కవి నిష్ర్కమణ

-- తాటిపాముల జయమాల


సూటిగా సాగే సూర్యకిరణాలను
కారుమేఘాలు ఉరితీస్తున్నాయి


కిటికీ పక్కనున్న గులాబీపువ్వు
విషాదగీతాలను ఆలపిస్తోంది


నిద్రపట్టని శిశువులాగా
టెలీఫోను అదేపనిగా రోదిస్తోంది


తన వెలితిని తలపోసుకుంటూ
శోకిస్తోంది ఖాళీకుర్చీ


మనస్సు విరిగిన ఛందస్సు తడబడగా
ఉత్ప్రేక్షకు విషాదం వ్యసనమైంది


వెల్లువలా సాగే కన్నీటిధారను
ఆపుకోలేక వికలమవుతోంది కుక్కపిల్ల


పక్కవీధిలోని కోవెల వైరాగ్యంతో
భగవద్గీతను బోధిస్తొంది


నిఘంటువులోని పదాలు జాలువారి
మరణించిన కవికి సంస్మరణ రాశాయి


(కీ|శే| కే.వి. సుబ్బారావు గారి ఆంగ్లకవిత "Death of a Poet"కు స్వేచ్చానువాదం)