పద్యం-హృద్యం

-- తల్లాప్రగడ

ముందుమాట: ఈ శీర్షికతో తెలుగు పద్యంలో ఉన్న అందాన్ని, గొప్పతనాన్ని పదిమందికీ అందించి, వారిని ఈ ప్రక్రియకు దగ్గిర చేసి, పద్యానికుండవల్సిన మర్యాదని గుర్తుచేయడమే మా సంకల్పం. మరుగు పడిన పద్యాన్ని మళ్ళీ మెరుగు పరచి, భాషను సరళీకృతం చేస్తే, పద్యాలంటే ఉన్న భయం తొలుగుతుంది. వాడుక భాషలో పద్యాలు వ్రాస్తే, అటు పద్యమూ నిలబడుతుంది, ఇటు ప్రజలకూ అర్థమవుతుంది. అందుచేత వాడుకభాషా ప్రయోగాలకు మేము ప్రాముఖ్యత ఇవ్వదలిచాము. ముందు ముందు ఈ శీర్షికను పాఠకులందరూ పాల్గునే విధంగా రూపొందిస్తాము. అలాగే మంచి పద్యాలకు భాష్యం, తాత్పర్యాలు, కూడా ప్రచురిస్తాము. అందరూ ఆనందించాలి, ఆస్వాదించాలి, ఆదరించాలి, అదే మాకు పదివేలు (డాలర్లు)!!!!

సమస్యాపూరణం:

ఈ క్రింది "సమస్యని" అంటే ఆ వ్యాక్యన్ని యదాతధంగా ఒక పద్యంలోకి ఇమిడ్చి వాడుకుంటూ రాయాలి. ఒకవేళ పద్యం కాకపోయినా ఒక కవిత రాసినా కూడా వాటిని మేము సగౌరవంగా స్వీకరిస్తాము.

మీ జవాబులు ఈ మెయిల్(rao@infoyogi.com) ద్వారా కాని ఫాక్స్ ద్వారా కానీ : 408-516-8945 మాకు నవంబర్ 20వ తారీఖు లోపల పంపించండి. ఉత్తమ పూరణలను తరువాయి సంచికలో ప్రచురిస్తాము. పద్యంలో యతిప్రాసల నియమాల సులువుగా అవగాహన అవ్వడానికి పాఠకుల సౌకర్యార్థం ఈ లంకెని నొక్కండి.

ఈ మాసం సమస్య

కం:// "కోతితొ పెండ్లి కుదిరెనని కోమలి మురిసెన్"

క్రితమాసం సమస్య : "సీ:// దొరల సాని ఎటుల దొరసాని అయ్యెనో?"

ఈ సమస్యకి మంచి సమాధానాలు వచ్చాయి. వాటిలో కొన్ని ఈ విధంగా ఉన్నాయి!

మొదటి పూరణ - డా: ఐ.యస్. ప్రసాద్, హైదరాబాద్

ఆ.వె.// దొరల సాని ఎటుల దొరసాని అయ్యెనో?
మంత్ర సాని యేమి మంత్రమేయు!
పంతులమ్మ యనిన పంతులకమ్మయా
తెలుగువానికైన తెలియ తరమె

రెండవ పూరణ - తల్లాప్రగడ, శాన్ హోసే

సీ// రౌడీలవేనయా రాజ్యముల్ భాగ్యముల్, రాజులీరోజు వారల వశంబు!
సానులకేదది సాధ్యంబుకాదయా, సొమ్మెంతచేరునో సొగసులివ్వ!
రౌడిలుదొరలవ్వ రౌడిసానులు కార దొరసానులిటులనే దొరలతోడ!
దొరలసాని ఎటుల దొరసాని అయ్యెనో? దొరలంటె అర్థాలె మారె నేడు!

తె.గీ.//స్వార్థమేలేక ప్రేమైన సాగదిచట!
వ్యర్థమీనేల తెలిసినా వదలలేను!
అర్థమెటులవ్వు మారేటి అర్థమందు,
ఏమి విధ్వత్తు నాకున్న రామచంద్ర!


మూడవ పూరణ - పుల్లెల శ్యామసుందర్, శాన్ హోసే

సీ// దొరల సాని ఎటుల దొరసాని అయ్యనో, తెలియజేతు నిపుడు తెలుసుకొనుము
ఎంతవారైనను కాంతదాసులుకార, తరుణి వలపుతోడ దరికిచేర!
వగలు ఒలకబోసి, వయ్యారములుపోయి, సిగన పూలు తురిమి, సెంటు పూసి
దొరల సాని అటుల దొరసాని అయ్యెరో, చెంత చేరి అతని చెలిమి చేసి!


