వీరతాళ్ళు వేస్తాం, వస్తారా?! - 7

--వేమూరి వేంకటేశ్వరరావు

ముందుమాట: తెలుగులో రాయటమన్నా, మాట్లాడటమన్నా చాల కష్టం అనే భావం మనలో చాలమందిలో ఉంది. అందుకనే ఎందుకొచ్చిన గొడవనీ, తేలిగ్గా ఉంటుందనీ శుభ్రంగా ఇంగ్లీషులో మాట్లేడేసుకుంటాం. ఏ భాషైనా సరే వాడుతూన్నకొద్దీ వాడిగా తయారవుతుంది; వాడకపోతే వాడిపోతుంది. కనుక మన భాష కుంటుతూనో, మెక్కుతూనో మాట్లాడుతూ ఉంటే వాడితేరి వాడుకలోకి వస్తుంది. ఇంగ్లీషులో ఉన్నంత పదజాలం తెలుగులో లేదు. ఇంగ్లీషులో వాడుకలో ఉన్న మాటలు దరిదాపు 50,000 ఉంటాయని అంచనా. ఇదే రకం అంచనా వేస్తే తెలుగులో వాడుకలో ఉన్న మాటలు ఓ 15,000 ఉంటాయేమో. మన భాష పెరగటం మానేసింది. మన భాష విస్తృతిని పెంచాలంటే వాడుకని పెంచాలి. వాడుక పెరగాలంటే క్లిష్టమైన భావాలని, సరికొత్త విషయాలని తెలుగులో వ్యక్తపరచటానికి సదుపాయంగా మన పదజాలం పెరగాలి. మన సంప్రదాయాలకి, మన వ్యాకరణానికి అనుకూలపడేలా ఈ పదజాలాన్ని సమకూర్చుకోవాలి. ఈ పని మనమే ప్రయోగాత్మకంగా చేసి చూడాలి. మాయాబజారు సినిమాలో చెప్పినట్లు మాటలు మనం పుట్టించకపోతే మరెక్కడనుండి పుట్టుకొస్తాయి?

ఒక భావానికి సరిపడే మాట సృష్టించే బధ్యత మనదే. తెలుగులో ఆధునిక అవసరాలకి పనికివచ్చే కొత్త మాటలు సృష్టించి వాటిని వాక్యాలలో ప్రయోగించి చూస్తే ఎలాగుంటుందో చూడాలని ఒక కోరిక పుట్టింది. ఈ ప్రయోగంలో పాఠకులని కూడా పాల్గొనమని ఇదే మా ఆహ్వానం. ప్రతినెలా మేము ఐదో-పదో మాటలు తయారు చేసి వాటి ప్రవర, పుట్టుపూర్వోత్తరాలు కొంతవరకు చెప్పి, అవసరం వెంబడి వాటి వాడకం ఎలాగో మీకు సోదాహరణంగా చూపిస్తూ ఉంటాము. ఆ తరువాత కొన్ని ఇంగ్లీషు మాటలు ఇచ్చి వాటితో సరితూగగల తెలుగు మాటలని ప్రతిపాదించమని పాఠకులని ఆహ్వానిస్తూ ఉంటాం. మేమడిగిన మాటలని తెలుగులో ఏమంటే బాగుంటుందో మీరు సూచించాలి. మీ సూచనని బలపరచటానికి ఆ తెలుగు మాటని ఒక వాక్యంలో ప్రయోగించి చూపండి. మా స్వకపోల కల్పితాలైన మాటలతో పాటు పాఠకులు సూచించిన వాటిలో కొన్ని ఎంపిక చేసి ప్రచురిస్తూ ఉంటాము. ఈ దిగువ చూపిన విధం మీకు నచ్చితే దాన్ని ఒక మూసగా తీసుకుని మీరూ ప్రయత్నించి చూడండి. లేదా కొత్త పంధాని సూచించండి. పాఠకులు పంపిన అంశాలని ప్రచురణ సౌకర్యానికి సవరించే హక్కు మాకు ఉంది. ఇదొక ‘విక్కీ’ నిఘంటువుని తయారుచేసే ప్రయత్నంలా ఊహించుకొండి. విక్కీ విజ్ఞానసర్వస్వంలో అందరూ పాల్గొన్నట్లే ఇదీను.

వీరతాళ్ళు- 8 ఈ శీర్షిక మొదలుపెట్టమని అడిగినది వంశీ ప్రఖ్య. మొదలుపెట్టి, కొన్నాళ్ళు నడిపి చూసేం. స్పందించినవారు ఎంతో ఉత్సాహంగానే స్పందించేరు. వీరందరికీ మా ధన్యవాదాలు. ఈ శీర్షిక ఇంతటితో ముగించెయ్యటానికి నిశ్చయించుకున్నాం. ఇది ముగించే లోగా బకాయిపడ్డ మాటలకి తెలుగు మాటలు సూచించి మరీ ముగిస్తాం!

