మరో ఉమ్రావ్ జాన్ కాకుండా...

-- గంటి భానుమతి


కారుని స్కూల్ గేట్లోకి పోనిస్తూంటే ఆ ఏడుపు వినపడింది. వేగం బాగా తగ్గించి కిటికిలోంచి బయటకి చూసాను. కురుస్తున్న వర్షంలో పూర్తిగా తడిసి పోయిన యూనిఫారంలో ఉన్న ఓ నాలుగైదు యేళ్ళ అమ్మాయి ఏడుపు అది. కారు పక్కగా ఆపి, కాలువలుగా పారుతున్న వర్షపు నీళ్ళల్లో, కాళ్ళని ఎత్తి, ఎత్తి, బలంగా నొక్కిపెడుతూ ఆమె దగ్గరకు వెళ్ళాను. నెత్తి మీద ప్లాస్టిక్ సంచుల్ని పెట్టుకున్న ఇద్దరాడవాళ్ళు ఆ పాపని ఏదేదో అడుగురున్నారు. అన్నింటికీ ఆమెది ఒకటే సమాధానం - ఏడుపు.

వీపుకి ఉన్న ఆమె బ్యాగ్ తీసాను. అతి జాగ్రత్తగా వర్షపునీళ్ళు లోపలికి పోకుండా, కొంచెం తెరిచి చూసాను బ్యాగుని. పలక, అందంగా మడత పెట్టిన రైన్ కోటుంది. పలకని పైకి తీసి చూసాను. ఓ వైపు శ్రీ రామ, మరో వైపు ఓం నమశ్శివాయ అని రాసి ఉంది. ఆ రెండూ కాకుండా ఆమె గురించిన వివరాలు ఇవ్వలేక పోయాయి.

బ్యాగుని మూసి, ఆ పాపకిచ్చి, నాతో పాటు స్కూలుకి తీసుకొచ్చాను. ప్రేయర్ అయిపోయింది. పిల్లలు ఎవరి క్లాసుకి వారు వెళ్ళిపోయారు. స్కూల్ ఆవరణ, క్లాసులు అన్నీ కూడా చాలా నిశ్శబ్దంగా ఉన్నాయి.

కారుని ఓ వైపుగా ఉన్న షెడ్లో పెట్టి, ఆ పాపని తిన్నగా ప్రిన్సిపల్ రూం లోకి తీసుకెళ్ళాను. ఆవిడకి విషయం అంతా చెపితే పొగిడింది. ఆయాని పిలిచాను. పాపను చూపించి సంగతంతా చెప్పి, ఆమె వేసుకున్న లాంటి స్కూల్ యూనిఫాం ఏ స్కూలుదై ఉంటుందో కనుక్కోమన్నాను.

ఓ గంట తర్వాత ఆయా తిరిగి వచింది. అలాంటి యూనిఫాం ఉన్న స్కూల్ అక్కడలేదని చెప్పింది.

ప్రీ ప్రైమరీ క్లాసుకి తీసుకెళ్ళాను. అక్కడున్న ఆయాని పిలిచి పాపకి సరిపోయే గౌను ఏదైనా ఉంటే తెమ్మన్నాను.

ఈ సంగతి టీచర్లకు తెలిసి, ఫస్ట్ పీరియడ్ అయ్యాకా ఒక్కొక్కళ్ళు రావడం, పాపని పేరు అడగడం లాంటి ప్రశ్నలు వేయటం మొదలుపెట్టారు. అయోమయంగా చూస్తూ ఏడుస్తోంది కానీ ఏం చెప్పలేదు. ఆమె తల తుడిచి, మొహం తుడిచి, ఆయా తెచ్చిన గౌను వేసాను. ఆమె ఏడుపు ఆపడానికి చేతిలో ఏదో ఒక వస్తువు ఇచ్చినా, ఓ అయిదు నిముషాలు ఏడుపు ఆపినా, తిరిగి ఏడుపు మొదలుపెట్టింది.

దగర్లో పోలీస్ స్టేషన్ కి మేడంతో ఫోన్ చేయించాను.

