సుజనరంజని / సారస్వతం / విశ్వ స్వరూపం

 

విశ్వస్వరూపం - 15  . .మహాప్రస్తానం

                                                              రచన :- వేమూరి వేంకటేశ్వరరావు

 

చాల దూరం ప్రయాణం చేసేం. చాల ప్రయాస పడ్డాం. చాల ప్రశ్నలు అడిగేం. చాల అభిమతాలు (“థియరీ” లు) వెల్లడించాం. గణిత సమీకరణాలంకృతాలయిన సిద్ధాంతాలు ('థీరం' లు) పరిశీలించేం. గ్రీకులతో మొదలుపెట్టి, గెలిలియో, నూటన్, మేక్‌స్వెల్, అయిన్‌స్టయిన్, మొదలైన ఎందరో మహానుభావుల పేర్లు స్మరించేం, వారికి మన వందనాలు అర్పించుకున్నాం. విశ్వ రహశ్యాలని ఛేదించటానికి విశ్వప్రయత్నాలు చేసేం. చివరికి మిగిలినది ఏమిటి? ఈ వ్యాస పరంపరని ఏ ప్రశ్నలతో మొదలుపెట్టేమో ఆ ప్రశ్నలే సమాధానాలు లేకుండా మిగిలిపోయాయి!

ఈ విశ్వం ఎందుకు ఉంది? అంటే, ఈ విశ్వం యొక్క ఉనికికి కారణం ఏమిటి? ఈ విశ్వం పనిచేసే తీరు ఏమిటి? ఈ విశ్వనిర్మాణానికి వాడబడ్డ ఘటకద్రవ్యాలు ఏమిటి? ఈ విశ్వం ప్రాదుర్భావానికి కారణభూతులు ఎవ్వరు? మహావిస్పోటనంతో విశ్వం పుట్టింది అన్నారు. ఈ మహావిస్పోటనం ఎందుకు జరిగింది? ఈ విస్పోటనంతోటే స్థలం, కాలం పుట్టేయని అన్నాం కదా. విస్పోటనానికి 'ముందు' స్థలమే లేకపోతే ఆ పేలిన పదార్ధం (బ్రహ్మ పదార్ధం?) ఎక్కడ ఉండేది? మహావిస్పోటనంలోనే కాలం పుట్టినప్పుడు 'విస్పోటనానికి ముందు' అనే సమాసానికి అర్ధం ఉందా?

పోనీ, పైన అడిగిన ప్రశ్నలకి వేదాంత ధోరణిలో తప్ప శాస్త్రీయ ధోరణిలో సమాధానాలు చెప్పలేమని ఒప్పేసుకుందాం – మాటవరసకి. మన ప్రశ్నలని భౌతిక శాస్త్రం విధించిన పరిధిలోనే అడుగుదాం. పదార్ధం పరమాణు రేణువులతో తయారయింది అన్నారు కదా. కొన్ని పరమాణు రేణువుల అస్తిత్వానికి నిలకడ (అంటే స్థిరత్వం) ఉండి, కొన్నింటికి లేదు. ఎందుకని? మనిషి ఎంత పొడుగున్నాడో, ఎంత బరువున్నాడో కొలిచినంత మాత్రాన ఆ మనిషి తత్త్వం అర్ధం అవుతుందా? అలాగే మనం చేసినదల్లా విశ్వంలోని అంశాలని కొన్నింటిని – దూరాలు, వేగాలు, కాలాలు, గరిమలు, ఆవేశాలు, మొదలైన భౌతిక రాశులని - కొలిచేం. అంతే కాని ఈ విశ్వం యొక్క తత్త్వాన్ని అర్ధం చేసుకోలేదు. ఈ విశ్వం యొక్క అస్తిత్వానికి కారణం ఏమిటి? ఈ రకం ప్రశ్నలకి ఆధినిక భౌతిక శాస్త్రం ఆమోదకరమైన సమాధానాలు ఇవ్వలేకపోతోంది – ఇప్పటివరకు.

అంటే ఏమిటన్నమాట? కొన్ని రకాల ప్రశ్నలకి సమాధానాలు ఎక్కడ దొరుకుతాయో మనకే తెలియటం లేదు. మరికొన్ని రకాల ప్రశ్నలకి సమాధానాలు ఇంకా అధునాతనమైన అభిమతాలలో దొరకొచ్చనే ఆశ ఉంది. ప్రస్తుతానికి మొదటి రకం ప్రశ్నలకి సమాధానాలు మరొక కోణం నుండి వెతుకుదాం.