Oven తెలుగు దేశంలో వంటలకీ, వార్పులకీ oven వాడుక చాలా తక్కువ. ఇటికలు కాల్చటానికి వాడే దానిని kiln అంటాం కదా. బన్ రోట్టెని oven లో పెట్టి కాలుస్తారు. ఈ రొట్టె ని బజారులో కొనుక్కోవటం తప్ప ఇళ్ళల్లో కాల్చటం నేను ఎరగను. కనుక ఇళ్ళల్లో ఎక్కడా oven చూడలేదు. తేగలని తంపట పెట్టి ఉడికిస్తారు. కాని ఈ తంపట పెట్టటం, oven లో పెట్టి కాల్చటం ఒకటి కాదని నా అభిప్రాయం. కనుక oven అన్న మాటకి ‘ఆవం’ తప్ప మరొక మాట లేదనే అనుకున్నాను. కాని ఈ మధ్య ఒక నిఘంటువులో oven కి ‘ముర్మురం’ అనే అర్ధం చూసేను, తటాలున నాకు ఆ మాట నచ్చింది. ఎందుకంటారా? ముర్మురం లో తయారయినవి కనుక మురమురాలకి ఆ పేరు వచ్చింది. లేదా మురమురాలని తయారు చేసే ‘కుంపటి’ కి ముర్మురం అనే పేరు వచ్చింది. కనుక వంటలలో వాడే oven ని ముర్మురం అందాం.

Clown ఈ మాటకి మంచి తెలుగు మాట ఉండే ఉంటుంది. విదూషకుడు clown కాదు. గంధోలీగాడు అనే మాట ఉంది కాని ‘గాడు’ అమర్యాద సూచకంగా ఉంది. మూడొంతులు గంధోలీ అంటే సరిపోతుందేమో!

Filter ఈ మాటకి తెలుగులో వడపోత అనే అర్ధం ఉంది. వడపోత కాగితం అంటే filter paper. వడపోసే సాధనానికి వడపోతగుడ్డ అని పేరుంది. తెలుగులో ‘గాలించటం’ అనే మరొక మాట కూడ ఉంది. అందులోంచి పుట్టిన ‘గలని’ అనే మాటని సైన్సు పుస్తకాలలో filter అనే సాధనాని కి వాడుతున్నారు. కాని ‘గలని’ filter అనే మాటకి సరితూగే మాట కాదని నా అభిప్రాయం. పప్పులని నీళ్ళల్లో పోసి, గాలించి, రాయీ, రప్పా వేరు చేస్తాం. కనుక ‘గాలించటం’ అనేది wet sifting, జల్లించటం dry sifting. కనుక నిజానికి గాలించటం లోంచి పుట్టిన గలని అంటే filter అనే అర్ధం స్పురించటం లేదు. అయినా వాడుకలో ఉంది కనుక గలని అని వాడితే మరేమీ తప్పు లేదు.

Vocabulary, Glossary, etc. ఒక భాషలోని పద సంపత్తిని పదజాలం లేదా vocabulary అంటారు. సాధారణంగా ఒక పుస్తకంలో వచ్చే కఠిన పదజాలానికి ఇచ్చే అర్ధకోశాన్ని glossary అనీ, పదార్ధకోశం అనీ అంటారు.

Valency ఈ మాట రసాయనశాస్త్రంలో వస్తుంది. ఒక అణువు మరొక అణువుతో సంయోగం చెందటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో తెలియజెప్పేది valency. నేను రాసిన రసగంధాయరసాయనం పుస్తకంలో దీన్ని ‘బాహుబలం’ లేదా ‘బాలం’ అని తెలిగించేను. దీన్ని బాహుబలం అని ఎందుకు అన్నానో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటే ఈ విధంగా ఆలోచించి చూడండి. మానవుల బాహుబలం = 2, విష్ణుమూర్తి బాహుబలం = 4, కుమారస్వామి బాహుబలం = 6. రావణుడి బాహుబలం రెండు కాని, ఇరవై కాని అయి ఉండాలి! (రావణుడికి పది తలకాయలు ఉన్నాయని చెప్పేరు కాని ఎక్కడా ఇరవై చేతులు ఉన్నాయని ఎవ్వరూ చెప్పలేదు!)