"కావ్యా - తప్పిపోయిన అమ్మాయిని గూర్చిన కంప్లైంట్ ఒకటి వచ్చిందని కానిస్టేబుల్ అన్నాడు"

"గుర్తులు, పాప యూనిఫాం రంగు అదీ, ఇంకా ఏదైనా ఆనవాలు ఇచ్చారా అని కనుక్కోండి మేడం" అని అన్నాను. ఆవిడ మళ్ళీ ఫోన్ చేసి కనుక్కున్నారు.

"ఏమీ లేదుట, ఓ నాలుగున్నర ఏళ్ళ అమ్మాయి తప్పిపోయిందని మాత్రం ఇచ్చారట.

"మేడం, నేను పాపని తీసుకొని పోలీస్ స్టేషన్ కెళ్తాను. మరి, నా క్లాసులు ...." అంటూ ఆగిపోయాను.

"నువ్వెళ్ళు, ఏ లైబ్రరీ రూంలోకో, స్పోర్ట్స్ కో పంపించి నీ క్లాసులు అన్నీ మేం మేనేజ్ చేస్తాము." అంటూ నాకు పాపని తీసుకొని పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది.

రెండు వీధులు తిరిగి, ఓ ముగ్గుర్ని అడిగి, పోలీస్ స్టేషన్ కెళ్ళాను పాపని తీసుకుని. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళెవరూ లేరు. అడ్రస్ మాత్రం ఇచ్చారుట.

"పర్వాలేదు, అడ్రస్ ఇవ్వండి" అని అడ్రస్ రాసుకునాను. కానీ అదెలా కనుక్కుంటూ వెళ్ళాలో, అసలు హైదెరాబాద్ నగరంలో ఎక్కడుందో తెలీలేదు. అదేమాట ఇన్స్పెక్టర్ తో అన్నాను.

"ఈ కానిస్టేబుల్ మీతో వస్తాడు" అంటూ ఓ కానిస్టేబుల్ని మాకు దారి చూపించడానికి ఇచ్చాడు.

హైదరాబాద్ కి ఒక మూల ఉన్నమేము, మరో మూలకి ఆ అడ్రస్ ప్రకారం కనుక్కోడానికి గంటపైనే పట్టింది. ఈ కానిస్టేబుల్ నాతో వచ్చాడు కాబట్టి, ఆ ప్రదేశానికి చేరాం, నేనయితే చచ్చినా కనుక్కోలేకపోయేదాన్ని.

చాలా వెనకబడ్డ ఏరియా అది. పదకొండు అవుతున్నా ఆడవాళ్ళు, మొగవాళ్ళు రోడ్ల మీద కబుర్లు చెప్పుకుంటూ, మొహాలు కడుక్కుంటూ టీలు తాగుతున్నారు.

నేనూ, పాప కార్లో ఉండిపోయాం. కానిస్టేబుల్ అడ్రెస్ తీసుకొని కారు దిగాడు, వాకబు చేయడానికి.

పాపని చూసాను. నీళ్ళు నిండిన కళ్ళతో బయటకి చూస్తోంది. అంత ముద్దుగా, నీట్ గా ఉన్న అమ్మాయి ఈ ఏరియాకి చెందిన అమ్మాయిగా ఊహించడానికి నా మనసు ఒప్పలేదు.

ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు, ఇద్దరు మొగవాళ్ళు కారు దగ్గరికొచ్చి, కిటికీలోంచి తొంగి చూసారు.

"ఆ మా పిల్లనే ... ఇచ్చేయండి" అన్నరు కిటికీని కొడ్తూ.

వాళ్ళని చూడగానే పాప ఇంకా గట్టిగా ఏడవడం మొదలెట్టింది. అంటే వాళ్ళెవరో పాపకి తెలీదన్న మాట.

