సుజనరంజని /  శీర్షికలు   /  ఎందరో మహానుభావులు

ఎందరో మహానుభావులు

రస జగత్తును ‘ఊయల’ ఊపిన గరికపర్తి కోటయ్య దేవర

                - తనికెళ్ళ భరణి

 

1864 ప్రాంతాల్లో
బందర్లో పెద్ద ఉప్పెనొచ్చింది..
తాడెత్తు సముద్రపు అలలు విలయతాండవం చేస్తోంటే
పెద్దపెద్ద చెట్లు పెళపెళ విరిగి పడిపోవడం...
పంట పొలాలు నాశనం అయిపోవడం
పెంకుటిళ్ళు కూలిపోయాయ్.
గుడిసెలు.. నీళ్ళలో తేలిపోయాయ్.
పశువులు కొట్టుకు పోతున్నాయ్
మనుషులు కొట్టుకు పోతున్నారు
ప్రాణభీతి.. ప్రకృతి భీభత్సం..
ఆ ప్రవాహంలో తేల్తోన్న చెక్క ఉయ్యాల
అందులో ఓ పసిపిల్లాడు..
ఏడ్చీ ఏడ్చీ.. సొమ్మసిల్లిపోయాడు
ఉయ్యాల కొట్టుకు పోతోనే ఉంది. కొట్టుకు పోతోంది.. పోతోంది..
ఎదురుగుండా లోయ అందులో పడిందా..
ఇంక అంతే..
కానీ ఈ ఊయలవెళ్ళి ఓ కుంకుడు చెట్టుకు చిక్కుకుంది..
....’

ప్రకృతి శాంతించింది
ఉప్పెన తగ్గింది
ఉయ్యాల్లోని పిల్లాడు..మళ్ళీ ఏడ్చాడు
అప్పటిదాకా! ఊరంతా వెతుకుతున్న తల్లి. గుండెలుబాదుకుంటూ వచ్చి ఉయ్యాల్లోంచి పిల్లాణ్ణి తీసుకుని గుండెలకు హత్తుకునీ..
కోటి దేవుళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంది.
అలా బతికి బట్టకట్టిన పిల్లాడే..
గరికపర్తి కోటయ్య దేవర.

* * *
కోటయ్యకి ఐదారేళ్ళొచ్చాయ్
బళ్ళో వేసారు. కానీ చదవట్లేదు
కొబ్బరి చిప్పకి..తీగలు కట్టి
గుర్రపు వెంట్రుకలు కట్టి కమానుతో వాయించడం మొదలుపెట్టాడు..
అప్రయత్నంగానే అద్భుతమైన నాదం పుట్టింది.
పిల్లనగోవి మీద పెదవి ఆన్చి... జగత్తుని మత్తులో ముంచేసిన మురళీమోహనుడి అంశ ఉన్నట్లు..
కోటయ్య.. కొబ్బరి చిప్ప వాయిద్యం మీద కోటి రాగాలు పలికేవి..
గురువులేదు..
విద్య తెలీదు..
అయినా విన్నవారంతా మంత్రముగ్ధులైపోతున్నారు.
ఇందుకేనేమో..ఆనాడు ఊయల వెళ్ళి కుంకుడు చెట్టుకి చిక్కుకుంది.
స్వతహాగా జంగమ వారవడం
తండ్రి లక్ష్మయ్యకు అంతో ఇంతో సంగీతం రావడంతో కొడుకు కోటయ్యకి సరళీస్వరాలు నేర్పాడు లక్ష్మయ్య.
ఇక చూస్కోండి.
సరళీ స్వరాలు కొబ్బరి చిప్ప మీదే
జంట స్వరాలు కొబ్బరి చిప్ప మేదే
కీర్తనలూ కొబ్బరి చిప్పమీదే
సంగీత సరస్వతికి కొబ్బరి చిప్పలో నైవేద్యం పెట్టేశాడు.
విద్య రావాలి కానీ వాయిద్యం ఏమంటే పలకదు?

* * *
ఆ కాలంలోనే జీవనోపాధి కోసం కోటయ్య తల్లిదండ్రులు నైజాం (హైదరాబాదు) కొచ్చేసారు.
ఇప్పుడు కోటయ్య స్థాయి కొబ్బరి చిప్పనుంచీ వాయులీనం దాకా పెరిగింది.
హైదరాబాదు వచ్చిన కోటయ్య దేవరకి వాయిద్యంతో పాటు గానం కూడా వంట బట్టింది. రోజు అరుగు మీద కుర్చునీ అద్భుతంగా వాయిస్తూ ఉండేవాడు.
ఒక రోజు
హైదరాబాద్ సంస్థానం మంత్రి సాలార్ జంగ్ బహద్దర్ వ్యాహ్యాళికెళ్తూ ఈ కుర్రాడి వాద్యం వినీ ముచ్చటపడి పోయి కుర్రాడి భుజాలు తట్టి తనతో తీసుకెళ్ళి చిన్నన్న అనే గాయకుడికి అప్పజెప్పి సంగీతం నేర్పమన్నాడు.

