సంక్షోభం

-- కీ|శే| కే. వి. సుబ్బారావు


కవర్లో
మృత్యువుబాజా
మోగిస్తూనేవుంది!


రోడ్డు మీద కత్తుల నృత్యానికి
ఎలెక్ట్రిక్ స్థంభం
రోదిస్తూ కూలిపోయింది!


ప్రత్యేక సమావేశంలో
వ్యాకరణం ఆధిపత్యాన్ని
ప్రశ్నిస్తున్నాయ్ వాక్యాలు!


కాంతి చుట్టూ
కాలసర్పాలు
బుసలు కొడ్తున్నాయ్!


డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల
మరణించిన బాలునికి
అశ్రుతర్పణం చేస్తోంది ఆసుపత్రి!


వికాసంలేని విద్యాలయాల్లో
చీకట్లు వరదలై
పరవళ్ళు తొక్కుతున్నాయ్!


కీళ్ళ రోగంతో
అడుగులు తడబడి
విలవిల్లాడుతోంది పురోగతి!


అచ్చుల పతనం తర్వాత
హల్లుల ఆగడాలు
అడ్డుకునేదెవరు?సుష్ఠుగా తిన్న కంఠం

-- కీ|శే| కే. వి. సుబ్బారావు


సుష్ఠుగా తిన్న కంఠం
మేడ మూడో అంతస్తులో
తలపొతల కిళ్ళీ నములుతూ
నీలిపొగల పాముల నాట్యం చూస్తూ
ప్రేమాయణం విప్పుతోంది


సుష్ఠుగా తిన్న కంఠం
అద్దంలో అందం ఆవిష్కరించి
ఆలోచనల నది ఈదలేక
ఆరాటపడుతోంది


సుష్ఠుగా తిన్న కంఠం
న్యాయం నెత్తిమీద
తబలా వాయించి
సొఫాలో కూర్చుని
భగవద్గీత చదువుతోంది


సుష్ఠుగా తిన్న కంఠం
అహంకారాల కారులో
వూరేగుతూ
ధనహీనులను
పురుగులకన్నా హీనంగా
హేయంగా చూస్తోంది


సుష్ఠుగా తిన్న కంఠం
అబద్దాన్ని అందలం ఎక్కించి
సత్యాన్ని రుద్రభూమికి పంపి
విలాసాల పరుపు మీద
హాయిగా నిద్ర పోతోంది!