కొంచెం వంగి కిటికీ గాజు తలుపు వేసాను. పాపనీచ్చేయమని ఇంకా గట్టిగా అరవడం మొదలెట్టారు. కానిస్టేబులున్నా దగ్గర కూడా ఇలాగే ఉంది స్థితి. అతని చుట్టూరా ఉన్న మనుషులు ఏదో గట్టిగా వాదిస్తునారు. ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి, కారు కిటికీ దగరున్న వాళ్ళని తోసేసి, గాజు కిటికీ మీద, అరచేత్తో కొడ్తూ పాపనిచ్చేయమని గొడవ చేయడం మొదలెట్టారు.

ఏం చెయాలో అర్ధం కాలేదు. కానిస్టేబుల్ పద్మ వ్యూహంలో అభిమన్యుడిలా ఉన్నాడు. అతను నడుస్తుంటే ఆ గుంపు కూడా నడుస్తోంది.పాపనిచ్చేయమని అడిగే తీరు, గూండాల్లాంటి పెద్ద పెద్ద మీసాల్తో మొగవాళ్ళు, అస్తవ్యస్తంగా ఉన్న వస్త్ర ధారణలో ఆడ వాళ్ళు. ఎంతో జుగుప్స కలిగింది. కొంచెం భయం కూడా వేసింది.

ఎలాగో ధైర్యం తెచ్చుకుని, ఏక్సీలెరేటర్ నొక్కి, ఎంత వేగంగా వెళ్ళగలనో, అంత వేగంగా అక్కణ్ణించి కారు తోలాను.

పోలీస్స్టేషన్ కెళ్ళి, ఆ ఇన్స్పెక్టర్ కి, జరిగిన విషయం అంతా చెప్పాను. ఆయన కూడా చాలా శ్రధ్ధగా విన్నారు.

అదే సమయంలో ఫోన్ మోగింది. ఆయన మాట్లాడి పెట్టేసాడు.

"శుభవార్త మేడం. ఈ పాప తలితండ్రులు దొరికినట్లే ఇంక ఈ పాపని వదలి, మీరు నిశ్చింతగా వెళ్ళిపోవచ్చు."

నాకు పోలీసు వాళ్ళ మీద పెద్ద నమ్మకం లేదు. ఎన్నో విన్నాను. ఎన్నో చదివాను. నాకు మాత్రం పెద్దపనేం వుంది? నా క్లాసులు మేడం మేనేజ్ చేస్తానంది కదా! ఆ తల్లితండ్రులని చూసాకే వెళ్ళాలని నిశ్చయించుకున్నాను.

"ఏం పర్వాలేదు. నాకు స్కూల్లో పనేం లేదు. పాప పేరెంట్స్ ని రానివ్వండి. వాళ్ళని చూసాకే వెళ్తాను" అని, అక్కడున్న పేపర్ తీసి చూడడం మొదలెట్టను.

కాస్సేపటికి, అతి దీనావస్తలో ఉన్న పాతికేళ్ళున్న ఓ ఆడ మొగ వచ్చారు. ఆమె ఏదో వెలిసిపోయిన పంజాబీ డ్రెస్ లో ఉంది. అతను ఓ జీన్స్ పాంటు, పసుపు రంగు టీ షర్ట్ లో ఉన్నాడు.

వీళ్ళు ఈ పాప తలితండ్రులా! పాపని, వాళ్ళనీ మార్చి, మార్చి చూస్తున్నాను. చాలా సేపు పోలికలు వెతుకుతూ చూస్తుండి పోయాను.

పాప వాళ్ళని గుర్తుపట్టినట్టుగా లేదు. కొత్తవాళ్ళని చూసినట్లుగానే చూస్తోంది. ఏడుస్తోనే ఉంది. ఆమె ముఖంలో ఏ విధమైన మార్పు లేదు.

ఇన్స్పెక్టర్ వాళ్ళని తికమక పెట్టే ప్రశ్నలు వేస్తున్నాడు. వాళ్ళిద్దరు కూడా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంత మెంటల్లీ రిటార్డెడ్ అయినా, తన వాళ్ళని చూడగానే గుర్తు పడ్తుంది కదా, ఈమె ఎందుకు గుర్తు పట్టలేదు? అసలు నెలల పిల్లలు కూడా గుర్తు పడ్తారు కదా, అలాంటిది ఈ నాలుగున్నర ఏళ్ళమ్మాయి, వాళ్ళని చూసి ఏ మాత్రం రియాక్షన్ లేకుండా ఎలా ఉంది? వీళ్ళు నిజంగా తలితండ్రులేనా! లేకపోతే, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళా?