అర్ధమౌతోందిగా.. ఉయ్యాలవెళ్ళీ కుంకుడు చెట్టుకి ఎందుకు చిక్కుకుందో..!

పదేళ్ళలో ఇటు హిందుస్తానీ.. అటు కర్ణాటక సంగీతాన్ని జుర్రేశాడు. ఈయన ప్రతిభని గుర్తించిన రాజగోపాలాచారి అనే జాగీర్ దారు.. నవాబ్ జఫర్ జంగ్ దేవిడీలో గాయకుడిగా నియమించాడు.
కొన్నేళ్ళకి కోటయ్య దేవర పేరు మారుమోగి పోయి..ఏకంగా హైదరాబాద్ సంస్థానంలోనే గవాయి (గాయకుడి)గా నియమితుడయ్యాడు.
ఎక్కడి గుడిసె, ఎక్కడి పేదరికం
ఎక్కడి కొబ్బరి చిప్ప వాయిద్యం ఎక్కడి హైదరాబాద్ సంస్థానంలో ఆస్థాన పదవి.
ఎక్కడి పూరిగుడెసె.. వేలి నడకా.. మట్టిబొచ్చె.. తరవాణీ!
ఎక్కడి బంగళా.. గుర్రబగ్గీ.. వెండికంచం... బిర్యానీ..!!

ఉయ్యాలవెళ్ళీ కుంకుడు చెట్టుకి ఎందుకు చిక్కుకుందనుకున్నారు..!
తన ఎదుగుదలకి కారణభూతుడైన రాజగోపాలాచారి మీద ఒక వర్ణం రాసి భక్తిని ప్రకటించుకున్నాడు కోటయ్య దేవర.
ఆ తర్వాత 1894 లో దక్షిణాది పర్యటన.
సియాళ నారాయణస్వామి అయ్యర్
తిరుక్కోడి కావై కృష్ణయ్యర్ తో కలసి తంజావూర్ సంస్థానానికి వెళ్ళి కచేరీ చేస్తే..
మహమ్మదీయుడి వేషంలో ఉన్న వ్యక్తి ఇంత చక్కటి కర్ణాటక సంగీతం ఎలా పాడుతున్నాడని రాజా వారి ఆశ్చర్యం.
తర్వాత ఇది నైజాం సర్కార్ ఆస్థానపు వేషమే గానీ మరోటి కాదని ఆయన చెప్పడం.
తంజావూర్ ఆస్థాన విద్వాంసుడిగా ఉండమని రాజావారు కోరడం
దేవర సున్నితంగా తిరస్కరించడం...రాజా వారు కోటయ్య దేవరను ఘనంగా సన్మానం చెయ్యడం.
1869 వరకు దక్షిణాదిన పర్యటించిన కోటయ్య దేవర చివరి దశలో బందరు వచ్చేసి అక్కడ ఒక సంగీత పాఠశాలను ఏర్పాటు చేసి తను సంపాదించిన డబ్బుతో అనేక మంది విద్యార్ధులకు ఉచితంగా భోజనం పెట్టి మరీ సంగీతం నేర్పించాడు.
కోటయ్య గురించి చెప్పుకోవాలంటే మరో విశేషం ఉంది.
ఒకసారి వల్లూరి సంస్థానంలో ఒక సంగీత కచేరి జరిగింది.
ఆ సభలో ఆర్గాను వాయించిందెవరో తెల్సా
కోటయ్య దేవర పెంపుడు కుక్కలు
కోటయ్య దేవర తన పెంపుడు కుక్కలకి ఆర్గాన్ తొక్కడం
అలవాటు చేసీ ఆ రోజు సభను రంజింప చేయగలిగాడు
అందుకే అంటారు పశుర్వేత్తి శిశుర్వేత్తి అని

శిశుర్వేత్తి అనగాను నాకు మళ్ళీ బందరు ఉప్పెన..
ఆ ప్రళయం. అందులో ఊయల.. ఆ ఊయల్లో వటపత్రశాయిలా కోటయ్య దేవర..
కుంకుడు చెట్టు గుర్తుకొస్తున్నాయి
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా.

 
     

మీ అభిప్రాయాలు, సలహాలు మాకెంతో అవసరం. దయచేసి మీ అభిప్రాయం ఈ క్రింది పెట్టెలో తెలపండి. (Please leave your opinion here)

పేరు
ఇమెయిల్
ప్రదేశం 
సందేశం
 

గమనిక: మీ విద్యుల్లేఖా చిరునామా ఎవరితోనూ పంచుకోము; అనవసర టపాలతో మిమ్మలను వేధించము. 
   మీ అభిప్రాయాలను క్లుప్తంగానూ, సందర్భోచితంగానూ తెలుపవలసినది.
(Note: Emails will not be shared to outsiders or used for any unsolicited purposes. Please keep comments relevant.)


Copyright ® 2001-2009 SiliconAndhra. All Rights Reserved.
            సర్వ హక్కులూ సిలికానాంధ్ర సంస్థకు మరియు ఆయా రచయితలకు మాత్రమే.      Site Design: Krishna, Hyd, Agnatech