సుజననీయం: వే టు గో, ఇండియా!

-- తాటిపాముల మృత్యుంజయుడు


దశాబ్దన్నర క్రితం నేను అమెరికా వచ్చినప్పుడు సామాన్యంగా ఎదుర్కొన్న ప్రశ్నలు ఏ విధమైనవి అంటే - 'ఆడవాళ్ళు నుదుటి మీద రెడ్ డాట్ (బొట్టు) ఎందుకు ధరిస్తారు?', 'ఇండియాలో ఏనుగుల మీద ప్రయాణిస్తారట గదా!', 'మీ ఇండియాలో పాముల్ని పట్టి ఆడించుకుంటూ బ్రతుకుతారట గదా!?' మొదలైనవి. కొన్ని సమాధానం చెప్పటానికి క్లిష్టమైన ప్రశ్నలైతే, కొన్ని మన భారతదేశం గురించి ఎన్ని అపార్థాలున్నాయో తెలియజెప్పే ప్రశ్నలు, అలాగే మరికొన్ని అజ్ఞానం వల్ల వచ్చే ప్రశ్నలు. ఆ ప్రశ్నలు కూడా లోతైనవి కాకుండా ఏదో కాకమ్మ కబుర్లాడుతున్నప్పుడు దొరలే ప్రశ్నలు. అప్పటి అవసరం అలా ఉండేది. ఇలాంటి ప్రశ్నలకు ఇది ఒప్పు, అది తప్పు అని గిరి గీసినట్టు సమాధానాలు ఉండవు కాబట్టి ఆ సందర్భంలో ఏది తోస్తే అది చెప్పటంతో సరిపోయేది.

ఈ పదిహేనేళ్ళలో కాలం ఎన్నో మార్పులు తెచ్చింది. కంప్యూటర్లు అభివృద్ధి చెంది ఇంటర్నెట్ విప్లవాన్ని తీసుకొచ్చాయి. ప్రపంచం కుంచించుకుపోయి ఒక కుటుంబమంత చిన్నదై పోయింది. ఔట్ సోర్సింగ్ మొదలైన కొత్తలో ఇండియాకు ఉద్యోగాలన్ని దొంగిలించబడుతున్నాయని శాపనార్థాలు పెట్టారు. అలాగే భారతదేశంలోని కాల్ సెంటర్లలో పనిచేసిన ఆడవాళ్ళు ఫోన్లలో కష్టమర్లనుండి ఇక్కడ రాయలేని, రాయకూడని మాటలను ఎదుర్కొన్న సందర్భాలు కూడా లేకపోలేదు.

మరి ప్రస్తుత పరిస్థితో. పైన చెప్పిన దానికి భిన్నంగా ఉంది. ఇప్పుడు అమెరికాలో ఉన్న ప్రజలకి భారతదేశం గురించి, భారతీయుల అలవాట్ల గురించి మంచి అవగాహన కుదురుతున్నది. భారతీయుల జీవనవిధానంపై, సంస్కృతిపై పట్టు దొరుకుతోంది. ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన విషయమేమిటంటే, కొద్ది రోజుల క్రితం అమెరికా ప్రభుత్వం మొట్టమొదటిసారిగా 'దీపావళి ' పండగను గుర్తించింది. అమెరికాల ప్రతినిధులు అనూహ్య స్పందనతో అంతర్జాతీయంగా, మతపరంగా, చారిత్రాత్మకంగా ప్రాధాన్యం ఉన్న 'దీపావళి ' పండగను ఆమోదిస్తూ తీర్మానం జరిపారు.

ఇవ్వాళ అమెరికాలో ఏ ఆఫీసులో చూసినా పనిమీద ఇండియా వెళ్ళటానికి ఎప్పుడు అవకాశం వస్తుందా అని కళ్ళలో వత్తులు వేసుకొని ఎడురుచూస్తున్న ఉద్యోగులు ఎంతమందో. భారతదేశం వెళ్ళి వచ్చినవారి మొహాల్లో ఎంత సంతోషం వెల్లి విరిస్తున్నదో. అమెరికాలో సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేస్తున్న అమెరికన్లు భారతదేశ కాలమానప్రకారం తమ పని సమయాల్ని సరిచేసుకొని ఇండియాలోనున్న సహోద్యోగులతో కలిసి పనిచేస్తుంటే ఇండియానుండి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఇండియానుండి అమెరికాకు నా చిన్నప్పుడు రకరకాల పనులపై మావూరి నుండి దగ్గర్లోనున్న పట్టణానికి వెళ్ళినట్టు వచ్చి వెళ్ళుతున్నారు.

ఇన్ని శుభ ఘడియలు వస్తున్న తరుణంలో భారతీయులందరు గర్వపడే విషయం ఇంకొకటి జరిగింది. గతవారం అమెరికాలోని లూసియానా రాష్ట్ర గవర్నర్ పదవికి జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన బాబి జిందాల్ ఎన్నికయ్యాడు. బాబీ తల్లితండ్రులు 1970లో పంజాబ్ రాష్ట్రం నుండి అమెరికాకు వలస వచ్చారు. ముప్పైయారేళ్ళున్న బాబీ జిందాల్ అతి పిన్నవయసులో గవర్నర్ గా ఎన్నిక కావడం ఒక విశేషమైతే అమెరికాలో పుట్టి పెరిగిన మొదటితరం ఒక ఇండియన్-అమెరికన్ అమెరికా రాష్ట్ర అత్యున్నత పదవికి ఎన్నికకావడం భారతీయులందరికి గర్వకారణం.

ఈ శుభసూచకాలను చూస్తుంటే ఇండియాకు ముందు ముందు స్వర్ణయుగం రాబోతుంది అనడం అతిశయోక్తి ఏమీకాదు. ఇది సుసాధ్యం కావాటానికి భారతదేశ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంతో గురుతరమైన బాధ్యత ఉన్నది. కాలానుగుణంగా వస్తున్న ఈ మార్పులను మన రాజకీయ నాయకులు అర్థం చేసుకుంటూ, ప్రభుత్వ విధానాలను సుగమం చేస్తూ, తమ పాతకాలపు అలవాట్లను మార్చుకొని భారతదేశ శ్రేయొభివృద్ధికై పని చేస్తారని ఆశిద్దాం. చైతన్యానికి పెద్దపీట వేస్తారని మనసారా కోరుకుందాం.


భవదీయుడు

తాటిపాముల మృత్యుంజయుడు


సుజనరంజని భిన్న అభిప్రాయాలకు వేదిక మాత్రమే. ఇందలి రచయిత(త్రు)ల అభిప్రాయాలను మనస్ఫూర్తిగా గౌరవిస్తాము.