నాల్గవ పూరణ - తుమ్మల శిరీష్ కుమార్, హైదరాబాదు


ఆ.వె.// సిరులు గోరి దొరల మరులుగొలుపు జాణ
సాని యగును కాని సాధ్వి గాదు
దొరల సాని ఎటుల దొరసాని అయ్యెనో
క్లుప్తముగ, లకార లుప్తమదియె


ఐదవ పూరణ - సుబ్రహ్మణ్యం బతల, రోచెస్టర్ హిల్స్, మిచిగన్


నాకలోకాని కరుదెంచు నరుని గాంచి
మరులు గల్గిన భామ మతి చలించి
మనుమడైన వాని మనువాడ గోరేను
దొరల సాని ఎటుల దొరసాని అయ్యెనో

తెల్ల కోట యందు తెలివి మీరగ జేరి
పెద్దరాయని చెంత ఒద్దికను బడసి
ఆంతరంగిక సేవ అవధి మీరగ జేయు
దొరల సాని ఎటుల దొరసాని అయ్యెనోభక్త హనుమ -- తల్లాప్రగడ

సందర్భం: అశోకవనంలో ఉన్న సీతను హనుమంతుడు తనతో వచ్చేయమని కోరతాడు. సీత అందుకు నిరాకరించి, రామునితో రమ్మంటుంది. అప్పుడు తల్లి అనుజ్ఞ తీసుకోని హనుమతుడు తన నిజరూపసందర్శనమిచ్చి శెలవు తీసుకుంటాడు. అప్పుడు అతడిని చూసిన సీతాదేవికలిగిన అనుభూతి ఇలావుంది.

సీ:// తన్మాత్రపంచకతత్స్వరూపంబును తన్మయత్వంబున తల్లిగాంచె !
ఆకాశ శబ్దంబు, ఆ వాయు శ్పర్శయు తేజస్సు రూపమై తెలుపుచుండ,
పుడమి గంధాలతో పుణ్యజలాసారములు కలబోసిన మూర్తిమంత
హనుమంత విశ్వరూపానుభవంబులే, తద్రూప భాగ్యంబె తనవి కాగ !

తే.గీ: రుద్ర యంశన వాయుపుత్రుండు వాడు,
పంచసాయకుని రూపాన మించి నాడు,
విష్ణుభక్తుడై వీరాధివీర హనుమ!
ఏమికోరని యోగయా రామచంద్ర!

ప్రతిపదార్థం:

తన్మాత్రపంచక= పంచభూతాలకు సంబంధించిన ఐదు మూలాణువులు
తత్స్వరూపంబును = ఆ తన్మాత్ర స్వరూపాన్ని
తన్మయత్వంబున = తనను తాను మరచి
తల్లిగాంచె!= తల్లి, సీత చూచెను.
ఆకాశ శబ్దంబు= ఆకాశానికి సంబంధించిన శబ్ధములాగా (శభ్దము ఆకాశానికి తన్మాత్రము)
ఆ వాయు శ్పర్శయు = ఆ వాయువునకు సంబంధించిన స్పర్శయు (స్పర్శ వాయువుకి తన్మాత్రము)
తేజస్సు రూపమై = ఆ తేజస్సు లేక అగ్నికి సంబంధించిన రూపంగా (రూపము అగ్నికి తన్మాత్రము)
తెలుపుచుండ= కనిపిస్తూ ఉంటే
పుడమి గంధాలతో = భూమికి సంబంధించిన సువాసనగా (గంధము భూమికి తన్మాత్రము)
పుణ్యజలాసారములు =పుణ్యజాలాలకు సంబంధించిన సారమై (సారము జలానికి తన్మాత్రము)
కలబోసిన = అన్నీ కలిపి
మూర్తిమంత= చేసిన సృష్టి లేక వ్యక్తి అయినటువంటి
హనుమంత = హనుమంతుని
విశ్వరూపానుభవంబులే= విశ్వరూప సందర్శన అనుభవములే
తద్రూప = (అలాగే) అటువంటి గొప్ప రూపమునకు చెందిన
భాగ్యంబె = భాగ్యమే
తనవి కాగ != తనకి(సీతకి) చెందగా! !

రుద్ర యంశన = రుద్రుడి (శివుని) అంశతో పుట్టిన
వాయుపుత్రుండు వాడు= వాయు దేవునికి పుట్టిన వాడు
పంచసాయకుని = మన్మదుని
రూపాన మించి నాడు,= అందంలో మించినటువంటివాడు
విష్ణుభక్తుడై = విష్ణు (రాముని) భక్తుడై
వీరాధివీర హనుమ!= వీరులలో అగ్రగణ్యుడైన హనుమంతుడు
ఏమికోరని యోగయా = (అన్నీ ఉండికూడా) ఏమీ ఆశించనటువంటి యోగి హనుమంతుడు !
రామచంద్ర!= రామచంద్రుడా!