాజాన్ని గురించికూడా ఆలోచించి, సమాజం లోని దోపిడీయే వర్గ వైషమ్యాలకు  మూలమని గ్రహించి ,దోపిడీని రూపుమాపి, వర్గ రహిత సమాజాన్ని ఏర్పరచడం ద్వారా తాము ఆశిస్తున్న సామాజిక కళ్యాణాన్ని,సర్వ జనుల సుఖాన్నీ  సాధించుకోనూగలరు.                                                   

ప్రాక్పశ్చిమ తత్త్వ శాస్త్రాల్లోని దేవుడున్నాడని రుజువుపరచ యత్నించిన పలు సిద్ధాంతాల బాగోగులు ముందు ముందు పరిశీలిద్దాం.

ఇప్పటికి సెలవు.      

 

ముత్తేవి రవీంద్రనాథ్ గారి 'తెనాలి రామకృష్ణ కవి-శాస్త్రీయ పరిశీలన' అనే తొలి రచనకే  కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ పొందడం విశేషం. వీరికి "కావ్యనుశీలన కళా సమ్రాట్టు" అనే బిరుదుతోబాటు,విజయవాడ,ఒంగోలు,గుంటూరు,తెనాలి,చీరాల, అద్దంకి మొదలగు చోట్ల ఘన సత్కారాలు జరిగాయి. కమ్యూనిస్టు ఉద్యమంలో కాకలు తీరిన కుటుంబ నేపథ్యం గలిగి, సైన్స్ విద్యార్థిగా శాస్త్రీయ దృష్టినీ,సహేతుక దృక్పథాన్నీ అలవరచుకుని,స్వయం సంపాదిత సాహితీ నేపథ్యంతో రచనలు చేస్తున్న రవీంద్రనాథ్ గారు సంఘ సేవా తత్పరులు కూడా కావడం అదనపు గౌరవానికి ఆలంబనమైన విషయం. వీరు  'శ్రమ వీరులు' పేరిట కొన్ని శ్రామిక సామాజిక వర్గాల చరిత్ర, స్థితిగతులపై పరిశోధనాత్మక గ్రంథం రాశారు. జనరంజకమైన  హరికథా రూపంలో దైవ ప్రస్తావన లేకుండా ' మహాకవి శ్రీ శ్రీ - సిరి కథ' అనే రచన చేశారు. 'పాండురంగ మాహాత్మ్యము-పరిచయం','మన ప్రాచీనుల ఆహారం,ఆరోగ్యం, వైద్యం' వీరి ఇటీవలి రచనలు. 2009 లో వాణిజ్య పన్నుల అధికారిగా పదవీ విరమణ చేసిన వీరు తత్త్వశాస్త్రం, చరిత్ర, వర్తమాన రాజకీయాలు, సైన్సు,పర్యావరణం వగైరా భిన్న, విభిన్నమైన  అంశాలపై  పలు దిన, వార, మాస పత్రికలలో రాస్తున్న వ్యాసాలు చదువరులలో ఆసక్తినీ,ఆలోచననూ రేకెత్తిస్తాయి. హేతుబద్ధమైన   ఆలోచన, శాస్త్రీయ దృష్టితోబాటు, వివిధ శాస్త్రాలు, భాషలలో చక్కటి ప్రవేశమున్న రవీంద్రనాథ్ గారి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే చర్చా వేదిక.

 
 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి.
(Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 
 

 

సుజనరంజని మాసపత్రిక ఉచితంగా మీ ఇమెయిల్ కి పంపాలంటే వివరాలు కింది బాక్స్‌లో టైపు చేసి
సబ్‍స్క్రైబ్ బటన్ నొక్కగలరు.
 

     

 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)

 

 
Copyright ® 2001-2012 SiliconAndhra. All Rights Reserved.
   సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.                                                                                                Site Design: Krishna, Hyd, Agnatech