రాన్రాను వాళ్ళిద్దరూ ఆ పాప తాలూకు వాల్లు కాదని తెలిసిపోయింది. ఈ పోలీసులేం చేస్తారు? ఈ అమ్మాకురాల్ని వాళ్ళకిచ్చేస్తారా! అసలా పాపని ఎవరికి ఇచ్చినా నేనొపూకోను. సైంటిఫిక్ గా తలితండ్రులని తేలేవరకూ ఇవ్వకూడదు. డీ ఎన్ ఏ పరీక్షకి నా డబ్బు ఇచ్చి అయినా సరే చేయించి, సరి అయిన తలితండ్రులని తేలాకే అప్పచెప్పాలి అని అనుకునాను.

పోలీసులు కూడా వాళ్ళ మాటల్ని పెద్దగా నమ్మినట్లుగా లేదు. అందుకే వాళ్ళ ఆర్గుమెంట్ లు అలా కొనసాగుతూనేఉంది.

ఈ లోపల ఎర్రబిడ్డ కళ్ళతో, ఆందోళనగా, మొహం తుడుచుకుంటూ, నీట్ గా ఉన్న గళ్ళ చొక్కా, నల్ల పాంటు వేసుకున్న ఓ ముప్పై ఏళ్ళ మనిషి, అతని వెనక్కలే ఓ ఏభై దాటిన బట్టతల మనిషి లోపలికి వచ్చారు.

పాపలో ఒక్కసారి చైతన్యం పొంగింది. " డాడీ! డాడీ!" అంటూ చెంగున నా ఒళ్ళోంచి లేచింది. రెండు చేతులు గాల్లోకి చాచింది. ఒక్కసారిగా వాళ్ళిద్దరూ ఆ పాపాయిని అపురూపమైన వస్తువు పట్టుకున్నట్లుగా, పట్టుకుని హత్తుకున్నారు. ఆ మొహంల్లోని ఆనందం, సంతోషం చాలు వాళ్ళు నిజమైన పాప తాలూకు వాళ్ళు. ఇంక డీ ఎన్ ఏ పరీక్షలు అక్కర్లేదు. ఆ పరీక్షలకి అందని భావం వాళ్ళలో ఉంది.

పంజాబీ డ్రెస్ ఆమెని, జీన్స్ పాంటు వాడిని, లోపలైకి తీసుకెళ్ళారు పోలీసులు, వెనక్కాల ఏదైనా ముఠా ఉందేమో అని అనిపించింది. గళ్ళ చొక్కా మనిషి, మొహం తుడుచుకుంటూ పాపని ఒళ్ళో పెట్టుకుని కుర్చీలో కూర్చుంటూ ఇన్స్పెక్టర్ తో అన్నాడు.

"పాపని స్కూల్లో దింపి, నా ఆఫీస్ కెళ్ళిపోయాను. మరో అరగంట తర్వాత ఫోన్ చేసాను. పాప ఏడుస్తోందా, పిల్లలతో కలిసిపోయిందా అని అడుగుదామని. పాప రాలేదని అన్నారు. గుండె ఆగినట్లయింది. పాపని గేటు దగ్గర వదిలాను, ఎందుకు లోపలికి వెళ్ళలేదు. ఏం జరిగి ఉంటుందో అని స్కూల్లోకి వెళ్ళి కనుక్కున్నాను. వాళ్ళకి ఏం తెలీదన్నారు. నిన్ననే మొదటి రోజు.. టై, బెల్ట్, బాడ్జ్ అన్నీ ఇవాళ ఇస్తామన్నారు. అన్ని పోలీస్ స్టేషన్లో రిపోర్టిచ్చాము. ఓ గంట క్రితం మీకు ఫోన్ చేసాను. మీరన్నట్లుగా స్కూల్ పేరున్నది ఏవైనా ఉంటే అది వేరే విషయం. లేదు కాబట్టి ఇంత జరిగింది. అయినా పాప ఇంత దూరం ఎలా వచ్చింది? నా ఆఫిస్ హిమయత్ నగర్. ఇదేమో జూబ్లీ హిల్స్."