ఈ మొదటి రకం ప్రశ్నలు భారతదేశంలో వర్ధిల్లిన సనాతన ధర్మ కర్తలు ఎప్పుడో వేదకాలంలోనే లేవదీశారు. ఋగ్వేదంలో (10.129) నాసదీయ సూక్తం అనే మంత్రం ఉంది. ఈ మంత్రం లోని భావం భాషకి అతీతం. యోగాభ్యాసం చేసిన మునులు అనుభవించి అవగాహన చేసుకున్న బ్రహ్మ సత్యాన్ని భాష విధించిన శృంఖలాలకి బద్ధులై చెప్పేరు. వారు చెప్పదలుచుకున్న విషయాన్ని భాషలోబంధించి చెప్పేసరికి సగం భావం నశించిపోయి ఉంటుంది. మిగిలినదానిని ఇంగ్లీషులోకో, తెలుగులోకో దింపి చెప్పటానికి ప్రయత్నిస్తే మరో వన్నె తరిగిపోతుంది. అయినా సరే నాసదీయ సూక్తంలోని ఏడు శ్లోకాలలోని భావాన్ని, నాకు స్పురించిన విధంగా వ్యాఖ్యానించి తెలుగులో చెప్పటానికి ప్రయత్నం చేస్తాను.

ఈ సూక్తంలో, శ్లోకానికి నాలుగు పాదాల చొప్పున, ఏడు శ్లోకాలు ఉన్నాయి. ప్రతి శ్లోకంలోను మొదటి పాదంలో చెప్పదలుచుకున్న ముఖ్యాంశం ఉంటుంది, మిగిలిన మూడు పాదాలలో కొంత వివరణ ఉంటుంది. ఈ శ్లోకాలని అర్ధం చేసుకోటానికి ముందుగా 'సత్' అనే మాటకి 'అసత్' అనే మాటకి ఉన్న విస్తృతార్ధం మనం గ్రహించాలి. “సత్” అంటే సత్వం లేదా అస్తిత్వం. దీనినే ఇంగ్లీషులో 'బీయింగ్' (being) అనిన్నీ 'ఎగ్జిస్‌టెన్స్' (existence) అనిన్నీ అనొచ్చు. తెలుగులో “ఉనికి” అని కాని, 'ఉండటం' అని కాని చెప్పుకోవచ్చు. సత్ అంటే ఏమిటో చెప్పేను కనుక దీనికి వ్యతిరేకమైన లేక విరుద్ధమైన అర్ధంతో 'అసత్' అనే మాటని వాడదాం. అసత్ అంటే నాస్తిత్వం. సంస్కృతంలో 'న' అంటే లేదు, కాదు అనే అర్ధాలు ఉన్నాయి. కనుక శ్లోకం మొదట్లోనే 'న అసత్, న సత్' అనే ద్వంద్వ విరుద్ధ భావాలతో మొదలు అవుతుంది. అందుకనే దీనిని నాసదీయ సూక్తం అన్నారు. ఈ మంత్రానికి అర్ధం ఏమిటో ప్రయత్నించి చూద్దాం.

1. సృష్ట్యాదిలో ఉనికి అనేది లేదు, ఉనికి లేకపోవటం అనేది లేదు ('నసదాసీన్నో సదాసీత్ తదానీం').

2. మృత్యువు లేదు, అమరత్వం లేదు, నామరూపాలు లేవు, రాత్రింబవళ్లు లేవు ('న మృత్యురాసీదమృతం న తర్హి న రాత్ర్యా')


3. అంతా చీకటితో ఆవృతమైన చిట్టచీకటి ('తమ ఆసీత్ తమసా గుళమగ్రే')

4. ఆ ఆదిలో కోరిక జనించింది . అది ఉనికికి, ఉనికి లేకపోవటానికి మధ్య ఉన్న తెరని ఛేదించింది ('కామస్తదగ్రే సమవర్తతాధి మనసోరేత')

5. బీజం అలా నాటటంతో మహా శక్తులు నాలుగు దిశలలో ఉద్భవించేయి ('రేతోధ ఆసన్ మహిమాన ఆసన్ త్స్వధ')

6. ఈ సృష్టి ఎలా జరిగిందో ఎవరు చెప్పగలరు? ('కో అద్ధ వేద క ఇహ ప్రవోచత్| కుత అజాతా కుత ఇయాం విసృష్టిః')

7. ఆ సృష్టికర్తకే తెలియాలి. వాడికి క
డా తెలియదేమో ('యో అస్యాధ్యక్షః పరమే వ్యోమన్ | త్సో అఙ్గ వేద యది వా న వేద')

ఈ ఏడు శ్లోకాలలో ఉన్న సారాంశాన్ని మన భాషలో చెప్పటానికి ప్రయత్నిస్తాను.

1. ఆదిలో మనకి అవగతమయే విశ్వం లేదు. (శ్లో. 1)
2. అంతరిక్షం లేదు. అంతరిక్షానికి అవతల ఏమీ లేదు. కాని ఏదీ లేదనటానికి వీలు లేదు (అంటే, ఏదో ఉందనే భావం).