Formaldehyde ‘బయాలజీ లేబు’ కి కాని ‘ఎనాటమీ లేబు’ కి కాని వెళితే అక్కడ వేసే వాసన ఈ formaldehyde దే! Formica అంటే చీమ అనీ, దాన్ని సంస్కృతంలో పిపీలికం అంటారనీ గతంలో చెప్పేను. కనుక చీమకీ, దీనికీ ఎక్కడో బాదరాయణ సంబంధం ఉండి ఉండాలని మీకు అనిపించటం లేదూ? Aldehyde అనేది ఒక కర్బన రసాయనం (organic chemical). ఈ aldehyde అనే మాట ఎలా వచ్చిందో ముందు చెబుతాను. కొంచెం ఓపిగ్గా చదవండి. ఒక మెతల్ ఆల్కహాలు బణువులో ఒక కర్బనం, ఒక ఆమ్లజని, నాలుగు ఉదజని అణువులు ఉంటాయి. ఈ నాలుగింటిలో రెండింటిని తీసివెయ్యగా మిగిలినదే ఫార్మాల్డిహైడు. ఇలా ఉదజని అణువులని తీసివేసే పద్ధతిని ఇంగ్లీషులో ‘డీహైడ్రాజినేషన్’ (dehydrogenation) అంటారు. ఆల్కహాలు నుండి రెండు ఉదజని అణువులని తీసివేశాము కనుక మిగిలినదానిని ‘డీహైడ్రాజినేటెడ్ ఆల్కహాలు’ (dehydrogenated alcohol) అనటం సబబే కదా! లేదా alcohol dehydrogenated అని కూడా అనొచ్చు. ఈ పద బంధం లోని మొదటి మాట alcohol లోని al, నీ రెండవ మాట dehydrogenated లోని మొదటి భాగం dehyd నీ తీసుకుని సంధిస్తే aldehyd వచ్చింది కదా. దీని చివర e చేర్చగా మనకి aldehyde తయారయింది. అదండీ aldehyde పూర్వ గాధ. ఇందులో చీమ ఎక్కడ నుండి వచ్చిందో ఇప్పుడు చూద్దాం.

రసాయనశాస్త్రంలో ఒక కర్బనపు అణువు, రెండు ఆమ్లజని అణువులు, ఒక ఉదజని అణువు ఉన్న గుంపుని కార్బాక్సిల్ గుంపు అంటారు. (ఇది అర్ధం కాకపోతే మాత్ర మింగినట్లు మింగెయ్యండి.) ఇటువంటి గుంపులకి ఒక ‘ఖాళీ చెయ్యి’ ఉంటుంది. ఆ ఖాళీ చేతికి మరొక ఉదజని అణువుని తగిలిస్తే మనకి ఫార్మిక్ ఏసిడ్ లేదా పిపీలికామ్లం వస్తుంది. ఈ పిపీలికామ్లంలో ఉన్న ఆమ్లజని-ఉదజని జంటని పైకి పీకేసి ఆ స్థానంలో ఒకే ఒక ఉదజని అణువిని ప్రతిక్షేపిస్తే వచ్చేది ఫార్మాల్డిహైడు లేదా పిపీలిక ఆల్డిహైడు లేదా పిపీలికాలంతం. ఇదెలాగంటారా? నీతిచంద్రిక కథలలా ఆ పిట్ట కథా చెబుతాను.

ముందస్తుగా, పూర్వపు రోజుల్లో, రసాయన శాస్త్రంలో తారస పడే పదార్ధాలకి ఎవరికి తోచిన పేరు వారు పెట్టేసే వారు. అంతా గందరగోళంగా ఉండేది. అప్పుడు పెద్దలు కొందరు జినీవాలో సమావేశమై ఒక ఒప్పందానికి వచ్చేరు. ఈ ఒప్పందం ఏమిటంటే ప్రతి alcohol పేరూ ఓల్ (-ol) శబ్దం తోటీ, ప్రతీ aldehyde పేరు ఆల్ (-al) శబ్దం తోటీ అంతం అయేటట్టు చూడమన్నారు. అప్పుడు పేరు వినగానే ఈ రసాయనం యొక్క కులగోత్రాలు మనకి తెలిసిపోతాయన్న మాట. ఈ నియమానికి అంతా ఒప్పుకున్నారు. ఫార్మాల్డిహైడు కి methane తల్లి వంటిది కనుక formaldehyde పేరు మార్చేసి methanal అనమన్నారు. కాని వాడుకలో formaldehyde అనే అంటున్నాం; అలవాటులు తప్పించటం కష్టం! ఇదే పద్ధతిలో మెతల్ ఆల్కహాలు ని methanol అనమన్నారు. చూశారా! Methanal -al శబ్దంతోటీ, methanol -ol శబ్దం తోటీ అంతం అవుతున్నాయి. ఉచ్చరించవలసి వచ్చినప్పుడు వీటిని మెతనాలు, మెతనోలు అని ఉచ్చారణ దోషం లేకుండా అనాలి. ఈ ఉచ్చారణ నియమాలని పాటిస్తూ, ఇంగ్లీషులో -al శబ్దంతో అయేవాటిని అలంతాలు అనీ, -ol శబ్దంతో అంతం అయేవాటిని ఒలంతాలు అనీ అందాం. ఏమంటారు? కనుక aldehyde లు అలంతాలు అవుతాయి. Alcohol ఒలంతం అవుతుంది. (తెలుగులో మాటలు అచ్చులతో అంతం అవుతాయి కనుక తెలుగుని అజంతం అనలేదూ, అలాగే అనుకొండి!)

Methane, Ethane, etc. ఇవి కర్బన రసాయన శాస్త్రంలో ఒక జాతి పదార్ధాలు. ఈ జాతి లక్షణం ఏమిటంటే ఈ జాతి బణువులన్నిటిలోనూ కర్బనపు అణువులు, ఉదజని అణువులు మాత్రమే ఉంటాయి. ఒకే ఒక కర్బనపు అణువు విష్ణుమూర్తిలా నాలుగు చేతులతో ఉంటే, ఒకొక్క చేతిని ఒకొక్క ఉదజని అణువు పట్టుకుని ఉన్న సందర్భంలో ఆ పదార్ధం పేరు మెతేను (methane). ఇద్దరు విష్ణువులు ఒకరినొకరు ఒకొక్క చేత్తో పట్టుకుని ఉంటే వారికి ఉమ్మడిగా ఆరు ఖాళీ చేతులు ఉంటాయి కదా. అదే విధంగా రెండు కర్బనపు అణువులు ఒకదానిని ఒకటి పట్టుకుని, మిగిలిన ఆరు ఖాళీ చేతులతో ఆరు ఉదజని అణువులని పట్టుకున్న సందర్భంలో మనకి వచ్చేది ఎతేను (ethane). ఇదే పద్ధతిలో మూడు కర్బనపు అణువులు, ఎనిమిది ఉదజని అణువులు ఉన్నప్పుడు దానిని propane అనీ, ఆ తరువాత వరుస క్రమంలో వచ్చేదానిని butane అనీ అంటారు. వెనకటికి ఒహడు పుచ్చ పాదులా పిల్లల్ని కనెస్తూ ఉంటే పేర్లు వెతుక్కోలేక కేశవ నామాలు అందుకున్నాట్ట. అలా, ఈ రసాయనాలు అంతు లేకుండా పుట్టుకొస్తూ ఉంటే కొత్త కొత్త పేర్లు పెట్టటం చేత కాక, ఈ వరసలో అయిదో దానిని pentane అనీ, ఆరవ దానిని hexane అనీ, ఆ తరువాత heptane, octane, అలా పేర్లు పెట్టటం మొదలెట్టేరు. ఈ పద్ధతిలో బ్యుటేన్ ని quartane అనీ, ప్రొపేన్ ని triane అనీ, ఎతేన్ ని diane అనీ అనాలి. కాని అలవాటు పడ్డ ప్రాణాలకి అది కష్టం అయిపోయింది. అనలేదు. ఇప్పుడు మనకి కొన్ని పాత పేర్లు, కొన్ని కొత్త పేర్లూ మిగిలేయి. ఈ కథంతా ఈ మధ్యనే – పద్ధెనిమిదో శతాబ్దం మధలో జరిగింది.

ఇప్పుడు ఒక ఉహా ప్రపంచం లోకి వెళదాం. మన వేమన యోగి పదహారో శతాబ్దం వాడనుకుంటాను. ఆయనా రసాయనాల మీద పరిశోధనలు చేసేడు. సరదాకి ఆ రోజుల్లో ఈ మెతేన్, ఎతేన్, ప్రొపేన్, బ్యుటేన్, పెంటేన్, .. మొదలైన వాటిని మన వేమనే కనుక్కున్నాడనుకుందాం. అప్పుడు ఆయన వీటికి ఏ పేర్లు పెట్టి ఉండేవాడంటారు? మూడొంతులు, పాడేను, విదేను, తదేను, చతుర్ధేను, పంచేను, షష్టేను, సప్తేను, అష్టేను, నవేను, దశేను, ఏకాదశేను,.. అలా పేర్లు పెట్టి ఉండేవాడు. అప్పుడు చచ్చినట్లు ప్రపంచం అంతా మన దేశపు పేర్లని వాడి ఉండేవారు. అప్పుడు మనం తెలుగు పేర్లు వాడటానికి చిన్నతనం పడిపోయి, ఏ సిరా బుడ్డిలోనో బుర్ర పెట్టేసి చచ్చిపోయి ఉండేవాళ్ళం కాదు!

ఇంతటితో ఈ శీర్షిక సమాప్తం!