"లోపల ఓ ఇద్దరున్నారులెండి. వాళ్ళతో కూపీ లాగిస్తాము. ఏదో పెద్ద ముఠా ఉండు ఉంటుంది. ఏమైనా మీ పాప దొరికింది." ఇన్స్పెక్టర్ సమాధానపరిచాడు.

"చాలా థాంక్సండి" అన్నారు ఇద్దరు. "థాంక్స్ మీరు ఈమెకు చెప్పాలండి. ఈవిడ పనిచేసే స్కూల్ దగ్గర ఈ దొరికితే, సరి అయిన హక్కుదారులకే ఇవ్వలనుకున్నట్లుగా పొద్దున్న నుంచి, ఈ పాపని అంటి పెట్టుకుని ఉన్నారు. వెళ్ళమన్నా కూడా వెళ్ళలేదు. ఆవిడకి మా మీద కూడా నమ్మకం లేదు. అంతే కదండీ" అంటూ నా వైపు చూసి నవ్వాడు ఇన్స్పెక్టర్.

తన విజిటింగ్ కార్డ్ తీసి ఇచ్చాడు. అతను ఓ బిల్డర్ అని కార్డు చెప్తోంది. ఈ తప్పిపోయిన ఉదంతం బిజినెస్ పార్ట్ నర్స్ మధ్య వైషమ్యం వల్ల కావచ్చు.

మా అందరికి ఒకటే ప్రశ్న జవాబు లేనిది. హిమయత్ నగర్ స్కూల్లో దిగిన అమ్మాయి జూబిలీ హిల్ల్స్ వైపు ఎలా రాగలింది? కంప్లైంట్ ఎవరిచ్చారు? రెండు జంటల ఒకే సారిగా ఒకే అమ్మాయి కోసం, ఇదే పోలీస్ స్టేషన్ కి ఎలా వచ్చి కప్లైంట్ ఇచ్చారు? వాళ్ళమ్మాయి కాకపోయినా, వాళ్ళమ్మాయే అని అబధ్ధం ఎందుకు చెప్పారు? అసలు వాళ్ళకి ఎలా తెలుసు పాప తప్పిఫొయిందని?

ఒక వేళ ఈ చిన్న పాపని, ఆ గూండాల్లంటి వాళ్ళని, వాళ్ళ బెదిరింపులు చూసి ఇచ్చేసి ఉంటే -
ఇన్స్పెక్తర్ మాట విని నేనిక్కడ నుంచి వెళ్ళి పోయి ఉంటే -
పోలీస్ స్తేషన్ కి వచ్చిన దంపతుల మాట విని ఇన్స్పెక్టర్ పాపని వాళ్ళకిచ్చేసి ఉంటే -
ఏం జరిగేది?
ఊహించుకుని ఒణికిపోయాను.
చేతులు మారుతూ, ఇళ్ళు మారుతూ, ఊళ్ళు మారుతూ, దేశాలు మారుతూ మరో ఉమ్రావ్ జాన్ అయిపోయేది. ఎంతటి గండం తప్పింది? ఘోరమైన ప్రమాదం ఎంతలో తప్పిపోయింది?

నేనే తప్పించగలిగానా? సరి అయిన వాళ్ళకి అప్పచెప్పడంలో నా ప్రయత్నాలు, నా ప్రయాస వ్యర్ధం కాలేదు. ఆ పాప తండ్రి నాకు థాంక్స్ చెప్పాడు. ఓ మంచి పనిని నా చేత చేయించినందుకు ఆ దేవుడికి నేను కృతజ్ఞతులు చెప్పుకున్నాను.