(శ్లో. 2., non-existence was not there, , శ్లో. 1)
3. ఆ ఉన్నదేదో అనంతమైన సాంద్రత కలిగి ఉంది (“గహనం గభీరం”, శ్లో. 1).
4. “ఇది” తప్ప మరింకేమీ లేదు (శ్లో. 2).
5. అవగాహనకి అందని ఆ “ఇది” మన అవగాహనకి అందని విధంగా దాగి ఉంది. (శ్లో. 3)
6. ఆ “ఇది” ఏమైతేనేమి, అది నామరూపాలు లేని శూన్యం (శూన్యం కూడ పూర్తిగా “శూన్యం” కాదని గుళిక శాస్త్రం చెబుతోంది కదా!) (శ్లో. 3)
7. తాపం వల్ల దానికి అస్తిత్వం సిద్ధించింది. (శ్లో. 3)
8. ఇచ్ఛ వల్ల విశ్వం వికసించింది. (వికసించి, వ్యాప్తి చెందింది. ) (శ్లో. 4)
9. దేవగణాలకి కూడ ఈ ప్రాదుర్భావం తరువాతే అస్తిత్వం సిద్ధించింది. (శ్లో. 6)
10. ఈ సృష్టికి కారణభూతమైన కారణం ఉందో లేదో తెలియదు. (శ్లో. 7)
11. ఈ సృష్టికార్యం అనే ప్రహేళికకి పరిష్కారం ఉందో, లేదో! (శ్లో. 6, 7)


ఇన్ని విషయాలు చెప్పిన మహర్షి (ప్రజాపతి పరమేష్ఠి), చివరికి మన ప్రశ్నలకి సమాధానం చెప్పనే లేదు!

బ్రహ్మసత్యం (Ultimate Reality) యొక్క స్వభావ స్వరూపాలు భాషతో వర్ణింఛటం చాల కష్టం. 'దాని'ది ద్వంద్వ స్వభావం. ఈ ద్వంద స్వభావాన్ని పరిపరి విధాలుగా వర్ణించటానికి ప్రయత్నించేరు మనవాళ్లు. ఉదాహరణకి ఈ నాసదీయ సూక్తం యొక్క సారాంశమే గీత (2.16) లో ఇలా కనిపిస్తుంది:

నాసతో విద్యతే భావో, నభావో విద్యతే సతః
ఉభయోరపిదృష్టోంతః త్వనయోస్తత్త్వదర్శిభిః


ఆత్మ యొక్క నిజ స్వరూపం పై వివేచన జరుగుతున్న సందర్భంలో చెప్పబడ్డ ఈ శ్లోకానికి ఈ విధంగా భాష్యం చెప్పవచ్చు: 'లేని వస్తువునకు ఉనికి లేదు. ఉన్న వస్తువునకు లేకుండా పోదు. ఆత్మ సత్ అనియు, అనాత్మ యగు దేహము అసత్ అనియు తత్త్వవేత్తలు మాత్రమే గ్రహింతురు.' సదసద్ వస్తువులకు (అంటే సత్, అసత్ లకు) మధ్య గల తారతమ్యం తత్త్వజ్ఞులు మాత్రమే గుర్తించగలరు అని కృష్ణుడు బోధిస్తున్నాడు. సత్, అసత్; ఆత్మ, అనాత్మ; నిత్యం, అనిత్యం; సత్యం, అసత్యం అనే ద్వందభావాల మధ్య ఉండే అంతరం బహు సూక్ష్మం అగుటచే అవి జనసామాన్యమునకు పరోక్షముగానే భాసించుచున్నవి తప్ప ప్రత్యక్షముగా కానరాకున్నవి.

నాసదీయ సూక్తం లోని చిట్టచివరి శ్లోకం వంటిదే గీతలో మరొక శ్లోకం (2.29) ఉంది. అవలోకించండి:

ఆశ్చర్యవ త్పశ్యతి కశ్చి దేనం | ఆశ్చర్యవత్ ద్వదది తథైవ చాన్యః
ఆశ్చర్యవ చ్చైవ మన్యః శృణోతి | శ్రుత్వా స్యేనం వేదన న చైవ కస్చ్త్

ఆత్మ, దేహముల (సత్, అసత్) పరస్పర సంబంధమును గూర్చి వింతతో చూతురు, వింతగా పలుకుదురు, ఆశ్చర్యముతో విందురు. దీనిని గూర్చి కన్నను, వినన్ను, పలికినను గూడ దీనిని నిజముగా నెరిగినవాడు ఒక్కడును లేడు.

ఈ ప్రయత్నంలోని సారాన్ని పోతనామాత్యుడు తెలుగులోకి ఎంత గంభీరంగా దింపేడో చూడండి:

కలడందురు దీనులయెడ
కలడందురు పరమయోగి గణముల పాలన్
కలడందురన్ని దిశలను
కలడు కలండనెడువాడు కలడో లేడో


ఈ మాటలు గజేంద్రుడి నోటి వెంట వచ్చినా, ఈ భావం మహర్షి మెదడులో మెదలిన స్పూర్తి. ఇదే భావం తో నాసదీయసూక్తాన్ని ప్రారంభిస్తాడు మహర్షి: 'న అసత్ ఆసీత్ నొ సత్ ఆసీత్ తదామ'. దీనిని ఇంగ్లీషులో 'ఎట్ ఫస్ట్ దేర్ వజ్ నో బీయింగ్ నార్ నాన్ బీయింగ్' అన్నారు.

కృతజ్ఞత: ఈ వ్యాసం రాయటానికి సహాయం చేసిన మిత్రుడు శ్రీ హరి కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు.

  సమాప్తం

 

 

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech