రాతివనం - 11వ భాగం

-- సలీం

జరిగిన కథ: అనూష ఒక సాధారణ మధ్య తరగతి టీనేజ్ పిల్ల. అనూష తల్లిదండ్రుల ప్రోద్బలంతో రెసిడెన్షియల్ కాలేజిలో చేరుతుంది. అందరికంటే భిన్నంగా ఓ జర్నలిస్టు కూతురు, మధుమిత హిస్టరీ గురించి మంచిగా చెప్పి మొదటి బహుమతి గెల్చుకుంటుంది, అనూషకు ఒంట్లో బాగోలేదని తెలిసి తండ్రి విజయవాడ వెళ్ళి ఇంటికి తీసుకువస్తాడు. ఇక అనూషను వెనక్కి పంపకూడదని నిర్ణయించుకుంటాడు తండ్రి.. హిమవర్ష, అనూష లానే తల్లిదండ్రుల ప్రోద్బలం మీద తనకు ఇష్టం లేని చదువుచదువుకుంటూంటుంది. ఇంటికొచ్చిన అనూషను స్నేహితురాళ్ళు హిమవర్ష, మధుమిత కలుస్తారు. మాటల్లో మధుమిత వాళ్ళిద్దరినీ సాంత్వన పరుస్తూ తమ కష్టాల్లోనే జీవితపు విలువలు నేర్చుకోవడమెలాగో చెబుతుంది.

మరో వైపు రామ్మూర్తి అనే ఒక ప్రతిభావంతుడైన శ్రీచరిత కాలేజ్ లెక్చరర్ సునందా కాలేజిలో జేరాడని శ్రీచరిత ఓనరు ఇంటికి పిలిచి బెదిరిస్తాడు. అయినా రామ్మూర్తి లొంగడు. ఇలా ఉండగా సుందరం అనే లెక్చరర్ ఇంటింటికీ తిరుగుతూ తాను పనిచేసే కాలేజికి ప్రచారం చేస్తుంటాడు. శ్రీచరిత, సునంద కాలేజీల మధ్య పేరు గొప్పల కోసం అంతర్యుద్ధం మొదలౌతుంది. సునంద మెడికల్ కోచింగ్, ఎంట్రన్స్ లలో పైచేయిగా ఉంటే, శ్రీచరిత ఇంజనీరింగ్ ఫీల్డులో ఆధిక్యత సంపాదించాలని చూస్తుంది. అందుగ్గాను, మామూలు కాలేజీలో చదివి స్వంత కష్టం మీద ఇంజనీరింగ్ ఎంట్రన్స్ లో మొదటి ర్యాంకు పొందిన పేద విద్యార్థిని శ్రీచరితలో కోచింగ్ తీసుకున్నట్టు ప్రకటించమని ఈశ్వరరావు కోరుతాడు. అందుగ్గాను, ఆ విద్యార్థి ఇంజనీరింగ్ చదవటానికయ్యే ఖర్చులు భరిస్తానని హామీ ఇస్తాడు. అందుకు ఆశపడి ఆ పేద కుటుంబం ఒప్పుకుంటుంది. హిమ వర్ష స్నేహితురాలు క్షితిజకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తూ ఆమెను కృంగదీస్తుంటాయి. ఆ పని చేయించింది ఆమె క్లాస్‌మేట్ తల్లి అయిన ఓ ఆడ కానిస్టేబుల్ అని తెలుస్తుంది. (ఇక చదవండి)


**** **** ****

కల్పన ఆత్మహత్య చేసుకుందిన్న తెలిగానే ఈశ్వర్రావుకి నిద్ర మత్తంతా వదిలిపొయింది. తన ప్రత్యర్ధి సునందా కాలేజిలో యాజమాన్యం గుర్తుకు రాగానే వళ్ళంతా భయంతొ చెమటలు పట్టేసాయి. తమ కాలేజిలో చదువుతున్న అభం శుభం తెలీని ఓ ఆడపిల్ల అన్యాయంగా చచ్చిపోయిందేనన్న దిగులుకన్నా ఈ సంఘటనని ఆధారంగా చేసుకుని తన మీద ఎంత బురద చల్లుతారోన్న అందోళన అతనిలో ఎక్కువగా ఉంది. ఈ వార్త న్యూస్ పేపర్లు వారికి, టీవీ మిడియాకి తెలీకుండా ఉండేదుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకొవటంలో అతను బిజీ అయ్యాడు.

ఉదయం ఆరింటికి కల్పన వాళ్ళ అమ్మనాన్న వచ్చారు. రిసెప్షన్ లో కూచుని కల్పన కోసం కబురు పెట్టారు. అనూషకు అంతా అయోమయంగా ఉంది. ప్రిన్సిపాల్ ఈశ్వరరావు గారు గట్టిగా చెప్పిపోయారు... కల్పన వాళ్ళ అమ్మానాన్నకి ఈ విషయం చెప్పకూడదు అని. సరైన సమయం చూసీ తనె వాళ్ళకు చెప్తానన్నాడు. అప్పటి వరకూ ఎవ్వరూ నోరు మెదపడానికి వీల్లేదని హెచ్చరించి వెళ్ళాడు. మరిప్పుడు కల్పన వాళ్ళ అమ్మానాన్నా వచ్చారు, వాళ్ళకేమైనా తెలిసిందా...అందుకే వచ్చారా.. తెలిసి ఉండదు. తెలిస్తే చనిపొయిన కల్పన కోసం కబురెందుకు పెడ్తారు? ఇప్పుడు తనేం చేయాలి ? వాళ్ళకు నిజం చెబితే ప్రిన్సిపాలుకి కోపమొస్తుంది. చెప్పకుండా ఎలా ఉండటం... మభ్యే పెట్టగలుగుతుంది.......

అనూష ఏడుస్తునే కిందకి దిగింది. కల్పన వాళ్ళ నాన్నని చూడాగానే తన్నుకు వచ్చిన ఏడుపుని అపుకుంది.

"ఏమిటమ్మా అలా ఉన్నావు? ఆరొగ్యం బాగోలెదా...కళ్ళు చూడు ఎర్రగా ఎలా ఉన్నాయో... మొహమంతా వాడిపోయింది... రాత్రంతా మేలుకుని చదివావా ఏమిటి? చదువు ముఖ్యమేకాని ఆరోగ్యం కూడా చూసుకోవాలిగా" అన్నాడతను ఆప్యాయంగా.

అనూష ఉబికే కన్నీళ్ళని దాచుకొలేకపొయింది...

"ఎందుకుమ్మా ఏడుస్తున్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? మీ అమ్మానాన్నా గుర్తొచ్చారా?"

"కల్పనకు వాళ్ళమ్మని చూడాలిని ఉందిట. ఈ రోజు దాని పుట్టిన రోజు. నిన్ననే బజారు కెళ్ళి దానికోసం కొత్త డ్రెస్ కొన్నాం. రూంలో అందరికి పంచడం కోసం అందరికీ స్వీట్లు కూడా తెచ్చాం. దాన్ని పిలువమ్మా ... స్నానం చేస్తోందా ...మొదట నిన్ను పంపించి తను మెల్లిగా వస్తానందా...." కల్పన వాళ్ళ నాన్న మాటలకు ఏం సమాధానం ఇవ్వాలో తెలియక మౌనంగా నిలబడిపోయింది.

"మా అమ్మాయిని తొందరగా రమ్మని చెప్పమ్మా. ఈ హాస్టల్ లో చేరినప్పటినుండి పిల్లని చూసుకోవటమే కుదరలేదు. దాన్ని చూడాలని ప్రాణం కొట్టుకుపోతుందంటే నమ్ము, ఇదిగో ఈయనే... పడనిస్తేగా... చదువు చదువు అంటూ పిల్లని చంపుకు తింటాడమ్మా, ముద్దూ, ముచ్చటా తెలీని మనిషి" కల్పన వాళ్ళమ్మ భర్త వైపు నిరసనగా చూసి మరలా అనూష వైపు తిరిగి" పుట్టిన రోజు పర్మిషన్ ఇస్తారట కదమ్మా... దాన్ని ఇంటికి పిల్చుకెళ్ళి మరలా సాయంత్రం ఈయనకిచ్చి పంపిస్తాను" అంది.

"నీకేనా కూతురు...నాకు కాదేమిటి? అదంటే వల్లమాలిన ప్రేమ ఉంది కాబట్టే పెద్ద చదువులు చదివి డాక్టర్ కావాలని కోరుకున్నాను. గారాబం ఎక్కువ ఐతే సరిగ్గా చదవరు, చదువు మీదున్న ధ్యాస మరల్చకుండా ఉండటానికి కొద్దిగా స్ట్రిక్ట్ గా ఉంటాను. నువ్వు చెప్పమ్మా అది తప్పా? దానికి జీన్స్ ప్యాంటు ఇష్టమని ఒకసారి అడిగితే బాగా కొప్పడ్డాను. కానీ ఈరోజు దాని పుట్టిన రోజు అని నేనే ఇష్టపడి ప్యాంటు కొనుకొచ్చాను. ఇవన్నీ ప్రేమ లేకుండానే చేస్తారా?" అన్నాడతను భార్య వైపు నిష్ఠూరంగా చూస్తూ.

"ఉందిలేండి బోడి ప్రేమ...వంద తిట్లు...చీటికి మాటికి మందలింపులూ...అమావాస్యకో పున్నమికో కొద్దిగ మురిపెం... అంతేగా సంబడం" అందామె.

"అమ్మా... అమ్మాయి యింకా రాలేదేమ్మ...తలస్నానం చేస్తోందా?" అంటూ ఏడుస్తూన్న అనూషా వైపు చూసి "ఎందుకలా ఏడుస్తున్నావు? నిజం చెప్పు... మా అమ్మాయి బాగానే ఉందా? ఏమైన జరక్కూడనిది జరిగిందా" అని అడిగింది.

అనూష వెకిళ్ళు ఆమెకు సమాధానం చెప్పాయి. ఆమెలొ సన్నటి భయం... శరీరంలో తెలీని జలదరింపు... "రూముకెళ్దాం పద". అంటూ అనూష సమాధానం కోసం ఎదురు చూడాకుండా ఆ అమ్మాయి జబ్బ పట్టుకుని లాక్కుంటూ మెట్లవైపుకు కదిలింది. రెణ్ణిమిషాలు కాకముందే ఆవిడా పెద్దగా శోకాలు పెట్టి ఏడ్వడం వినిపించింది.

కల్పన వాళ్ళ నాన్న కూడా మెట్ల్లెక్కి రూం చేరుకుని తమ కూతురి శవాన్ని చూడగానే గుండె పగిలేలా ఏడ్చాడు.

"నువ్వు డాక్టర్ కాకున్నా ఫర్లేదు తల్లీ...బతికుంటే చాలు... నా కళ్ళెదురుగా తిరుగాడితే చాలు. ఇంకెప్పుడూ నిన్ను చదవమని బలవంతపెట్టనమ్మా... నీ కిష్టమైన చదువే చదువు తల్లీ. ఒక్కసారి కళ్ళు తెరిచి మాట్టాడమ్మా" అంటూ అతను రోదిస్తుంటే చూసేవాళ్ళ హృదయాలు బరువెక్కాయి.

పెద్దపెద్దగా ఏడ్పులు... శోకాలు. రోడ్డుమీద పోయేవాళ్ళ చెవులపడ్డాయి. మొదట వూహాగానాలు మొదలై... నిర్థారణకోసం రకరకాల ప్రయత్నాలు జరిగి .. మెల్లమెల్లగా వార్త బైటికి పొక్కింది.

సునందా కాలేజీ యజమాని రావుకీ విషయం తెలియగానే చెవుల్లో ఎవరో అమృతం పోస్తున్నభావనకు లోనైనాడు. వయసు యాభైదాటిన విషయం మరిచిపోయి డ్యాన్స్ చేయాలనుకున్నాడు. పక్షి వలలో చిక్కింది. ఇప్పుడు చాలా సులభంగా దాని మెడ పిసికేయొచ్చు. చచ్చి ఊరుకుంటుంది... ఈ దెబ్బతో శ్రీచరితకాలేజీ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోతుంది.

ఫోన్ చేతుల్లోకి తీసుకుని, దీర్ఘంగా ఒక నిశ్వాస విడచి మొదట ఈనాడు పేపర్ వాళ్ళకు సమాచారం అందించాడు. తర్వాత వార్త, ఆంధ్రజ్యోతి .... ఈ టీవికి, టీవి నైన్ కి ఫోన్ చేసి చెప్పాడు. పదిహేను నిమిషాలాగి టిఫిన్ చేసి, పొగలు కక్కే కాఫీ సిప్ చేస్తూ కులాసాగా కాళ్ళూపుతూ జరగపోయే తమాషా చూడటం కోసం వళ్ళంతా కళ్ళుచేసుకొని కూచున్నాడు.

విషయం పేపర్ వాళ్ళకెలా తెలిసిందో ఈశ్వరరావుకి అర్థంకాలేదు. రావడం రావడం వార్డెన్ల మీద విరుచుకు పడ్డాడు. పోలీసులొచ్చారు. శవాన్ని పోస్ట్ మార్టం చేయాల్సిందేనన్నారు. యస్సైని పక్కకి పిలిచి డబ్బులు చేతిలో పెట్టపోతే "సార్ ... మా ఉద్యోగాలు వూడిపోతాయి. మీడియాకి తెలిశాక మా చేతుల్లో ఏం ఉంటుంది చెప్పండి" అన్నాడు. అంబులెన్స్ లోకి శవాన్ని ఎక్కిస్తున్నప్పుడు టీవీ నైన్ వాళ్ళు వచ్చి కెమేరాని శవం మీద జూం చేసి ... తర్వాత కల్పన వాళ్ళ నాన్నమీద ఫోకస్ చేసి మైక్ అతని దగ్గర పెట్టి "మీ అమ్మాయి ఎలా చనిపోయింది? కారణం ఏమై ఉంటుందనుకుంటున్నారు? కాలేజీ యాజమాన్య కారణమా? వత్తిడి తట్టుకోలేక చనిపోయిందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

"నా కూతురు డాక్టరై తిరిగొస్తుందనుకున్నాను. ఇలా శవమై తిరిగొస్తుందనుకోలేదయ్యా? అంటూ కల్పనవాళ్లనాన్న వలవలా ఏడ్చాడు.

"మాయదారి చదువులు నాకూతుర్ని బలి తీసుకున్నాయి నాయనా. బెజవాడ అంటే చదువులవాడ అనుకున్నాం తండ్రీ. కానీ చంపేసేవాడ అని ఇప్పుడే తెలిసింది బాబూ" అంటూ కల్పన వాళ్ళమ్మ టీవీ ముందు శోకాలు పెట్టింది.

ఎంత తప్పించుకుపోదామని ప్రయత్నించినా వదలకుండా వెంటబడి ఈశ్వరరావుని పట్టుకున్నారు వాళ్ళు.

"మీరు పిల్లల్ని చదువులూ ర్యాంకులూ అంటూ హింసిస్తున్న మాట నిజమేనా?"

"నిజం కాదు. తల్లిదండ్రులు మా పైన నమ్మకంతో పిల్లల్ని ఇక్కడ చేర్పిస్తారు. ఆ నమ్మకం వమ్ముకాకుండా మా స్టాఫ్ అహర్నిశలూ కష్టపడ్తారు. ఫలితాల్ని సాధిస్తారు."

"ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకున్న కల్పన అనే అమ్మాయి ఫ్యాన్ కి ఉరేసుకుని చచ్చిపోవడనికి కారణం మీరు పెట్టే హింసేనని అనుకుంటున్నారు. మీరేమంటారు?"

"మేము ఎటువంటి వత్తిడి పెట్టలేదు. ఆ వయసులో ఆడపిల్లలు ఆత్మహత్య చేసుకోవడానికి చాలా కారణాలు ఉండవచ్చు."

"ప్రేమ వ్యవహారమని మీ అనుమానమా? అటువంటిదేమీ లేదని ఆ పిల్ల తల్లితండ్రులు గట్టిగా చెపుతున్నారు."

"నేనలా అనలేదు. ఆ వయసులో పిల్లలు చాలా సెన్సిటీవ్ గా ఉంటారు. చిన్న కారణమైనా సరే ఒక్కోసారి వాళ్లని ఆత్మహత్యకు పురిగొల్పవచ్చు."

"నిన్న అందరి ఎదురుగా సత్యవతి అనే వార్డెన్ కల్పనని నిల్చోబెట్టి తక్కువ మార్కులు వచ్చినందుకు తిట్టి అవమానించినందు వల్లనే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని కొంత మంది విద్యార్థులంటున్నారు? మీరేమంటారు"

ఆ మాటలు వినగానే ఈశ్వరరావు హతాశుడైనాడు. నిజంగా అలా జరిగిందని అతనికి తెలీదు. కల్పన చావు విషయం మీడియాకు తెలీనప్పుడు కొద్దిగా కంగారు పడినా ఏదో ఒకటి చెప్పి మీడియాని మభ్యపెట్టొచ్చనుకున్నాడు. ఈ విషయం చాలా సీరియస్ అయ్యేలా ఉందని అతనికి అర్థమైపోయింది.

"నాకా విషయం తెలీదు" అన్నాడు.

కెమేరా అనూషమీద ఫోకస్ అయింది. ఆ అమ్మాయి ఇంకా షాక్ లోనే ఉంది. కొన్ని గంటల ముందు వరకు తమతో కలిసి తిరిగిన అమ్మాయి చనిపోయిందన్న నిజాన్ని ఆమె చిన్ని హృదయం ఒప్పుకోవడానికి నిరాకరిస్తోంది.

"కల్పన నీ రుమ్మేటా" టీవీ వాళ్ళ ప్రశ్న.

ఔనన్నట్లు తల వూపింది.

"నిన్న రాత్రి సత్యవతి అనే వార్డెన్ కల్పనని తిట్టిన మాట నిజమేనా?"

అనూష బెదురుగా ఈశ్వరరావు వైపు చూసింది.

"భయం లేదు. చెప్పు." అతను రొక్కించాడు.

నిజమేనన్నట్లు తల వూపింది.

"ఎందుకు తిట్టింది?"

"యంసెట్ మ్యాత్ టెస్ట్ లో చాలా తక్కువ మార్కులొచ్చాయని తిట్టింది. అందరి ముందు

నిల్చోబెట్టి షేం షేం అనిపించింది"

"కల్పన ఎలా రియాక్టయ్యింది?"

"చాలా బాధపడింది. రూం మేట్స్ అందరం ఎంత నచ్చచెప్పినా ఏడుపు మానలేదు"

"కల్పన ఆత్మహత్య చేసుకోవడానికి మరేమైనా బలమైనకారణముందా?"

"తెలీదు"

టీవీ యాంకర్ కెమేరా ముందుకొచ్చి "కాలేజీ యాజమాన్యానికి ర్యాంకులు కావాలి. అందుకోసం పిల్లల్ని ఎన్నిరకాల హింసలకైనా గురి చేస్తారు. వీళ్ళ కళ్ళకు పిల్లలు మనసున్న మనుషులుకారు. మార్కులు తెచ్చుకునే యంత్రాలు మాత్రమే. వీళ్ళ ర్యాంకుల దాహానికి మరో విద్యార్థిని బలైపోయింది. ప్రభుత్వం వీళ్ళమీద కఠినమైన చర్యలు తీసుకోకుండా కళ్ళు మూసుకుని ఉన్నంతకాలం వీళ్ళ ఆగడాలు ఇలా సాగుతూనే ఉంటాయి. యంసెట్ల కోరల్లో చిక్కి అమాయకపు పిల్లలు బలౌతూనే ఉంటారు" అన్నాడు.

తొమ్మిది కాక ముందే విద్యార్థి సంఘాలవాళ్ళు ప్లే కార్డులు, బ్యానర్లు పట్టుకుని కాలేజీ గేటు ముందు నిలబడ్డారు.

"శ్రీచరిత కాలేజీ యాజమాన్యం డౌన్ డౌన్"

"కల్పన ఆత్మహత్యకు కారణమైన వాళ్లని ఉరి తీయాలి"

"చదువుల పేరుతో జరుగుతున్న అమానుషాన్ని అరికట్టాలి"

"ర్యాంకులకోసం శ్రీచరిత కాలేజీ జరుపుతున్న మారణకాండని రూపుమాపాలి"

"శ్రీచరిత కాలేజీని మూసేయాలి"

నినాదాలతో పాటు గేటు దగ్గిర గుంపు రెండింతలు మూడింతలుగా పెరిగిపోయింది. అందులో సగం మంది విద్యార్థులు కాదు. సునందా కాలేజీ యజమాని రావు పంపించిన రౌడీ మూక.

ఒకడు రాయి తీసుకుని హాస్టల్ కిటికీ అద్దానికి గురి చూసి విసిరాడు. భళ్ళున శబ్దంతో అది పగిలింది.

**** **** ****

(సశేషం)

భావుకతను సృజనాత్మకతను రంగరించిన కథనశైలితో విశేష ప్రతిభ కలిగిన కథకుడు, నవలాకారుడు శ్రీ సలీం. కథా ప్రక్రియలో తెలుగు యూనివర్సిటీ ధర్మనిధి పురస్కారం,వెండి మేఘం నవలకు తెలుగు యూనివర్శిటీ సాహిత్య పురస్కారం (రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు), వి. ఆర్. నార్ల పురస్కారం లభించాయి. 'రూపాయి చెట్టూ కథా సంపుటికి మాడభూషి రంగాచారి స్మారక అవార్డు, కాలుతున్న పూలతోట నవలకు బండారు ఈశ్వరమ్మ స్మారక పురస్కారం లభించాయి.